భావము అనేది అమూర్తము, మనోగతము, కనిపించదు. రూపం అనేది చర్మ చక్షువులకి కనిపిస్తుంది. కాగా అమ్మ, భావానికి అందేదంతా రూపమే – అన్నది. అందుకు ఉదాహరణలు కోకొల్లలు.
అమ్మ ఆదరణ, ఆప్యాయత, మమకారం, అలౌకిక శక్తి, అపార అనుగ్రహం కంటికి కనిపించవు; అమ్మ చేతల్లో మనస్సుకి అనిపిస్తాయి, కనిపిస్తాయి.
నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా అమ్మకి నమస్కరించుకుని పాయసం నివేదన చేశాను. దానిని అమ్మ అందరికీ పంచుతూ, “నాన్నా! నీ ఆనందాన్నే అందరికీ పంచావు” అన్నది. ఆనందానికి రూపం వచ్చింది – పాయసం పంచటం ద్వారా.
“మంగళ సూత్రాలు భర్త రెండు పాదాలు” అన్నది అమ్మ.
జాతీయ పతాకంలోని రంగులు, ధర్మ చక్రము ఉదాత్త భావనకి ప్రతీకలు. కాషాయరంగు త్యాగానికీ; తెలుపురంగు స్వచ్ఛతకి, శాంతికి, ఆకుపచ్చరంగు సంపదకి, ధర్మచక్రం స్వధర్మ నిరతికి సంకేతాలు.
గాయత్రీదేవి ధ్యాన శ్లోకంలో ‘ముక్తా విద్రుమ హేమ నీల ధవళ’ చ్ఛాయలు, ఐదు ముఖాలు ఐదు భూతాలకి ప్రతీకలు. పంచ భూతముల సమ్మేళనమే గాయత్రి అని వివరించింది అమ్మ.
‘సుదర్శన చక్రం’ అంటే శిరస్సును ఛేదించి రక్తాన్ని చిందించేది అనికాదు – సమ్యగ్దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేది; అజ్ఞానాన్ని నశింపజేసి ఈశ్వర దర్శన సౌభాగ్య ప్రాప్తికి మార్గదర్శనం చేసేది – అని.
ఒకనాడు శ్యామల అనే బాల్య వితంతువు అమ్మ వద్ద తన సందేహాన్ని వ్యక్తం చేసింది – “మొదటి నుండి భర్తను యెరుగని నా స్థితి ఏమిటి?” అని. ఆ సందర్భంగా అమ్మ “రూపాన్ని యెరగవు గాని భావన వున్నదిగా చేసుకున్నాను, పోయాడని. ఆ గుర్తు ఉన్నది కదా! ఆ గుర్తునే ఆరాధించు. ఆ ‘చేసుకున్నాను’ అనే అయిదు అక్షరాలే మహామంత్రం. రూపాన్ని ధ్యానిస్తే ఏది పొందుతాడో అక్షరాలను ధ్యానించినా అదే పొందుతాడు” అని. రూపం లేదు కాని ‘గుర్తు’ ఉన్నది. దానిని ఆరాధించమన్నది. ఇది ఇంకా ఒక నిగూఢ సత్యావిష్కరణ.
ఇపుడు భావానికి గల శక్తిని గురించి తెలుసుకుందాం.
‘భావేషు విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే!
న ఫలం భావ హీనానాం తస్మాత్ భావోహి కారణమ్ ॥’ – అనేది పెద్దల మాట – ‘భగవంతుడు రాయిలోనో, మట్టిలోనో లేడు, భావంలో ఉన్నాడు. భావం లేని వానికి ఫలితం లేదు” – అని.
త్యాగయ్య, అన్నమయ్య వంటి పరమ భాగవత శ్రేష్ఠులు అవాజ్మాన సగోచరమైన పరతత్త్వానికి రాముడని, తిరుమలేశుడని ఒక రూపాన్ని కల్పించుకుని ఆరాధించారు. ఆ రూపాన్ని శిలలని భావించ లేదు. ప్రాణాధికంగా ముమ్మూర్తులా తమ ఆరాధ్య దైవాలేనని ఉపాసించారు. కనుకనే ఆ అర్చామూర్తులు కనుమరుగు కాగానే పిచ్చివారై విలపించారు. కొంచెం వివరిస్తాను.
– త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను వారి అన్నగారు కావేరీ నదిలో విసిరి వేశారు. శ్రీరామ వియోగ దుఃఖాన్ని భరించలేక త్యాగయ్య తీర్థ యాత్రలకు తరలి వెళ్ళారు. అంత శ్రీరామచంద్రుడు వారికి స్వప్నంలో కనిపించి విగ్రహాల జాడ తెలియజేశారు. వాటిని కనుగొన్న ఆనందాతిరేకంతో త్యాగరాజు ‘కనుగొంటిని శ్రీరాముని నేడు’ అంటూ భక్తి పారవశ్యంలో ఓలలాడేరు.
అన్నమయ్య నిత్యం ఆరాధించే శ్రీవేంకటేశుని విగ్రహాన్ని కొందరు దుర్మార్గులు దాడిచేసి అపహరించారు. అన్నమయ్యకు దుఃఖం కట్టలు త్రెంచుకు ప్రవహించింది.
‘ధారుణి మైరావణు దండించి రాము దెచ్చి
నేరుపున మించిన అంజనీ తనయా !…
ఇందిరా రమణు దెచ్చి యియ్యరో మాకిటు వలె
పొంది యీతని పూజింప పొద్దాయ నిపుడు – అంటూ విలవిలలాడేడు. అంతే. ఒక కోతి ఆ ముష్కరుల గుడారంలో ప్రవేశించి భీకరాకృతి దాల్చి గుడారాన్ని ధ్వంసం చేసి శ్రీవేంకటపతి విగ్రహాన్ని తెచ్చి అన్నమయ్య ముందు ఉంచింది.
వారంతా ఆలయాల్లో ప్రతిష్ఠింపబడిన అర్చామూర్తుల నమూనాలో ఉన్న విగ్రహాలను తెచ్చుకుని, వాస్తవానికి వాటిని తమ మనోమందిరాల్లో ప్రతిష్ఠించుకుని అర్చించుకున్నారు.
ఒక విశేషాంశం – ‘విగ్రహం – అర్చామూర్తి’ పదాల స్వరూప స్వభావాన్ని ఒక సందర్భంలో అమ్మ లోకోత్తర రీతిగా ఆవిష్కరించింది. వివరిస్తా –
టి.టి.డి. కార్య నిర్వహణాధికారిగా త్రికరణశుద్ధిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ (IAS) గారికి విశాఖపట్టణం బదిలీ అయింది.. తదనంతర కాలంలో వారు జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ పద సన్నిధిలో ఆసీనులయ్యారు. వారినుద్దేశించి అమ్మ, “నాన్నా! వెంకన్న నీ కోసం బెంగ పెట్టుకున్నాడు’ – అన్నది. ఆ మాట వినగానే ఒక సందేహం తల ఎత్తుతుంది. బంగారు కోవెలలో కొలువై ఉన్నది ఒక విగ్రహం, దైవం. విగ్రహం / దైవం. మనకోసం బెంగపెట్టుకోవడమేమిటి? – అని. సరే. ప్రస్తుతానికి దానిని అలా
ఆనందంగా అమ్మ మాటల నాలకించిన శ్రీ ప్రసాద్ గారు “నాదేమీ లేదమ్మా. అంతా స్వామి చేసుకున్నదే’ అన్నారు సవినయంగా. తక్షణం అమ్మ తన పలుకులను కొనసాగిస్తూ, “దేవుడంటే రాయి కాదు కదా! తనకీ మనస్సు ఉ న్నది కదా!” – అన్నది; విగ్రహారాధన అర్చన మాటున దాగిన మహత్వపూర్ణ అలౌకిక సత్యాన్ని తేటతెల్లం చేసింది. నిజం. భగవంతునికి సృష్టిపై బిడ్డలపై ఉన్న ప్రేమ నిరుపమానం. పునర్దర్శన ప్రాప్తిని ఆకాంక్షించేది భగవంతుడే.
“భావానికి అందేదంతా రూపమే” అనే అమ్మ వాక్యాన్ని మరొక కోణంలో అధ్యయనం చేయడానికి “భావచైతన్యమే కవిత్వం” అనే అమ్మ వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నాను. “చూచినవాడు చూడని వానికి చూచినట్లు చెప్పేది కవిత్వం” అని నిర్వచించింది అమ్మ. అంటే అనుభవాన్ని వ్యక్తం చెయ్యటమే కాక, అది మనకు అనుభూతమయ్యేటట్లు చెయ్యటం కవిత్వం. ఏమైనా సిద్ధాంతం కంటే ఉదాహరణలే బాగా బోధిస్తాయి. కొన్ని రచనలని అధ్యయనం చేద్దాం.
- ఆర్షవాక్కు :- 1. శ్రీమద్రామాయణ పారాయణ క్రమంలో ఒక శ్లోకం ఉన్నది
‘ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం॥ అని. దుష్టరాక్షసులు హనుమతోకకు నిప్పుపెట్టారు. హనుమ ఆ పావక ప్రభలతో లంకా పట్టణాన్ని దహనం చేశారు. ఉన్నది కావ్యంలో. కానీ పై శ్లోకంలో పతివ్రతా శిరోమణి సీతమ్మ వేదనాగ్నిని తీసుకుని హనుమ లంకాదహనం చేశాడు. అని ఉన్నది. ఇదే సత్యం అనిపిస్తుంది. తోకకు పెట్టిన నిప్పు తోకను దహించదు, పైగా చల్లగా మంచు కురిసినట్లే ఉంటుంది – సీతమ్మ ఆశీస్సులతో, ఇదొక యదార్ధ భావనా విశేషానికి అక్షరాకృతి.
- ‘ఆదిత్య హృదయంలో తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే! కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః – అనే శ్లోకం ఉన్నది. ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి భానుడు చీకటిని – చలిని సంహరిస్తాడు. ఇది కంటికి కనిపించే సత్యం. కృతఘ్నులను – చేసిన మేలును విస్మరించిన వారిని సంహరిస్తాడు. ఎంత గొప్ప నీతి వాక్యం, ఆప్తవాక్యం, ఉత్తమ భావన ! 2. సంస్కృతం: రఘువంశ కావ్యంలో గంగాయమునా సంగమాన్ని వర్ణిస్తూ కాళిదాస మహాకవి ఎన్నో ఉపమానాలు చెప్పారు. అందు- ‘క్వచిచ్చ కృష్ణారగ భూషణైవ భస్మాంగరాగా తనురీశ్వరస్య’ అనేది ఒకటి. గంగాజలం తెల్లగా ఉ ంటుంది, యమునా జలం నల్లగా ఉంటుంది. వాటి కలయిక ఎలా ఉంది. అంటే – శరీరమంతా తెల్లని భస్మంతో విరాజిల్లే మహేశ్వరుని శరీరంపై నల్లని సర్పం కదలాడుతున్నట్లు – అని. భస్మం ఉన్న ప్రాంతం తెల్లగాను, సర్పం ఉన్న ప్రాంతం నల్లగాను ఉంటుంది. అద్భుత భావనా వైచిత్రి ఇది. ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు, గంగాయమునలు నేలపై ఉన్నాయి. ఇది ఒక విశేష దృష్టి. ‘అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి’: – అన్నారు అందుకే.
- తెలుగు: పద్యం –
తెళ్లనిదంచు చు వాసనల దేలుచు నందము చిందునంచు నీ
వల్లన కేతకీ సుమము నా పొదకేగియు ద్రుంపగోర క
త్యుల్లసనమ్ముతో నచట నున్నవి ముండ్లు భుజంగముల్ కడున్
డిల్ల పడంగ జేయును కడింది విచారము గూర్చు మిత్రుడా!’
అర్థం: తెల్లగా అందంగా ఉండి సువాసనలు వెదజల్లుతుంది – అనుకుని నువ్వు మొగలి పొద చెంతకు చేరి ఆ పుష్పాన్ని త్రుంచవద్దు. అక్కడ విశేషంగా ముళ్ళు, సర్పాలు ఉన్నాయి. తలక్రిందులవుతావు, కోరి కన్నీళ్ళు తెచ్చుకుంటావు – అని. అన్యాపదేశంగా చేసిన హితోక్తి. కవి లక్ష్యం మొగలి పువ్వుకాదు, కోరికల వెంటపడిపోతే దుఃఖం అనే ఊబిలోనో, శోకం అనే లోయలోనో పడి అలమ అని.
- హిందీ:
‘బఢా హుల తో క్యాహు ఆ జైసే పేఢ్ ఖజూర్
పంధీకో ఛాయా నహీ ఫల్ లాగే అతిదూర్’ – (కబీర్)
అర్థం: ఎడారిలో ఖర్జూర వృక్షం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. ఆ ఎత్తున ఉంటాయి ఫలాలు. ఏం ఉపయోగం? డస్సిన యాత్రికులకు పళ్ళు అందిస్తాయా? లేదు. కనీసం నీడనైనా ఇస్తాయా? అదీ లేదు – అని.
కవిలక్ష్యం – పరోపకార స్వభావం లేని మనిషి రేవులో తాడిలా ఎదిగితే ఏం ప్రయోజనం? ఏం పరమార్థం? అని. అది చక్కని విలువల్ని అందమైన అక్షర కూర్పుతో చిక్కని భావాన్ని దృశ్యకావ్యంగా చిత్రించటం.
- ఆంగ్లం:
‘Dark mother! always gliding near with soft feet,
Have none chanted for thee a chant of fullest welcome?
Then I chant it for thee, I glorify thee above all,
I bring thee a song that when thou must indeed
Come, come unfalteringly’ (Whitman)
ఇక్కడ కవి personification అనే అలంకారాన్ని ప్రయోగించారు. వారు మృత్యువును తల్లిగా భావన చేశారు; ఎందరో కవులు మృత్యువును ప్రియునిగా స్నేహితునిలా వర్ణించారు కూడా – అందరూ భయంతో వణికిపోయే సందర్భాన్ని, చివరి మజిలీని. కంటికే కాదు, మనస్సుకీ తెలియదు అది ఏమిటో! (Death) మృత్యువుని స్వాగతిస్తూ తాను ఆమెను స్తుతిస్తానని, సర్వోన్నతురాలుగా కీర్తిస్తానని అన్నారు. నిజమే. మృత్యువు సర్వోన్నతురాలే. ఒక వ్యక్తి కళ్ళు తెరిచింది మొదలు తను పడ్డ పరుగులు, ప్రయాసలు, ఆశ అసంతృప్తులు, రాగ ద్వేషాలు, – జయాపజయాలు, సుఖ దుఃఖాలు, కోపతాపాలు… అన్నింటికీ ఒక Full stop పెట్టి సుస్థిరమైన శాంతినిచ్చి సేదతీర్చేది తనే కదా!
భాష ఏదైనా – ‘Poetry is divine’ అన్నారు. ‘నానృషిః కురుతే కావ్యం’ అన్నారు. అనేకానేక భావ పరంపరల వ్యక్తీకరణలో అక్షర రమ్యత, సత్యాన్వేషణ, నీతి ప్రబోధము ఎన్నో అంతర్లీనంగా దీపిస్తాయి కవితాశిల్పంలో.
“భావానికి అందేదంతా రూపమే”, “భావచైతన్యమే కవిత్వం” అనే అమ్మ వాక్యాన్ని తరిచే కొద్దీ కల్పవక్షం, కామధేనువు, అమృతభాండం… ఎన్నో ఉద్భవిస్తాయి, అఖండ ఆనందాన్ని ప్రసాదిస్తాయి; పవిత్రీకృతం చేస్తాయి.