వాత్సల్యామృతవర్షిణి, జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్ర మానవ ఇతిహాసంలో సువర్ణాధ్యాయం. అమ్మ దేవత, గురువు అయినప్పటికీ చరిత్రలో మానవతకే పెద్దపీట వేసింది. “జన్మ కర్మ చ మే దివ్యం” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నట్లుగా అమ్మ చరిత్ర కూడ ఆద్యంతం దివ్యమే. అమ్మ దృష్టిలో పూర్ణమానవత్వమే దైవత్వం. నాకు తెలిసి నేను ఎప్పుడూ దీపారాధన కూడా చేయలేదు. అవసరమైతే శివలింగంతో కుంకుడు కాయలు కొడతాను అన్నది. అమ్మ కాలివేళ్ళకు ఎన్నో దేవతా విగ్రహాలు ఉన్నాయి. అమ్మా, ఈ విగ్రహాలు ఇలా పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి అంటే, నాన్నా! నాకు పిల్లలూ దేవుళ్ళే, దేవుళ్ళూ పిల్లలే అంటుంది. అమ్మ దృష్టిలో జడచేతన భేదం లేదు, అంతా చైతన్యమే.
మీరంతానేనే. మీదంతా నేనే. నేను దేవతను కాదు, మీరు భక్తులు కారు. నేను మార్గదర్శిని కాను, మీరు బాటసారులు కారు. మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు కూడ అని అమ్మ భూమి మీద అవతరించినది మొదలు కనుమరుగయ్యే వరకు పిల్లల్ని పూసుకు పూసుకు తిరిగింది. అమ్మ అనారోగ్యంతో ఉన్నా ఎక్కడకు వెళ్ళినా అమ్మ చుట్టూ ఎప్పుడూ అక్కయ్యలు, అన్నయ్యలు మూగి వుంటారు. అమ్మది పరార్ధ జీవనం. అది నేర్పడానికే అమ్మ అవతారం. అమ్మ దైవం కాకపోతే ఇంక ఎవరు దైవం ? మీరే నా ఆరాధ్యదైవాలు అంటుంది పిచ్చి తల్లి. నాన్నా! మీరు తినకపోతే చిక్కిపోతారు. నేను పెట్టుకోకపోతే చిక్కిపోతాను. మీరు తింటే నేను తిన్నట్లే. మీరు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే. ఒక సంపన్నుడు అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మ బట్టలు పెడితే నా కెందుకమ్మా అన్నాడు. “నీకు పెట్టడం నీ చేత పెట్టించడం కోసమే నాన్నా” అన్నది. అమ్మది ఎంత గొప్పభావనో. అమ్మ ఔన్నత్యం, ఔదార్యం, కారుణ్యం, వాత్సల్యం న భూతో న భవిష్యతి. అమ్మకు ఇంత ఉన్నతిస్థితి ఎలా కలిగి వుంటుంది ? అమ్మ జ్ఞాన శిఖరాగ్రాన దేవతామూర్తియై వెలుగొందింది కనుక. జ్ఞానం వల్లనే సమత్వం, ఏ భేడ లేకపోవడం, మంచి చెడ్డల భేదం కూడా లేదు. నాకు శెడ్డవాళ్ళను చూస్తే జాలేస్తుంది. మంచివాళ్ళను చూస్తే ఏడు వస్తుంది. ఎవరైనా చరిత్రలో ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారా ? అమ్మ ఆచరణ నుంచే ఈ మాటలు ఆణిముత్యాల్లా వెలువడ్డాయి. మానవజాతికి అన్ని కాలాల్లోను, అన్ని దేశాల్లోను ప్రామాణికమైనవి అమ్మ మాటలు, చేతలు.
అమ్మా, మేము పది సంవత్సరాల నుంచి నీ సన్నిధికి వస్తున్నాము. మాకేమి ఉపదేశం చెయ్యవేమిటి? అంటే ముందు బడిలోకి రావటం నేర్చుకోండి నాన్నా! అంటుంది. ఇన్నేళ్ళు నుంచి అమ్మ సన్నిధికి వస్తున్నా, అమ్మ మాటలు వింటున్నా, అమ్మ చేతలు చూస్తున్నా, మనలో మార్పు రాలేదన్న మాట. అమ్మ మనల్ని అందరినీ ఎంత ముద్దు చేసిందో ? దర్శనానికి వెళితే ముందు అన్నం తినిరా నాన్నా అంటుంది. తిని వచ్చాను అంటే, ప్రసాదంగా నైనా కొంచెం తిను నాన్నా అంటుంది. లేకపోతే నేనే కలిపి ఇక్కడ ముద్దలు పెడతాను అని అంటుంది. అనడమేనా, క్షణాల్లో తెప్పించి నోట్లో కుక్కుతుంది. తల్లి పక్షి పిల్లలకు ఆహారం తినిపించినట్లు. మన సుఖముఃఖాల్లో మనకంటే ఎక్కువ ఆనందాన్ని, బాధని పొందుతుంది. ఎంత మంచి అమ్మ! అమ్మా ! మీరు మహిమలు చూపించరేమిటి అని అడిగితే, మంచితనాన్ని మించిన మహిమ ఏముంటుంది? నాన్నా. అంటుంది. మంచితనం అంటే గుణదోష విచారణ లేకుండా పరహితాన్ని కోరడం. అమ్మ మనందరికీ భోగిపళ్ళు పోసింది. ఆ దృశ్యం ఎంత రమణీయమో ! అన్నపూర్ణాలయంలో అందరినీ బారులుగా కూర్చోబెట్టి అన్నం పెట్టినట్లుగా దోసిళ్ళతో పువ్వులు, రేగుపళ్ళు, డబ్బులు కలిపి తలంబ్రాలు చల్లినట్లు, అలా చల్లుతుంటే ముసలివాళ్ళు కూడా పసిపిల్లల్లా సంతోషపడే వారు.
మనం ఊరికి వెళ్ళేటపుడు అమ్మ దగ్గర సెలవు తీసుకుంటే, అందరికీ బొట్టు పెడుతుంది. షేకండ్ ఇస్తుంది. ఎందరికో బట్టలు పెడుతుంది. మేడమీదవరండాలోకి వచ్చి చేతులు ఊపి బై, బై చెబుతుంది. ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చినవాళ్ళు మళ్ళీ, మళ్ళీ రాకుండా ఉండలేరు. ఆ వాత్సల్య మహిమ అలాంటిది. అమ్మ మన నుంచి ఏమీ ఆశించలేదు. తన దగ్గర ఉన్నది అంతా ఊడ్చి పెట్టింది. మన సుఖాల్లో ఆనందించింది. మన కష్టాల్లో వెన్నుతట్టి ఊరడించింది. అమ్మ ఉన్నది, మనకేం తక్కువ? అనిపించేది. ఇపుడూ అనిపిస్తోంది. అమ్మ కనుమరుగయ్యాక కూడా ఇది ఎందరో అనుభవిస్తున్న విషయం. మనం ఎంత ధన్యులమో ? అమ్మ ప్రేమకు ఇంతగా పాత్రులమైన మన పుణ్యాన్ని వర్ణించగలమా ? ఎంత పుణ్యమో చేశాము, నీ సుందర రూపం చూశాము. నీ మాటల, మంత్రాలు విన్నాము” మదిలో అమ్మను భావించు, గుడిలో అమ్మను సేవించు”. “ఎద ఎదలో వెలిగే అమ్మా, పదపదమున నీవే రమ్మా. మా సర్వం నీవేనమ్మా” అంటూ పాడుకున్నాను.
అన్నపూర్ణాలయంలో భోజనానికి డ్రస్సూ, అడ్రస్సూ కాదు అర్హత. ఆకలే అర్హత. అమ్మ సన్నిధిలో గాయత్రి యాగం జరిగింది. ఆసక్తే అర్హత అని చెప్పి రెండు యజ్ఞ గుండాలు పెట్టించింది. మడితో, నిష్ఠతో గాయత్రీ హోమం చేసే వాళ్ళకు ఒకటి, అందరికీ మరొకటి. ఎంత సమత్వమో. స్వర్ణోత్సవాలకు నీకేమి బహుమతి ఇవ్వమంటావమ్మా అంటే, లక్షమంది ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తుంటే చూడాలని ఉంది నాన్నా అంది. ఇలాంటి కోరిక ఎవరైనా కోరతారా ? అది తీరుతుందా ? అమ్మ సిద్ధ సంకల్పే కాదు సంకల్ప సిద్ధ కూడా. భవభూతి ఉత్తర రామచరిత్రలో “లౌకికానాం హి సాధూనాం అర్థం వా గనువర్తతే” ‘ఋషీణాం పునరాద్యానాం వాచ మరోనుధావతి’ మామూలు సజ్జనులు జరగబోయే దానిని చెబుతారు. ఋషులు ఏది చెబితే అది జరుగుతుంది. వాళ్ళ మాటకు, సంకల్పానికి, అంతబలం. అమ్మ మాట అంత విలువైనది. తోలు నోరు కాదు కదా, తాలు మాట రావటానికి అని అమ్మే చెప్పింది. నేను నేనైన నేను. అన్ని నేనులు నేనే. మొదటి వాక్యంలో మూడు నేనులున్నాయి.
- నేను = బ్రహ్మాండం అనసూయాదేవి (అమ్మ)
- నేను = నేను, నేను అని అందరిలో వుండే అహంకారం.
- నేను = సృష్టి, స్థితి, లయాలకు మూలమైన ఓంకార రూపమైన సంకల్పం – “అహం బహుస్యామ్”. ఆధారం, ఆధారమైతే అంతా సహస్రారమే. అంటే మూలాధార చక్రం దగ్గర స్థిరంగా కుండలిని జాగృతమైతే, క్రమంగా సహస్రార కమలంలో ప్రకాశించే లలితా పరమేశ్వరి అవుతాడని అమ్మ భావన. ఆధ్యాత్మిక శక్తికి దూరశ్రవణ, దూర దర్శనాలు అత్యల్ప విషయాలు అన్నది కదా ! అమ్మ చరిత్రలో, దూరశ్రవణ, దూరదర్శనాల నిదర్శనాలు కోకొల్లలు. మీరు కానిది నేనేమీ కాను అంటుంది అమాయకంగా.
“అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్” అల్ప బుద్ధులకు వీడు నావాడు, పరుడు అనే భేద భావం ఉంటుంది. అమ్మ లాంటి ఉదార చరితులకు, లోకం అంతా ఒకటే కుటుంబం. అమ్మ పేరు బ్రహ్మాండం అనసూయాదేవి. అమ్మది ఆశ్లేష నక్షత్రం. అమ్మ ఇల్లు అందరిల్లు. అమ్మ భర్త నాగేశ్వరుడు. బ్రహ్మాండమే ఆమె నివాసం. రాగ, ద్వేష అసూయలను పారద్రోలేదే అనసూయత్వం. అదే ఈ అనసూయా తత్త్వం. పతిని ఆధారంగా చేసికొని పంచభూతాలను స్వాధీనం చేసుకొన్న పతివ్రత అమ్మ. సముద్రంలా అన్నింటిని, అందరినీ కావలించుకుంటుంది. నా ఒడి విడచి ఎవరూ లేరు నాన్నా!
జీవితంలో సుఖపడే మార్గం ఏమిటమ్మా అంటే, నీకిచ్చింది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో. అన్నీ దైవమే చేస్తున్నాడనుకో అంది. అర్థవంతమైన ఈ ఉపదేశంలో ఎంత నిండుతనమో.
- నీకు – నువ్వు నిమిత్తమాత్రుడవే. నీ ప్రయోజకత్వం అత్యల్పం. నువ్వు ఒక శక్తి సంతానానివి. ఓ ! నేనెంత వాడినో, నా ప్రయోజకత్వం వల్లే ఇంత వాడిని అయ్యాననుకోవటం అజ్ఞానం.
- ఇచ్చింది – నీవు పొందే సుఖాలు, దుఃఖాలు లాభా లాభాలు, జయాపజయాలు. అన్నీ ఆశక్తి ఇచ్చినవే.
- తృప్తిగా తిని – అంతా దైవానుగ్రహమే అనే భావనతో ద్వందాల్లో క్రుంగు, పొంగుల్లేకుండా జీవించమని. మనం మనకున్న దాన్ని అంటే, దైవం ప్రసాదించినదాన్ని తృప్తిగా అనుభవించమని. అయితే మనకు తృప్తి ఎక్కడ ఉంది? ఎంత వచ్చినా చాలదు. ఇంకా ఇంకా ఏదో కావాలి. భిక్షాధికారి లక్షాధికారి కావాలి. లక్షాధికారి కోటీశ్వరుడు కావాలి.
- ఇతరులకు – నిజానికి ఇతరులు ఎవరూ లేరు. అది మన అవివేకం. జగత్తు అంతా నీ స్వరూపమే. “భవోయం భావనా మాత్రం”. ఈ ప్రపంచం అంతా నీ భావనే – నానాత్వానికి ఆధారం ఏకత్వమే కదా! కెరటాలు, నురుగు తుంపురులు ఇవన్నీ సముద్రమే కదా ! గాజులు, గొలుసులు, కర్ణాభరణాలు అంతా బంగారమే కదా ! కుండ, మూకుడు అంతా మట్టే కదా ! అందువల్ల ఇతరులు అనేది
- ఆదరంగా పెట్టుకో – అమ్మ పంచిపెట్టని కాడికి ఉండడం దేనికి ? ఒకని సంపాదన వల్ల పదిమంది సుఖంగా జీవించాలి. “పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం”. నీకు పుణ్యం కావాలంటే ఉపకారం చెయ్యి. నాన్యః పంధా’ (ఇంకో మార్గం లేదు. అపకారం చేస్తే పాపమే వస్తుంది. అది ఖాయం. కాని లోకం గతానుగతికంగా నీరు పల్లానికి పోయినట్లు, అపకారం చేయటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అది స్వార్థమే కదా ! అందువల్ల పెట్టక తప్పదు. ఏదో మొక్కుబడిగా కాకుండా నేను పరోపకారం చేస్తున్నాను. ఇంతమందిని ఉద్ధరిస్తున్నాను అనే అహంకారంతో కాకుండా ఆదరంగా, తల్లి బిడ్డలకు పెట్టుకున్నట్లు పెట్టమంది. కాదు కాదు పెట్టుకోమంది. ఈ పెట్టడం నీ కోసమే. పుచ్చుకునే వాడే లేకపోతే ఎవరికిస్తావు ? మాతృ యాగం చెయ్యండి నాన్నా అంది అమ్మ. ఆకలితో వున్న వాడికి అన్నం పెట్టడం వీలైతే గుడ్డలు పెట్టడం, రోగార్తులకి మందులు వేయించడం, ఇదీ మాతృయాగమంటే.
- అంతా దైవమే చేస్తున్నాడనుకో – నీకుకలిగే లాభా, లాభాలకు నీవు కారణం కాదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచుట కాదు. దైవం తలిస్తేనే తాను తలుస్తాడు. “మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణా ఇవ” ఈ ప్రపంచమంతా నేను దారంగా గుచ్చబడిన మణిహారమే అన్నాడు కృష్ణభగవానుడు. మళ్ళీ ఒకసారి అమ్మ మాట తలచుకుందాం. నా ఒడి విడచి ఎవరూ లేరు నాన్నా అనసూయా దేవి, సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే పసిపిల్లలుగా లాలించింది. నాకు శిష్యులు ఎవరూ లేరు. అందరూ శిశువులే. అమ్మ జిల్లెళ్ళమూడిని “ఊరు” అనదు. ఆవరణ అంటుంది. అమ్మ, ఆవరణకు హద్దు ఎక్కడ వుంటుంది ? అమ్మ పాదాలు వత్తుతూ, అమ్మా ఇది బ్రహ్మ కడిగిన పాదం కదా అంటే, మీరంతా బ్రహ్మలే కదా, మీరు కడిగిన పాదాలే ఇవి.
అమ్మకు నిద్రలో కూడా నేను అమ్మను. ఈ సృష్టి అంతా నా సంతానమే అన్న భావన చెదరదు. మీరంతా • బిడ్డలే కాదు, నా అవయవాలు కూడా అంది కదా ! అమ్మ గురువులకు గురువు. దేవతలకు దేవత. “వసంత వత్ లోకహితం చరంతః” అమ్మ బురదలో పుట్టిన పద్మం. ముళ్ళ మధ్య గులాబి. తితిక్షారూపిణి. సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి. శిల్పానికి అందం రావాలంటే ఉలిదెబ్బ అవసరం. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడిలేదు. రాగద్వేషాలు అనే రెండు గ్రహాలు మీద ఆధారపడి వుంది. ఆ రెండింటికీ నేనే ఆధారం
వత్రోత్సవాలకు 60 వేల మందికి పైగా భోజనం చేశారు. దానికి ముందు రోజు ఊళ్ళోనే అక్కయ్యలను, అన్నయ్యలను అందరినీ పిలిచి విందు భోజనం ఏర్పాటు చేసింది. అందరింటిలోని అక్కయ్యల చేత పూలు, పళ్ళు ఇప్పించి ఆదరించింది. అంతేనా, వత్రోత్సవాల తరువాత రోజు ఊళ్ళో వున్న ఆవులు, బజ్జెలు, దున్నపోతులు, ఎడ్లు అన్నింటిని అలంకరించి వరుసలో నిలబెట్టి రుచికరమైన దాణా పెట్టించి అవి తింటుంటే చూసి ఆనందించింది. సమసమాజ దేవతా సమారాధనకు ఇంతకంటే తార్కాణం ఏముంటుంది ? ఆ లోకకుటుంబినికి సాటి ఎవరు ? అమ్మ రూప, నామములకు జయమంగళం. మనమంతా మాతృశ్రీ గోత్రోద్భవులం, అస్మత్ గోత్రం వర్ధతామ్ అభి వర్ధతామ్.