1. Home
  2. Articles
  3. Mother of All
  4. మన అమ్మ విశ్వజనని

మన అమ్మ విశ్వజనని

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 14
Month : January
Issue Number : 1
Year : 2015

“అమ్మ” అంటే అంతులేనిదీ, అడ్డులేనిదీ, అన్నిటికీ ఆధారమైనదీ. ‘తల్లి’అంటే” అనాద్యంతస్వయంభూత దివ్యమూర్తి, ఆది, మూలం. శ్రీ పోతన గారి

‘మూలకారణం బెవ్వడు? 

అనాది మధ్యలయుడెవ్వడు?

సర్వముతానైయైన వాడెవ్వడు,’ అనే ప్రశ్నల వర్షానికి సమాధానమే సాకారరూపమే అమ్మ. ఆ పరతత్వాన్ని వేదాలు – ‘పూర్వం యోదేవేభ్యోజాతః సకల దేవతల ఆవిర్భావానికి ముందే ఉన్నది’ అని ప్రస్తుతించాయి. అంటే అమ్మ ఆనాడూ, ఈనాడూ, మరేనాడూ ఉంటుంది. అమ్మకి త్రికాలములు లేవు. కాలాతీత. “నాకు అంతా వర్తమానమే” అని స్పష్టం చేసింది.

ఆ మూలకారణశక్తిని తద్విరాడ్రూపాన్ని వర్ణించాలంటే మాటలవలన కాదు. ‘యతో వాచోనివర్తనే అప్రాప్య మనసా సహ’ అని ఏనాడో శృతులు తేల్చి చెప్పాయి. ఆ మూల ప్రకృతి ‘బహుశ్యాం ప్రజాయయేతి – నేను అనేకం కావాలి’ అని సంకల్పించింది. “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ – సృష్టిగా తాను రూపాంతరం చెందింది. ఈ ఆప్తవాక్యసారాన్నే అమ్మ, “కనిపించేదంతా నిజస్వరూపమే” ననీ “సృష్టేదైవం” అనీ యదార్థాన్ని చాటింది. సత్యం, జ్ఞానం, అనంతం అయిన బ్రహ్మ పదార్థాన్ని కళ్ళకి కట్టినట్లు చూపింది.

సృష్టికి పూర్వం ఉన్న ఆ సద్వస్తు రూపాన్ని INVOLUTION అనీ, తర్వాత సృష్టిగా ఏర్పడిన రూపాన్ని EVOLUTION అనీ అంటారు. ఈ రెండు దశలూ ఒక దానినొకటి అనుసరిస్తాయి. INVOLUTION అంటే నామరూప రహితంగా, నిరాకారంగా, నిర్గుణంగా, రజస్తమోగుణాతీతంగా కాలాతీతంగా ఉండేది. SI నామరూప సహితంగా, సాకారంగా, సత్త్వరజ స్తమోగుణాత్మకంగా కాలస్వరూపంగా విరాజిల్లేది.

“INVOLUTION లోనిదే EVOLUTION” అని అమ్మ స్పష్టం చేసింది. అనంతశక్తి పరిమిత రూపంలో అనసూయ మాతగా కళ్ళముందు నిల్చింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉన్నది. నామరూప రహితమైనదీ – నామరూప సమన్వితమైనదీ, గుణరహితమైనదీ – గుణ సహితమైనదీ ఒక్కటే. ఏక కాలంలో ఇది అసాధ్యం. ఈ విధంగా రెండు పరస్పర విరుద్దములైన సంగతుల సమన్వయంతో చక్కని భావం ఉత్పన్నం కావటాన్ని విరోధాభాస అలంకారం. అని అంటారు. సృష్టికర్త పరంగా సాధ్యా సాధ్యాల ప్రసక్తేలేదు. ఇందుకు సముచితమైన అన్వయాన్ని అమ్మ ఇచ్చింది. ‘అన్ని నామములు, రూపములు, గుణములూ వాడివే. కాబట్టి వాడు (దైవం) నామ రహితుడు, రూప రహితుడు, గుణరహితుడు” అని.

‘అమ్మ’ నిజ తత్వ స్వరూప స్వభావాలకు వాస్తవ చిత్రణ చేస్తూ శ్రీ దివాకర్ల వేంకటావధానిగారు హృద్యంగా మనోజ్ఞంగా

“జిల్లెళ్ళమూడి నాశ్రితుల సేవలు గైకొనుచుంబ్రశాంతి సం

ధిల్లగ జేయ లోకమున దివ్య శుభాకృతి దాల్చి నీవు రంజిల్లుచునుండ, రూప గుణ చేష్టలు లింగము లేకయే విరా జిల్లుచు నుండు. బ్రహ్మమంచును వచించెదరేటికో! పండితోత్తముల్ ” అని చమత్కరించారు. ‘అమ్మా! నువ్వు జిల్లెళ్ళమూడిలో లోక కళ్యాణార్ధం సాకార పరదేవతగా అవతరించావు. అమ్మగా కనిపించే బ్రహ్మవు నీవు. కానీ పండితోత్తములు ‘బ్రహ్మ పదార్ధం నిర్గుణం, నిరాకారం, నిష్క్రియా రూపం…. గా ప్రకాశిస్తుంది’ – అని అంటారెందుకో!!-అని. విశ్వసంచాలక శక్తి వాత్సల్యామృత వర్షిణిగా నిలిచింది. ఇంకా చిలుక పలుకుల్లా దంత వేదాంతాన్ని వల్లె వేయాలా? గమ్యాన్ని చేరుకున్నాక పరుగులు తీయాలా?

ఒక సందర్భంలో శ్రీ చిదంబరరావు తాతగారు అమ్మతో, “నువ్వు సకల కార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలను నడిపే సగుణమూర్తివి” అంటూ అమ్మ మహిమాన్వితస్థితిని అభివర్ణించారు. ఈ నేపధ్యంలో కొన్ని ఉదాహరణలు:

అమ్మ జీవిత చరిత్రని ‘అమ్మ జీవిత మహోదధి’ పేరుతో శ్రీ భాస్కరరావు అన్నయ్య వ్రాశారు. వాస్తవానికి అది అమ్మ స్వీయచరిత్ర. తాను జన్మించిన క్షణం నుంచి సకల విషయాలు, విశేషాల్ని పూస గుచ్చినట్లు వివరించింది అమ్మ. అమ్మ చెపుతూంటే అన్నయ్య వ్రాసేవారు. అలా అని కేవలం అది ఉక్తలేఖనం కాదు. నలభై ఏభై ఏళ్ళనాటి సన్నివేశాల్ని అక్షరబద్ధం చేసేటప్పుడు ఆయా వ్యక్తుల సంభాషణలు వారి వారి కంఠధ్వనులతో యధాతధంగా హావభావ స్ఫోరకంగా అన్నయ్యకి వినిపించేది. ఇది నిస్సందేహంగా మానవాతీత శక్తి ప్రభావమే, మన మేధస్సుకి అందేది కాదు.

శ్రీమన్నవ బుచ్చిరాజుశర్మ (రాజుబావగారు) ‘అనుభవసారం’ అనే గ్రంధాన్ని రచించారు. అందు ఎన్నో రాగమాలికలు, అనురాగమాలికలు, తత్త్వ జలధి లోతుల్లోని అనర్ధరత్నాలు అన్నిటినీ మించి అమ్మ అనుభవాలు ప్రతి అక్షరంలోను ప్రతిబింబిస్తాయి. అమ్మ మాటే వారిపాట. ఆశ్చర్యం, అద్భుతం, వారికి అమ్మ తన అనుభవాల్ని వివరిస్తూ కాల చక్రాన్ని వెనక్కి త్రిప్పి అలనాటి అనుభవ పరంపరని ప్రత్యక్షంగా దర్శింప చేసింది. ఆ సమయంలో శ్రీ రాజుబావ ఆయా సన్నివేశాలని ప్రత్యక్ష సాక్షిగా దర్శించేవారు. అమ్మ ప్రక్కనే ఉంటూ తానూ ఒక పాత్ర ధారిగ అనుభూతి పొందారు. ఒక ఉదాహరణ:

మన చుట్టూ ఆవరించిన గాలిలో అనేక వాయువులతో పాటు అసంఖ్యాక ధూళికణ సమూహాలు ఉన్నాయి. కానీ అవి మన కంటికి కనిపించవు. ఒక పూరిల్లు, పాక, పెంకుటిల్లు… పై కప్పు రంధ్రంగుండా సూర్యరశ్మి, గది లోపలి గోడమీద పడినపుడు ఆ కాంతి ప్రవాహం గుండా అసంఖ్యాక ధూళికణాలు చలించడం మనం స్పష్టంగా చూడవచ్చు. ఇది అందరి అనుభవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మ, “ఈ అనంత సృష్టిలోని గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర సమూహాలు… సమస్తము అలా కనిపిస్తున్నాయి నాకు” అని అన్నది. అంటే విశ్వంలోని సకల గ్రహాలు, గ్రహరాజుల సమిష్టి రూపాన్ని, వాటి గమనాన్ని ఏక కాలంలో దర్శించగల విశాలమైన నేత్రాలు అమ్మవి. కనుకనే అమ్మను ‘విశాలాక్షి’ అని స్తుతిస్తారు.

సకల సృష్టిని – బీరువాలోని వస్తువుల సమూహాన్ని, గంపలోని పండ్లగుట్టని మనం చూసినట్లు – ఒక యూనిట్గా అమ్మ చూస్తోంది. సామాన్య మానవ దృష్టికి కాగితం వెనుక ఉన్నది, గోడ అవతల ఉన్నది కానరావు. ఇక దిక్చక్రము (HORI ZON) ఆవల ఉన్నవీ, పెంజీకటి (Black Hole) కావల ఉన్నవీ చూడ గలమా?

అనితర సాధ్యం, నిరుపమానం, విశేషం. అమ్మ ఆ విధంగా తన సహజ త్వాన్ని వివరిస్తూంటే, రాజుబావగార్కి గ్రహపరిమాణాలూ, పరిభ్రమణాలూ వెండితెరమీద చూసినట్లు దృగ్గోచరమైనాయి. అమ్మ ప్రక్కనే, అమ్మలో భాగంగా తాను ఉండి ఈ విశ్వనిర్మాణము, కదలికలు, అమ్మలో భాగంగా తాను ఉండి. ఈ విశ్వనిర్మాణము, కదలికలు, కేంద్రక చర్యలు, విస్ఫోటనాలతో ఊహకి అందని మాటలలో వివరించలేని విరాడ్రూప దర్శనం కలిగింది. అంతేకాదు. తాను కూడా నభో మండలంలో సంచరిస్తున్నట్లయి వారి మనస్సులో సంతోషము, దుఃఖము, భయం, పరవశత్వం…. ఎన్నో ఉద్వేగాలు చోటు చేసుకున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ యశోదా దేవికి, అర్జునునికి అనుగ్రహించిన విశ్వరూప సందర్శన భాగ్యం కలిగింది. వారికి. అది ఏనాటి సుకృత ఫలమో! అమ్మ అకారణ కారుణ్యమో!! ఒక్కమాటలో చెప్పాలంటే ఈ విశ్వానికి జననిగా, విశ్వజననిగా, విశ్వమే జననిగా అమ్మను దర్శించుకున్న ద్రష్ట శ్రీరాజు బావగారు.

సమాధి స్థితిలో అమ్మ ఎల్లవేళలా ఉండేది. అది ఆర్జితం, అభ్యసితం కాదు, సహజాతం. కనుకనే విజ్ఞులు దానిని “సహజ సమాధి’ అని అంటారు. మనతో మాట్లాడుతున్న సమయంలోనే దేశవిదేశాల్లో మరెవరితోనో సంభాషిస్తుంటుంది. వారి సమస్యలకి పరిష్కారాల్ని అనుగ్రహిస్తుంది. మంచం మీద గుర్రుపెట్టి నిద్రపోతుంది. సంకల్ప రూపంగానో సశరీరంగానో వెళ్ళి సంకటస్థితిలో నున్న బిడ్డల్ని ఆదుకుంటుంది. ఆ సమాధి స్థితి కలగటానికి ఒక భంగిమ అంటూ అవసరం లేదు. మెలకువగా ఉన్నా, కూర్చున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా. సర్వకాల సర్వావస్థలలోను సర్వ సాధారణమే అమ్మకి. అనేక భాషల్లో మాట్లాడేది. వాటి పేర్లుకూడా తెలియవు సామాన్యులకి. ‘అరవిందాశ్రమంలోని మదర్ మాట్లాడుతున్నాను’ అన్నది ఒకనాటి రాత్రి.

ఒకనాడు నిద్రలో కలవరిస్తోంది, “నాకు చపాతీలు చేసిపెట్టండి. ఉత్త మనిషిని కూడాకాను. గర్భంలో నీరు చేరింది” అని. ‘ఏమిటమ్మా? ఎవరికి? అని అడిగితే వివరించింది. “పార్వతీపురంలో ఒక కోయదంపతులు ఉన్నారు. భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చి భర్త ఆమెను చావబాదాడు. ఆమె తపస్విని, గొప్ప ఇల్లాలు, నిండు గర్భిణి. గిలాగిలా తన్నుకుంది, రక్తస్రావమైంది” – అని. అమ్మ శరీరం, దృష్టి, వాక్కు, కదలిక, సంకల్పము, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు… అలౌకికము, పారమార్థికము, అగ్రాహ్యము అయినవి. “నా దృష్టిలో అంతా చైతన్యమే, సజీవమే, జడమేమీలేదు ” అన్నది అమ్మ. ఒకసారి ఒక స్వామీజీ వచ్చారు. తమ ఆశ్రమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని అమ్మను కోరారు. మాటల సందర్భంలో అమ్మ, ‘వస్తాను. ప్రతిష్ఠచేయవచ్చు. కుంకుడు కాయలు కొట్టవచ్చు. కుంకుడు కాయలు కొట్టినపుడూ శివలింగమే అనుకుంటాను ‘ అన్నది. ఈ సందర్భంగా అమ్మను అర్థం చేసుకోవటం కంటె అపార్థం చేసుకోవటానికే అవకాశం ఎక్కువ. ఈ మాటలు అతిశయంతో అన్నవికాదు, సర్వత్రా సర్వాత్మనా ఏక రూపాన్ని స్వస్వరూపాన్ని దర్శించే అద్వైత స్థితిలో అన్నవి. కుంకుడు కాయలు కొడితే రాయి, ఆలయంలో ప్రతిష్ఠిస్తే శివలింగం ఈ దృష్టి భేదం, భేదభావం సామాన్యులకు. అన్నీ తానైన అమ్మకు అన్ని శిలలూ సాలగ్రామ శిలలే, శివస్వరూపాలే. రెండవ తలంపు లేదు, రాదు. కనుకనే కుంకుడు కాయలు కొట్టినపుడూ అదిరాయి కాదు- శివలింగమే అనే స్థిర చిత్తం అమ్మది. ఒక రాయిలో, గోడలో చైతన్యం-జీవత్వం ఉన్నాయని అంటుంది. ప్రయోగశాలలో పరీక్షనాళికలో నిరూపించబడినపుడే సత్యం అనిపిస్తుంది మనకి.

ఒకసారి కృష్ణాజిల్లా నందిగామ గ్రామంలో ఒక సోదరుడు అమ్మను తన ఇంటికి ఆహ్వానించారు. బిడ్డ పిలుపును అందుకుని సంతోషంగా అమ్మ వారింటికి వెళ్ళింది. గేటు దాటిలోపలికి రెండు అడుగులు వేసింది. కుటుంబ సభ్యుల్ని కుశల ప్రశ్నలు వేస్తోంది. తటాలున అక్కడే నిలబడి పోయింది. అక్కడ ఒక దృశ్యం అమ్మ మనస్సును గాయపరచింది. అక్కడ ఉన్నది ఒక కొబ్బరి చెట్టు. పైన చుట్టూ నిండుగా బొండాలు వ్రేలాడుతున్నాయి. కానీ దాని మొదట్లో ముళ్ళు, గాజు పెంకులు, గుడ్డముక్కలు, పుల్లాకులు, చెత్తతో గూడు కట్టుకుని ఉన్నాయి. “నిండు గర్భిణిలా ఉన్న ఆ చెట్టును చూసే విధానం ఇదా!” అని విచారిస్తూ అమ్మ అక్కడనే కూర్చున్నది. తక్షణం ఆ చెట్టు మొదట్లోను, పరిసరాల్ని శుభ్రం చేయించి, నాలుగు కడవల నీళ్ళు పోయించి తృప్తిగా అప్పుడు గృహప్రవేశం చేసింది.

ఒక ఏడాది వరద వచ్చి జిల్లెళ్ళమూడి గ్రామాన్ని నీటిలో, కన్నీటిలో ముంచింది. గ్రామస్థులు నిరాశ్రయులైనారు. జనజీవనం అస్తవ్యస్తం అయింది. అందరింట్లోకి నీరు చేరింది. దిక్కుతోచక అంతా అమ్మ వద్దకు పరుగులు తీశారు. దీనంగా సంకటస్థితిని నివేదించారు. ఆ సంగతి విని సంతోషంతో అమ్మ, “అమ్మాయి ‘గంగ’ వచ్చిందా! పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను పట్టి చేతులతో పంపకూడదు. పసుపు కుంకుమ, చీరె-సారె పెట్టి పంపండి” అన్నది. అలాగే చేశారు. క్షణాల్లో వరద తగ్గుముఖం పట్టింది. అందరి ముఖాల్లో వెలుగు రేఖలు వెల్లి విరిశాయి.

ఈ వ్యాస సారాంశమేమంటే అమ్మకి మనుష్యులే కాదు పశుపక్ష్యాదులూ, క్రిమికీటకాలూ, చెట్టూ-చేమ, రాయి-రప్ప, దేవతలు… అంతా, అన్నీ కన్న బిడ్డలే. అమ్మకి సృష్టి – సృష్టికర్తా ఇరువురూ కవల పిల్లలు. అనుత్తమ ఆర్య సంభావ్య పదవీ పరినిష్ఠిత అమ్మ. సర్వంబునను ఉండి, సర్వంబునై ఉండి, సర్వ సాక్షిగ వెలుగు సర్వేశ్వరికి ఇదే అక్షర నీరాజనం. కొండంత దేవునికి కొండంత పత్రినిడెడు కుశలురు కలరే! మన అమ్మ విశ్వజనని శ్రీ చరణాలకు శత సహస్రాధిక వందనములు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!