పర్వతం గురించి గులక రాయి మాట్లాడాలి. అనుకోవటం,
మహాసముద్రం గురించి నీటిబొట్టు ఏదో చెప్పాలి అని ఆరాట పడటం,
సూర్యుడి తేజస్సును వర్ణించాలి అని దివిటీ పూనుకోవడం దుస్సాహసం.
పియస్ ఆర్ అన్నయ్య గారి గురించి చెప్పాలి
అనుకోవడం కూడా అటువంటి దుస్సాహసమే. కానీ మనసు ఆగటం లేదు.
జిల్లెళ్ళమూడితో, అమ్మతో మమేకం అయిపోయి
పడుగూ పేకలా, పాలు నీరులా కలిసి పోయిన
ధన్యజీవులు కారణజన్ములు కొంతమంది ఉన్నారు.
వారికి అమ్మ తప్ప వేరే ప్రపంచం లేదు.
పండుగలు పబ్బాలు, వారి శుభ కార్యాలు అన్నీ అమ్మ
సమక్షంలోనే.
అమ్మ దగ్గర వుంటే పండగ. దూరంగా వున్నా పండగే.
అమ్మను వేరేగా తలుచుకోనవసరం లేదు.
వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వుంటుంది అమ్మ.
ఆ కోవకు చెందిన వారు పి ఎస్ ఆర్ అన్నయ్యగారు.
నిలువెత్తు విగ్రహం. బెత్తెడు అంచు జరీ పంచె కల్లీ
లాల్చీ జరీ ఉత్తరీయం ఎంత మందిలో వున్నా
కొట్టొచ్చినట్టు కనిపించే వ్యక్తి.
జిల్లెళ్ళమూడిలో ఏ వేడుక జరిగినా ఏ సభ జరిగినా ఏ
కార్యక్రమం జరిగినా అన్నయ్య గారిదే ప్రముఖ పాత్ర.
మహాకవి. పండితుడు. వారి ఉపన్యాసం ఒక ఝరీ ప్రవాహం.
తన వాక్పటిమతో శ్రోతలను మంత్రముగ్ధులను కావించ గల ప్రతిభావంతుడు.
చిరునవ్వుతో అందరినీ ప్రేమగా ఆప్యాయంగా
పలకరిస్తూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి పెద్ద
అన్నగారిలా వ్యవహరిస్తూ, అందరి ఇంటి ఆవరణలో
మసలుతూ ఉండే పి ఎస్ ఆర్ అన్నయ్య గారు మన
అందరి జీవితాల్లోనూ ప్రత్యేకమైన వ్యక్తి. కొండంత అండ.
మొన్న మొన్ననే, సోదరుడు రావూరి ప్రసాద్ సన్మానం, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ ఉత్సవాలు, వసుంధర అక్కయ్య స్వర్ణాభిషేకం మొదలైన కార్యక్రమాలు తన చేతుల మీదగా నిర్వహించిన అన్నయ్యగారు అమ్మ శతజయంతి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించ వలసిన బాధ్యత తన మీద ఉండగా హఠాత్తుగా అనారోగ్యం పాలవడం, కోలుకుంటున్నారు అని సంతోష పడుతున్న సమయంలో వెళ్ళిపోవటం పిడుగు పడినట్లు అయింది.
అన్నయ్య గారు లేని లోటు భరించటం కష్టం. వారికి ఉత్తమలోకాలు కలగాలి అని ప్రార్థించడం కేవలం మొక్కుబడి తంతు అవుతుంది.
అందరికీ సుగతే అన్న అమ్మ తన అనుంగు బిడ్డ కోసం అన్ని ఏర్పాట్లు చేసే ఉంటుంది. మనకు ఇది పరీక్షా సమయం. అమ్మ లీలలు మనకు ఎప్పుడూ అర్థం కావు. అన్నీ నా దయే అని ఎన్నో సందర్భాలలో చెప్పింది అమ్మ. ఈ విషాద సమయంలో విశ్వజననీ పరిషత్ కార్య నిర్వాహక సభ్యులకు, అన్నయ్య గారి ఆత్మీయులకు, ధైర్యాన్ని నిబ్బరాన్ని ప్రసాదించ వలసిన బాధ్యత కూడా అమ్మే స్వీకరించాలి మరి.
భౌతికంగా మన మధ్య లేకపోయినా అన్నయ్య గారు మన జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచి ఉంటారు. వారి ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేము. అమ్మతో తన అనుభవాలను వివరించి చెప్తూ వుంటే విని పరవశించి పోయిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. ఒక మహనీయుడు, పుణ్యాత్ముడు అయిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగాము అనే తృప్తి మిగిలింది.
మరణం అంటే పరిణామం అని అమ్మ చెప్పారు కదా. బిడ్డ తల్లి ఒడిలోకి తరలి వెళ్ళి పోయారు. కోటికి ఒకరు పుడతారు పుణ్యమూర్తులు. మహనీయునికి ఘన నివాళి.