మాయను ఆధారంగా చేసుకొని మాతృశ్రీ ఈ అవనిలో జన్మించింది. ప్రకృతిని, మాయను ఉపయోగించి సాధారణ మానవ రూపం దాల్చింది. అమ్మకు అనంత దివ్యత్వము ఉన్నా, అంతమున్న మనిషిగా కనపడింది. అతిమానుష దివ్యశక్తిని బచ్చికంగా చేసుకొని కారుణ్య రసామృతమూర్తిగా మన ముందు నిలిచింది. అమ్మ సహజస్థితే దివ్యత్వం. సర్వ సామాన్యంగా కనపడుతున్నా, అంతరంగికంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అనసూయాదేవి మాయకు అధిపతి, మన జీవితాలలో ఆశ్చర్యకరమైన విషయం మాయలో పడడం. సత్త్వ, రజో, తమో గుణములతో ఆవరించి ఉండే మాయ అమ్మచేతిలోని ఓ సూత్రం. అమ్మకు మనకు గల వ్యత్యాసం ఏమిటంటే మనం మాయ ఆధీనంలో ఉంటే, మాయ అమ్మ ఆధీనంలో ఉంటుంది. మాయాశక్తికి లోనుకాకుండా మోక్షపథం వైపు ప్రయాణించాలంటే మనలోని మాయను తొలగించమని మనము వేడుకోవాలి.
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ॥ అప్పుడే మనస్సు నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఇంద్రియాలకు నిగ్రహశక్తి లభించినప్పుడు భక్తుని చూపు తాత్కాలిక సుఖాలమీద ఉండదు. నిత్యము, నిశ్చలము అయిన మోక్షపథం వైపు ఆ చూపు ప్రసరిస్తుంది.
అమ్మ చూపులో బ్రహ్మాస్త్రం ఉంది, అదే వాత్సల్యాస్త్రం, అమ్మకి మనకి అడ్డుగా ఉన్నది మన ఆలోచనలు’ (చక్షువులు), అమ్మ చూపు విశిష్టమైనది. ఈ విషయం అమ్మ కూడా ఎన్నోసార్లు అంగీకరించింది. “మీరు ఇక్కడకు వచ్చి నన్ను చూస్తారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. నేను చూస్తున్నాను అనేది ఎప్పుడు అర్ధం అవుతుంది అంటే మీరు చూస్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూడడం” (అమ్మ కనికరిస్తేనే ఆ దివ్య చక్షువుల ప్రసరణ మనమీద పడుతుంది). విముక్తి కలిగించే అమ్మ నేత్రములపై దృష్టిని కేంద్రీకరించడం వలన మాయను తొలగించుకొనగలము. మనం మాయ నుండి విముక్తి పొందడం అమ్మ ఆధ్యాత్మిక మార్గం యొక్క సారాంశం. ఇది సంపూర్ణ నిశ్చలత మరియు ఏకాగ్రత ద్వారా వస్తుంది. దీనినే ధ్యానపద్ధతిలో ‘మానసిక స్వయం సమర్పణ’- అత్యున్నతమైన త్యాగం అంటారు.
శ్లో. జ్ఞానినా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా॥
ఐలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి ॥ (దేవీ మాహాత్మ్యము -155)
జగన్మాత మహామాయగా జగతిలో ప్రకటితమైనపుడు మాయలోకి జ్ఞాని కూడా లాగబడతాడు. కాబట్టి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మానవ జీవితం కష్టంతో కూడి ఉన్నదన్న భావం మనలో ఎప్పుడూ ఉండాలి. అంతంలేనిదాని నుండి అంతమున్న దానివరకు కనిపిస్తున్న అనంతాన్ని మనం అమ్మలో చూస్తాము. అమ్మ కూడా మనలాగే జీవితంలో ఒడుదుడుకులను అనుభవించింది, అంతరంగికంగా ఉన్న శక్తి వనరుల వలన అమ్మ దేనికీ తొణకలేదు. అమ్మ ఒక్క చూపు, ఒక్క మాట, ఒక్క స్పర్శతో జీవితాల్లో ఎంతోమంది మారిన సంఘటనలు ఉన్నాయి. ఎందరిలోనో దివ్యానుభూతిని అందించింది. అమ్మ ముళ్ళబాటలో నడవటానికి ఎంత ఇష్టపడుతుందో, బిడ్డలను పూలబాటలో నడిపించటానికి అంత తాపత్రయ పడుతుంది. అందుకే అమ్మకైనల్యదాత్రి.
అమ్మపై మన మనసును కేంద్రంగా పెట్టుకుంటే మన భక్తి దివ్యమైనశక్తిని కలిగి ఉంటుంది. అమ్మ మనతో కలిసి జీవించడంచేత (సమకాలికులు) మనలో అద్భుతశక్తిని చూడగలుగుతాము. అమ్మ మనం చేస్తున్న పనుల్లోను, ఆధ్యాత్మిక జీవితంలోను గొప్ప మార్పును తీసుకురాగల్గుతుంది. అమ్మ విశ్వజనని- సకల చరాచర జగత్తుకి తానే తల్లినని ప్రకటించింది. అమ్మతత్త్వం మనకు అర్ధంకాదు. అనంతశక్తి పరిమిత రూపంలో అమ్మగా కనిపిస్తోంది. అమ్మ అందరి అమ్మ అందని అమ్మ,