1. Home
  2. Articles
  3. Viswajanani
  4. “భావనామాత్ర సంతుష్ట హృదయ”

“భావనామాత్ర సంతుష్ట హృదయ”

R. Lakshmi Narayana
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : May
Issue Number : 10
Year : 2014

ఆరోజు నేను 1984 సంవత్సరంలో జిల్లెళ్ళమూడిలో అమ్మ సన్నిధిలో మండలదీక్షలో ఉన్న రోజులు. ఉదయం గం.5-00 నుండి రాత్రి గం. 9-00 వరకు ఏకాదశ మహారుద్రాభిషేకం సంపూర్ణ సుందరాకాండ పారాయణ లలితా సహస్రం, త్రిశతి, ఖడ్గమాల, అష్టోతర శత పారాయణలతో తీరిక ఉండేది కాదు. దీక్షాకాలంలో కార్యక్రమం అంతా పూర్తి చేసి అమ్మకు నివేదన ఇచ్చేదాకా ఏమీ తీసుకోరాదని నియమం పెట్టుకొన్నాను. అప్పుడు కూడా ఫలహారమే కాదు ఉడికిన పదార్థం గాని, కాచిన పదార్థం గాని ఏమీ తీసుకోరాదని మనసులో నిష్ఠ, నియమం.
అట్లా రెండు మూడు రోజులు గడచినవి. అమ్మ దగ్గరకు పిలిచి “శరీరం శుష్కించి పోతున్నది. పాలైనా తాగు నాన్నా!” అన్నది. పాలు కూడా కాగినవే కనుక రాత్రికి అమ్మకు నివేదన తర్వాత ఏదైనా తీసుకోవాలనే నియమం కనుక పాలు తీసుకోవడానికి విముఖత చూపాను నేను. అప్పుడు అమ్మ పండ్లు ముక్కలు తెప్పించి “ఇవి ఉడికినవి కావు. ఫలహారం అనుకోవచ్చు అన్నది” అవి కూడా … నివేదన అయ్యే వరకు తీసుకోదలచ లేదమ్మా! అన్నాను. ప్రసాదంగా ఇచ్చినా తీసుకోవా! నాన్నా! తీసుకో!” అన్నది. నేను ఎవరి అనుగ్రహం కోసం – 

కారుణ్యం కోసం ప్రసన్నత కోసం నా యీ దీక్ష సాగిస్తున్నానో, ఆ విశ్వజనని విశ్వమే జననిగా రూపొందిన అమ్మ) మాతృమూర్తి మమతల ఒడి తనకై తాను ప్రసాదంగా ఇస్తున్నాను తీసుకోనాన్నా” అంటున్నది. తినాలా ! వద్దా ! ఇస్తున్నది నా దైవం. తినకపోతే నా అమ్మ మాట ఉల్లంఘన, తింటే నా నియమభంగం. సందిగ్ధావస్థలో పడ్డాను. మనస్సులో ఒక క్షణం మధన జరిగిన అనంతరం మనస్సుకు ఒక ఆలోచన స్ఫురించింది. (అలా అనటం కంటే అమ్మ ఒక పరిష్కార మార్గం ప్రసాదించింది ఏమో)అమ్మ ఇస్తున్న ప్రసాదం తీసుకోక తప్పదు. ఆ ప్రసాదం నా నోట్లో వేసుకుంటూ అమ్మ నోటికి నేను అందిస్తున్నట్లు, అమ్మకు నేను అందిస్తున్నట్లు, అమ్మకు నేను తినిపిస్తున్నట్లు భావిస్తున్నాను. అలా 35 రోజులు గడచినవి. నా భావనగాని – నా మధనగాని అమ్మకు ఎన్నడూ చెప్పలేదు.

ప్రతిరోజు అమ్మ ప్రసాదంగా పండ్లు, కాయలు ముక్కలుగా చేసి తన స్వహస్తాలతో పెట్టుతూనే ఉన్నది. నేను నా భావనతోనే తింటూ ఉండే వాడిని. నానాటికి నాలో ఆ మాత్రపు ఆహారం (ప్రసాదం) తీసుకొనే శక్తి కూడా తగ్గుతున్నది. ఒకనాడు అమ్మ ప్రసాదం పెట్టింది. అది తినగా మరల కాస్త పెట్టబోగా ఇక తినలేనమ్మా! అన్నాను. అమ్మ నా వైపు చూచి మందహాసం చేసి తిరిగి నాదోసిట్లో ప్రసాదం వుంచుతూ అనురాగముతో వీపు నిమిరి “నీవు తినడం లేదుగా నాన్నా!” అని క్షణము ఆగి నా కన్నులలోకి చూస్తూ “నేను తింటున్నానని నీవు అనుకుంటూ… నోట్లో వేసుకుంటున్నావుగా అట్లాగే అవి కూడా తిను నాన్నా!” అని అన్నది.

ఇది నా సందేహ నివృత్తి – ఎలాగంటే – నేను అమ్మ వద్దకు రాకమునుపు నుండి, వచ్చిన తరువాత అమ్మ నాకు సాంఘిక, ఆర్థిక, సాంసారిక, ప్రాపంచిక, మానసికమైన ఎన్నో ఎన్నో అనుభవాలు అనుభూతులు ప్రసాదించినప్పటికి ఎప్పటికప్పుడు ప్రతిఅనుభూతిలో ఏదో ఒక ప్రత్యేకత, ప్రతిసారి నాకు వచ్చే సందేహాలకు జవాబులే.

నేను అమ్మను దైవంగా భావన చేస్తూ, భావనతోనే ఆరాధిస్తూ అది తనకు అందుకుండా లేదా అనే అనుమానం నాకు కలగకుండా, కలిగినా నివృత్తి చేయడానికా అన్నట్లు ఈ ప్రసాదం, ఈ భావన ఇచ్చి అన్నీ నాకు నీ భావన మాత్రం గానే నాకు చెందుతున్నాయి నాన్నా ! అని మరొకసారి సోదాహరణంగా విశదపరచింది.

ప్రతిదినము అమ్మకు పూజచేసుకునేటప్పుడు ప్రతి నామంలో నామానికి అనుగుణంగా అమ్మను భావన చేసుకుంటూ వుంటాను, కాని భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః” అనే నామము వచ్చినప్పుడు మాత్రము ఈ చేసే పూజ, పెట్టే నివేదన అమ్మ అందుకుంటుందా అనే జిజ్ఞాస అప్పుడిప్పుడు మనస్సులో ఉదయిస్తుండేది. అది కలిగిన రోజున పూజ అనంతరం . పెట్టిన నివేదనములోని పదార్థములు అమ్మ ఒక్కొక్కటి తింటున్నది అని భావన చేసినప్పుడు ఆ పదార్థము యొక్క వాసనమాత్రము ముక్కుకు అందుతూ రుచి ప్రకారం అమ్మ యొక్క ముఖకవళికలు మారుతున్నట్లు, అందులో ఏఏ పాళ్లు ఎక్కువ అయినవో, తక్కువ అయినవో మనస్సుకు స్ఫురింపచేస్తూ వుండేవి. మేము ఆ పదార్థము తినేటప్పుడు అవి భావనలను ఋజువు పరచేవి. అది కూడా నా భావనయేమోను, లేక నా మానసిక స్థితి ప్రాబల్యం ఏమోనని అనిపిస్తూ వుండేది. అందుకేనేమో ఈ నా నియమం, ఉల్లంఘన, అమ్మ ప్రసాదం, నా భావన, ఆభావనకు “భావనామాత్ర సంతుష్ట హృదయ” యైన అమ్మ శరీరం నుండి వచ్చిన అమృతవాక్కు మనస్సుకు స్ఫురిస్తున్నా తన నోటితో చెప్పితేనేగా మనకు ఋజువు. అందుకే నాకు ఈ అనుభవము. ఔను ! తను అమ్మనని, ఈ సర్వజీవరాశికి తల్లినని, తన నోటితో చెప్పినా నమ్మలేని స్థితి ఈ మనస్సుది. అందుకే అడుగడుగునా ఈ అనుభవాలు అనుభూతులు ఈ సంకోచపు మనస్సుకు అమ్మ ఇంకా ఎన్ని అనుభూతులు, అనుభవాలు ఇవ్వాలో? పరిపూర్ణమైన మానసిక పరిపక్వతకు వేచి వుండటమేగా నేను చేయగలిగిన పని.

కొన్ని కాయలు పండటానికి తక్కువ కాలము పడుతుంది. మరికొన్నింటికి ఎక్కువ కాలము పడుతుంది. ఈ కాయ పండటానికి ఇంకా ఎంత కాలము కావాలో ? దీనికి జవాబు చెప్పగలిగేది పండించగలిగేది- అమ్మే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!