దృవ్యమానమయిన బాహ్యప్రకృతి మానవుల అంతః ప్రకృతికి ప్రతీక. వ్యక్తస్థితిలోనూ, అవ్యక్తస్థితిలోనూ ప్రకృతి ఒక్కటే కాబట్టి దాని ధర్మంలో భేదం ఉండదు.
సంక్రాంతి వచ్చింది. కర్షకులు సంవత్సరమంతా చేసిన కృషికి ఫలితాన్ని అనుభవించే ఆనందకర సమయమిది. అయితే యీ సమయంలో ఎంతమంది ఆనందించ గల్గుతున్నారు. ఎందరు దుఃఖపు కౌగిలిలో నలుగుతున్నారు ? దీనికి సమాధానం చెప్పటం కష్టం. వర్షాలు చాలక పైరు కొన్ని చోట్ల ఎండిపోయింది. కొన్ని చోట్ల వర్షాధిక్యంవల్ల గంగపాలయింది. సమవర్షాలున్నా కొన్నిచోట్ల కారణాంతరాలవల్ల పైరు దెబ్బతిన్నది. అన్ని బాధలకు తట్టుకొని కొన్నిచోట్ల పైరు చక్కగా పండింది.
ఈ అస్తవ్యస్తస్థితిలో ఒక అర్థవిశేషం అంతర్లీనమై ఉన్నది.
అఖండ ప్రకృతిలో అంతర్భాగాలైన మానవ ప్రకృతులలో కొన్ని బలహీనాలు; కొన్ని బలవిశిష్టాలూ ‘నేనిలా ఉండాలి”అది అలా కాకూడదు’ అని శాసించటానికి ఎవ్వరికీ సామర్థ్యం లేదు. సర్వావాంతర భేదసమన్వితమై, సర్వశక్తి విలసితమైన మహాప్రకృతికే అటువంటి సామర్థ్యముంది.
మానవులయొక్క చిత్త ప్రవృత్తుల వైపరీత్యాలనుబట్టి నేడు ప్రపంచంలో ఇటువంటి దుర్భిక్ష, క్షామాది బాధలు కలుగుతున్నాయనికాదు దీని ఉద్దేశ్యం.
బాహ్యమనీ, అంతరమనీ ద్విధా విభక్తమయిన ప్రకృతియొక్క మూల మొక్కటేననీ, దాని స్వభావాన్ని అవగతం చేసుకొని అనుభవించటమే మన కర్తవ్యమనీ మాత్రమే మనం తెలుసుకోవాలి !
“చేతలు చేతుల్లో లేవు”
“” సృష్టి సహజం” అంటుంది అమ్మ.
మహా ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ప్రవచించిన యీ రెండు వాక్యాలలో సర్వవేదసారం గర్భితమై ఉన్నది; సర్వవేదాంత సౌరభం గుబాళిస్తోంది.
అమ్మా! మధురమాయా విలసితమైన నీ ప్రకృతి రహస్య విజ్ఞాన పరిష్వంగంలో నీ బిడ్డలనందఱినీ నిర్విశేషంగా లాలించి పాలించవా ?
పవిత్రమైన ఈమకర సంక్రాంతి కాంతిలో క్రాంతి పథాన్ని మాకు చూపించు తల్లీ !