అవును. మన మనస్సే ఒక మంత్రమని, దాని మననమే తంత్రమని అమ్మ చెప్పింది నిజమే. అది ఎలాగో ఇక్కడ పరిశీలిద్దాము.
మొదటగా ఇక్కడ మనస్సంటే హృదయము, బుద్ధి, వివేకము, జ్ఞానము అని అర్ధం చెప్పుకోవాలి. శిలాయుగంలో నివసించిన ఆది మానవుడు కొంతకాలం ఈ భూమ్మీద నివసించే ఇతర జంతుజాలము వలెనే మృగప్రాయుడై జీవించేవాడు. ఆ తరువాతి కాలంలో అతడు క్రమేపీ శారీరకంగా, మానసికంగా మార్పుచెంది తనకు ఆహారాన్నిచ్చే భూమిని – వర్షాన్ని కురిపించి, పంటలను పండించి, తన దాహార్తిని తీర్చే వరణుడ్ని తన ఊపిరి నిలుపుకొనేందుకు గాలి నిచ్చిన వాయువును తాను తినే ఆహారాన్ని తినేందుకు వీలుగా పక్వంచేసి దానితో బాటుగా వెలుగునూ వేడినీ యిచ్చిన అగ్నిని పైనుండి సూర్య చంద్రులరూపంలో వెలుగునూ శబ్దాన్నీ ప్రసాదించిన ఆకాశాన్నీ దైవస్వరూపులుగా భావించి కొలిచేవాడు.
అయితే ఆ కొలువు అభినయాదులతో కూడిన ఆంగికమేకాని దానికి పంచభూతాలను స్తుతించే భాషలేదు. తన తోటి మానవులతో కేవలం సంజ్ఞలతో, అరపులతో, కేకలతో మాట్లాడే మూగ భాషయేగాని దానికి అక్షర రూపంలేదు.
అటువంటి పరిస్థితిలో పంచభూతాత్మకుడైన భగవంతుడు తాను సృష్టించిన జీవకోటినుండి మానవుడిని విడదీసి అతడిలో వివేకాన్ని, బుద్ధినీ, జ్ఞాన సంపదను కలుగ జేసి, వాటిని వ్యక్తపరిచే భాషను నేర్పి తద్వారా అతడిని తన ప్రతినిధిగా భూమండలంపై ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాడు.
తదనుగుణంగానే మానవులలో కొందరిని యోగులుగా, మహర్షులుగా మార్చి, అప్పుడు ఆకాశం నుండి శాంత గంభీర స్వరంతో మంత్రోచ్ఛారణ చేయసాగాడు. ఆ మంత్రోచ్ఛారణే దేవభాష అయన వేద ప్రవచనం. ఆ వేద ప్రవచనమే వ్యాసభగవానుల దయవలన ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజింపబడ మానవాళి కందించబడింది.
అయితే ఆ వేద ప్రవచనానికి భాషను, బీజాక్షరాలనూ ఎవరు రూపొందించారు? సమస్త సృష్టికీ కర్త అయిన ఆ బ్రహ్మయే ఆదికవియై వేదాలను రూపొందించి తన వాణి ద్వారా పైనుండి మనకందించాడు.
పైనుండి వినవచ్చిన ఆ వాణిని పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి ద్వారా భూమండలమందుగల అప్పటి మన ఋషులు, యోగులు గ్రహించి యోగ్యులైన మనవజాతికి అందించారు.
ఎలానంటే – పైన పరమాత్ముని నోటివెంబడి వినవచ్చిన ఆ వేదఘోషను ‘పరా’ అన్నారు. అలా వినవచ్చిన ఆ మంత్ర శబ్దాన్ని యోగులు తమ మనోమయ కోశంలో నిక్షిప్తపరిచారు. దానినే ‘పశ్యంతి’ అన్నారు. అలా నిక్షిప్తపరచిన ఆ శబ్ద తరంగాలలోని భేదాన్ని, హెచ్చుతగ్గులను బట్టి దాన్ని ‘వాక్కు’గా మార్చారు. ఆ అదే ‘మధ్యమ’ అంటే. వాక్కునే, భావయుక్త, భాషాపరంగా తమ వాణిద్వారా బైట పెట్టారు. దానినే ‘వైఖరి’ (వాక్యరూపకమైన వాక్కు) అన్నారు. ఈప్రక్రియ (పర, పశ్యంతీ, మధ్యమ, వైఖరీ) ఆనాటి మన ఋషులు, యోగుల నుంచీ ఈనాటి వరకూ మనకు తెలియకుండానే మన మానవాళి మధ్య పరస్పర సంభాషణల రూపంలో కొనసాగుతూ వున్నది.
కనుక పాఠకులారా! బ్రహ్మ మానసంనుండి వెలువడిన వేదమంత్రాలు మానవ మానసంలోకి ప్రవేశించి పై విధంగా తోటి మానవుల కందించబడినవి. కాబట్టి మనసే మంత్రమని, ఆ మంత్ర శబ్దాలను మననం ద్వారా ఎదుటి వారికి తెలియచెప్పటం తంత్రమని (క్రియ) చెప్పింది మన ‘అమ్మ’.
ఇంతకీ అమ్మ మంత్రమేమిటో తెలుసా? ఒక భక్తుడు “నువ్వు ఏ మంత్రం పఠిస్తావమ్మా?” అని అమ్మను అడిగితే “సరే మంత్రం నాన్నా! అందట. ఆ “సరే” అనే మాటనే దేవతల భాషలో ‘తథాస్తు’ అంటారు. దాని అర్ధం “అలాగే అవనీ” అని. అమ్మ దేవతే అయినా మానవదేహం దాల్చి మన మధ్యన తిరుగుతున్నది కాబట్టి ఆ తథాస్తునే సామాన్య మానవులకు అర్ధం అయ్యేట్టు “సరే”గా మార్చి మనకు చెప్పింది.
ఇంకొక విషయం తెలుసా? ఆకాశంలో దేవతలు ఎప్పుడూ “తథాస్తు” అనే మాటను మంత్రంలాగ జపిస్తూ ఉంటారట. మనం అనేమాట, అది మంచిదైనా చెడుదైనా ధ్వని తరంగంగా మారి వారిని చేరుతూ ఉంటుంది. వారు ఆ మంచి చెడులకు రెండింటికీ “తథాస్తు” అనే బదులిస్తారు. మరి వారి నోటి వాక్యం శక్తివంతమయినది కదా. ఆ శక్తి వాక్యం మనం పలికేమంచి మాటకు మంచినీ, చెడుమాటకు చెడునూ ప్రసాదిస్తూ ఉంటుంది. మంచి చెడులు రెండూ మానవులకేగాని దేవతలకు లేవు. అందుకే ‘అమ్మ’ “నాదృష్టిలో మంచేగాని చెడులేదు నాన్నా” అన్నది. అంటే ఆమె మానవరూపంలో సంచరించే దేవత అనే కదా……. మరి అమ్మ విషయంలో కూడా మనకు అదే వర్తిస్తుంది.
అందుకే అంటారు మన పెద్దలు – “పైన తథాస్తు దేవతలుంటారు. మంచినే కాని చెడు మాట్లాడకండర్రా!” అని.
అసలు దేవతలెక్కడో పైన ఉండటమేమిటి? దేహం ఉన్నా లేక పోయినా అమ్మ రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. అందుకే మనమందరం మంచిగానే వుండి, మంచినే మాట్లాడుతూ, మంచినే చేస్తూ అమ్మ అనుగ్రహానికి పాత్రులు మవుదాం.
“జయహో మాతా!” “ఓం హైమ!”