“భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం” – అని అమ్మ ఒక విలక్షణమైన, విశిష్టమైన నిర్వచనాన్ని అనుగ్రహించింది. ‘సర్వసమానత్వం’ అనే మాట నేడు ఎచ్చోటనైనా వినిపించే సర్వసాధారణ పదం. కానీ అభివృద్ధి మార్గాలు, అభ్యున్నతి పదాలు, జనబహుళ్యానికి ‘అందని ద్రాక్ష పళ్ళే’. కావున సామాజిక అశాంతికి, రక్తపాతానికి కారణం కొన్ని వర్గాలూ, జాతులూ నిర్లక్ష్యం చేయబడటమే.
చాలా దేశాల్లో సామాజిక వ్యవస్థే దాని ఆర్ధిక స్థితిగతుల్ని నిర్దేశిస్తోంది. ఫలితంగా కొన్ని వర్గాల వారు అణగద్రొక్కబడిన నిరుపేదలూ నైరాశ్యోపహతులూ అయ్యారు. ఇది ధరిత్రిపై సర్వత్రా గోచరించే సత్యం. వాస్తవానికి సాంఘిక సమానత్వం ఆర్ధిక సమానత్వాన్ని పాలిత సమానత్వాన్ని నియంత్రిస్తుంది. భారతదేశంలో కులవ్యవస్థ శతాబ్దాల తరబడి సామాజిక జీవనానికి దిక్సూచిగా నిల్చింది. ఆ వ్యవస్థ దురవస్థగా మనుస్మృతికాలం తదుపరి కాలగమనంలో పరిణామం చెంది పతనమైంది. ‘చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః ‘ అని పురాణాల్లోనూ ఉటంకించారు. తొలుత సంఘంలో వారివారి వృత్తులు సరళమైన సాంఘిక జీవనానికి దోహదం చేసాయి. ఆనాడు కట్టుబాట్లు సాంప్రదాయాల పరిధిలో నాలుగు వర్ణాలు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుని సహజీవనం చేసేవి: తదంతర్గతంగా అవగాహన, ఐక్యత వెల్లివిరిశాయి. ఆ సత్యం చరిత్ర బద్ధం. నాటి సరళీకృత సామాజిక జన జీవనం అన్ని వర్గాల వారి ప్రతిభా పాటల్ని, అంతర్గత సహజ బౌద్ధిక నైపుణ్యాల్ని శక్తిని ప్రోత్సహించింది. ఆ వర్ణాంతర కదలికలు సామాన్యవ్యక్తి వికాసానికి బహుముఖాభివృద్ధికి దోహదం చేశాయి. మన పురాణాల్లో అట్టి ఉదాహరణలు అనేకం కనువిందు చేస్తాయి. ఒక బోయవాడు శ్రీమద్రామాయణ కావ్యరచయిత, మహర్షి అయినాడు. దాసీపుత్రుడు సత్యకామ జాబాలి వేదాధ్యయనానికి మహర్షులచే ఎంపిక అయినాడు. మత్య్సకారుడు శ్రీమద్భారత భాగవత కావ్యస్రష్ఠ వేదవ్యాసుడు మహర్షి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయినాడు. ఆచంద్రార్కం భారతీయులు గర్వించదగిన లోకోత్తరచరిత్రలు, నిరుపమాన అలౌకిక సాహిత్య పరిమళాలు అవి. కులము, పుట్టుక ఆనాడు ఏ వ్యక్తి యొక్క శారీరక మానసిక వికాసానికి ఆటంకాలు కాలేదు.
గ్రీకు రోమన్ సంస్కృతులను అధ్యయనం చేస్తే సాంఘిక కట్టుబాట్లు సాంప్రదాయాలూ విలువలూ కాలక్రమేణా క్షీణించాయని తెలుస్తోంది. ఫలితంగా మహోన్నత విలువల ఆధారిత పునాదుల మీద నిర్మించదగు ధృడమైన సాంస్కృతిక సౌధాలు కుప్పకూలాయి. అదే విధంగా హైందవ జీవనయానంలో భారతీయ సంస్కృతి వధంలో కులవ్యవస్థ కరడుకట్టింది. జాత్యంతరాలు విజృంభించాయి. పురాతన ఆచారాలు, కట్టుబాట్ల ఇనుపచట్రంలో వివక్షత, పక్షపాత ధోరణులు వెర్రితలలు వేశాయి. అధికార కాంక్ష, అవగాహన లేని ఆచార వ్యవహారాల పోషణ పాలకులు పాలితుల ఎదలో ఒకచో ఆత్మీయత, మరొకచో అస్పృశ్యత విషబీజాల్ని నాటింది. కనుకనే కొందరిని పరిగ్రహించారు. కొందరిని పరిత్యజించారు. అపరిపక్వమైన సమాజశైశవదశలో ఆంక్షలు విధించటం ద్వారా ప్రజాస్వామ్యం నిరక్షరాస్యుల్ని, నిరుపేదల్ని వృద్ధి చేసింది.
ఒకనాటి ఔన్నత్యానికి హేతువైన వ్యవస్థ సమానత్వం అనే సామాజిక న్యాయాన్ని విస్మరించి స్వేచ్ఛావ్యక్తిత్వవికాసానికి అడ్డు తగిలింది. స్వేచ్ఛ గగనకుసుమం కాగా సామాజిక వ్యవస్థాంతర రూప కాఠిన్య వటవృక్షం విశృంఖలంగా శాఖోపశాఖలై వేళ్ళూని విస్తరించింది. వ్యక్తి కట్టు, బొట్టు, పుట్టుకలతో నిమిత్తం లేకుండా నిజవ్యక్తిత్వ వికాసాభివృద్ధి కోసం సకల సిద్ధాంతాలూ మతాలూ ఆచరణ సాధ్యమైన ఒక విధానాన్ని రూపొందించుకోవటం అత్యంత ఆవశ్యకమైంది.
ఈ సందర్భంగా అమ్మ అభిమతాన్ని గుర్తు చేసుకోవటం ఎంతో సముచితం. “శుక్లశోణితాల కేదికులమో అదే నా కులం” అనే అమ్మ విస్పష్ట ప్రకటన – వర్ణవ్యవస్థ, సామాజిక వ్యత్యాసం అనే మహావృక్షాల్ని కూకటి వ్రేళ్ళతో పెకలించి భస్మీపటలం చేసింది. “గుణభేదమే లేని నాకు కులభేదం ఏది?” అనే అమ్మ ప్రశ్న సాంఘిక దురాచారాల్ని ఛాందసాల్ని రూపుమాపుతోంది. వ్యక్తుల కులగోత్రాలే కాదు వ్యక్తి యోగ్యతాయోగ్యతలు, గుణదోషాలు, శీల సంస్కారాల్ని అమ్మ పరిగణించదు.
వాస్తవానికి ఈ అడ్డుగోడలు అవరోధాలు మానవ కల్పితాలే. “రక్తమంతా ఈశ్వరతత్వమే” అనే అమ్మవాక్యం మానవాళి సర్వసమానత్వాన్ని తిరుగులేని విధంగా ఆవిష్కరించింది; జాతి కులవ్యవస్థ కళంకాన్ని నిర్మూలించింది, మానవతత్వాన్ని ప్రక్షాళన చేసింది, పునరుద్ధరించింది.
అమ్మ యొక్క “సర్వసమానదృష్టి’ కేవలం మాటలకే పరిమితం కాదు. అమ్మ శరీరంతో ఉండగా పదహారు అణాల ఆంగ్లేయుడు జిల్లెళ్ళమూడిలో ఉంటూ భారతీయ జీవన విధానాన్ని అలవరచుకొని హైమాలయ ప్రాంగణంలో
అఖండనామం, అభిషేకాలూ పూజలూ… అన్ని కార్యక్రమాల్నీ నిర్వహించేవాడు. అది తప్పనిసరిగా సాంప్రదాయ లబ్ధ జాత్యహంకారానికి స్వస్తి పలకటమే. దశాబ్దాల తరబడి హైందవ విధానాల ననుసరించి అర్చనలు నిర్వహించబడే ఆలయాల్లో సైతం నేటికీ అందరూ ప్రవేశించటాన్ని పాల్గొనటాన్ని నిషేధిస్తున్నారు. ఆ నియమాల్ని ఉల్లంఘిస్తే కులమత లింగ ప్రాతిపదికన అనాచారము అపచారము అని దుయ్యబడతారు. అందుకు భిన్నంగా నిస్సంశయంగా జిల్లెళ్ళమూడిలో విప్లవాత్మకమైన ఒక సంఘసంస్కరణకి అమ్మ శ్రీకారం చుట్టింది.
అమ్మ సమక్షంలో హైమాలయంలో విప్రోత్తములు శ్రీ రాయప్రోలు భద్రాద్రి రామశాస్త్రిగారి స్థానే సోదరి శేష ప్రభావతి నమకచమకాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్ని నిర్వహించింది. ఈ పద్ధతి మానవ సమానత్వాన్ని సముద్ధరించడమే.
‘ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్’ – (కంటికి కనిపించే ఈ ప్రపంచం అంతా ఈశ్వరుడు నివసించేదే అని ఈశావాశ్యోపనిషత్ ప్రవచించింది. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఈశ్వర రూపమే అంటూ మన ప్రాచీన గ్రంధాల్లో, వేదాల్లో సర్వసమానత్వం చాటబడింది. కానీ కాలక్రమేణా ఆ సత్యం కనుమరుగైంది, నివురుగప్పిన నిప్పు అయింది. ఈ సందర్భంలో సుప్రసిద్ధమైన ‘మనీషాపంచకం’ అని పిలువబడే శంకరచండాలవాదాన్ని ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. అది పరమేశ్వరునికి ఆదిశంకరుల వారికి మధ్య సంభవించిన ఒకానొక సంభాషణ..
‘బ్రహ్మై వాహమిదం జగచ్చసకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైత దవిద్యయా త్రిగుణయా సేశం మయా కల్పితం | ఇత్థం యస్య ధృఢమతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోZస్తు సతు ద్విజోస్తు గురి రిత్యేషా మనీషా మమ ॥
(నేను బ్రహ్మను, నాచే ఈ జగత్తంతా విస్తరించబడినది. ఈశ్వరునితో సహా ఈ ప్రపంచం త్రిగుణాత్మకమై అవిద్యశక్తిచే నాచే కల్పించబడినది. ఈ విధంగా ఎవని బుద్ధి దోషరహితమై త్రికాలాబాధ్యమై స్థిరముగా నుండునో అతడు చండాలుడైనా బ్రాహ్మణుడైనా ఎవరైననూ నాకు గురువే.) ఇలా ఐదు శ్లోకాల్లో అద్భుతంగా ప్రకాశితమైన అసదృశ ఆధ్యాత్మిక సాహిత్య కుసుమ పరిమళాన్ని అఘ్రాణిస్తారు. రాగాన్ని ఆలపిస్తారే కానీ నిత్యసత్యమైన అందలి సారాన్ని విలువల్ని వీక్షించరు, ఆచరించరు. అమ్మ జీవితాన్ని అధ్యయనం చేస్తే, తన బాల్యం నుంచే మన్నవలోని పరిసర గ్రామాలలోని చరిత్ర బద్ధమైన సంఘటనలు కులమత వర్ణ వర్గాలకు అతీతంగా అమ్మలో మూర్తీభవించిన ‘విచక్షణ లేని వీక్షణ’ ని మనకళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తాయి.
ఒకసారి తెనాలిలో ఒక వీధిలో గేదెలు తొట్రుపాటు పడి లంఘించాయి. ఒక పాకీది దొడ్లను చిమ్మే పనిలో నిమగ్న అయింది. ఆమె పసివాడు తల్లి కోసం రోడ్డుకు అడ్డంగా పాకుతున్నాడు. ప్రమాదం ముంచుకొస్తోంది. అమాంతం అమ్మ ఒక్క ఉదుటున దూకి పిల్లవానిని లేవదీసి భుజాన వేసుకున్నది. పాకీది అంటే అస్పృశ్యురాలు. తన బిడ్డని మృత్యువాత నుంచి రక్షించిన అమ్మను ‘బ్రాహ్మలు నా బిడ్డను ఎత్తుకున్నారు’ అంటూ పాకీది అమితానందంలో వాటేసుకున్నది. ఆక్షణాలు మానవత్వానికి పుష్పాభిషేకం; ఆనందనీరాజనం; ఉత్తమ సంస్కార ఆలయ శిఖరాలకు సహస్రఘటాభిషేకం. ‘మా బ్రాహ్మణత్వం మట్టిలో కలిసింది. ఇంకా ఏం మాట్లాడతావులే. నీ పిల్లవాడిని నీవు తీసుకుపో అని అమ్మ అమ్మమ్మ జానకమ్మగారు రుసరుసలాడింది. వెంటనే అమ్మ “అవును. బ్రాహ్మణత్వం మట్టిలో కలిసింది. కనుకనే మీరు ఆ పిల్లవాడిని ఎత్తుకోలేదు” అన్నది. ఈ చర్యపై ఇరుగుపొరుగు వారు గానీ, పెద్దలు గానీ తమ ఆమోద ముద్ర వేయలేదు. వారి విముఖతని అమ్మ లక్ష్య పెట్టలేదు. ఛాందసవాదులు నిర్దేశించిన సరిహద్దుల్ని లక్ష్మణరేఖల్ని తుడిచిపెట్టింది; త్రుంచి పారవేసింది.
జీవనోపాధులు క్రమేణా కులవృత్తులుగా రూపు దిద్దుకోవడం, కులవ్యవస్థ ఏర్పడటం, కొన్నిటిని ఉన్నతం గానూ కొన్నిటిని నీచంగానూ పరిగణించడం… మొదలైన విషయాలను ఐదేళ్ళ బాలిక అమ్మ కూలంకషంగా చర్చించింది. మరుగుదొడ్లు శుభ్రం చేసుకోవడం ఒక మౌలిక అవసరం. ఆ పనిని సంఘంలో ఒక వర్గం వారికి అప్పగించారు. మౌలికమైన అత్యావశ్యకమైన అట్టి సేవలను అందించే వారిని నీచంగా చూడడం, ఏ పాపం తెలియని వారిని అస్పృశ్యులుగా పరిగణించడం పొరపాటు; వారిని “సంఘమాతలు’గా గుర్తించి గౌరవించాలని విశదపరచింది.
“మనకు పనికివచ్చే పాకీతనానికి పనికిరానితనాన్ని అంటగడుతున్నాము’ అని విచారాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దానితో అక్కడి వయోవృద్ధులు అవాక్కయ్యారు. వారికి అందలి సత్యాన్ని అంగీకరించక తప్పలేదు తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా. అమ్మవాక్యాలు ఏ సందర్భంలోనైనా ఎవరైనా అర్ధం చేసుకోవాల్సిందే, అన్వయించుకోవాల్సిందే. అమ్మ దృక్పధం, అమ్మవేసే ప్రతి అడుగూ “ఉన్నది ఉన్నట్లు కనటమే లోచూపు” అనే మహావాక్యపరంగా అక్షరసత్యంగా భాసిల్లుతాయి. వాత్సల్యయాత్రలో భాగంగా హైదరాబాద్, నరసాపురం, ఏలూరు, నెల్లూరు…. ఏ నగరానికి, పట్టణానికి వెళ్ళినా అమ్మ ముఖ్యంగా గుడిసెలను, మురికి వాడలను ఆతృతగా వెతుక్కుంటూ వెళ్ళేది. నిండు మనస్సుతో అమ్మ హృదయంలో స్థిరమైన స్థానం కన్నీటి కడలిలో కొట్టుకుపోయే పీడితులు, బాధితులకే. వారు నివేదన చేసిన అన్నం మెతుకులు అయినా నిస్సంకోచంగా పరమానందంతో పరమాన్నంగా ప్రేమతో స్వీకరించేది. బాధ ఎవరిదైనా బాధించేది అమ్మనే. దివిసీమ ఉప్పెనలో ఆప్తులను కోల్పోయి గంపెడు దుఃఖంతో ఉన్నవారిని కాలినడకన వెళ్ళి వారి కన్నీరు తుడిచింది; కన్నీరు చిందించింది; మరి కన్న తల్లి కదా!
జిల్లెళ్ళమూడిలో నిమ్న జాతిగా చూడబడిన మంత్రాయి అనే సోదరుని అమ్మ ఆదరించింది; తను అమ్మకి సాయం చేస్తూండేవాడు. అమ్మ జీవితచరిత్రను ఆమూలాగ్రం అధ్యయనం చేస్తే నిమ్నజాతులనే కాదు, విషతుల్యమైన హేయ మనస్తత్వాలను కూడా అమ్మ ఓర్చుకొని ఆదరించి సంస్కరించిన సంఘటనలు అసంఖ్యాకములు.
మంచిపని చేయటానికి దేనిని కోల్పోవాలన్నా అమ్మకి ఇష్టమే. 1984 ప్రాంతంలో నిర్వహింపబడిన గాయత్రీ యాగనిర్వహణలో భాగంగా కులమత వర్ణ వర్గ స్త్రీ పురుష విభేదరహితంగా ఆసక్తి గల వారందరికీ అమ్మ గాయత్రీ మంత్ర జపదీక్షా స్వీకారానికి అనుమతినిచ్చింది. వరంపరాగత సాంప్రదాయాన్నననుసరించి గాయత్రీ మంత్రోపదేశము అనుష్ఠానములకు అగ్రవర్ణ సంజాతులే అర్హులు. గాయత్రీ యాగానికి ఎంతోకాలం ముందుగానే కవి, భక్తులు అయిన అంధసోదరులు శ్రీ యార్లగడ్డ రాఘవయ్యగార్కి వారి అభీష్టం మేరకు అమ్మ గాయత్రీ మంత్రోపదేశం చేసింది. “నీ కంటే బ్రహ్మణుడు. ఎవరు?’ అని వారిని ప్రశ్నించింది. ‘శుచిర్విప్రఃశుచిః కవిః’ అనేది ఆర్యోక్తి కదా! పూజ్య సోదరులు శ్రీ రాఘవయ్య గార్కి భౌతిక నేత్రాలు మసకేశాయి కానీ (జ్ఞాననేత్రం) ఉపనయనం వార్కి కనిపించే అమ్మను కనిపించని బ్రహ్మగా దర్శింప చేసింది. బ్రహ్మతత్వాన్ని ఎరిగిన వారే వాస్తవానికి బ్రాహ్మణులు.
తన ప్రవచనం, ఆచరణలతో పాటు అమ్మ సమానత్వాన్ని అందరింట్లో ప్రతిష్ఠించింది. “వైకల్యం లేనిది కైవల్యం” – అనే మహావాక్యానికి భాష్యంగా సుమనోహర సాంఘిక సహజీవనం తాత్పర్యంగా కారుణ్యావతారమూర్తి అమ్మ 1950లో ఒక యోగశాలను ప్రేమప్రయోగశాలను స్థాపించింది. అదే అన్నపూర్ణాలయం, అమ్మ అనుగ్రహమందిరం. అది ఆవిర్భవించిన మరుక్షణం నుండే ఆత్మీయతా తరంగాల్ని ఏకోదర బాంధవ్యాన్ని దిద్దిగంతాలకు వ్యాపింప చేసింది. సాధారణంగా అన్యోన్యంగా మెలగుతున్నట్లు కన్పించే వ్యక్తుల మధ్య ఒకే కులశాఖలు ఒకే మతశాఖల మధ్య కూడా కంచం పొత్తు లేదు.
జిల్లెళ్ళమూడిలో మన సోదరసోదరీమణులు కష్టించి సంపాదించిన పదార్ధాలతో ఒకే గాడి పొయ్యి మీద వంట చేసి క్రొత్త వారు పాతవారు అనే భేదం లేక ఉన్నంతలో ఆహారాన్ని ఆనందాన్ని పంచుకుంటారు. వైశ్వానరాగ్ని రూప పరమాత్మే అన్నపూర్ణాలయంలో అర్చామూర్తి. విశేషమేమంటే అన్నపూర్ణాలయ ద్వారాలు నిరంతరం తెరిచే ఉంటాయి; అక్కడ బిడ్డల ఆకలి తీర్చడం కోసం భగవతి ఎదురు చూస్తూంటుంది. సహపంక్తి భోజనం అనేది. నిస్సందేహంగా సర్వసమానత్వ సాధనకి పరాకాష్ఠ. కనుకనే శ్రీ కాశీ కృష్ణాచార్య ‘అమ్మా! నువ్వు రాజరాజేశ్వరివి. కానీ వర్ణ సంకరం చేశావమ్మా!’ – అని నిర్ఘాంత పోయారు.
(Justice, Liberty, Equality, Fraternity) న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను రాజ్యాంగ చట్టాల ద్వారా ఏ నాటికి సాధించలేం. తరతరాలుగా బీడువారిన రసహీనమైన మనస్సుల్ని, ఛాందసభావాల్ని, దురభిమానాలూ, దురభిప్రాయాలూ, మతమౌఢ్యాలూ, అంధ విశ్వాసాల్ని మార్చడం సంస్కరించడం అలౌకికశక్తి సంపన్న సర్వసమర్ద అమ్మకే సాధ్యం. మనకి అసాధ్యమైనది అమ్మకి సుసాధ్యం.
అమ్మ మాటల మనిషి కాదు; చేతల మనీషి, రహివహించు అపార కారుణ్యమూర్తి, అమ్మ చేసిన చికిత్స, విచికిత్స గాడితప్పిన సమాజాన్ని మళ్ళీ మానవ విలువల పధంలో నడిపిస్తున్నాయి. చైతన్యవంతమైన ప్రగతి శీలమైన సమాజనడవడిక మన లక్ష్యం అయితే అమ్మ సాధించిన, దర్శింపచేసిన విలువలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయము, ఆచరణీయము.
‘ఆది శంకరుల రచనల్లోని, ప్రవచనాల్లోని ఖాళీలను అమ్మ పూరించింది; సమగ్రతను సంతరించింది’ అని మద్రాసు పూర్వసర్వోన్నత న్యాయమూర్తి శ్రీ పి.వి. రాజమన్నార్ అన్నారు. అంతేకాదు. నేటి సమాజంలో కళ్ళకి కన్పించే ఆశ్చర్యకరమైన లోపాల్ని అగాధాల్ని అసమానతల్ని అమ్మ రూపుమాపింది; తన మాటలలో, చేతలలో తనదైన విలక్షణమైన శైలిలో సమాధానాన్ని, పరిష్కారాన్ని అందించింది చూపింది.
‘విజాతులన్నియు వృధా, వృధా
అజామిళాదుల కదియే జాతి’ – అని బోధించారు శ్రీ అన్నమాచార్యులవారు శుక్లశోణితాల కేది కులమో అదే అమ్మకులం. అదే మానవజాతి జీవన సూత్రం, గోత్రం కనుకనే ‘మనుష్యులందరిదీ మాతృశ్రీ గోత్రం’ అని అంటారు.