ఎగసెను దివ్యానందము
ముగిసెనుగా శతజయంతి ముచ్చట లెల్లన్
ముగిసెను జయప్రదమ్ముగ
దిగివచ్చిన అమ్మ మనకు దీవన లిడగా.
కరుణయు త్యాగమ్ము క్షమయు
సరిహద్దులు లేని ప్రేమ సమతా మమతల్
పరమోదారత అమ్మగ
ధరణికి దిగివచ్చె ననుట తథ్యము కాదే ?
తరగని సౌజన్యమునకు
పరిమితు లెఱుగని విశిష్ట వత్సలత కిలన్
చెరగని సౌభ్రాత్రమునకు
చిరునామా యైనది మన జిల్లెళ్లమూడే.
ఉల్లము లందున ప్రేమయు
సల్లాపములందు మహిత సంస్కారమ్మున్
జిల్లెళ్ళమూడి నుండియె
ఎల్లెడ వ్యాపింప వలదె ఎడతెగకుండన్.
కలదేమొ గాని సభలను
కలదే తలపగ ముగింపు? కర్తవ్యమునన్
వలదే పూనిక మనకిక
ఇలలో మన అమ్మ తత్త్వ మింపుగ నింపన్.