జీవితంలో అమ్మను చూడలేని నేను కనీసం కలలోనైనా చూద్దామని తపన పడేవాడిని. అలా చాలా కాలం తపన చెందాక ఒకసారి అమ్మ నాకు కలలో కనబడి నా ముఖంలో ముఖం పెట్టి నవ్వుతూ – “ఏరా! ఇప్పుడు తృప్తిగా వుందా?” అన్నది లాలనగా. ఆ వైనమును మన విశ్వజనని పత్రికలో లోగడ వ్రాసాను.
ఇప్పుడు అంటే ఈ మధ్య నాకో కల వచ్చింది. అందులో క్రింద కూచున్నప్పుడు ఎప్పుడూ సుఖాసనంలో కూచునే నేను, నా రెండు కాళ్ళను ఒక ప్రక్కకు మడతపెట్టి కూచున్నాను. ఇంతలో అమ్మ వచ్చింది. నేను అమ్మవైపు చూసి ‘అమ్మా!’ అని పిలిచాను. అయితే అమ్మ నావంక ఒకసారి చూసి, తరువాత ఎడమకాలి మీద ముడుచుకుని వున్న నా కుడి కాలివైపు సీరియస్ గా పరిశీలించి చూస్తూ నా ముందుకు వచ్చి ముంగాళ్ళపై కూచుంది. నేను – “అరె! నాతోమాట్లాడకుండా అలా నాకాళ్ళ వైపు ఎందుకు చూసినట్టు?” అని అనుకుంటూ అమ్మ కాళ్ళకు నేను నమస్కారం చేసే ప్రయత్నంలో ముంగాళ్ళపై కూచుని తన ముందున్న ఏదో వస్తువును తీయబోతున్న ఆమె చేతులకు నా చేతులు పొరబాటున తగిలించాను.
అప్పుడు అమ్మ – “ఏమిట్రా ఈ అల్లరి?” అన్నట్టు నావైపు విసుగ్గా చూసింది. నేను బిత్తరబోయి చూచేంతలో కల చెదిరిపోయింది.
అది కలలో జరిగిన సంఘటన. అయితే ఆ మరునాటి అర్ధరాత్రి ఇలలో నిజంగానే మరొక సంఘటన జరిగింది. నేను ఆ రాత్రప్పుడు మెలుకువ వచ్చి, బాత్రూముకు వెళ్ళడానికి లేవబోగా హఠాత్తుగా నా కుడి మోకాలి చర్మం పైన భగభగ మంట రేగింది. పైగా కాలు కూడా లేచి కూచునేందుకు స్వాధీనం కాలేదు.
నేను భయంతో “ఇదేమిటి? ఈ కాలికేమైంది?” అని బాధగావున్న చోట చేత్తోరాయబోగా అది మరింతభగ్గుమన్నది. వెంటనే “అమ్మా!” అని బాధగా అరిచాను.
అంతే వెంటనే కాలిపై మంట మాయమై కాలు నా స్వాధీనంలోకి వచ్చింది. “ఇలా ఎందుకైనదబ్బా!” అనుకుంటూ నేను బాత్రూమ్కు వెళ్ళివచ్చి మళ్ళీ పడుకున్నాను.
అప్పుడు గుర్తుకు వచ్చింది. “నిన్నరాత్రి కలలో అమ్మ ఈ కాలిపై ఈ భాగం వంకనే కదా తీక్షణంగా చూసింది” అని.
అంటే – ఈరోజు, ఈ సమయానికి నాకాలికి జరగబోయే రుగ్మతను అమ్మ ముందురోజే గ్రహించి తనకంటి చూపును ఆ భాగంపై ప్రసరింపజేసి, నేను అట్టే బాధపడకుండానే నయం చేసిందన్న మాట!
ఆ ఆలోచన రాగానే – “అమ్మా! నీకు ఏ విధమైన సేవచేయని ఈ బిడ్డపై నీకెందుకమ్మా! ఇంత అక్కర?” అని అమ్మకు మనసులోనే నమస్కారం చేసుకున్నాను.
మరి “అమ్మ” కదా! బిడ్డ తనను గమనించక పోయినా బిడ్డను వేయికళ్ళతో కాపాడుతూనే ఉంటుంది.
అదే మన ‘అమ్మ’ ప్రత్యేకత!