”ఇది నవ్య సంక్రాంత్రి. ఇది దివ్య సంక్రాంతి. ఇది భవ్య సంక్రాంతి. ఇది కావ్య సంక్రాంతి. ఇది అమ్మ సంక్రాంతి” అని నేను ఎప్పుడో ఒక సంక్రాంతినాడు అమ్మ సన్నిధిలో గానం చేశాను. అమ్మ జన్మస్థలం మన్నవ. మన్నవలో ఆ రోజుల్లో సంక్రాంతి ఎంత వైభవంగా జరుగుతుందో చూస్తే ఆ పండుగలోని పరమార్థం తెలుస్తుంది. దేవాలయంలో మంగళ వాయిద్యాలు. ధనుర్మాసం కనుక హరిదాసు అక్షయపాత్ర నెత్తిన పెట్టుకొని చెక్కభజనతో ఆధ్యాత్మిక రామాయణం పాడుకుంటూ ప్రతియింటికీ వస్తాడు. గంగిరెద్దుల సన్నాయి పాటమ్మా! చిన్నప్పుడు అమ్మ వాకిట్లో చిమ్మి నీళ్ళు చల్లి పెద్ద పెద్ద ముగ్గులతో అలంకారం చేస్తుంది. గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ రాసి, గుమ్మడిపూలతో అలంకరించి తల్లి గొబ్బెమ్మ – పిల్ల గొబ్బెమ్మ అని పెడుతుంది. ఇంటి ముందు బంతిపువ్వుల రేకులు చల్లింది. ఇంటి ఇలవేలుపును అందరు కొల్చి పెద్దలను గుర్తుకు తెచ్చుకొని దానధర్మాలు చేస్తారు. గ్రామదేవతలను కొలుస్తారు. అల్లుళ్ళు కూతుళ్ళు – క్రొత్త కోడళ్ళు – మనుమలు మనుమరాళ్ళతో ప్రతి ఇల్లు సందడిగా ఆనందంలో మునిగి ఉంటారు. మన్నవలో 150 బ్రాహ్మణ కుటుంబాలు.
అందరిండ్లలో పేరంటాలు. అమ్మ అందరిళ్ళలో పేరంటానికి పిలవటానికి బొట్టుపెట్టి (సంధ్య గొబ్బెమ్మను ఆవుపేడతో చేసి) నేను ‘సంధ్యగౌరి”ని పూజచేస్తున్నాను. పిల్లలు మీరు పసుపు కుంకుమకు రండి అని పిలుస్తుంది. మగవాళ్ళను, విధవలను కూడా పిలుస్తున్నది. సంధ్య గౌరి ఎవరు ? అని అడగ్గా మీరు సంధ్య గొబ్బెమ్మ అంటారు. నేను ఆవుపేడను గౌరి అంటారు. ఆ గౌరిని సంధ్యవేళ పూజిస్తున్నాం కనుక సంధ్య గౌరి అన్నాను అని చెప్పింది.
అది కాదు అని ఒక ముత్తైదువ గొబ్బెమ్మ కథ చెప్పింది. గొబ్బెమ్మ అంటే ఒక ముని కన్య. పూర్వం ఆవును కొట్టింది. అది చూచిన ఒక మహాపతివ్రత. ఆ దెబ్బలు చూచి సహించలేక నీవు పేడవయి పుట్టమని ముని కన్యను శపించిందనీ, ఆ మునికన్యే ఆవు పేడ అనీ – కృష్ణునికి గోవులు ముఖ్యం. ఆమె కూడా కృష్ణుడుకి ఇష్టం. ఆమె కృష్ణ భక్తురాలు. కనుక గోవు పేడ కూడా కృష్ణునికి ఇష్టం కనుక పూజనీయమైంది. అందుకే గొబ్బి తట్టేటప్పుడు ఆ మునికన్య కథ చెప్పి తట్టాలంటారు. … దుఃఖం లేకుండా సంతోషంగా ఉండటానికే యీ వ్రతాలు, పూజలు పునస్కారాలు అన్నది అమ్మ. గోపాలుడితో ఆడుకున్నవి కనుకనే ఆవులు గోవులయినై. అటువంటి గోవుపేడ తెచ్చి గౌరిని చేసి పూజ చేస్తామన్నాను. అంతే అన్నది అమ్మ. ప్రతి వస్తువులో దైవత్వాన్ని చూడటానికే ఈ పూజలు వ్రతాలు ఏర్పడ్డవి. ప్రతి వస్తువు అంటే కత్తి దగ్గర నుండి పేడవరకు – తులసి నుండి ఎన్నో రకాల చెట్ల వరకు అన్నీ పూజకు ఉపయోగపడేవే – పూజకు ఉపయోగపడేవెంతో పూజించే మానవుడూ అంతే – అన్ని రకాల వస్తువులలో మాధవుని చూచిన మానవుడే మాధవుడు – అన్నది అమ్మ. ఇంటికి వచ్చి గౌరీ పూజ చేస్తుంది.
గొబ్బెమ్మ దగ్గర బెల్లం పెట్టి నివేదన చేస్తున్నాం. పేడ తెచ్చి బెల్లానికి నివేదన చేస్తామా – చెయ్యం – మరి ఇక్కడ పేడకు నివేదన చేస్తున్నామా ? పేడను గౌరమ్మగా భావించాం. కనుక దేవతగా భావించి నివేదిస్తున్నాం. పేరంటానికి వచ్చిన ఒక చిన్న పిల్ల పేడ మీద కాలువేస్తే తల్లి ఛీ పేడ తొక్కుతావు ఇవతలికి రా అన్నది. అప్పుడు అమ్మ చూచారా పేడ తొక్కటానికి కూడా పనికి రాదు. ఆ పేడ మట్టితో కలిపి తొక్కి ఇల్లు అలుక్కుంటాం. అలాగే అవసరంతో, శ్రద్ధతో విని మా పిల్లలచేతకూడా సందె గొబ్బెమ్మ వ్రతం చేయిస్తాం అని చెప్పారు.
వ్రతం అంటే నియమంతో నడవటమే. నియమ మంటే కొన్ని పద్ధతులు తప్పకుండా కట్టుబడి నడవటమే. నియమమే నోము – వ్రతమన్నా నియమమన్నా ఒకటే. ప్రతి వస్తువులో దైవమున్నదని గుర్తించటమే అన్నది అమ్మ.
గొబ్బి తట్టమని ఎవరో అనగా గొబ్బి ఎందుకు తట్టాలో ఆ కారణాలు చెప్పింది కదా ఇంక గొబ్బి తట్టటమెందుకు అన్నారు మరి కొందరు. గొబ్బి తల్లికి తాను సాష్టాంగ నమస్కారం చేసి అందరి చేత చేయిస్తుంది అమ్మ.
అమ్మ స్నేహితులు బాల, సీత, నాగరత్నం, లక్ష్మి, అన్నపూర్ణ, శకుంతల, తులసి, బృంద, దుర్గలు దాయాది బాంధవ్యం. వారికి అమ్మతో ప్రాణస్నేహం – అందరూ తెల్ల చీరలు కట్టుకొని సంకురుమయ్యారు. ఓలలాడించ టానికి మేళతాళాలతో 80 ఇళ్ళవాళ్ళు వస్తారు. దాదాపు 500, 600 మంది జనం చిన్నలు పెద్దలు అన్ని జాతుల వారు కలిసి వస్తారు. సంకురుమయాన్ని భుజాన పెట్టుకొని ఒక పెద్ద ముత్తయిదువ చుట్టూ ముత్తయిదువులు, అందరు పసుపు, కుంకుమ, బంతిపూల రేకులు సంకురుమయ్యా మీద చల్లుకుంటూ పోతారు కాలవలో ఓలలాడించటానికి. అందులో కొందరు పులిహోర, దధ్యోదనము, శనగలు అడ్డెడుతవ్వెడు చేయించినవి పళ్ళెలలో పెట్టుకొని, మూడురోజులు మట్టితో తయారు చేసిన అందరిళ్ళలో పూజ చేసిన సంకురుమయాన్ని, ఒక చీరె, రవిక ”జయజయమంగళం నిత్యశుభమంగళం” అని పాటలు పాడుకుంటూ వెళ్ళుతారు. తీసుకెళ్ళిన పదార్థాలు నివేదన చేస్తారు. అందరూ ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు. గంధం రాసుకుంటారు. సంకురుమయాలను (సంక్రాంతి పురుషులను) కాలవలో కలుపుతారు. నివేదనలు అందరూ తీసుకుంటారు. అమ్మ చెప్పి చేయించేవన్నీ సామూహిక సాధనలే. కర్మ సమష్టే- వ్యష్టి కాదు అమ్మ దృష్టిలో. ఉపనయనాల్లో గాయత్రీ మంత్రం చెవులో రహస్యంగా చెపుతున్నారు ఈనాడు. కాని ఆ మంత్రంలో సామూహికంగా గొంతెత్తి పాడినట్లే బహువచనంలో ఆ మంత్రంలో చెప్పబడింది. గురువు వద్దన్నా రామానుజాచార్యులవారు గొంతెత్తి అందరికీ ”ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని ఎలుగెత్తి చాటాడు.
అమ్మ అన్నింటిని దైవంగానే భావించాలని, ఆరాధించాలని, సృష్టిలో విలువ తక్కువైనదేదీలేదనీ అన్నీ అవసరాన్ని బట్టి పూజనీయమైనవేనని వారికి బోధించి ఈ సంక్రాంతి సమయంలో వివరించింది. అలా వారందరిలో క్రొత్తగా ఆలోచించే ఒక ప్రేరణను ఇచ్చింది. నిజానికి సంక్రాంతి అంటే ఒక మంచి అడుగు, ఒక క్రొత్త వెలుగు. అమ్మ అందరి జీవితాలలో ఎక్కడి కక్కడ ఒక క్రొత్త వెలుగును ప్రసాదిస్తున్నది. ఒక విశ్వతాదాత్మ్య భావనను కలిగిస్తున్నది. దానికి నమూనాగానే విశ్వ కుటుంబ భావనకు ఒక రూపంగానే అందరింటిని ఏర్పాటు చేసింది. తెలుసుకున్నవారు ముందుగా అమ్మను చేరుతున్నారు. తెలుసుకోలేకపోయినా ఫరవాలేదు. అందరికీ సుగతినే ప్రసాదిస్తుందికదా! కాకపోతే ఆ దగ్గరకు తీసుకోవటంలో సాలోక్య – సామీప్య – సారూప్య – సాయుజ్యాలు ఉంటాయేమో సంప్రదాయులు చెప్పినట్లు – అందరి నెత్తిపై భోగిపళ్ళు పోస్తుంది కదా!
ఆలాంటి సంక్రాంతి – మన్నవ సంక్రాంతి – శ్రీమన్ నవసంక్రాంతి వెలుగులు మనపై ప్రసరించాలని కోరుకుందాం. కోరుకోకుండా ఉండలేం కనుక.