జిల్లెళ్ళమూడిలో మొదటి కోటినామ పారాయణకు వైజాగ్ నుంచీ చాలా మంది పాలుపంచుకున్నారు. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు వారి శిష్యులను కొంత మందిని జిల్లెళ్ళమూడికి పంపారు. అత్యద్భుతంగా కార్యక్రమం జరిగింది. నాకు కూడా పాల్గొనే అవకాశం దొరికింది. అదే నా జీవితానికి కొత్త దశ అయింది. ఆ రోజు నుంచీ ‘అమ్మ’ నన్ను తన అధీనంలోకి తీసుకుంది. నేను ఏమీ చేయలేను. ప్రతిక్షణం నా చేయిపట్టుకొని నడిపిస్తోంది. లలితా సహస్రనామాలకు ప్రవచనాలు శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావుగారి చేత మొట్టమొదటిసారిగా 24 రోజులు మాతృశ్రీ అధ్యయన పరిషత్, విశాఖలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇది అమ్మ ఆదేశం. ఆ తరువాతే జిల్లెళ్ళమూడిలో చెప్పించటం జరిగింది. ఆ వ్యాఖ్యానాన్ని ‘భారతీ వ్యాఖ్య’గా అమ్మ చేతుల మీదగా మహా మహాపండితుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. 108 ‘భారతీ వ్యాఖ్య’ పుస్తకాలతో అమ్మకు విశాఖ అధ్యయన పరిషత్ సభ్యులు పూజ చేసుకున్నారు.
అది మొదలు రంగారావుగారికి అనేక బిరుదులు, సన్మానాలు జరిగాయి. అనేక చోట్ల అనేక నగరాలలో ప్రవచనాలు చెప్పటం, వారి ఆధ్వర్యంలో హరి అచ్యుతరామశాస్త్రిగారి లలితా సహస్రనామ పారాయణ క్యాసెట్లు కూడా విడుదల అయ్యాయి. శ్రీ రంగారావుగారిది బందరుగా ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం.
మా తండ్రిగారు శ్రీ అయ్యగారి రామమూర్తిగారు స్థాపించిన జైహింద్ హైస్కూలులో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేసేవారు. బందరులోని నాగేశ్వర స్వామి గుడిలో సాయంత్రం వారి ప్రవచనాలు ఎక్కువగా జరిగేవి. ఆ విధంగా వారు మాకు చాలా దగ్గర వారు, ఆప్తులు. వారి కుమారులే మన జిల్లెళ్ళమూడి ఓరియంటల్ కాలేజీలో పనిచేస్తున్న శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు. వారు తండ్రిని మించిన తనయులుగా అలరారుతున్నారు.
మా తండ్రిగారు బందరులో భారతదేశంలో మొట్టమొదటి సైంటిఫిక్ కంపెనీ “ఆంధ్రా సైంటిఫిక్” కంపెనీ, నేషనల్ కెమికల్స్, ఆంధ్రా గ్లాస్ వర్క్స్, ఈడికో మొ||లగు పెద్ద ఫాక్టరీలు నిర్మించారు. ఆయన చిన్న వయస్సులోనే పోయారు. కోట్ల రూపాయల ఆస్తులూ వారితోనే పోయాయి. తరువాత ఆ కంపెనీని భారత ప్రభుత్వ రక్షణ శాఖ తీసుకుంది. అమ్మ బందరు వాత్సల్య యాత్రలో భాగంగా వెళ్ళినప్పుడు సైంటిఫిక్ కంపెనీ వారు పూర్ణకుంభంతో వేద ప్రవచనాలతో అమ్మకు ఆహ్వానం పలికారు. ఆ సమయంలో నా భార్య కుసుమ అమ్మతోపాటు కంపెనీని దర్శించింది. అక్కడ వున్న మా నాన్నగారి విగ్రహాన్ని స్వయంగా అమ్మచేతితో తడిమి ఆశీర్వదించటం జరిగింది. ఆ విగ్రహాన్ని డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించారు. ఈ విషయాలన్నీ రంగారావుగారికి బాగా తెలుసు. వారితో గడిపినంత సేపూ ఆ విషయాలు ముచ్చటించుకునే వాళ్ళం. ఒకసారి సభలు జరిపిన సందర్భంలో నేను కొత్తగా కొనుక్కున్న మారుతీ వాన్లో ఇద్దరం ప్రయాణిస్తున్నాం. ఈ వాన్ 40 రోజుల దీక్ష తర్వాత అమ్మ అనుగ్రహించి ఎలా ఏర్పాటు చేసిందో చెప్పకున్నాను. వెంటనే వారు అమ్మ “క్షిప్రప్రసాదిని” అండీ అని ఆ నామం అర్ధాన్ని వివరించారు.
ఆ సందర్భంలోనే వారు మరో సంఘటనను గుర్తుచేసుకున్నారు. జిల్లెళ్ళమూడిలో అమ్మ సమక్షంలో రామాయణం చెప్పడం జరిగిందట. ఒక రోజు రాత్రి అమ్మ వారిని రమ్మని కబురు పంపిందిట. ఆ రోజు పౌర్ణమి. చక్కటి చిక్కటి వెన్నెలలో అమ్మ డాబా మీద పచార్లు చేస్తోంది. వారు వెళ్ళి అమ్మకు నమస్కరించి అమ్మ వద్ద నిలబడ్డారు. అమ్మ “నాన్నా! నీవు ఈ రోజు రామాయణం చెప్పినప్పుడు వాల్మీకి వ్రాశాడు” అన్నావు. అంటే “రామాయణం జరగలేదా! అంతా కట్టు కథ అంటావా?” అని అడిగింది. రంగారావుగారు విస్తుపోయారు. ఏమి చెప్పాలో తెలియలేదు. ధైర్యం కూడ దీసుకొని సమయస్ఫూర్తితో “అమ్మా! నేను పండితుడ్ని. వాల్మీకి పాండిత్య ప్రతిభ గురించి చెప్పానమ్మా! ఇంకో ఆలోచన లేదు. అమ్మా! నువ్వు చెప్పు రామాయణం జరిగిందా” అని అడిగారు.
అమ్మ చెప్పటం మొదలు పెట్టింది. ఆ నాటి వైభవం, రాజసం, ప్రేమలు, ఆప్యాయతలు ఎలా ఉండేవంటే దశరథుడు రాముడ్ని ‘రఘునందనా’ అని పిలిచే వాడు అని వర్ణించటం మొదలు పెట్టింది. రంగారావుగారు “అమ్మా! అప్పుడు నువ్వు అక్కడున్నావా తల్లీ” అని అడిగారు. అమ్మ ఉన్నాను నాన్నా!’ అని చెప్పింది గంభీర స్వరంతోటి. రంగారావుగారికి అమ్మ నిజరూపం వెన్నెలలో మెరిసిపోయి ప్రత్యక్ష మయింది. వెంటనే అమ్మ పాదాల మీద వాలిపోయారు. మళ్ళీ అంతే యధాస్థితికి వచ్చేశారు. అమ్మ మాట మార్చేసి మాయకప్పేసింది. “అమ్మ ఆదిశక్తి, సాక్షాత్ ఆ పరమేశ్వరే అని చెప్పుకోవటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని రంగారావుగారు చెప్తుంటే ఒళ్లు పులకరించి పోయింది. మనం ఎంత అదృష్టవంతులం! ఆ జగన్మాత అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళం.