1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మన్నవలో జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి ఉత్సవాలు

మన్నవలో జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి ఉత్సవాలు

Kondamudi Prem Kumar
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : May
Issue Number : 10
Year : 2022

అమ్మ అవని పై అవతరించిన పుణ్య దినం 28/3/1923.

నేటికి అనగా 28-03-2023 నాటికి వంద వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అమ్మ జన్మస్థలమైన మన్నవ గ్రామంలో 28/3/2023 న అమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, అమ్మ శోభాయాత్ర జరిగినవి.

అమ్మ మేనల్లుడు శ్రీ మన్నవ రంగనాథ్ గౌతమ్ సతీసమేతంగా ఉదయం అమ్మకు అభ్యంగనస్నానం చేయించగా, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ సభ్యులు శ్రీ పొత్తూరి ప్రేమ్ గోపాల్ దంపతులు, కొండముది ప్రేమ్ కుమార్ దంపతులు, యల్లాప్రగడ వెంకట రమణ గారు, విశాలాక్షి, ఉష, పూర్వవిద్యార్థిని రమాదేవి గార్లు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.

అనంతరం జిల్లెళ్ళమూడి అమ్మ శోభాయాత్రను శ్రీ కొండముది ప్రేమ్ కుమార్ ఏర్పాటు చేయగా జిల్లెళ్ళమూడి నుండి వచ్చిన అన్నయ్యలు, అక్కయ్యలు భజన బృందం వారు, గుంటూరు నుండి వచ్చిన వసంత(రాజ్యం అక్కయ్య కుమార్తె)జయ, రమ అక్కయ్యలు, విజయవాడ నుండి వచ్చిన అమ్మ బిడ్డలు పాల్గొనగా శ్రీ నరసింహారావు మామయ్య, దినకర్ అన్నయ్య, సాయిబాబు అన్నయ్య, కొండముది సుబ్బారావు అన్నయ్య దంపతులు, ప్రేమ్ గోపాల్ దంపతులు, ప్రేమ్ కుమార్ దంపతులు తదితరులు కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను అమ్మ గుడి నుండి ప్రారంభించుట జరిగింది. రంగడుబావ ఇంటి వద్దకు రాగానే ఆ దంపతులు ఉద్వేగభరితంగా తమ జన్మధన్యమైనదని, ఆనందంతో వారు పోసి హారతులిచ్చారు. మన్నవ గ్రామస్తులతోకూడ కలసి, వేణుగోపాలస్వామి గుడి మీదుగా శోభాయాత్ర మన్నవ గ్రామ వీధుల గుండా చింతలతోపు వద్దకు చేరుకుంది. (నేడు చింతల తోపు లేదు. ఆ ప్రదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.) వారికి అమ్మ ప్రసాదం అందించి, మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలలో అమ్మ బాల్యంలో చింతలతోపులోని ఘట్టాలను స్మరించుకుంటూ పరవశిస్తూ శోభాయాత్ర SC కాలనీ మీదుగా వచ్చి అంబేద్కర్ సెంటర్లో ప్రసాదం పంచి, ఆ తరువాత అమ్మ నామం చేస్తూ ఊరంతా ప్రసాదాలు, కుంకుమ పంచుతూ శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు.

ఈ ఉత్సవంలో వందమందికిపైగా పాల్గొనగా భానుడి ప్రచండ గ్రీష్మతాపానికి శోభాయాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శోభాయాత్రలో ఎన్నెన్నో మధురాను భూతులను మూటగట్టుకుని తిరిగి శోభాయాత్ర అమ్మ మందిరం వద్దకు చేరుకుంది.

అమ్మగుడిలో 21 మంది లలితా సహస్రనామ స్తోత్రపారాయణ చేసి, నైవేద్యం, మంత్రపుష్పాదులతో అమ్మను పూజించారు.

శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్వీరు, శ్రీ నరసింహారావు మామయ్య అమ్మకు నూతన వస్త్రాలు సమర్పించారు.

ఇక్కడొక అమ్మ లీల జరిగింది. జిల్లెళ్ళమూడిలో 28/3/23 నుండి (ఆంగ్లతేదీ ప్రకారం అమ్మ పుట్టిన రోజు) అమ్మ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కనుక మన్నవలో భోజనానికి ఎంతమంది. ఉంటారో తెలియక, 25 మందికి మాత్రమే ఏర్పాటు చేయుట జరిగింది. కానీ కొంతమంది మన్నవ గ్రామవాసులు,ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కలిపి 60 మందికి పైగా భోజనం చేయగా ఇంకా మిగిలింది. ఇది కదా అన్నపూర్ణేశ్వరి అమ్మ మహిమ అంటే !!!

ఈవిధంగా జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి ఉత్సవాలలో భాగంగా అమ్మ జన్మస్థలం మన్నవలో శోభాయాత్ర చేయాలన్న నా కోరికను మన్నించి నాకు తన పుట్టిన రోజు నాడే శోభాయాత్ర చేసే అవకాశం కల్పించింది.

ఎన్నో ఎన్నెన్నో అనుభవాలను, తీపి గుర్తులను కలిగించి, అడుగడుగునా నా చేయిపట్టి నడిపిస్తున్న అమ్మకు ఏమిచ్చి ఋణం తీర్చు కోగలను, కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు సమర్పించటం తప్ప.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!