అన్నపూర్ణాలయమ్మున
అమ్మ యెపుడు
ఉజ్జలంబుగ వెలుగొందు
ఉత్సవముగ
భుక్తి ముందుగ చూపించి
భూరి దయను
ముక్తి కలుగంగ చేయును
ముదము తోడ.
వత్సలతా నిధానముగ వాసికి నెక్కిన అమ్మ యింటిలో
మత్సర భావముల్ మనకు మచ్చునకైనను కానుపింపవే
వత్సర మంతయు న్నచట వారణ లేకయె ఉత్సవంబులున్
తత్సహకార మింపొదవ తల్లిని భక్తిని కొల్చుచుండగా.
ఆనందంబును పొందగా దలచినన్ అమ్మన్ విలోకింపుమా
ఏనా డైనను జీవయాత్ర నడుమన్ వాత్సల్య వారాశినిన్
ప్రాణాధారను పుణ్యకార్య నిపుణన్ ప్రత్యక్ష దైవంబు గా
ఈనాడే కడుభక్తితో కొలువగా ఈ మాత రక్షించుగా.
“నేను” మూలంబుగా గల్గి
నిఖిల జనులు
సాగుచున్నారు నిత్యమ్ము
సగుణు లగుచు
“అన్ని నేనులు నేనైన”
అమ్మను గని
శాంతి సుఖములు పొందుటే
సకల శుభము.
లోకోత్తరంబుగా
లోకాలనేలేటి
లోకల్యాణి యీ
లోకపూజ్య
ఆనందమును పంచ
అవతారమెత్తిన
అమ్మయై వెలసిన అమృతమూర్తి
అజ్ఞాన తిమిరంబు
నంత మొందింపగా
దివ్యమౌ బోధను
తీర్చిదిద్దు
తరియింప జేయుటే
తనకార్యమని పల్కి
తాపశాంతిని కలిగించు
తల్లి ఈమె
అన్నపూర్ణయె తానైన
అమ్మ ఎపుడు
కన్నబిడ్డల ప్రేమతో
కనికరించు
కారుణ్యమూర్తిగా
కనుల నెదుట
నిలిచి బ్రోవంగ
వెలుగును
నిత్యమిచట.