1. Home
  2. Articles
  3. Mother of All
  4. మధురస్మృతులు – 2

మధురస్మృతులు – 2

A. S. Chakravarthy
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 10
Month : April
Issue Number : 2
Year : 2011

అమ్మ విశాఖపట్టణాన్ని ఒక ముఖ్యకేంద్రంగా ఎంచుకొని తన ప్లాన్ నిర్వహణ మొదలు పెట్టింది. దానిలో భాగంగానే శ్రీ తంగిరాల కేశవశర్మగారిని ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆయన వచ్చినప్పటి నుంచీ లక్షనామార్చనలు, అనేక పూజా కార్యక్రమాలు విశాఖలో నిర్వహించాము. మాతృశ్రీ అధ్యయన పరిషత్, విశాఖ శాఖ ఆవిర్భవించింది. ప్రప్రథమంగా అమ్మ ఆదేశానుసారం శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావుగారి చేత లలితా సహస్రనామావళికి ప్రవచనం చెప్పించుకున్నాము. ఆ 24 రోజులు మరో ప్రపంచంలో వున్న భావనే సభికులకు కలిగింది. సభలు జయప్రదంగా జరిగాయి. ఆ తరువాతే జిల్లెళ్ళమూడిలో ఆయన లలితా సహస్రనామ ప్రవచనం చేసారు. పిమ్మట అనేక చోట్ల చెప్పటం జరిగింది.

శ్రీ రంగారావుగారు మా పరిషత్ సభ్యులకు గాయత్రీ మంత్రం, మంత్రమహత్యం గురించి వివరించారు. కేశవశర్మ గారు అమ్మతో చర్చించి జిల్లెలమూడిలో గాయత్రీ యాగం కూడా తల పెట్టారు. దాని సందర్భంగా అమ్మ మంత్రం ఇస్తుందంటే అనేక మందిమి తరలి వెళ్ళాము. గాయత్రీ మంత్రం ఉన్న కాగితం, జపమాలా అందరికీ బొట్టుపెట్టి ఇచ్చింది. ఆ మంత్ర ఉచ్చారణ కొరకు శ్రీ రంగారావుగారిని చెప్పమంది. దానికి వారు ఆ మంత్రం బయటకు చెప్పకూడదని, అందరూ చేయకూడదని శాస్త్ర నిబంధనలున్నాయని, వాటిని అతిక్రమించ లేనని వారి నిస్సహాయతను వెలిబుచ్చారు.

కొందరు అమ్మ దగ్గర ఉపనయనాలు చేయించుకుంటున్నారు. ఒకాయనకు మొగ పిల్లలు లేరు. ఆయన కోరిక తీర్చటానికన్నట్లుగా వారి ఆడపిల్లలిద్దరికీ చెవిలో మంత్రం చెప్పి యజ్ఞోపవీతాన్నే రెండు వరసల గొలుసులా చేసి, మెడలో వేస్తే చూస్తునే వున్న మేమంతా విస్తుపోయాము. అమ్మ దగ్గర ఏ విధి నిషేదాలు లేవు. అందరం గాయత్రీ దీక్ష తీసుకొని 40 రోజులు మండల దీక్ష చేసి గాయత్రీ యాగంకు జిల్లెళ్ళమూడి వెళ్ళాము. అడిగిన వారందరికీ వారి కులంతో నిమిత్తం లేకుండా ఒడుగులు చేసింది. బ్రాహ్మణులు అందరూ కలిసి హోమం చేయటానికి విముఖత చూపించారు. అమ్మ వెంటనే ముందుకు వచ్చి పరిష్కారమార్గం సూచించింది. రెండు హోమగుండాలు ఏర్పాటు చేయించి ఒకటి శాస్త్రోక్తంగా చేసే పండితులకు, రెండోది అమ్మ బిడ్డలకు. అమ్మగాయత్రీ దీక్ష వర్గ, వర్ణ, స్త్రీ పురుష బేధంలేకుండా అందరికీ ఇచ్చింది.

గాయత్రీయాగంకు దాదాపు 40 వేల మంది జనం వచ్చారు. అందరి వదనాలు ఆనందోత్సాహాలతో వెల్లి విరుస్తున్నాయి. అమ్మ భక్తులలో ఒక సోదరుడు నాతో “మీ అమ్మగారు దీక్ష ఇచ్చారు సరేగాని, హోమం చేయిస్తారా, అందరి చేతా, మీ బ్రాహ్మలకే పరిమితమా?” అని విని చాలా దుఃఖపడ్డాను. ఆ మాట నామనస్సును తొలిచి వేస్తూనే వుంది. అందరూ హోమం చేస్తుండటం చూసి పులకరించి పోయాను. తిన్నగా మేడమీద అమ్మ గదికి వెళ్ళాను. నా అదృష్టం. అమ్మ ఒక్కతే మంచం మీద నాకోసమే కూర్చుందా? అనిపించింది. అమ్మ ముందు కూర్చుండి పోయాను. అమ్మ పాదాలు పట్టుకొని సంతోషం ఆపుకోలేక “అమ్మా! చాలా బాగుందమ్మా! అందరూ వర్ణ, లింగ బేధం లేకుండా ఆడా మొగా అందరూ చేస్తున్నారన్నారని” అన్నాను.

అమ్మకు తెలియంది ఏముంది? నా మనసులోని మాటకు, ఆలోచనకు అమ్మ దగ్గర సమాధానం ఎప్పుడో రెడీ అయిపోయింది. అమ్మ మొదలు పెట్టింది. “శాస్త్రోక్తంగా చేసే వారి కంటే మీరు చేస్తుంటేనే చాలా ఆనందించాను. అందరూ చేయకూడదు, శాస్త్రం ఒప్పదు అన్నారు. ప్రొద్దున్నించి ఇక్కడే కూర్చున్నాను నాన్నా! ఏ శాస్త్రంతో చేయ కూడదన్నారో ఆ శాస్త్రంతోనే ఖండిద్దామని, కానీ ఎవరూ రాలేదు. ఒక్కొక్క మాట తోటి, అమ్మ ముఖం ఎఱ్ఱగా మరిపోతోంది. నాకు దడ మొదలైంది. ఏ వర్ణం వాడు శాస్త్రం పాటిస్తున్నాడు! బ్రాహ్మణులను నిత్యాగ్నిహోత్రం చేయమన్నారు. అంటూ తన మూతి దగ్గర వేళ్ళు పెట్టి వుఫ్, వుఫ్ అని పొగతాగుతున్నారు. క్షత్రీయులను బలహీనులను సంరక్షించ మన్నారు. వాళ్ళు సంపదలను పెంచుకుంటున్నారు. వైశ్యులను అన్ని వస్తువులను సరియైన ధరలకు ఇమ్మన్నారు. వాళ్ళు వారికి తోచినట్లు అమ్ముకుంటున్నారు. వృత్తి పనుల వారు వారి పనులను మానుకొని, వేరే పనులు చేసుకుంటున్నారు. వర్ణాశ్రమ ధర్మాలను ఎవ్వరూపాటించటం లేదు.

హోమాలు చేసి జంతువులను బలి ఇచ్చి తింటున్నారు. అమ్మ ముఖం ఎఱ్ఱగా మండిపోతోంది. ఆ రుద్రరూపం చూడటం కష్టమైపోతోంది. అమ్మ ఆపలేదు. పూర్వకాలంలో యజ్ఞం చేసి మోక్షప్రాప్తికి పరిపక్వత పొందిన మేకను తెచ్చి మంత్రం చెప్తూ, సీసం కరగపెట్టి దాని చెవిలో పోసేవారు. దానికి స్వర్గ ప్రాప్తి లభించేది, చేసిన వారికి యజ్ఞఫలం దక్కేది అన్నది అమ్మ. ఆ శక్తి స్వరూపం తట్టుకోలేక అమ్మ పాదాల మీద వాలి పోయాను. అమ్మ నెమ్మదిగా తను శాంతించి మామూలు స్థితికి వచ్చేసి మాట మార్చేసింది.

మన బందరు ప్రసాదు వచ్చాడు. వాడు కూడా హోమంలో పాలు పంచుకున్నాడు నాన్నా! అని నన్ను మామూలు మాటలలోకి దించేసింది. బందరు ప్రసాద్ ప్రతి ఏటా డిసెంబర్ 31కి కేకు తీసుకు వచ్చేవాడు. అమ్మ కర్టెన్ రిబ్బను కట్చేసి కొత్త సంవత్సరానికి ప్రారంభోత్సవ చేసేది. ఆ తరువాత ఆ కేకు కట్ చేసి కొత్త సంవత్సరం వేడుక చేసేది. అన్ని వేల మందిలో పైన కూర్చున్న అమ్మ ప్రసాదు ఎలా చూసింది. అమ్మ సహస్రాక్షి, సహస్రపాత్రదా!

మధ్యాహ్నం యాగం పూర్తి చేయటానికి అమ్మ క్రిందకి యాగశాలకు వచ్చి కూర్చుంది. మైక్లో రామకృష్ణ అన్నయ్య “రంగారావుగారు గాయత్రీ మంత్రం. చెప్తారు” అని, కానీ నిశబ్దం. యాగశాలలో ఏం జరుగుతోందో బయట వున్న మాకు తెలియదు కదా! మరి కాసేపు ఆగి, “రంగారావుగారు మంత్రం చెప్తారు” అని రంగారావుగారి కంచుకంఠం మోగింది. మిగితా పండితులందరూ కూడా ముక్త కంఠంతో గాయత్రీ మంత్రం ఉచ్చరించటం మొదలు పెట్టారు. వారితో అమ్మ బిడ్డలూ గొంతుకలిపారు. జిల్లెళ్ళమూడి ఆ మంత్రంతో దద్దరిల్లి పోయింది. ఆ మంత్రంతో అంతా సుఖాంతం. అమ్మే గాయత్రి అమ్మే అన్ని దేవతలకు మూలం.

జయహోమాతా

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!