1. Home
  2. Articles
  3. Mother of All
  4. మంచి మనస్సు

మంచి మనస్సు

Pragna
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 2
Month : January
Issue Number : 4
Year : 2001

నిత్య జీవితంలో మన మనుగడ ఇతరుల మీద ఆధారపడి ఉందనే సత్యం మనలో ప్రతి ఒక్కరికి అనుభవమే. తెల్లారి లేస్తే ఏదో విధంగా మనకి మన కుటుంబ సభ్యులతో కాని, యిరుగు పొరుగులతో కాని, బయట వాళ్ళతో కాని పని బడుతునే ఉంటుంది. వారికి కూడా మన సహాయ, సంపర్కాలవసరమౌతాయి. కాబట్టి మనం పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని నడుచుకుంటే జీవితం నందన వనం అవుతుంది. లేకపోతే ముళ్ళకంచె అవుతుంది.

“నీ మనస్సు మంచిదైతే ఎక్కడికి పోయినా మంచి వాళ్ళే దొరుకుతారు. నాకు మంచి అంటూవుంటే యెవరైనా చెడు చేసినా మంచిగానే పరిణమిస్తుందని” అమ్మ శ్యామలతో చెప్తుంది. (అమ్మ జీవిత మహోదధి మొదటి భాగం పేజి 342)

ఈ వాక్యాలు మనందరి జీవితాలకి వర్తిస్తాయి. ప్రతి మనిషి రాగం, ద్వేషం, ఆగ్రహం, అనుగ్రహం, అసూయ, ఈర్ష్య, ప్రేమ, ద్వేషం, అహంకారం, జాలి అనే గుణాలు కలిగి వుంటాడు. అవి భగవంతుడిచ్చిన వరాలు, శాపాలు. అమ్మ అన్నట్లుగా మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు. రాగద్వేషాలనే రెండే గ్రహాల మీద ఆధారపడి వున్నాయి. మన జీవితంలో యీ రెండు అవగుణాలు మన నడవడికల్ని, ఆలోచల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ కంప్యూటర్ల యుగంలో మరీ దేదీప్యమానంగా ఈ గుణాలు వెలుగుతున్నాయి. మానవుడు ప్రగతి సాధించిన కొద్దీ, ఓర్వలేనితనం, అసూయ, స్వార్థం అనే అవగుణాలు వెఱి తలలు వేస్తున్నాయి.

మహాత్ములలాగ మనం యీ అవగుణాల్ని జయించలేక పోవచ్చును. మన పరిస్థితులను బట్టి, పరిధులను బట్టి వాటికి లొంగి పోవచ్చును. కాని, వారి జీవిత చరిత్రలను చదివి, వారి ఉద్భోధలను విని, కొంత వఱకైనా మన స్వభావాలను, బలహీనతలను మార్చుకొనె ప్రయత్నం చెయ్య గలమేమో ! మన మనస్సును ప్రక్షాళితం చేసుకోవాలంటే మొదటి అడుగు విశాల దృక్పధం వైపు వెయ్యాలి. ఎదుటి వాడిలోని అవలక్షణాలను వెదకకుండా మనలోనివి వెదుక్కోవడం ప్రారంభించాలి. ప్రతిక్షణం మన ఆలోచనలతో, మనం అంతర్ముఖంగా సంఘర్షణ జరుపుతూనే వుండాలి. అవతలి వ్యక్తి యొక్క దుర్బలత్వాన్ని అర్థం చేసుకుని, వానిని ప్రేమతో సానుభూతితో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. దాని వలన యిద్దర్లోనూ మార్పు వచ్చి, యిద్దరూ తృప్తి పడ్తారు.

మన దైనందిన వ్యవహారాలలో అనేక సంఘర్షణలకూ వాద ప్రతివాదాలకు లోనవుతాయి. అహంకారంతో దుర్భాషలాడ్తాం. దాని వల్ల మనశ్శాంతి కోల్పోతాం. అవతలి వారి మనశ్వాంతిని పోగొడ్తాం. కొన్ని సమయాలలో యీ చిన్న చిన్న ఘర్షణలే గర్భ శత్రుత్వంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే మనం మన యొక్క ప్రవర్తనని అవలోకించుకుని మన యొక్క బలహీనతలను విమర్శించుకుంటే, మన యొక్క లోటుపాట్లు, తప్పులు భూతద్దంలో చూసినట్లుగా మనకి కనిపిస్తాయి. వాటిని జయించడానికి ప్రయత్నిస్తే అంతకంటే సుఖం యింకొకటి వుండదు. ఎదుటి వాడి బలహీనతలను క్షమా గుణంతో స్వీకరించగలిగితే మన మనస్సు ప్రక్షాళితం అవుతుంది. స్నేహశీలత, క్షమాగుణం కలిగిన వ్యక్తికి అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. అందర్నీ ప్రేమాదరాలతో అభిమానిస్తారు. ఈ ప్రేమాదరాలు వారికి అమూల్యమైన ఆభరణాలు. Every action has a reaction అన్నట్లుగా మనం మంచి మనస్సుతో యితరులను అభిమానిస్తే, మనకి కూడా యెదుటివాడి మంచితనం లభ్యమౌతుంది. సామాన్య మానవులం కాబట్టి మన జీవితాలలో అనేక ప్రలోభాలకి, బలహీనతలకి లోనవుతూ వుంటాం. కాని, వాటిని వీలైనంత వరకు నాశనం చేసుకోవడానికి ప్రయత్నించి, మన మనస్సులను నిర్మలంగా, నిశ్చింతగా ఉంచుకుంటే, యీ మానవాళి అంతా ప్రేమస్వరూపులు దయాళువులు అవుతారు. అప్పుడు మన జీవితాలు మలయమారుతం, మంచి గంధం, మల్లెల సువాసనల భరితం అవుతాయి కదూ !

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!