“భయాన్ని పోగొట్టేది భయాపహ.. సర్వప్రాణి సహజమైన ఆహారనిద్రాభయమైధునాల్లో భయం ఒకటి. అభయ స్వరూపిణి అయిన అమ్మ సన్నిధిలో భయానికి తావులేదు. సర్వకాల సర్వావస్థలలోనూ దేవీ నామ సంస్మరణం సర్వభయనివారకం. ఆనంద సంధాయకం. భయం కలిగినప్పుడల్లా దేవీనామం కీర్తించాలని వాయుపురాణం తెలియజేస్తోంది. సమస్తభయాలను పోగొట్టి చిత్తశాంతిని ప్రసాదిస్తుంది కనుక శ్రీమాత భయాపహ”భారతీవ్యాఖ్య.
ప్రాణికోటికి ఆహారనిద్రా భయ మైథునాలు సహజ సిద్ధమైనవి. చిన్న చీమ మొదలు ప్రపంచాన్నే గడగడ లాడించగల నరరూప రాక్షసులవరకు ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు భయం కలుగక మానదు. ఈ భయం కేవలం మానవులకు, పశు, పక్ష్యాదులకు మాత్రమే పరిమితం కాదు. దేవతలకు, రాక్షసులకు కూడా తప్పలేదు. అమృతం ఆస్వాదించిన దేవతలకు జరామృత్యు భయాలు లేకపోవచ్చు; కానీ, రాక్షసుల వల్ల భయం పట్టిపీడించేది. దేవతలను హడలగొట్టిన రాక్షసేంద్రులు, ఎన్ని వరాలు పొందినా అమరత్వాన్ని సాధించలేకపోయారు. అందువల్ల, మృత్యువు తమ్ము ఎప్పుడు, ఎలా కబళించి వేస్తుందో అని కలవర పడుతూ కాలం గడిపేవారు. క్షణంక్షణం భయం భయంగా జీవిస్తున్న మానవాళికి అమ్మ నామసంకీర్తనం రక్షాకవచం. శ్రీమాత నామస్మరణ మాత్రం చేతనే భయాలు మనందరికి చేరవు సరికదా! మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందువల్ల శ్రీలలిత భయాపహ.
“అమ్మ”- భయాపహ. ఒక సినీకవి – “నీదరినున్న తొలగుభయాలు నీదయలున్నా కలుగుజయాలు…..” అని “అమ్మ” ను గురించి స్పష్టంగా ప్రకటించాడు. తన బిడ్డల నెందరినో ఎన్నో రకాల భయాలనుంచి తప్పించి, అభయం ఇచ్చిన “అమ్మ” భయాపహ. ఇలలోనే కాదు; మనకు వచ్చే కలల్లో సహితం – “అమ్మా” రక్షించు’ అని ప్రార్ధించిన మరుక్షణమే ఆ భయం తొలగిపోతుంది.
అది 2011 సంవత్సరము డిసెంబరు నెల 6వతేది-తెల్లవారు ఝాము 4గంటల సమయం. ప్రతిదినం నేను నిద్రలేచి, నిత్యకృత్యాల్లో మునిగిపోయే వేళ అది. ఆరోజు కూడా ఇంకా కొద్దిసేపటిలో లేవవలసిన దాన్నే. కానీ, ఈలోగానే, ఒక భయంకరమైన కల వచ్చింది. అందులో ఒక పెద్ద, పొడవైన, నల్లని పాము; దాని తోక నా కను చూపుమేరలో లేదు. అది బుస్సుమంటూ, నా ఎత్తుకు లేచింది. నా ముఖానికి ఒక జానెడు దూరంలో, దాని తల్లి నిట్టనిటారుగా నిలబడి ఉంది. నేను భయంతో గజగజలాడి పోయాను. అయితే, అంత భయంలోనూ చాలా బిగ్గరగా “అమ్మా!” రక్షించు. అమ్మ కాపాడు.” అని అరిచాను. నా ఆర్తనాదం ‘అమ్మ’ చెవులను తాకిందేమో మరి. అంత దగ్గరగా ఉన్నా ఆ భీకరసర్పం ఎక్కడా వంగకుండా, నిటారుగానే మెల్లమెల్లగా క్రిందకు జారుతూ, వెనక్కి జరుగుతూ కనుమరుగయింది. నాకు మెలకువ వచ్చేసింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి ఉంది. చుట్టూ చూశాను. అంతా మామూలుగానే ఉంది. “ఇది కలా!” అని అనుకున్నాను. ఇలలోనే కాదు, కలలోకూడా కమ్ముకు వస్తున్న భయకారణాన్ని క్షణంలో మాయం చేసి,అభయాన్నిచ్చి అనుగ్రహించగల “అమ్మ”- భయాపహ.
మెలకువనైనా, కలలోనైనా తలచినంతనే మన భయాలను పోగొట్టి, మానసిక ప్రశాంతతను అనుగ్రహించే “అమ్మ” భయాపహ. మన మదిలో “అమ్మ” మెదిలిన వెంటనే భయం భయంతో పలాయన మంత్రం పఠించవలసిందే.
మా మూడవ అక్క అక్టోబరు (2012) లో వాళ్ళ అబ్బాయి దగ్గరకు భోపాల్ వెళ్ళింది. ఉజ్జయిని, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూడాలని వాళ్ళంతా ఒకకారు మాట్లాడుకున్నారు. అయితే బయలుదేరిన కాసేపటికి ఆ కారు
టైరు పెద్ద శబ్దంతో బద్దలయింది. అందరూ భయపడ్డారు.డ్రైవరు అందర్నీ దింపి, వేరే టైరు వేసి, కారు స్టార్ట్ చేశాడు. అందరూ సంతోషంగా కారు ఎక్కారు. తమాషా! కొద్దిసేపటికి మళ్ళీ పెద్ద చప్పుడుతో ఇంకొక టైరు తుక్కు తుక్కుగా బద్దలయింది. అదృష్టం ఎవ్వరికీ ఏప్రమాదమూ జరుగలేదు. ఈసారి మార్చడానికి వేరే టైరు కూడా లేదు. “చాలాదూరం ప్రయాణం చేయాలి కనుక నా కారులో వద్దు. నేనే వేరే కారు తెప్పిస్తాను” అని ఆ కారుడ్రైవరు వేరే కారుకు ఫోను చేసి, రప్పించాడు. అందరూ తమ సామాన్లతో కొత్తకారు ఎక్కి కూర్చున్నారు. కారు బయలుదేరింది. ఆశ్చర్యం ! ఈ కారుటైరుకు ఉన్న స్క్రూ ఊడి, టైరులోని గాలి అంతా బైటకు వచ్చేసింది. ‘ఏమిటీ? ఇన్ని అవాంతరాలు’ అని అందరూ చాలా నిరుత్సాహం చెందారు. మా అక్క అయితే కారులో కూర్చున్నప్పటి నుంచీ వదలకుండా “అమ్మ” నామం చేసుకుంటూనే ఉందిట. ఇంక ఆ తర్వాత ఎలాంటి ఆటంకమూ లేకుండా అంతటిసుదీర్ఘ ప్రయాణమూ నిర్విఘ్నంగా, దిగ్విజయంగా జరిగి, అందరూ క్షేమంగా ఇళ్ళకు చేరడంతో యాత్ర సుఖాంతమైంది. ఇదంతా “అమ్మ” దయే” అని మా అక్క ప్రగాఢ విశ్వాసం. నమ్ముకున్నవారిని భయాపహ అయిన “అమ్మ” అండదండగా, వెన్నంటి ఉండి రక్షిస్తుంది – అని స్పష్టం చేస్తోంది ఈ సంఘటన.
భయాపహ అయిన “అమ్మ”. ఈ సంవత్స రాంతంలో మనందరి భయాలను పోగొట్టి, నూతన వత్సరానికి స్వాగతం పలుకుతున్న మనకు “తన” అభయహస్తం అందించి, ఆదుకుంటుందని ఆశిద్దాం.