అమ్మ మాటల్ని అర్థం చేసికోవటానికి ఒకజీవిత కాలం సరిపోదు. అమ్మ మాటల్ని ఆచరణలో పెట్టటానికి వంద జీవితకాలాలు కూడా సరిపోవు. “భర్త అంటే శరీరం కాదు, భావన” అనేది అమ్మ ఆవిష్కరించిన వినూత్న సత్యం. విప్లవాత్మక ప్రవచనం.
“పెళ్ళి అంటే ఆత్మార్మణ” అనీ,
“పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించేది పతివ్రత” అనే వివరణ సామాన్యులకు అర్ధం కానిది.
‘ఆ అబ్బాయికి జీవకళ లేదంటే అమ్మాయి వినడం లేదమ్మా’ అని ఒక సోదరి ఫిర్యాదు చేస్తే అమ్మ “జీవం లేదనుకుంటున్న శిలలకు జీవం కలవారందరూ మ్రొక్కుతారు. జీవంకల వారందరినీ ఆ శిలారూపం రక్షిస్తోంది కదమ్మా” అని ‘రూపం’, ‘భావం’ అనే పదాల అర్థాన్ని ప్రాధాన్యతని తేటతెల్లం చేసింది.
“నడుం వంచి తాళి కట్టేది భర్త
“తల వంచి తాళి కట్టించుకునేది భార్య” అని భార్యాభర్తల బాధ్యతలను, విధులను సరళంగా విశదీకరించింది. నేటి చలనచిత్ర కలుషిత సమాజంలో ‘కామం’ ‘ప్రేమ’ అనే పదాలకు పెద్ద తేడా లేదు. పెళ్ళి అనేది ఒక Sexual license గా అర్ధం అవుతోంది. స్వస్సుఖ సుఖిత్వం కామం’ అనీ, తచ్చుఖ సుఖిత్వం ప్రేమ అనీ శాస్త్రం నిర్వచించింది. నేను సుఖంగా ఉండాలి, అందుకు ఆ వస్తువు ఏమైనా ఫర్వాలేదు అనేది కామం.
నేనేమైనా ఫర్వాలేదు, ఆ వస్తువు సుఖంగా ఉండాలి – అనేది ప్రేమ.
వనవాసకాలంలో సీతారామలక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమానికి వెళతారు. అపుడు అత్రిమహర్షి భార్య అనసూయ సీతతో చెప్పిన మాటలు వింటే మన అనసూయమ్మే గుర్తొస్తుంది, అణువణువునా సాక్షాత్కరిస్తుంది.
‘నగరస్థో వనస్ధావా శుభోవా యదివా శుభః |
యాసాం స్త్రీణాం ప్రియో భర్తా తాసాం లోకా మహోదయాః ॥
దుఃశ్శీలః కామవృత్తో వాధనైర్వా పరివర్జితః |
.స్త్రీణాం ఆర్య స్వభావానాం పరమం దైవతం పతిః ||
(భర్త నగరంలో ఉండవచ్చు, అడవిలో ఉండవచ్చు, అదృష్టవంతుడు కావచ్చు, దైవోపహతుడు కావచ్చు, ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమిస్తుందో దివ్యలోకాలు ఆమెకై నిరీక్షిస్తాయి. భర్త దుర్మార్గుడు కావచ్చు, కామలోలుడు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఉత్తమ స్త్రీలకు పతియే పరమదైవం) “పెనిమిటి అంటే పెన్నిధి. ఎట్లాంటి వాడైనా సరే ఆయన సేవ చేయటమే
నీ ధర్మం” అని ఒక సోదరికి సూచించింది అమ్మ. ధర్మపత్ని ధర్మాన్ని నిర్దేశించింది. ‘నాతో విశిష్ఠం పశ్యామి బాంధవం విమృశన్వహం। సర్వత్ర యోన్యం వైదేహి తపః కృతమివావ్యయం’ – అన్నది అనసూయ (ఎంత వెదికినా భర్త కంటే గొప్ప బంధువు వేరొకడు లేడు).
అమ్మ “పెళ్ళి అయిన దగ్గర్నుంచి తల్లి, తండ్రి, గురువూ, దైవమూ వారేనమ్మా” అన్నది. వాస్తవానికి అమ్మకీ మనకీ ఏపోలికా లేదు. ఒక విధంగా అమ్మ నామాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు. కానీ మన అల్పత్వాన్నీ అమ్మ అనల్పత్వాన్నీ మననం చేసుకుంటే మనం తరించినట్లే.
మనం పూల బాటకోసం తపిస్తాం.
అమ్మ ముళ్ళ బాటలోనే పయనిస్తుంది. సుఖాలు బిడ్డలకి, కష్టాలు తల్లికి. ఇది ప్రకృతి నైజం. నిఖిల నారీలోకానికి పసుపు కుంకుమల్ని ప్రసాదించే వరలక్ష్మి అమ్మ. కానీ తన విషయంలో ఏం చేసిందో చూడండి. ఒకసారి నాన్నగారు అమ్మతో ‘నీ చేతుల మీదుగా నన్ను సాగనంపాలి’ అని కోరుకున్నారు. కఠోరమైన ఆ కోరికను ఆజ్ఞగా శిరసావహించింది. తర్వాత కాలంలో తన చేతుల మీదుగా నాన్నగార్ని ఆలయప్రవేశం చేయించింది. ఈ సందర్భంలో అమ్మ పార్వతీ దేవికంటే ఉదాత్తమైన పాత్రను పోషించింది.
‘మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడునది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ
మంగళ సూత్రమ్ము నెంత మది నమ్మినదో” – అని పేర్కొన్నట్లు క్షీరసాగర మధనంలో ప్రభవించిన హాలా హలాన్ని స్వీకరించి లోకాన్ని కాపాడమని పార్వతీదేవి భర్తను ప్రార్ధించింది. శంకరుని సర్వశక్తిమత్వం మీద నమ్మకంతో తన మంగళ సూత్రాలను పణంగా పెట్టింది విశ్వ శ్రేయస్సాధనకి పార్వతీదేవి.
కానీ నేడు మన అమ్మ తన మాంగల్య రూపమైన పతిదేవుల్ని అనసూయేశ్వరాలయంలో ప్రతిష్ఠ చేసి తన కన్నీటి సాగరానికి తన గుండెల గోడలలోనే చెలియలి కట్టని కట్టింది లోక కళ్యాణం కోసం. అమ్మ చేసిన త్యాగము నిరుపమానము, అనితరసాధ్యము అగ్రాహ్యము. నాన్నగారు లేకుండా అమ్మ!!! స్థితి, క్షణం ఊహించరానివి. అమ్మ అంటుంది “బరువైన పాత్రలంటేనే నాకు ఇష్టం” అని. ఉలిదెబ్బలు తినటం, ఆలయంలో ఆర్చామూర్తి కావటం, అన్నింటికీ ‘సరే’ మంత్రం పఠించడం… అమ్మకి మాత్రమే సాధ్యం. కనుకనే ‘అసిధారావ్రతాచార తత్పరాయై నమః” అని పూజిస్తున్నాం. అమ్మ అనుభవం, అమ్మ ప్రవచనం అవిభక్త మైనవి. కనుకనే అమ్మ వాక్యాలు సార్వకాలిక సత్యాలు.
నాన్నగారు ఆలయప్రవేశం చేసిన తర్వాత కొన్ని రోజులకు నేను అమ్మను చూడటానికి వాత్సల్యాలయంలో అడుగు పెట్టాను. గదిలో Zero watt bulb బలహీనంగా వెలుగుతోంది. అశోకవృక్షం క్రింద సీతాసాధ్విని దర్శించినట్లయింది నాకు. ఆ స్థితిలో అమ్మకి సీతామాతకి తేడా ఉంది. ‘ఆశాబంధః కుసుమ సదృశం’ అని కాళిదాసు కవి అన్నట్లు ఎప్పటికైనా రాముడు వస్తాడనే నమ్మకమే ఊపిరిగా జీవిస్తోంది సీతాసాధ్వి. కానీ అమ్మ తన చేతులారా ప్రళయాన్ని తన మీదికి ఆహ్వానించింది. ఆ కన్నీటికి అంతం లేదు.
‘విచింతయంతీ సతతం తమేవ
తధైవ పశ్యామి తధా శృణోమి’ – (శ్రీరామ సాన్నిధ్యాన్ని, రూపాన్ని నిరంతరం ధ్యానించడం వలన దానినే చూస్తున్నాను, దానినే వింటున్నాను) – అని అంటుంది.
అమ్మ నన్ను చూడగానే రామకృష్ణ అన్నయ్యతో “నాన్నగారు గుంటూరు ఆస్పత్రిలో ఉండటం, వీడు సేవ చేయటం” అన్నది. ధ్యాసే ధ్యానం కదా!
ఒకసారి నాన్నగార్కి జ్వరం వచ్చింది. మందులు వాడారు. తగ్గింది. నాలుగు రోజులు గడిచాయి. నాకు ఉద్యోగం వచ్చినట్లు కబురు వచ్చింది. ఆ శుభవార్త అమ్మకు విన్నవించాను. అమ్మ సంతోషంతో నాకు పరమాన్నం తినిపించింది. హఠాత్తుగా “నాన్నా! నాన్నగార్కి ఇవాళ టెంపరేచర్ చూశారా?” అన్నది. నేను తటపటాయించాను. ‘ఇవాళ చూడలేదమ్మా. నాలుగు రోజుల నుండి టెంపరేచర్ రావటం లేదు” అన్నాను. వెంటనే మెట్లు దిగి క్రిందికి వచ్చి టెంపరేచర్ చూస్తే 101 ఉంది. నిర్ఘాంత పోయాను. కనుకనే ఒక సందర్భంలో ‘పరధ్యానంగా ఉన్నావేమిటమ్మా?’ అని అడిగితే ‘పరధ్యానంకాదు, పతి ధ్యానం’ అన్నది అమ్మ. అమ్మ మూర్తీభవించిన ధర్మం, ఆచరణ.
ఈ సందర్భంగా మరొక సంఘటన గుర్తు చేసుకోవాలి. అపుడే ఈ భావానికి పరిపూర్ణత. నాన్నగారు అన్నమాటే తర్వాత కాలంలో ఒకసారి వసుంధర అక్కయ్య అమ్మతో అన్నది ‘నీ చేతుల మీదుగా నన్ను సాగనంపు’ అని. ఈసారి అమ్మ. ‘సరే’ మంత్రం పఠించలేదు. అని విని వ్రేటువడ్డ ఉరగాంగనయుం వలె నేయి వోయ భగ్గున దరిగొన్న భీషణ హుతాశనకీల అనంగ’ – (దెబ్బతిన్న త్రాచు వలె, ఆజ్యం పోసిన అగ్ని జ్వాల వలె) లేచింది. తాను తల్లి పాత్రను పోషిస్తోంది. 1 కనుక చప్పగా చల్లారి పోయింది. నిఖిల స్త్రీలోకానికి మహత్తర సందేశాన్ని వసుంధర అక్కయ్య విషయ పరంగా అందించింది. “ఎంత స్వార్ధం నీకు??? నువ్వు ముందుగా వెళ్ళి పోతే నాకు ఎవరు చేయాలిట?? నీకు బాధ్యత లేదా? భర్తను నిజంగా ప్రేమించే ఏ స్త్రీ అయినాఏ లోటు రాకుండా కడవరకుచేసి సాగనంపాలి. అని కోరుకోవాలి. అది ఆమె ధర్మం. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు” అని పరోక్షంగా ‘పునిస్త్రీ’, ‘పసుపుకుంకాలు’, ‘ఐదవతనం’ అనే పదాలకి చరిత్రలో ప్రప్రధమంగా భాష్యం చెప్పింది. ఒక దివ్యౌషధాన్ని అందించింది. కానీ ఎవరికీ రుచించదు సామాన్యంగా. కారణం ఔషధం చేదుగా ఉంటుంది. కొన్నాళ్ళు వేపాకు తిని ఉన్నాను’ అన్నది అమ్మ. మనం కరివేపాకులో వేపాకు అనే పదాన్ని ఉచ్చరించటానికి కూడా ఇష్టపడం.
“మంగళ సూత్రాలు భర్త రెండు పాదాలు” అని నిర్వచించింది అమ్మ. ప్రతిరోజూ ఆ పావన పాద ద్వయాన్ని అభిషేకించి, ఆ తీర్ధాన్ని త్రాగి మనకి తీర్థం వేసేది. నిజమే. మంగళసూత్రాలు వంటింట్లో డబ్బాల మూతలు తీయటానికి, పళ్ళుకుట్టుకోవటానికి కాదు కదా!
“పెళ్ళినాడు కట్టిన మంగళ సూత్రాలు ఇవి.
నేను వాటిని చెరిపించ లేదు” అన్నది అమ్మ నాతో. సొట్టలు పడ్డాయనో, అందంగా లేవనో సాధారణంగా వాటిని చెరిపించి క్రొత్తవి చేయిస్తాం, మరి కొంత బంగారం కలిపి, మెరుగు పెట్టిస్తాం. మనకేది మెరుగో మనకి తెలియదు.
వివాహ మంత్రాలను పరిశీలిస్తే ‘అభ్రాతృఘ్నీం వరుణా పతిఘ్నీం బృహస్పతే ఇంద్రా పుత్రఘ్నీం లక్ష్మ్యం తామస్యై సవితస్సువ’ – (ఈ కన్యకు భ్రాతృ వియోగము, భర్తృ వియోగము, సంతాన వియోగము కలుగకుండు గాక) – అమంగళ హేతువైన ఆ దోషాన్ని తొలగిస్తున్నానంటూ వరుడు ఒక దర్భతో వధువు కనుబొమల నడుమ నుంచి తుడిచి వేస్తాడు.
అమ్మ సన్నిధిలో జరిగిన వివాహాలు తలచుకుంటే వధూవరులకు తలకు నూనె పెట్టడం, దిష్టితీసి కొబ్బరికాయలు పగుల కొట్టడం, నుదుట తిలకాన్ని తిరునామంలా, కళ్యాణ తిలకంలా, చంద్రరేఖలా దిద్దటం… మనకి తెల్సినవి, తెలియనివి (ఊహకు అందనివి) ఎన్నో క్రియలు ఉన్నాయి. “ఇక్కడ మంత్రం లేదు, తంత్రం ఉన్నది” అన్నది అమ్మ. గాడిపొయ్యి మీది గుండిగెలో చేయిపెట్టి అన్న తీసి మంటల్లో వేసింది. అది తండులహోమం; వైశ్వదేవం. మనకి మంత్రార్థమూ తెలియదు, తంత్రమూ తెలియదు.
అమ్మ మాంగళ్య చిహ్నాలను విసర్జించలేదు. మాంగళ్య దేవత అమ్మ. “భర్త అంటే శరీరం కాదు, భావన” అనే మహావాక్యానికి సాకార రూపమే అమ్మ జీవితం. మనకి శ్వాస ఎంత సహజమో అమ్మకి నాన్నగారి స్మరణ, స్ఫురణ, సాన్నిధ్యం అంత సహజం. అదే సాలోక్యమూ, సారూప్యము, సాయుజ్యము. కనుకనే ‘ “పాతివ్రత్యం పూర్ణమైన అద్వైతానికి తీసుకు వెళ్తుంది” అంటుంది అద్వైత సిద్ధిదాయిని అమ్మ.