“భక్తుల హృదయాలలోని భేదభావ మనే అజ్ఞాన తమస్సును పటాపంచలు చేసే సూర్యకిరణ సముదాయం భారతీ వ్యాఖ్య. గలది లలితాదేవి. భక్తుల హృదయాలలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానతేజాన్ని నింపే శ్రీమాత “భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతిః” . అంతటా నిండి ఉన్న ఆత్మ స్వరూపాన్ని గుర్తించలేక, భేదభావంతో ప్రవర్తించే మనం అజ్ఞానాంధకారంలో
మునిగి ఉన్నాం. అమ్మ జ్ఞానస్వరూపిణి.
అజ్ఞానం చీకటి వంటిది. చీకటిలో వస్తుసముదాయాన్ని గుర్తించ లేనట్లే, అజ్ఞానంతో నిండి ఉన్న మన మనస్సులు, అంతటా నిండి ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను గుర్తించలేవు. ఎంత దట్టంగా అలుముకుని ఉన్న చీకటి అయినా సూర్యకిరణ ప్రసారంతో మటుమాయ మవుతుంది. అలాగే మన మనస్సులలోని అజ్ఞానతిమిరాన్ని తొలగించి, జ్ఞానదీపికను వెలిగించే శ్రీమాత ‘భక్త హార్ద తమో భేద భానుమద్భానుసంతతి’. “అమ్మ” ‘భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి’. మనకు అన్నీ సందేహాలే. కొన్ని లౌకికమైనవి. అయితే మరికొన్ని ఆధ్యాత్మిక మైనవి. ఈ రెండూ కాక నిత్య జీవితంలో మనకు ఎన్నో, ఎన్నెన్నో సందేహాలు. అందుకే “అమ్మ” అంటుంది… “దేహమే సందేహం నాన్నా” అని. నిజమే కదా! ఈరోజు ఉన్నట్లు రేపు ఉండని మన దేహమే ఒక గొప్ప సందేహం. ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో అనేది జీవితాంతం మనల్ని వేధించే అంతు చిక్కని సందేహం.
రకరకాల సందేహాలతో “అమ్మ” దరికి చేరిన మనకు అర్థం అయ్యే తేలిక భాషలో సందేహ నివృత్తి చేసే “అమ్మ” ‘భక్తహార్ద తమో భేద భానుమద్భానుసంతతి’.
సర్వసాధారణంగా బాధల్లో ఉన్న వ్యక్తికి తన బాధను పోగొట్టుకోవడానికి ఏ దేవుణ్ణి కొలవాలి, ఏ స్వామిని ఆశ్రయించాలి అనే తపన కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు “అమ్మ” చెప్పిన సమాధానం.. “ఎక్కడకు వచ్చినా ఏవీ పోవు. మనది మనం అనుభవించాల్సిందే” అని. అంతేకాదు. బాధలు లేకపోతే జీవితంలో చైతన్యమేముంటుంది? అని ప్రశ్నిస్తుంది.“… బాధలు ప్రతివారికీ తప్పవు. వాటిని కొందరు నవ్వుతూ అనుభవిస్తే, కొందరు ఏడుస్తూ అనుభవిస్తారు. అంతే. విధిని ఎవరు తప్పించుకుంటారు?” అని నిలదీస్తుంది.
“ఏ గ్రంథాలూ, ఏ శాస్త్రాలూ నిత్యజీవితం కంటే ఎక్కువ బోధించే దేమీ లేదు.” అని, “నిత్యకృత్యంలోనే జీవిత సత్యం తెలుస్తుంది. నిత్యకృత్యంలోని జీవిత సత్యాన్ని తెలుసుకోలేక ఏవో గ్రంధాల కోసం ప్రాకులాడుతారు.” అని చెప్పింది “అమ్మ”. ఎవరి జీవితంలోనైనా వారి అనుభవమే వారికి ఒక గుణపాఠం కదా! “ఎన్ని సార్లు గీతను విన్నా, మన గీతను బట్టే జరుగుతుంది”.. అన్నది “అమ్మ”. అంటే “గీత”ను చదువవద్దు అని అర్థం కాదు. ముందుగా మనకు ఏది నిర్ణయమై ఉన్నదో అదే జరుగుతుంది కానీ, “గీత” ను చదవడం, చదవక పోవడం బట్టి నిర్ణయం మారదు అని భావం. అందుకే ఒక సందర్భంలో “అమ్మ” అంటుంది.. “నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి బద్ధుడే” అని,
‘మనసుకు స్థిమితం కలగటానికి మార్గం చెప్పమ్మా’ అని అభ్యర్థించిన ఒకరితో “జరిగే ప్రతిదీ దైవం చేయిస్తున్నా డనుకోవటమే” అని చెప్పిన “అమ్మ” మన మనస్సులోని అజ్ఞానాన్ని పారద్రోలే ‘అజ్ఞాన ధ్వాంత దీపిక’.
మన అందరికీ భగవంతుణ్ణి చూడాలనే కోరిక కొద్దో, గొప్పో ఉంటుంది. భగవద్దర్శనానికి ఎంత తపించాలో కదా! సామాన్యులమైన మనకేం కనబడతాడు.. లాంటి భావాలు కూడా మనలో చాలామందికి కలుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు “అమ్మ”…” దేవుణ్ణి చూడాలనే ఆసక్తి నాకు లేదు. ఈ కనబడుతున్న దాని కన్నా భిన్నంగా ఏదీ నాకు కనపట్టం లేదు.” మీరూ, ఈ కనబడేదీ ఈ సృష్టే భగవంతు డనుకుంటాను. మీకంటే భిన్నంగా చూడటం లేదు. చూడాలని అనిపించటం లేదు.” నేను మాత్రం మీకంటే భిన్నంగా దేవుణ్ణి చూడలేదు” అని చాలా స్పష్టంగా చెప్పింది.
మనకు ఇంకా బాగా అర్థం కావటానికి… “ఒకే శక్తి అన్ని గుణాలతో, అన్ని రూపాలతో ఉంది. ఈ సర్వమూ దైవమే. ప్రత్యేకించి ఒక రూపంతో లేడు…” అనీ, “రాముడంటే మగవాడనీ, అనసూయ అంటే ఆడదనీ కాదు. అనేక పేర్లతో అన్నీ వాడే” అనీ, “ రూపం తేడా. అన్నీ దైవమే. ఇష్ట దైవమే అన్ని రూపాలూ” అనీ విశద పరచింది “అమ్మ”.
“మాధవుణ్ణి గుర్తించి అన్ని వస్తువుల్లోను మాధవుణ్ణి చూచిన మానవుడే మాధవుడు” అని అనిర్వచనీయమైన నిర్వచనాన్ని అందించిన మాధవి మన “అమ్మ””.
“జ్ఞాని పశువులో దైవాన్ని చూస్తాడు. అజ్ఞాని మానవుడిలో పశువుని చూస్తాడు” అని జ్ఞానికి అజ్ఞానికి గల తేడాను వివరించి, మీలో నేను దైవత్వం చూస్తాను. నాలో మీరు మానవత్వం చూస్తారు” అని మన అజ్ఞానాన్ని బయల్పరచింది “అమ్మ”.
‘ నీవు సాక్షాత్తూ రాజరాజేశ్వరి వమ్మా’ అన్న ఒక సోదరునితో ” మీరు కానిది నేనేదీ కాదు నాన్నా” అని మనకు దైవత్వాన్ని ఆరోపించి, మనలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించిన ఆ తల్లి ‘ భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి.
మనం సర్వసాధారణంగా భగవంతుడికి పదార్థాలను నివేదన చేస్తూ ఉంటాం.
‘నివేదన ఎందుకు చేయాలి?’ అనే ప్రశ్నకు… “అసలు నివేదన అంటే ఏమిటి?” అని ప్రశ్నించి.. “నువ్విచ్చిన తిండి, నువ్విచ్చిన మనస్సు… నువ్విచ్చింది అని గుర్తిస్తున్నాము… అని. అంతేకాని, ‘నివేదన’ అంటే పదార్థం కాదు. వాడు ఇచ్చాడనే గుర్తింపు ‘నివేదన’. ‘నివేదన’ అంటే… లంకణాలు ఉన్నాడని పెట్టడం కాదుగా!” అని ‘నివేదన’ లోని పరమార్థాన్ని ప్రకటించింది “అమ్మ”.
“వాడి శక్తి ప్రసారమైన దనుకున్నప్పుడు ప్రసాద మైంది” అని ‘ప్రసాద్’ మంటే ఏమిటో కూడా వివరించింది “అమ్మ”.
ప్రసాద మంటే అన్నం. ప్రసాద మంటే ప్రకృష్టమైన ఆహారం అని. భగవచ్ఛక్తి ప్రసరించిన పదార్థం ఏదైనా అది ప్రసాదమేగా మరి.
మనకు కలిగే ఇన్ని రకాల లౌకిక, ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసిన “అమ్మ”కు ఇవి రెండూ వేరు వేరు అనిపించడం లేదు. అందుకే “అమ్మ” – “నేను ఆధ్యాత్మికం వేరూ, ఇదంతా వేరూ అనుకోను. రెండూ ఒకటే అంటుంది.
“మంచితనం కంటే దైవత్వం ఎక్కడుంది?” అని మనపై ఒక ప్రశ్నను సంధించింది “అమ్మ”. అంటే మంచితనమే భగవత్తత్త్వం.
భేదదృష్టిని వదలి, అభేదభావంతో అంతటా పరమాత్మను దర్శించి, మన తోటివారిని మనవారిగా భావించి, ఆదరించ గలిగితే.. అదే “అమ్మ”కు మనం సమర్పించగల పూజాపుష్పం.
“అంతటా ఉన్న అమ్మ తెలియటానికే ఈ అమ్మ” అనే “అమ్మ” వాక్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆచరించ గలిగితే ఈ జన్మ కదే సార్థకత.
ఈ శరన్నవరాత్రులలో శరచ్చంద్ర చంద్రికలను వెదజల్లే అర్కపురీశ్వరి అనసూయా మాతను ‘భక్తహార్ధ తమోభేద భానుమద్భాను సంతతిగా దర్శించి, స్మరించి, భజించి, తరించుదాం.
—
“మీరు దేనికీ కర్తలు కాదు అనిపిస్తుంది. ఏం జరిగినా వీటన్నింటికి ఒకే కారణం కనిపిస్తుంది. నాకు. అందుకే ఒక దాని గొప్పతనం ఇంకో దాని కొద్దితనం కనిపించదు. ఒక వస్తువు తయారు చేశామన్నా మరొకటి చేశామన్నా దాని మూలం భూమి గుర్తొస్తుంది. అదే అన్నీ ఇవ్వగా లేనిది మనం చెయ్యటంలో విశేషం ఏముంది? పదార్థాలను, వస్తువులను మార్పు చెయ్యటంలో మన ప్రతిభ ఉన్నదనుకున్నా అంటే భూమిలో నుండి ఇనుము వచ్చి దానంతట అది బీరువాకాలేదు; మనం చేస్తేనే అయింది. అయినా ఆ భూమిలో నుండి రావటానికి ఏది కారణమో ఈ తలలో నుండి రావటానికీ అదే కారణమనిస్తుంది. నాకు. కిరసనాయిలు దీపం కనిపెట్టినా, విమానం కనిపెట్టినా ఆ రెండూ నాకు ఒకటే; నాకు రెండు అనిపించదు. మనస్సుకే అంత శక్తి ఉన్నది. ఆ శక్తికి ఇంత సృష్టి చేయగా లేనిది ఇవన్నీ ఏమిటీ?”
– అమ్మ