పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములపైన మసస్సు – ఆపైన బుద్ధి – ఆపైన అహంకారం రాజ్యం చేస్తాయి. గాఢనిద్రలో ఉన్నపుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారములకు తెరపడినా మనస్సు జాగృతమై ఉంటుంది. లౌకిక స్పృహ ఉండదు – నేను టీచర్, ఇద్దరు బిడ్డల తండ్రిని
మనస్తత్వశాస్త్ర (Human Psychology) రీత్యా Conscious mind నిద్రించినా Subconscious mind జాగృతమయ్యే ఉంటుంది. సోదాహరణంగా వివరిస్తా.
శ్రీ పోతుకూచి విద్యాసాగరం గారమ్మాయి ఝాన్సీ తన బాల్యంలో ఒకనాడు ఘోరప్రమాదానికి గురైనది. తన జుట్టు ఫాన్ రెక్కల్లో చిక్కుకుని క్షణాల్లో రక్తపుమడుగులో స్పృహ తప్పి పడిపోయింది. కానీ తన పెదవులపై అమ్మనామం – ‘జయహెూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి” – స్పష్టంగా వినిపిస్తోంది. ఆ స్థితి పరమవాంఛనీయం. మన జాతిపిత మహాత్మాగాంధీని హఠాత్తుగా ఒక రివాల్వర్ తో కాలిస్తే ‘హే రామ్’ అంటూ నేల కొరిగారు. అది అసంకల్పితంగా మనస్సు చేసిన ప్రార్థన సహజంగా.
శ్రీ రాజుబావగారు ‘దీవించుమమ్మా మము, ఎల్లపుడు భావింతుమమ్మా మిము’ – అనే పల్లవితో రచించిన పాటలో ‘మరపులో కూడ మనసంత – నిండంగ’ – అమ్మ పాదాలు మనస్సులో నిండి ఉండాలి – అని అభ్యర్థిస్తారు.
‘మరపు’ అంటే Conscious mind కాకుండా Subconscious mind పనిచేసేతీరు. Subconscious mind ఒక Bank Account వంటిది. జ్ఞానాన్ని నిల్వ చేస్తుంది, కావాలన్నపుడు అందిస్తుంది.
ఈ సూత్రాన్ననుసరించి Foreign Language Teaching / Learning Situation లో Suggestopedia అనే పద్ధతిని అనుసరిస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే – తరగతిగదిలో పాఠం చెప్పేముందు dim light వేస్తారు. విద్యార్థులు విశ్రాంతిగా ఉంటారు. Music play చేస్తారు. పిదప ఒక story వినిపించి Comprehension Questions వేస్తారు. విద్యార్థులు తమ ఆలోచనలు, ఉద్వేగాలకు స్వస్తి చెప్పి స్వాంత చిత్తులై మనస్సును కేంద్రీకరించి చక్కగా సమాధానాలు ఇస్తారు.
అమ్మ దర్శనం ఇచ్చే సమయంలో కూడా ఇంచు మించు ఈ సూత్రం అమలవుతోంది. ముందుగా రామకృష్ణ అన్నయ్య సింహాసనం, కుంకుమ పొట్లాలు, పాదపీఠం అన్నీ సిద్ధం చేసుకుంటాడు. యాత్రీకుల్ని ఒక క్రమంలో సుఖాసీనుల్ని చేస్తాడు. పళ్ళు పూలూ తెచ్చుకున్న వాళ్ళని ముందు వరుసలో ఉంచుతాడు.
Pin-drop-silence. సిరిగిరిసుబ్బారావు/చకిలం దామోదరంగారు / చాగంటి వెంకట్రావుగారు పాటో/పద్యమో వినిపిస్తారు. అమ్మ మెల్లగా వచ్చి సింహాసనాసీన అవుతుంది. Silence. అప్పుడు పళ్ళు పలహారాలూ తెచ్చుకున్న వాళ్ళను ముందుగా ఆహ్వానిస్తాడు. కారణం. వాటిని మిగతా వారికి ప్రసాదంగా అందించవచ్చు అని. ఈ సూత్రాన్ని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సోదరీసోదరులు రాజయోగ, తత్త్వబోధ విధాన సమయంలో తు.చ. తప్పకుండా పాటిస్తారు.
ఈ సూత్ర పరాకాష్ట స్థితిని తత్త్వతః శ్రీ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులు శ్రీ మౌనస్వామి వారిలో దర్శించవచ్చు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమనికాదు. మాటలు లేకుండా హావభావాలతో సైగలతో (Non-verbal Communication) అభిప్రాయాలను పంచుకోవచ్చు. మౌనం అంటే – మరపులో కూడా మనసంతా పరాత్పరి శ్రీచరణ వైభవాన్ని నింపుకోవటం. అది కఠోర సాధన, తపన వలన సాధ్యం. అందుకు ఉదాహరణ శ్రీ యార్లగడ్డ భాసరరావు అన్నయ్య. సర్వకాల సర్వావస్థలలో అన్ని ప్రశ్నలకు పలకరింపులకు సమాధానం – ‘అమ్మ’, ‘అమ్మ’ మంత్రోచ్చారణ.
అమ్మ పరోక్షంగా ఆచరణాత్మకంగా ఈ సూత్రాన్ని ప్రబోధిస్తోంది. ‘పరధ్యానంగా ఉన్నావేమిటమ్మా?’ అని ప్రశ్నిస్తే “పరధ్యానం కాదు, నాయనా, పతిధ్యానం” అన్నది. అమ్మ మనతో మన మధ్యే ఉంటుంది. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుంది. ఆదరిస్తుంది. సంరక్షిస్తుంది. తనువు మనతోనే, కానీ మనస్సు భర్త వద్దే. ఒక ఉదాహరణ :
నేను జిల్లెళ్ళమూడిలో ఉండగా నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసింది. Proceedings copy అందింది. సంతోషంతో అన్నపూర్ణాలయంలోకి వెళ్ళి శేషయ్యగారితో చెప్పాను. వెంటనే ఆయన క్షీరాన్నం చేసి బాక్స్లో పెట్టి ఇచ్చి ‘అమ్మకి నివేదన చేసుకో’ అన్నారు. పరుగు పరుగున అమ్మ వద్దకు వెళ్ళాను. అమ్మ హాలులో దర్శనం ఇస్తోంది. అక్కడ 10/15 మంది ఉంటారు. నేను వెళ్ళి ‘అమ్మా! నాకు ఉద్యోగం వచ్చింది’ – అంటూ నమస్కరించుకుని క్షీరాన్నం నివేదించాను. అమ్మ కొద్దిగా నోట్లో వేసుకుని నాకు బొట్టు పెట్టి మూడుసార్లు తినిపించింది. “నీ ఆనందాన్ని అందరికీ పంచుతున్నావురా” – అంటూ దగ్గరలో ఉన్న అందరికీ పెట్టింది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. ఆ సమయంలో నా గడ్డం పట్టుకుని “నాన్నా! ఇవాళ నాన్నగారికి Temperature చూశావా?” – అని అడిగింది. నేను గతుక్కుమన్నాను. నాన్నగారికి జ్వరం వచ్చి తగ్గి నాలుగు రోజులైంది. నేను మందులు ఇస్తున్నాను. తగ్గిందికదా! అని పట్టించుకోవడం లేదు. ‘లేదమ్మా’ అని హుటాహుటిన మెట్లుదిగి నాన్నగారిని సమీపించా. 100 డిగ్రీల జ్వరంతో ఉన్నారు. ఆ సంగతి ఎక్కడో పైన రెండవ అంతస్తులో ఉన్న అమ్మకు తెలిసింది. నేల మీద తిరుగాడే నాకు తెలియ లేదు. బిడ్డకూడా భర్త తర్వాతే. నా ఆనందంలో తను పాలుపంచుకొంటున్నది. భౌతికంగా నావద్దే ఉన్నది. బిడ్డలందరికీ నోరు తీపి చేస్తున్నది. ఆ తీపి తానూ అనుభవిస్తోంది. కానీ అమ్మ వస్తుతః తత్త్వతః నాన్నగారి వద్దే ఉన్నది. మరపు, పరధ్యానం అనేవి మానవులకుగాని అమ్మకి లేవు.
కనుక ‘మరపులో కూడ అమ్మయే మనసంతా నిండటం’ అనే మహనీయస్థితిననుభవించిన సో॥ శ్రీ కె. రామచంద్రారెడ్డిగారి అనుభవం వివరిస్తా –
1985లో అమ్మ శరీరత్యాగం చేసే ముందు తీవ్ర అస్వస్థతతో ఉన్నదని తెలిసి, అందు నిమిత్తం అమ్మనే ప్రార్థించాలనుకుని సో॥లు శ్రీ ఉపద్రష్ట సత్యనారాయణ మూర్తిగారు, శ్రీ కె. రామచంద్రారెడ్డిగారు అమ్మ నామ ఏకాహం చేయతలపెట్టారు.
ఉదయం గం. 6.30లకే రెడ్డిగారు మూర్తిగారింటికి వచ్చారు. కేవలం నలుగురు ఉన్నారు. రెడ్డి అన్నయ్య నామం చెబుతూంటే మిగిలిన వారు అంటున్నారు. అంతలో రెడ్డిగార్కి నిద్రముంచుకొచ్చింది. దిండు వేసుకుని గోరగిలపడి నిద్రపోయారు.
మధ్యాహ్నం గం. 12.30లకు వారికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచారు. హాలు నిండాజనం. ఆశ్చర్యం. వారికి తెలియకుండా గం. 6.30ల నుండి ఏకధాటిగా బిగ్గరగా నామం చెబుతూనే ఉన్నారు. సాధారణంగా వారు నామం నెమ్మదిగా చెబుతారు.
జరిగినదేదో రెడ్డిగారికీ, మూర్తిగారికీ ఇరువురికీ తెలియదు. కనుకనే మూర్తిగారు అన్నారు. “అన్నయ్యా! 6 గంటల నుండీ నువ్వే నామం చెబుతున్నావు. కాసేపు విశ్రాంతి తీసుకో” – అని.
ఈ అలౌకిక స్థితిని జీవితంలో ఒక్కసారైనా ప్రసాదించమని అనుగ్రహ స్వరూపిణి అమ్మని అంజలి ఘటించి ప్రార్ధిద్దాం.