అక్టోబరు సంచికలో వచ్చిన మల్లాప్రగడ శ్రీవల్లి గారి వ్యాసం ‘నిశ్చింతా’ స్వయంగా అమ్మే పంపిన సందేశంలా ఉంది. ఆమాట కొస్తే విశ్వజననిలో వచ్చే ప్రతి వ్యాసం, రచన, పి.యస్.ఆర్. గారి సంపాదకీయం, గోపాలన్నయ్య గారి శోధనాంశాలు నించి, అర్కపురి విశేషాల వరకూ, ప్రతి అక్షరం, ‘అక్షరాక్షరాత్మిక’ అమృత గుళికలే. మరిపుడు ప్రత్యేకించి ఈ వ్యాసం వ్రాయడం, అమ్మ మనకి ఏఏ రూపాలలో, మనకి తెలిసీ తెలియకుండా, మన ప్రతిది అవసరానికీ, మన వెంట ఉండే ఎలా సలహాలిస్తుందో, ధైర్యం చెబుతుందో అవసరమైతే మందలిస్తుందో, విన్నవించుకోవడానికే.
నేను విశ్వజనని పత్రిక కోసం ప్రత్యేకించి ఎదురు చూడను. ఖచ్చితంగా ఏ తేదీకి వస్తుందో తెలియదు కనుక. కానీ, మనసు ఎపుడైనా, ఆందోళనతో, భయానికో గురై, ‘ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తున్నపుడు, విచిత్రంగా, ‘ఇదిగో సార్, అమ్మవారి ప్రసాదం’ అంటూ మా కాలేజి అటెండర్ విశ్వజనని పత్రిక తీసుకొచ్చి చేతిలో పెడతాడు? అంతే ! నన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం అందులో ఉంటుంది ఖచ్చితంగా. పరమానందంతో సంచిక తీసుకుని, ఎప్పటికీ, మొదట పేజీనించి గాకుండా, కళ్ళు మూసుకుని మధ్యలో ఎక్కడో ఒక పేజీ తెరుస్తాను. అంటే లాటరీ లాగినట్టు. ఆశ్చర్యకరంగా, అక్కడ ఓ చిన్న కవిత రూపంలోనో, వ్యాసంగానో, సమస్యకి సమాధానంగా ఉంటుంది. నాతో నేరుగా అమ్మే మాట్లాడుతున్నంత స్పష్టంగా ఉంటుంది తప్ప నేనేదో అర్థం చెప్పుకోవడం గాదు.
అలా, ఓ రెండు నెలలుగా, నాకు అర్థం కాకుండా సతమతపెడుతున్న సమస్యలకి అమ్మే శ్రీవల్లి గారి ద్వారా సమాధానం పంపినట్లు అనిపించిన వ్యాసం ‘నిశ్చింతా’. భాష శ్రీవల్లిగారిది, భావం అమ్మది. ‘భాషారూపా, బృహత్సేనా’ కదా అమ్మ! ఆ వ్యాసంలో భాషా, భావం రెండూ శక్తివంతంగా ఉన్నాయి.
శకునాలు వంటి మూఢనమ్మకాల్ని విడనాడి చెప్పిన సంఘటన దుద్దుకూరు అక్కయ్య గారిది. వారి మంగళ సూత్రాలు ఎవరో దొంగ తెంపుకుపోతే అదే మన్నా అమంగళమేమో అని అక్కయ్య భయపడుతున్నదట. అపుడు అమ్మ చిరునగవుతో కంగారేం లేదు లోపల మంగళ సూత్రాలు ఉన్నాయి మెళ్ళో వేసుకో’ అని చెప్పిందట. ఎందుకుండవూ? బిడ్డల భయాన్ని తొలగించడానికి, అమ్మవద్ద మంగళసూత్రా లుంటాయీ, పట్టుపీతాంబరాలూ సిద్ధంగా ఉంటాయి. ‘సుమంగలీ, సుఖకరీ’ అమ్మ!
పున్నయ్య గారికి చిటారు కొమ్మన చిన్నికృష్ణునిగా దర్శనం ఇచ్చిందట అమ్మ. ఆపైన ఇక ఆకాశమే. అంటే భావమూ, ఆలోచనే. నీ భావమే, నీ అనుభవం. దాన్ని అదుపులో ఉంచుకో” అని చెప్పిన భావాభావవివర్జిత అమ్మ.
జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి. అమ్మ దయవలన గానీ వయసుతో, రకరకాల అనుభవాలతో బాటు, చాప క్రిందనీరులా శకునాలను వంటి మూఢనమ్మకాలు కొన్ని తిష్ట వేసుకుపోయాయి మనసులో. ఇక మనసు ఎలాగూ పిచ్చి ఆలోచనలతో గందరగోళ పరుస్తూనే ఉంటుంది. వీటితో కలిగిన ‘చింత’తో మనుషుల పట్ల చిరాకు పెరిగి, దాంతో భయం ప్రవేశించి, సతమతం అవుతున్న నాకు ‘నిశ్చింతా’ వ్యాస గొప్ప ఊరట.
మనలోని ఆలోచనే, దాని తత్వాన్ని బట్టి, చింతగా వేధించవచ్చు. అదే చింతరసంగా దాహం తీర్చనూవచ్చు. అనంత ఆకాశంవంటి ఆలోచనకి కాస్త పగ్గం వేయగలిగితే భావాభావాలకి అతీతమైన ‘ఆదిశక్తి’ సాక్షాత్కరిస్తుంది.