1. Home
  2. Articles
  3. Viswajanani
  4. భగవత్సంకల్పం కాదు సంకల్పమే భగవంతుడు

భగవత్సంకల్పం కాదు సంకల్పమే భగవంతుడు

Dr.P.Jhansi Lakshmibhai
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : April
Issue Number : 9
Year : 2012

అమ్మ వాక్యాలు, ఆణిముత్యాలు, నిత్య సత్యాలు, తత్త్వశోధకాలు, తత్త్వప్రాపకాలు.

అమ్మ సూక్తులు పైకి భావన చూస్తే చాల తేలికగా అల్పార్థ విధాయకంగా కనిపిస్తాయి. కానీ దాని అంతరార్థం లోతుగా ఆలోచిస్తే దానిని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఒక జీవితకాలం చాలదని తెలుస్తుంది. ఆ వాక్యం పైకి కనిపించే అర్థం సర్వకార్యక్రమాలకు చెందినదయి ఉంటే, అంతరార్థ పరిశీలన జీవితంలో అన్నికోణాలను సాధనంలో ఉండే అన్ని స్థాయి వారికి మార్గనిర్దేశకం చేస్తూ ఉంటుంది. అవతారం తల్లిగా రావటం వలన మనకింత సౌలభ్యం సౌకర్యం, అందరికి చెందిన సమన్వయం, అందరికి సాధనా విషయ సంతృప్తిని ఇవ్వటం ఈ వాక్యాల కుండే ఒక ముఖ్య లక్షణం. అమ్మ ఇచ్చే సంతృప్తి అంటే జీవిత సంతృప్తి, ఎంత విస్తృతమయిందో సాధనా సంతృప్తి సాధకులకు అమ్మ వాక్యాల వల్ల కలిగేది ఏమని వివరిద్దాం. అమ్మ వాక్యాలలో వినబడే సాధనా సంతృప్తిని చూస్తే సర్వులకు సాధన మీద మక్కువని కలిగించి, తమ జీవిత విధానాన్ని సాధనని ఒక సమతౌల్యతని, తద్వారా సాధన సంతృప్తిని కలుగ జేస్తుంది.

మనం ఏ మంచిపని చేయబోతున్నా సంకల్పం చెప్పుకుంటూ పూజలు చేస్తూ సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని పనులు సఫలం కాకపోవటం కొన్ని విఫలం అవటం కూడా చూస్తూ ఉంటాం. సఫలమయిన అన్ని పనులకు ఎవరికి వాళ్ళు “నేనీ పని బాగా చేశాను, అందువల్ల నా పని ఇలా బాగా పూర్తి అయిందని కర్తృత్వం మన మీద పెట్టుకుంటూ తృప్తి పడుతూ ఉంటాం. విఫలమయిన పనులు ప్రాప్తించినప్పుడు మాత్రం ‘మనకేం తెలుసు? దేవుడు చేస్తే పనులవుతాయి. లేకపోతే కావని అంటూ దేవుని ఒకరిని అస్తిత్వం, కర్తృత్వం గూర్చి ఆలోచిస్తాం. మంచి పరిస్థితులు జీవితంలో జరిగితే ఆ పరిస్థితులు తన కోరిక వలన, తన సాధన వలన జరిగినాయి అని భావిస్తూ ఉంటాం. మన వలన ఈ జగత్తు అస్తిత్వం అని ఒక్కొక్కసారి భావన చేస్తూ ఉంటాం.

మరీ ఏదయినా మనం భరించలేని విధంగా విషయం తటస్థపడితే “ఏదయినా భగవత్సంకల్పం ఉంటే జరుగుతుంది లేకపోతే జరగదు, మన చేతులలో ఏముంది!” అని భావన కొస్తాం. అప్పుడు మనం భగవంతుని వరకు వాని అస్తిత్వం దృఢమయినదనే వరకు వెళ్తాం. మరీ ఈ విషయంలో దృఢపడుతూ మనం భగవత్సంకల్పం యొక్క మహత్త్వమును, భగవత్సంకల్పం యొక్క తీవ్రతను, దాని యొక్క ప్రాబల్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాం. మన విజయాల కన్నింటికి ఆయనని గూర్చి లోతుగా ప్రార్థిస్తూ ఉంటాం. మెల్లగా పనిచేసుకోవటం మనకి కేవలం ఒక ప్రయత్నశీలతగా మారుతుంది. పని యొక్క ఫలితం పూర్తి భగవదధీన మనే బుద్ధి దృఢపడటం మొదలవుతూ ఉండటం మనకి జరుగుతూ ఉంటుంది. ఇలా మనం జీవితంలో జరిగే ప్రతి పని ఫలితాలకు కర్తగా భగవంతునికి ప్రార్థిస్తూ భగవంతుని సంకల్పానికి ఫలితాలకు భగవంతుని ఒక దృఢమయిన ముడిని వేస్తూ ఉంటాం. ఇలా మనం భగవంతుని అస్తిత్వాన్ని, భగవంతుని కర్తృత్వాన్ని, ఫలదాతృత్వాన్ని ఒప్పుకుంటూ మొగ్గు పరచుకుంటూ ఉంటాం. మనం చేస్తున్న పనులు గూర్చి ఎవరయినా ఏదయినా ఫలితాలను గూర్చి అడిగితే మనం ఇలా చెబుతాం. “పని చేయటమే మన కర్తవ్యం, ఫలమివ్వటం భగవంతుని నిర్ణయమని” చెప్పుకుంటూ ఉంటాం. ఇలా మనం చేస్తూ చేస్తూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ మెల్లగా “మనం అన్నింటికీ నిమిత్త మాత్రులమే’ అని మెల్లగా భగవంతుని సంకల్పం మీద శ్రద్దని, ప్రేమని బుద్ధిని పెడుతూ ఉంటాం. ఇక్కడ వరకు మనకి మన ప్రాచీనుల బోధల వలన భగవత్సంకల్పాన్ని గూర్చిన కొంతవరకు అవగాహన కుదిరింది. సంకల్పానికి భగవంతునికి ఉండే ఒక అవిభాజ్యమయిన సంబంధం అవగతం కావటం మొదలయింది. కొంతవరకు, జీవితం, సాధనం రెండు సుగమంగా జరగటం కూడా జరుగుతూ వస్తోంది.

మరి అవతారమే అమ్మగా వచ్చింది, కనుక ఆ సాధన మనకు స్వాధీనం కావాలని ఆమె కోరుకుంటుంది. కనుక సాధనం సర్వజనస్వాధీనం కావాలనేది కూడ ఆమె కోరిక కనుక పైన మనం చర్చించుకున్న భగవంతుడు సంకల్పం’ అనే పదాలకు అసలు అర్థం చెప్తూ ఆ పదాలకు ఒక నేర్పయిన కూర్పునిస్తూ ఒక సూక్తిని “భగవత్సంకల్పం కాదు, సంకల్పమే భగవంతుడు” అని ఒక వాక్యాన్ని మన జాతికి మానవజాతికి అందించింది. భగవంతుడు వేరు సంకల్పం వేరు కాదు. అంటూ ద్వైతాన్ని ద్వైతభావాన్ని పక్కకు పెడుతూ “సంకల్పమే భగవంతుడు” అంటూ జీవుడికి దేవుడికి ఉండే ఏకత్వాన్ని స్పష్టపరుస్తోంది.

జీవుడు దేవుడు ఒకటే అంటే మనకి అర్థం కాదు, మరి ఆ విషయాన్ని స్పష్టపరచాలంటే జీవుడికి నిత్యం ఉండే సంకల్పాలతో దేవుని సంబంధం కలిపి చూపిస్తే మన సాధన, సుగమవుతుంది. జీవ, దేవ ఏకత్వస్థితి గూర్చి సాధన మొదలవుతుంది. జీవదేవ ఏకత్వ స్థితి కరతలామలకం అవుతుంది. భగవత్సంకల్పం కాదు, సంకల్పమే భగవంతుడు అంటున్న అమ్మ కాదు అనే పదం వాడటం ఒక విషయాన్ని నిషేధించటం కాదు అని మరొక మెట్టు మనకి నొక్కి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ జీవ దేవ ఏకత్వం సహజసిద్ధం. దానిని అనుభూతి పరచమని అమ్మని ప్రార్థిద్దాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!