13-7-22. గత రెండు రోజులుగా నాకు నడుం నెప్పి ఎక్కువగా వుంది. ఇది ఎన్నో రోజుల నుంచి ఉంది, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది. టాబ్లెట్లు వేసు కుంటాను తగ్గిపోతుంది. రాత్రి రెండు గంటల దాకా నిద్ర పట్టలేదు. మళ్లీ మందు వేసుకుని పడుకున్నాను. పొద్దున 10 గంటలకు నిద్ర లేచాను.
అయ్యో నగర సంకీర్తన చూడలేదు. అని యూ ట్యూబ్ చూస్తుంటే ఓపెన్ కావడం లేదు. బాధ కలిగింది. ఇవాళ గురుపూర్ణిమనాడు ఇలా జరిగింది ఏమిటి? అనిపించింది. స్నానం చేసి పూజ చేసుకోవాలి. చాలా ఆలస్యం అయిపోయింది అని కంగారు పడుతూ వుంటే చిన్నగా ఎవరో చెవిలో చెప్పినట్లు వినిపించింది.
“ఇవాళ బుధవారం, అమ్మ చరిత్ర పారాయణ విషయం మర్చిపోయావా?” – అని.
వెంటనే స్నానం చేసి పారాయణ చేసుకున్నాను.
టింగ్ మని సెల్ లో శబ్దం. అంతకుముందు మొరాయించిన యూట్యూబ్ ఓపెన్ అయింది. నగర సంకీర్తన – కనుల పండువగా. దయామూర్తి దయకు అంతు లేదా? ప్రతి చిన్న విషయంలోనూ ఇలా కనిపెట్టి ఉంటుందా ? ఎన్ని వేల జన్మల పుణ్యం ఈ తల్లి అండన చేరటం…. చేతులెత్తి నమస్కరించడం తప్ప ఇంకేం చేయగలం!