మంత్రం అంటే మననం చేస్తే మాటి మాటికీ భావన చేస్తే తరింపజేసేది అని పెద్దలు అర్థం చెప్పారు. (మననాత్ త్రాయతే ఇతి మంత్రః) ఓం నమశ్శివాయ, ఓం. నమోనారాయణాయ మొదలైన వానిని పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలన్నారు. వానిని పునః పునః జపిస్తే అంటే వాని అర్థాన్ని భావన చేస్తే మనశ్శాంతి లభిస్తుంది అన్నారు.
మరి, అమ్మ ‘మనస్సే మంత్రం’ అనేది మంత్రం. కొన్ని బీజాక్షరాల సముదాయం అని లోకంలో వ్యవహారం. మనస్సే మంత్రం అనేది ఎలా అర్థం చేసుకోవాలి ? పంచాక్షరి మొదలైనవి మంత్రాలు కావా ? అని సందేహం. అయితే పంచాక్షరి, అష్టాక్షరి మొదలైనవి. తప్పకుండా మంత్రాలే. కాని వానికి మంత్రత్వం మనస్సుతోనే వస్తుంది. అప్పుడే అవి తరింప చేసేవి అవుతాయి. ఏ మంత్రానికైనా మనస్సు అంటే ఏకాగ్రమైన మనస్సు మంత్రత్వాన్ని ఇస్తుంది. లేకుంటే వాని వల్ల ప్రయోజనం తక్కువ. “మహావాక్యాలు అనుభవం లేకపోతే మన వాక్యాలే” అన్నది అమ్మ. అహం బ్రహ్మాస్మి వంటివి నేను బ్రహ్మనే అనే అనుభవం పొందితే అది మహావాక్యం. లేకపోతే కేవలం అక్షర సముదాయం. అయితే ఆ అనుభవం రావడానికే గదా ఈ జపతపాదులన్నీ. ఆ మాట నిజం. “అంతా బ్రహ్మమయం. ఇదంతా బ్రహ్మమయం” అనే అనుభవం పొందడానికే సాధనలన్నీ.
మనస్సే మంత్రం అనడానికి పోషకంగా అమ్మ మరొక విషయం కూడా చెప్పింది. తరించడానికి ఓం నమశ్శివాయ వంటివే కానక్కర లేదు. “ఇది ఏమిటి” పంచాక్షరి. “అసలు ఇది ఏమిటి” అష్టాక్షరి. అక్షరాలకు బలాన్ని ఇచ్చేది మనస్సే. మంత్రం ఊతకఱ్ఱలాంటిది. దాన్ని మనం సరిగా పట్టుకుంటే అది మనం పడకుండా కాపాడుతుంది. కఱ్ఱను మనం సరిగా పట్టుకోలేకపోతే కఱ్ఱ ఎంతగట్టిదైనా మనం పడిపోతాం. అలాగే మంత్రం ఎంతగొప్పదైనా మన మనస్సు ఏకాగ్రం కాకపోతే ఆ మంత్రం వల్ల ప్రయోజనం తక్కువ. అందువల్ల అక్షర సంపుటి ఎలా ఉన్నా మనస్సే ప్రధానం కనుక మనస్సే మంత్రమని అమ్మబోధ. ఈ సందర్భంలోనే మనస్సే గురువని, మనస్సే దైవమని కూడ అమ్మ చెప్పింది. అమ్మ దృష్టిలో మనస్సంటే నిశ్చలమైన మనస్సు. మనస్సే ఆత్మ అని కూడా అన్నది. అయితే మనస్సు నిశ్చలం కావడానికి ఎన్నో సాధనలు చెప్పారు. వాటిలో దేనినీ అమ్మ కాదనలేదు. కాని సాధ్యమైనదే సాధన అని సాధనకు కొత్త నిర్వచనం చెప్పింది. ప్రతివాడికి ప్రతిదీ సాధన కాదు. గురువులు చెప్పినవీ, గ్రంధాల్లో ఉన్నవీ సాధనా మార్గాలు ఎన్నో ఉన్నాయి. వానిలో ఏది ఆచరిస్తే మనస్సు నిశ్చలం అవుతుందో అది వాడికి సాధన. కొందరికి జపం, కొందరికి తపస్సు, కొదరికి యోగం, కొందరికి ధ్యానం, కొందరికి ఆత్మ విచారణ, ఇంకా కొందరికి నామ సంకీర్తన, నిష్కామ కర్మాచరణ, ప్రజాసేవ ఇలా ఎన్నో సాధనా మార్గాలు. వీటి అన్నిటికీ పరమ ప్రయోజనం మనో నిగ్రహం. “సర్వే మనోనిగ్రహ లక్షణాం తాః” (అన్ని పనులు మనోనిగ్రహంకోసమే) అని భిక్షుగీత.
దేనివల్ల మనస్సు నిగ్రహింప బడుతుందో అదే మంత్రం, అదే సాధన, అదే సిద్ధి. బంధమోక్షాలకు మనస్సే కదా కారణం. ‘చిత్తే చలతి సంసారం నిశ్చలం మోక్ష ఉచ్చతే’, తరంగాలతో అల్లకల్లోలంగా ఉండే సముద్రం లాంటిది సంకల్ప వికల్పాలు చేసే మనస్సు. విస్తరంగ సముద్రం లాంటిది నిశ్చలమైన మనస్సు. అక్కడ కోరికలు లేవు. చింతలు లేవు. ద్వంద్వాలు (రాగద్వేషాలు, మానవమానాలు, సుఖదుఃఖాలు) లేని పూర్ణ కామస్థితి. జీవన్ముక్త స్థితి.
పుంఖాను పుంఖ విషమేక్షణ తత్వరోపి
ఆత్మావలోక నదియం నజహాతి యోగీ |
సంగీత వాద్యలయ తాళ వశం గతాపి
మౌళి కుంభ పరిరక్షణ ధీర్నటీవ
పాట, వాద్యాలు, తాళం ఇలా ఎన్నిమోతలున్నా తలమీది ఘటం క్రింద పడకుండా నటి ఏకాగ్రమైన మనస్సుతో ఉంటుంది. తొట్రు పడదు. అలాగే యోగి (చిత్త వృత్తి నిరోధం కలవాడు) విషయాలను (శబ్ద, స్పర్శ, రస, గంధాలు) పుంఖాను పుంఖంగా చూస్తున్నా ఆత్మానంద స్థితిని కోల్పోడు. వికారహేతువులెన్ని ఉన్నా ఆతని మనస్సు చలించదు. ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మన్తవ్యః నిధి ధ్యాసి తవ్యః. మనసైవాను ద్రష్టవ్యం. బుద్ధి యోగం దదామ్యహం వంటివి ఈ విషయాన్ని స్మరింప చేస్తాయి.
పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లానిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణపాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మరచెన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా !
ప్రహ్లాదుడు ఏపనిచేస్తున్నా ‘సర్వమున్నతని దివ్యకళామయమంచు’ తలంచినవాడు. ఇది భక్తి అన్నారు. భక్తికీ జ్ఞానానికీ భేదాన్ని చెప్పింది అమ్మ. భక్తుడు అంతా, అన్నీ భగవంతుడే. నేను లేను అంటాడు. జ్ఞాని అంతా, అన్నీ నేనే. వేరేదీ లేదంటాడు. రెండింటికీ లక్ష్యం ఏకత్వమే. “ద్వితీయాద్వై భయం భవతి” అన్నారు అద్వైతులు.
రెండోది లేకపోతే భయాలకు, బాధలకు తావు లేదు. అయితే మనస్సు నిశ్చలం కావడం అంటే ఏమిటి ? అది జడం లాగ ఏమాత్రం చలనం లేకుండా ఉంటుందా ? కాదు. అన్ని సంకల్పాలూ దైవానివే. సంకల్ప వికల్పాలు రెండింటికీ తాను కర్త కాదు. కర్త కాకపోతే భోక్త కూడా కాదు. అహంకార మమకారాలు లేవు కనుక భేదమోదాలకు తావులేదు. ఆ స్థితిలో మనస్సు సంకల్ప వికల్పాలు చేసినా అశాంతి ఉండదు. సాక్షి మాత్రుడు కదా ! అట్టి మనస్సే మంత్రం. ఆ మనస్సుకు అన్ని మాటలూ మంత్రాలే. అన్ని శబ్దాలూ ఓంకారమే. అన్ని శిలలూ శివలింగాలే. ‘అమ్మ’ నేననుభవించేదంతా సుఖమే, నాకు ప్రత్యేకించి ఫలానాది కావాలి అనేది లేదు. నవ్వు వస్తే నవ్వుతాను. ఏడుపు వస్తే ఏడుస్తాను. ఏడవటం తప్పని, ఎప్పుడూ నవ్వే ఉండాలని నాకు అనిపించదు. అవసరం విలువైనది. నాకు అవసరమనిపిస్తే శివలింగంతో కుంకుడు కాయలు కొడతాను. “ఇదంతా మీరంతానేనే – మీదంతా నేనే, ఈ కనుపించే ప్రకృతే పరమేశ్వరుడు. శబ్దం ‘బ్రహ్మ’ అయితే నిశ్శబ్దమూ బ్రహ్మే. వైద్యుడికి రోగి కూడా నారాయణుడే. భార్యకు భర్త దైవమైతే భర్త భార్య కూడా దైవమే. దైవం కానిది సృష్టిలో ఏదీ లేదు. అంతా చైతన్యమే. జడమేమీ లేదు. అంతా శక్తి మయమే అని తన స్థితిని వివరించింది. సంసారంలో ఉండి అద్వైతాన్ని ఆచరించడం ఎలా ? అని అడిగితే కూతుర్ని, కోడల్ని ఒకలా చూచుకుంటే సరి అన్నది.
అవి వట్టి మాటలు కావు. ఆచరించి చూపించింది. అమ్మకు ఆడవాళ్ళంతా కూతుళ్ళే. మగవాళ్ళంతా కొడుకులే. వాళ్ళు ఏ వయస్సు వాళ్ళైనా, ఏరంగు బట్ట కట్టినా సరే. “నాకు రెండుగా కనుపించినా ఒకటే అనిపిస్తుంది’ అన్నది. సూదిలో దారం ఎక్కిస్తే రెండుగా కన్పిస్తుంది. నిజానికి అది ఒకే దారం కదా. అమ్మ అరటిపండును చేత్తో పట్టుకుని ఇది అద్వైతం నాన్నా – (తొక్కా, గుజ్జు మొత్తం) సగం ఒలిచి ఇది విశిష్టాద్వైతం నాన్నా (తొక్కతో కూడి గుజ్జు), పూర్తిగా ఒలిచి ఒక చేత్తో తొక్క, ఒక చేత్తో గుజ్జుపట్టుకుని ఇది ద్వైతం నాన్నా అన్నది. మతభేదం బాహ్యమే కాని (భ్రాంతేకాని యధార్ధం కాదు. “సర్వసమ్మతమైనదే నా మతం” అన్నది. జరిగిందే ముహూర్తం. సర్వ దినాలూ పర్వదినాలే. రూప పరిణామమే కాని రూపనాశం లేదు. నిజానికి నాశం అంటే లేకుండా పోవడం కాదు. కనిపించక పోవటమే. కనిపించని దానిని లేదనడం. లోకంలో వాడుక. అమ్మకు శుభాశుభాలు లేవు. లాభనష్టాలు లేవు. చివరకు మంచి చెడ్డలు కూడా లేవు. అందరూ మంచివాళ్ళే అన్నది. నా దృష్టిలో అంతా చైతన్యమే. జడమేమీ లేదు” అంది.