(2007 సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ రామకృష్ణరావుగారు స్వయంగా చెప్పి నాదెండ్ల లక్ష్మణరావుగారి చేత వ్రాయించిన వారి స్వీయచరితం నుండి)
ఒకరోజు అన్నంరాజు మాధవరావుగారి అల్లుడు కుటుంబరావుగారి ఇంటికి వెళ్ళి, అక్కడ శ్రీశైలక్షేత్రం అనే పుస్తకం చదివి inspire అయి శ్రీశైలం వెళ్ళాను. అచట టి.టి.డి. కాటేజీలలో రూము నంబరు 1 దొరికింది. అది అద్దెకు తీసికొని సాధుసన్యాసులు ఎవరైనా తపస్సు చేసుకుంటున్నారేమోనని అరణ్యానికి వెళ్లేవాడిని.
అట్లా ఉన్న సమయంలో ఒకరోజు సుప్రభాతంకు వెళ్లి, తిరిగి వచ్చినప్పుడు, 29 ఏళ్ళ జటాధారి అయిన ఒక యోగీశ్వరుడు – ఈశ్వర స్వరూపంతో కనిపిస్తూ (ఆయనే శ్రీశ్రీశ్రీ పూర్ణానందస్వామి), ప్రక్కనే రమణబాబా అనే ఆయనతో క్రింద కూర్చోబోతున్నారు. నేను కూడా ఋషీశ్వరుల సందర్శనం కోసం వెతుకుతున్నాను. కాబట్టి, వారి వద్దకు వెళ్ళి కాఫీ తెచ్చి వారికిచ్చి, వారిని మర్యాద చేసి ఎక్కడ నుండి వస్తున్నారని వారిని అడిగినాను. వారు అన్నారు మేము బాంబేలో మా గురువుగారైన రాఖాడిబాబా వారి అనుమతితో వారు ఇచ్చిన 10 పైసలతో షిర్డీ వెళ్లాను. తరువాత రమణ బాబాతో కలసి శ్రీశైలం వచ్చాను. ఆకలి అవుతుంటే పుట్టించిన వాడే చూసుకుంటాడు అంటారు. స్వామీజీ. వెంటనే నేను వారిని తీసికొని వెళ్ళి చపాతీలు తినిపించి మరల రూముకు వచ్చాను. మూడు నాలుగు రోజుల తరువాత, సుప్రభాతం అయిన తరువాత స్వామీజీ పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో ఉన్నారు. వారికి నేను నమస్కారం చేసుకొని, నాకు చాల ఆనందంగా ఉన్నదని వారితో అన్నాను. తరువాత వారికి నా కష్టాలు అన్నీ చెప్పుకొని ఓం సాయి నామం చేసుకుంటున్నానని, సిగరెట్టు త్రాగినా అదే మంత్రం ఉందనీ నాకు ఏదైనా మంత్రోపదేశం చేయమని అడిగాను. స్వామీజీ ‘నాకు ఇంతవరకు ఎవరూ శిష్యులు లేరు, నీవే ప్రథమ శిష్యుడవు అవుతావు’ అన్నారు. నన్ను కూర్చోపెట్టి కుండ దొరక్కపోతే, బాతురూమ్లో చెంబులో నీళ్ళు పోసి, మంత్రాలు చదువుతూ, నా నాలుక మీద బీజాక్షరాలు వ్రాసి, నాకు అంగన్యాస, కరన్యాసాలతో అర్థాలు చెప్పి భువనేశ్వరీ మంత్రం ఇచ్చి కొంచెం గోప్యంగా చేసుకో, పులగం తినమని, లోపలే చేసుకోమని చెప్పారు. 3 రోజులలో చెప్పిన విషయాలన్నీ ఇప్పటికీ 40 సంవత్సరాలైనా నాకు స్మరణలో ఉన్నాయి. అమ్మవారి మంత్రం నాకు ఎందుకు అన్నాను. ఎన్ని చేయాలి ? దానికి ఉపయోగం ఏమిటి అన్నాను. ఒక లక్ష చేయమన్నారు స్వామీజీ. నీవు భగవంతునితో తింటావు మాట్లాడుతావు! అన్నారు. స్వామిజీ నా రూములో ఉన్నప్పుడు ఎప్పుడూ Transe లోకి వెళ్ళిపోయేవారు. అప్పుడు స్వామీజీ బాతురూములోని చెంబునే తీసికొని నృత్యం చేస్తూ, దానిని వాయిస్తూ, కౌపీనంతో, జుట్టంతా వదలి ‘అహం బ్రహ్మస్వరూపే, అహం శివస్వరూపే, అహమిత్యేవ నిర్మల స్వరూపే, అహం నిర్వికారే, మంగళస్వరూపే’ అని పాడుతూ ఉండేవారు.
తరువాత కారేపల్లి వచ్చి డెబ్బది వేలు మంత్రజపం చేసాము. అనుకోకుండా పూలమ్మగారు నాకు కబురుచేస్తే నండూరు వచ్చాను 1969లో. ఇంతలో మా నాన్నగారి మాసికం వచ్చింది. అక్కడివారు జిల్లెళ్ళమూడి అమ్మ వద్ద పెట్టుకోవచ్చు అన్నారు. సరేనని నేను కూరలు అవీ తీసికొని జిల్లెళ్ళమూడి వచ్చాను. అమ్మ దగ్గరకు వెళ్లాను. నీకు ఎవరు మంత్రోపదేశం చేశారు అని అమ్మ అడిగారు. గడ్డం ఉన్న ఆయనా లేక తెల్లచొక్కా ఆయనా అని అమ్మ అడిగితే గడ్డం ఉన్న ఆయనే అన్నాను.
నాకు ఆ మంత్రం హాయిగా ఉన్నదన్నాను. అలంకార హైమాలయం వద్ద జపం చేసుకున్నాను. అమ్మ నీరసంగా ఉన్నారు. మాసికానికి ఏర్పాట్లు ఏమీ లేవనుకున్నాను. కాని అమ్మ సర్వాంగసుందరంగా వచ్చి కూర్చున్నది. వంటింట్లో నుంచి గారెలు, మల్లెపూల దండలు అన్నీ వచ్చినై. ‘నీవు కారేపల్లిలో ఇట్లా, అట్లా అంటూ అన్నాన్ని మూడు ముద్దలు నిమ్మకాయకారం కలిపి తనే తింటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మానాన్న సంవత్సరీకాలు నీ దగ్గరే పెట్టుకుంటున్నాను” అన్నాను నేను. మరల కారేపల్లికి అమ్మ ఫోటో తీసికొని వెళ్ళి మిగిలిన ముప్పది వేల జపం పూర్తిచేశాను ఆనందమైంది. ఇంతలో జిల్లెళ్ళమూడి నుండి నాకు టెలిగ్రాము వచ్చింది. నేను వెళ్ళలేదు. మరల టెలిగ్రాము వచ్చింది. అమ్మ వద్దకు వచ్చాను. అమ్మ నా భుజాల మీద చెయ్యి వేసి ఏంచేస్తున్నావు అంది. భువనేశ్వరీ మంత్రం అని చెప్పాను. ‘నీకు కావలసినది అమ్మే కదా ! నేనే భువనేశ్వరిని. నీకు ఇల్లు ఇస్తాను. నీవు వెంటనే భార్యాపిల్లలతో రమ్మంది. ఆనందంతో తెల్లవార్లూ అమ్మ వద్ద కూర్చున్నాను. స్వామీజీ చెప్పిన మూడు పదాలు కరెక్టు అయినై. ఎక్కిరాల భారద్వాజగారు వ్రాసిన ఒక పుస్తకం కొని బయలుదేరాను. బస్టాండులో శ్రీశైలం బస్సు వచ్చింది. శ్రీశైలం వెళ్లాను. మరల లోగడ దొరికిన రూము దొరికింది. స్వామీజీ హఠకేశ్వరంలో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లాను. స్వామీజీతో have seen God (నేను భగవంతుడిని చూశాను) అని చెప్పాను.
- ఇంకావుంది.