సో. శ్రీ కె.నరసింహమూర్తి గారు హైదరాబాదులో తమ స్వగృహంలో భారతకాలమాన ప్రకారం (జ్యేష్ఠ బహుళదశమి, గురువారం) 23-6-2020న అమ్మ అనంతోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఉన్నతాసనంపై రమణీయమైన అమ్మ వర్ణచిత్రపటాన్ని సుమనోహర సుమమాలికలతో అలంకరించి, శ్రీ సూక్త విధానేన లలితా అష్టోత్తర, అంబికా అష్టోత్తర శతనామ పూర్వకంగా శ్రద్ధాసక్తులతో అర్చించారు. అమ్మ సజీవమూర్తిగా పూజల నందుకొని అనుగ్రహించింది. సుమారు 200 మంది సోదరీ సోదరులు ఈ ఉత్సవానికి హాజరై 3 సార్లు ఉత్సాహంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కావించారు. అందరూ సభక్తికంగా అమ్మ శ్రీ చరణాలకు కుసుమాంజలి సమర్పించారు.
పిమ్మట శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ప్రసంగిస్తూ “అమ్మ”ను అర్చించుకోవడం, ఆరాధించడం అంటే ఆచరణాత్మకంగా అమ్మ ప్రబోధించిన ఆదరణ, ప్రేమ, సేవ మున్నగు లక్షణాల్ని అర్థం చేసికొని ఆచరణలో పెట్టడం అనీ; శ్రీ ఎమ్. దినకర్ అన్నయ్య “అమ్మ సాహిత్యం ఎక్కువగా ఆంగ్లభాషలో రావాల్సిన ఆవశ్యకత ఉందనీ; అమ్మ నిన్న, నేడు, రేపు ఎప్పుడూ ఉంటుంది” అనీ; శ్రీ వి.యస్.ఆర్. మూర్తి గారు నిన్నటి వరకు అమ్మ అవతార వైభవాన్ని దర్శించి పరవశించాం. అమ్మశతజయంతి ఉత్సవ సందర్భంగా ఇక ఒక ఉద్యమస్ఫూర్తితో ప్రతి ఒక్కరు యథాశక్తి తమ తమ సేవలనందించాలనీ పిలుపు నిచ్చారు. శ్రీ రాణి గోపాలకృష్ణగారు స్వీయ దివ్యానుభవాలను వివరిస్తూ అమ్మ మహత్వాన్ని చాటారు.
అనంతరం అమ్మ మహాప్రసాదంగా షడ్రసోపేతమైన విందు భోజనాన్ని అందరూ స్వీకరించారు. నిండు మనస్సుతో శ్రీ నరసింహమూర్తిగారి కుటుంబ సభ్యులు చూపిన ఆదరాభిమానములకు అందరూ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆ క్షణాల్లో అది భాగ్యనగరం కాదు, జిల్లెళ్ళమూడి క్షేత్రమే అనిపించింది.