“శ్రీ లలితాదేవి భావనాగమ్య. అంటే భావనచేత దేవి సామీప్యం లభిస్తుంది అని అర్థం. భావనాగమ్య అంటే మరో అర్థం కూడా ఉంది. భావన, అగమ్య అనే పద విభాగాన్ని బట్టి భావనల చేత అందుకోలేనిది శ్రీమాత స్థానం అని భావం.
మనస్సు సమాధిలో లగ్నమైతే దేవీ సాక్షాత్కారం కలుగుతుందని ఈ నామంలోని అంతరార్థం. ధ్యానంలో లీనమైన మనస్సు అంతర్గతంగా ఉన్న శ్రీమాత రూపాన్ని దర్శించగలదు” – భారతీవ్యాఖ్య.
మానవుని మనస్సు పుట్టెడు ఆలోచనలకు పుట్టినిల్లు. అంతులేని ఈ ఆలోచనలు ప్రాపంచిక విషయాలపై ఉన్నంత కాలమూ మనస్సుకు ప్రశాంతత ఉండదు. శాంతిలేని మనస్సు భౌతిక విషయాల కోసం పరిపరివిధాలుగా పరితపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనాపరంపరను పరమార్థం వైపుకు మరల్చుకోగలిగితే మనస్సు నిర్మలమై, నిశ్చలత్వాన్ని పొందుతుంది. పరిపక్వ మానసిక స్థితిలో మనోఫలకంపై అమ్మ సాక్షాత్కరిస్తుంది. భావన చేత శ్రీమాత సామీప్యం సిద్ధిస్తుంది కనుక శ్రీలలిత భావనాగమ్య. పరమాత్మ అవాజ్మానసగోచరుడు. అందువల్ల భావన, అగమ్య – అని భావన చేత అందుకోలేనిది శ్రీమాత అని కూడా ఈ నామానికి అర్థం. భగవత్తత్త్వమూ, భగవత్స్వరూపమూ సామాన్య మానవులమైన మన ఊహాకు కూడా అందవు. కోటికొక్కరికి అంతరంగంలో శ్రీశ్రీదేవి దర్శనభాగ్యం కలుగుతుంది. భావాతీతమైన పారవశ్యంలో మనోనేత్రంపై సాక్షాత్కరించిన శ్రీ లలిత భావనాగమ్య.
“అమ్మ” భావనాగమ్య. “అమ్మ”ను హృదయ పద్మంలో దర్శించినవారు, భావనలో “అమ్మ” రూపాన్ని నిలుపుకున్నవారు, బాహ్యంగా “అమ్మ” రూపాన్నే చూసి తరించినవారు, తమ ఇష్టదేవతామూర్తులుగా “అమ్మ”ను ప్రత్యక్షం చేసుకున్నవారు – ఇలా ఎందరు, ఎందరెందరో “అమ్మ” బిడ్డలు భావనాగమ్య అయిన “అమ్మ” అనుగ్రహానికి
పాత్రులై పరవశించారు. ఎవరి దర్శనం వారికి ఒక అలౌకికానందానుభూతి.
జిల్లెళ్ళమూడికి వచ్చే సోదరీమణుల్లో శ్రీమతి కె. రామలక్ష్మిగారు (కీ॥శే॥ ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్గాగారి అర్ధాంగి ఒకరు. ఆమె సుమారు 40 సంవత్సరాల క్రితం తమ సోదరి శ్రీమతి రామకుమారిగారితో కలసి జిల్లెళ్ళమూడికి వచ్చారు. ఈ 40 సం||ల కాలంలో శ్రీమతి రామకుమారిగారు మళ్ళీ జిల్లెళ్ళమూడికి రాకపోయినా “అమ్మ”ను స్మరిస్తూనే ఉన్నారు. కాలం తెచ్చిన మార్పుల్లో ఆమె రకరకాల కుటుంబ సమస్యల్లో చిక్కుకుని, అనేక విధాలైన బాధలకు గురైనారు. ఆమె హైదరాబాద్లో ఉండేవారు. తన శారీరక, మానసిక బాధలను భరించలేక, జిల్లెళ్ళమూడికి వచ్చి, “అమ్మ” చరణసన్నిధిలో తన చరమదశను గడపాలనుకుంటూ “అమ్మ”ను ప్రార్థించేవారు. 2013 జనవరి నెలాఖరులో ఒకనాటి రాత్రి కలలో ఆమెకు “అమ్మ” చెప్పినట్లుగా “కొంచెం ఓపికపట్టు. రెండు కాలువలు దాటితే వచ్చేద్దువుగాని” అవి వినిపించింది. ఫిబ్రవరి మొదటివారంలో తలవని తలంపుగా ఆమె తన సోదరి శ్రీమతి రామలక్ష్మిగారి వద్దకు (విజయవాడ) వచ్చారు. వీరి ఇంటికి దారి చెబుతూ కారు డ్రైవరుతో రామకుమారి గారు -‘బుడమేరు, ఏలూరు కాలవలు దాటించు. తర్వాత దారి నేను చెబుతాను” అంటూ ఆ రెండు కాలువలు దాటి శ్రీమతి రామలక్ష్మిగారి ఇంటికి
చేరారు.
శ్రీమతి రామకుమారిగారికి రెండుకాళ్ళూ (పాదాలూ, వేళ్ళూ, పిక్కలూ) కొంచెం దూరం నడిస్తేనే మెలికలు తిరిగిపోయి విపరీతమైన బాధ పెడతాయి. అలాంటి స్థితిలో ఆమెను తీసుకొని 13 జూన్ 2013న శ్రీమతి రామలక్ష్మిగారు జిల్లెళ్ళమూడికి వచ్చారు. ఈ ప్రయాణం తలపెట్టినప్పటినుంచీ శ్రీమతి రామకుమారి గారు ‘ఎలా వెళతానా’ అని భయపడుతూ ఉన్నారు.ఆశ్చర్యం. జూన్ 13న విజయవాడలో ఆటో ఎక్కినప్పటి నుంచీ ఆమెకు విచిత్రానుభూతులు కలిగాయి. తాను ఎక్కేబస్సుకు నేలకు కొద్ది ఎత్తులోనే మెట్టు ఉన్నట్లు – తోచింది. ఆమె ఆ మెట్టుపై కాలు పెట్టి సునాయాసంగా బస్సు ఎక్కేశారు. అలాగే దిగారు. ఆ తర్వాత జిల్లెళ్ళమూడిలో అన్ని గుళ్ళకూ నడిచి వెళ్ళారు. “అమ్మ” తత్త్వచింతన సదస్సు కార్యక్రమాలకు వెళ్ళి, ప్రసంగాలు విన్నారు. అయినా, ఆమె కాళ్ళు నొప్పులనిపించలేదు. ఇదంతా అవ్యాజకరుణా మూర్తి “అమ్మ” కృపావిశేషమే అనుకుని ఆమె ఎంతో ఆనందించారు. ఇంతకంటే విచిత్రం ఏమిటంటే – ఆరోజు రాత్రి వారికి ఏర్పాటు చేసిన బసలో ఆమెకు “అమ్మ” దివ్యమంగళరూపదర్శనం కలగడం. అన్నపూర్ణాలయ షెడ్డు వెనుక ఉన్న ఒక గెస్టురూములో వారికి బస ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ముందు గదిలో శ్రీమతి రామకుమారి గారు పడుకున్నారు. ఇంక నిద్రపోలేదు. కళ్ళు మూసుకున్నారు. వారి చెల్లెలు పలకరిస్తే జవాబు చెప్పారు.
అంతలోనే తాను “అమ్మ”కు సమర్పించిన చీర కట్టుకుని (కుచ్చెళ్ళు అంచుకనిపించేలా పరచుకుని ఉన్నాయి) “అమ్మ” ఆమె కనులకు స్పష్టంగా కనిపించింది. రాత్రి గం. 11-00- 1-00 వరకూ ఆమె ఆ పారవశ్యంలోనే ఉన్నారు. ఇంకొక
వింత ఏమిటంటే ఆమె పడుకున్న పక్కమీద పాదాల క్రింద సుతిమెత్తని ‘మెత్త’ (ఆ మెత్తదనం వర్ణింప నలవికానిది) ఏర్పాటై ఉండడం. పాదాలు అటూ, ఇటూ ఎటు కదిలించినా ‘మెత్త’ ఆమె పాదాలకు మెత్తగా తగులుతూ హాయినివ్వడం. తెల్లవారిన తరువాత ఆమె రాత్రి తాను పొందిన సుఖాన్ని తలచుకుంటూ పాదాలు పెట్టుకునే వైపు చూశారు. ఏముంది అక్కడ ? గట్టి దిండు.
“అమ్మ” అనుగ్రహ విశేషం చేత ఆనాటి నుంచీ ఈనాటివరకూ, ఆమెకు మళ్ళీ కాళ్ళ నొప్పులు గాని, వంకర్లు పోవడం కానీ లేవు. ఆమె విజయవాడకు వచ్చినప్పటినుంచీ ఆమె కాళ్ళనొప్పులకు వాడే మందులు దొరకక, మందులు వాడడం లేదు. ఆమెకు ఇంత దివ్యానుభూతిని అనుగ్రహించిన “అమ్మ” – భావనాగమ్య.
“అమ్మ” భావనాగమ్యగా దర్శించిన శ్రీమతి రామకుమారిగారు ధన్య.
భావనాగమ్య అయిన అనసూయమాతకు శిరస్సు వంచి నమస్కరిస్తూ….
‘నీచరణ కమలాన నేనున్న చాలు
ఎందుకే నా తల్లి ! నందన వనాలు’.
శ్రీమతి రామకుమారిగారికి కృతజ్ఞతలు.