అమ్మ దగ్గరకు ప్రతి రోజూ చాలా మంది వచ్చేవారు. అమ్మలో ప్రత్యేకత ఏమిటి ? అమ్మ ఏమన్నా మహిమలు చేసేవారా ? అని చాలా మంది అడుగుతూంటారు. సహజం. చాలా మందికి మహిమల మీదే మోజు ఎక్కువ. అయితే అమ్మ అసలు మహిమల గురించి పట్టించుకునేవారు కాదు.
అమ్మకు మహిమల గురించి ప్రస్తావించడం, వాటి మీద ఆసక్తిని ప్రోత్సహించడం సుతరామూ యిష్టముండేది కాదు.
“మంచి తనాన్ని మించిన మహిమలేదు”.
“మహితత్త్వానికి మహత్యాలతో పని లేదు”.
“మహత్యాల మీద ఆధారపడ్డ విశ్వాసం ఎంత కాలముంటుందో?” ‘ఈ సృష్టికన్నా మించిన మహత్యమేముందీ? ఇంత కన్నా ఏం మహత్యం కావాలి?’ అనే వారు అమ్మ. అయినప్పటికీ, అమ్మ దగ్గరకు వచ్చి, తమకు యీ అనుభవం కలిగిందనీ, ఆ మహిమ అమ్మ చూపించారనీ, అమ్మ దగ్గర చాలా మంది విన్నవించుకునే వారు వాళ్ళ – వాళ్ళ తృప్తికోసం.
అయితే ఆ మాటలు అమ్మ పట్టించుకునే వారు కాదు. విని ఊరుకునేవారు.
“అది నా విశ్వాసం నాన్నా అన్నిటికీ కాలమే కారణం. అలాగ జరుగవలసి ఉంది. జరిగింది. ఇందులో నా ప్రమేయం లేదు. రోజు వస్తే అన్ని అనుకోకుండా జరిగి పోతాయి. సమయం వస్తే ఏమీ ఆగవు” అనే వారు అమ్మ.
“నా దృష్టిలో నిర్ణయం – మీ దృష్టిలో మహాత్మ్యం”.
ఒకనాడు ఒక కుటుంబం గుజరాతు నుంచి వచ్చారు. భర్త, భార్య, ఇద్దరు కుమారులు. ఆయన అంతకు ముందే 10 సం॥ల క్రితం అమ్మను దర్శించినాడట అప్పటికి సంతానం లేదు. అమ్మకు విన్న వించుకున్నాడట. అప్పుడు అమ్మ ఆయనకు కుంకుమ ప్రసాదమిచ్చారట.
తరువాత యిద్దరు కుమారులు కలిగారు. ఈ విషయం ఆయన ఇంగ్లీషులో అమ్మకు విన్నవించు కున్నాడు.
నేను ఆ సమయంలో అక్కడే ఉన్నాను. అమ్మకు విషయమంతా తెలుగులో విన్నవించాను.
ఒక్కొక్కసారి నాకు కలిగేది. తెలుగురాని వారు వచ్చినపుడు యీ విధంగా అనువదించే సేవా భాగ్యం.
అమ్మ అన్నారు : “తరుణం వచ్చింది నాన్నా, బిడ్డలు కలిగేరు. కాలమే అన్నిటికీ కారణం”.
“కాదు, ఇదంతా మీ దయ” అంటారా దంపతులు.
అది వారి విశ్వాసం
లేకపోతే ఎక్కడ గుజరాత్ ఇంత దూరం వస్తారా ?
ఇలాగ ఎంతో మంది ఎన్నో విషయాలు అమ్మకు విన్నవించుకునే వారు. అమ్మ మాత్రం అన్నిటికీ కాలమే కారణం అనేవారు. అమ్మ తన మెప్పుకోసం ఎన్నడూ ఒప్పుకునే వారు కాదు. కాలమే “కాళి” అని అమ్మ నిర్వచనం. నిర్విరామంగా జరిగే కాలమే “రాముడు”. అంటారు అమ్మ.
(జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి కాకినాడ సమర్పణ)