మానవ జీవితమే కడగండ్లతో కూడినది. అందునా మహాత్ములు, మహాపురుషుల జీవితాలలోని కడగండ్లు అసాధారణమూ, అసామాన్యమూ అయినవి. వారు ఈ కష్టాల నుంచే అవతార పురుషులుగా, మహాత్ములుగా లోకానికి ఆదర్శమై వెలుగొందుతారు. బంగారాన్ని పుటంలో పెడితేనే ఇంకా వన్నె కొచ్చి కాంతులీనుతుంది. అదే ఇటుకకు పెడితే కాలి బూడిద మిగుల్తుంది. సాత్విక సంపదకలవారు కష్టాలవల్ల నిగ్గుతేలి మహాత్ములవుతారు. అదే రాజసికతామసిక ప్రవృత్తి కలవారు కష్టాలవల్ల దుష్టులయ్యే ప్రమాదముంది. వారు లోకం మీద అకారణమైన కసి పెంచుకుని ద్వేషంతో రగులుతూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు.
ఈసారి నుంచి కొందరు అవతార పురుషుల జీవితాలలోని కడగండ్ల గురించి రాద్దామనుకుంటున్నాను. చదువరులు ఇందులో పొరపాట్లేమైనా వుంటే సహృదయంతో మన్నించాలని కోరుకుంటున్నాను.
అమ్మ జీవిత మహోదధిని పరిశీలించి అందులో ఒక్క బిందువును గ్రహించినా నేను ధన్యురాలినే అనుకుంటున్నాను. అందులోని ఒక నీటి తుంపరను మాత్రమే పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
అమ్మ జన్మతః కారణ జన్మురాలైనప్పటికీ మానవ శరీరం, అందునా స్త్రీమూర్తి శరీరం ధరించినందుకు జీవితంలో ఎన్నో అసామాన్యమైన యాతనలన్నీ అనుభవించింది. తనను కష్టపెట్ట గలిగిన దేదీ ఈ సృష్టిలో లేదని నిరూపించుకుంది. ఇష్టమైనదేదీ కష్టం లేదని కష్టాలన్నీ ఇష్టాలుగా మార్చుకుంది.
ఆమె అగ్నిహోత్రంలాంటి ఆచార సంప్రదాయాలు నియమాలు గల శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా అన్నిమతాలకు అతీతంగా, జీవించింది. రంగమ్మ, సీతాపతిశర్మ అనే పుణ్యదంపతులకు జన్మించింది. పుట్టగానే మంత్రసాని నాగాం బొడ్డుకోయటానికి చాకుతీసుకెడితే, ఆ చాకు త్రిశూలంలాగ కనపడి అమ్మ బొడ్డు ఒక పద్మం లాగ ఆ పద్మంలో ఒక బాలిక, బొమ్మ వలె గిరగిరా తిరుగుతూ సాక్షాత్కరిస్తే నిశ్చేష్టురాలయింది. తరువాత ఆ దృశ్యం అదృశ్యం అయి మామూలు చాకు కనిపించగా తేరుకుని బొడ్డుకోస్తుంది. ఇదీ అమ్మ ప్రసాదించిన మొట్టమొదటి దివ్య దృశ్యం. ఇలా అమ్మ అనుగ్రహించిన దివ్యానుభూతులు అమ్మ జీవితంలో కోకొల్లలుగా వున్నాయి. ఆమె తల్లిరంగమ్మకు పూర్వం ఎంతో మంది బిడ్డలు పుట్టి దక్కకుండా చనిపోవటం వల్ల ఆమెకు అమ్మను గురించి తీవ్రమైన అభద్రతా భావంతోచి ఆమె ఆలనాపాలనా పసిగుడ్డుగా వున్నప్పుడే గొల్లనాగమ్మకు అప్పు చెప్పింది. ఈ బిడ్డ అయినా బతికి బట్టకట్టాలని కోటి దేవతలకు మ్రొక్కింది. అలనాడు కృష్ణపరమాత్మను దక్కించుకోవటానికి దేవకీదేవి కృష్ణుణ్ణి పసి గుడ్డుగానే గొల్లవనిత యశోదకు అప్పచెప్పింది కడుపు తీపితో. అందుకే అమ్మ నేను పాడే “ఎవరు కన్నారెవరు పెంచారు! నవనీత చోరుని, గోపాల బాలుని ఎవరు కన్నారు…” అనే పాట రోజుకి పదిసార్లయినా పాడించుకునేది. ఆమె జీవితమంతా ఆ పాటలో వుంది.
కన్నతల్లి స్థన్య పానానికి గాని, వెచ్చగా మాతృదేవి డొక్కలో పడుకోవడానికి కాని అమ్మ నోచుకో లేదు. ఇలావుండగా పసివయస్సులోనే అమ్మ తన అమ్మను కోల్పోయింది. తల్లి లేని పిల్లగా వుండి అందరినీ జాలి చూపులతో చూచేది. ఎంతమంది బంధువులున్నా మాతృసమానులు కాలేరు కదా! ఇది ఆమె జీవితంలో తీర్చలేని లోటు. ఆమె సామాన్యులవలె తల్లి మరణానికి దుఃఖించినట్లు కనపడదు. జనన మరణాలపట్ల ఆమెలో తర్జన భర్జనలూ, పరిశీలనలూ మొదలయ్యాయి. బాల్యంలోనే తనకు ఎదురైన ప్రతి సంఘటననూ, ప్రతి వస్తువునూ మూలంలోకి వెళ్లి, పరిశోధించి, ఆత్మావలోకనంతో అన్నింటిలో ఒకే పరమాత్మను దర్శించి సహజ సమాధి స్థితిలో ఉండసాగింది.
“తను మూలమిదం జగత్” అని చిన్ననాడే అందరికీ చెప్పింది. బుచ్చిరాజు శర్మగారి పాటలో “ఆధారమౌ నీకు ఆధారమేలేక వున్నావు నీ నీడ ఏకాకీ! జాడ కన్నావు ఆత్మావలోకీ! అమ్మా! అమ్మా! ఆనంద రూపిణీ” అని ఎంత అద్భుతంగా రాశారు ! మేము ఆ పాట పాడాము కూడా.
పసితనం నుండే అమ్మ సాన్నిధ్యంలో కొన్ని పుణ్యజీవులకు మరణం రూపంలో ముక్తి లభించేది. ఈ కోవలో ఒక తేలు, ఒక కుక్క అమ్మ సన్నిధిలో సాయుజ్యం పొందాయి. పున్నయ్య అనే కృష్ణభక్తుడు అమ్మలో కృష్ణపరమాత్మను దర్శించి పారవశ్యంతో గానం చేసి నృత్యం చేసి అలసి సొలసి మరి కొద్ది రోజులకే అసువులు బాశాడు. కృష్ణసాయుజ్యం పొందాడని అందరూ అనుకున్నారు.
అపరిచితమైన శక్తి పరిమితమైన దేహంలో ఇమిడి వుండాలంటే ఆ శరీరం చాలా యాతనలు అనుభవించాల్సి వస్తుంది. ఒక చిన్మయ శరీరులకే అది సాధ్యం. ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస అన్నారు “ఒక గుడిసెలోకి ఒంటెగాని ఏనుగుగాని ప్రవేశిస్తే ఆ గుడిసె నిలబడుతుందా, కుప్పకూలిపోదా?” అని. అట్లా సర్వ వ్యాపకమైన పరమాత్మ శక్తిని శరీరంలో నిల్పటం ఒక అవతార పురుషులకే సాధ్యం అవుతుంది.
మౌలాలీ అనే పుణ్యశాలికి అమ్మ తన విశ్వరూపాన్ని దర్శించే భాగ్యం కల్గించింది. అమ్మ మన్నవలో ఒకసారి ఒక చింతచెట్టు కింద ఏకధాటిన 22 రోజులు నిరాఘాటంగా కూర్చుని వుండగా ఆమె తలపై పాము పడగలు గొడుగులాగా నిలబడటంలాంటి అనేక అద్భుతాలు ఆ పుణ్యశాలి కనులార చూచి మహాభక్తుడు అయ్యాడు. కపాలభేదనం మొదలైన ఆధ్యాత్మిక పరిణామాలు కల్గినపుడు ఆమె శరీరాన్ని కాపాడి పోషించి సేవచేసినవారు ఎవరూ లేరు. ఒక విధంగా ఆమె గాలికి తిరిగి గాలికి పెరిగి ఆలనా పాలనా లేకుండానే పెద్ద పిల్ల అయింది.
స్త్రీగా ఆమెకెన్నో హద్దులూ, కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు వున్నాయి. అయినా ఆమెలో హద్దులు మీరిన విశ్వప్రేమ, సర్వజీవులయెడ దయా విస్తరించి వాటివల్ల అనేక ఇబ్బందులకు, బాధలకు లోనయ్యింది. నిగ్రహించని దయాగుణంతో ఆమె అన్నార్తులకు భిక్షకులకు తనకై వడ్డించిన విస్తరి కూడా చేరవేసి వారి ఆకలి తీర్చటానికి చాలా ఆరాట పడింది. లోభికి ఖర్చు చెయ్యటం ఎంత కష్టమో, దయాగుణం వున్నవారికి దానంచేయ్యకుండా వుండటం కూడా అంత కష్టం. ఈ దానగుణం వల్ల ఆమె బాలికగా వున్నప్పుడు చివాట్లు, మొట్టికాయలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. వేలమందికి అన్నం పెట్టుకోవాలనే ఆమె చిరకాలవాంఛ అనతి కాలంలోనే ఆమె జన్మదిన స్వర్ణోత్సవ సందర్భంగా లక్షమందికి పైగా అన్నవితరణ ద్వారా తీరింది. ఆమె భౌతిక నిష్క్రమణానంతరం కూడా అక్కడ అన్నవితరణ జరుగుతూనేవుంది. ఈ అంశానికి ఆమె జీవితంలో ఎంత ప్రాముఖ్యత యిచ్చిందంటే ఆమె వద్దకు వచ్చిన యాత్రికులు, వారిని తీసుకు వచ్చిన డ్రైవర్లు, రిక్షావాళ్లు, కూలివాళ్లు అందరూ భోజనంచేస్తేగాని వెళ్లనిచ్చేది కాదు. ఈ సూత్రాన్ని మనం అందరం జీవితంలో సాధ్యమైనంత వరకూ ఆచరిస్తేగాని రించలేము.
ఆమె చిన్నతాతగారు చంద్రమౌళి చిదంబరరావుగారికి మాత్రమే ఆమె ఔన్నత్యాన్ని మహాత్త్వాన్ని గుర్తించే భాగ్యం లభించింది. మిగతావారంతా ఆమె మౌనాన్ని, ఆమె ధారాళమయిన ప్రేమతత్త్వానికి విపరీతార్థాలు కల్పించి నిరసించి విమర్శించి ఏదోరీతిగా హింసించిన వారే కన్పిస్తున్నారు. ఆమెకు ప్రేమించేవారు, ద్వేషించేవారు అందరూ సమానమే. పసితనం నుంచే ద్వంద్వాతీతురాలై, తన దివ్య చైతన్య శక్తి ప్రకాశించగా ఆమె హృదయపద్మంలోని మధువును అనేకవేల జీవులు ఆస్వాదించాయి. ఈ కలిలో తన కాకలి లేదని ఆహారాన్ని పూర్తిగా విసర్జించింది. ఒక్క రోజు ఆహారం లేకుండా వుండలేమే, ఆ తల్లి కొన్ని దశాబ్దాలు ఆహారం లేకుండా జీవించడం మహాద్భుతం కాదా! ఆమె అసామాన్యమూ, అసాధారణ వ్యక్తి అయి వుండి అతిసామాన్య స్త్రీగా, ఇల్లాలిగా, తల్లిగా వ్యవహరించిందంటే లోకానికి ఆదర్శంకోసం కాక తన కోసరమా? తనకా అవసరం వుందా?
అలాగే ఆమె వివాహ సంఘటన ఒకనాటకంలా చిత్ర విచిత్రమయిన మలుపులతో కొనసాగింది. ఆమె వివాహవిషయంలో కుటుంబంలో వాదోపవాదాలు, అపార్థాలూ, తర్జన భర్జనలూ జరిగి ఒక విధమైన అశాంతి వాతావరణం నెలకొంది. అమ్మ స్థిరచిత్తంతో పుట్టినప్పటి నుంచి అనుకుంటున్న తన మేనత్తకొడుకు నాగేశ్వరరావుగారినే తనకు దైవం నిర్ణయించిన భర్తగా నిశ్చయించుకుంది. ఒక సమయంలో తెనాలిలో వుండగా తన నిశ్చయాన్ని ప్రేమపూరిత అంగీకారాన్ని తెలియజేస్తూ అక్కడి పార్కులో మౌనంగా ఆమె ఆరాధనా భావంతో కార్చిన కన్నీటి చుక్కలు నాన్నగారి పాదాల మీద నిలవగా ఆ బిందువుల్లో ఆయన రూపం తళుక్కుమని గోచరించగా చూసి పరవశించింది. సృష్టి అంతలో ఆ రూపాన్నే చూడాలని కోరుకుంది. ఇంతటి మనోహరమైన ప్రణయ దృశ్యాన్ని మనం ఏకావ్యాల్లోగాని, ప్రబంధాల్లోగాని చూడగలమా! ఆమె బంధువులు ఆమెతో “ఈ సంబంధం చేసుకుంటేకష్టపడతావేమో దరిద్రం అనుభవించాల్సివస్తుందేమో ఆలోచించుకో” మని బెదిరించారు. దానికి అమ్మ “పెనిమిటే పెన్నిధి. ఆ పెనిమిటి సన్నిధిలో పేదరికం యేమిటి?” అని ప్రశ్నించింది. “ఐశ్వర్యంవల్ల ఆ సన్నిధి వస్తుందా?’ అని అడిగింది. “సన్నిధే పెన్నిధి” అని సమాధానం యిచ్చింది. ఇది సాధించినవారిని ఏకష్టాలూ, దరిద్రాలూ, దుఃఖాలు ఏమీ చెయ్యలేవు అన్నది. ఆ స్థితి మనందరికీ ఆదర్శం కావాలని అభిలషించింది.
వివాహానంతరం ఆమె అనేక కష్టాలు యాతనలు అనుభవించినట్లు కర్ణాకర్ణిగా తెలిసినా “సంసారంగుట్టు” అని ఆ మహా ఇల్లాలు ఏవీ ప్రకటితం కానీయలేదు. ‘అగ్గిలో దూకి నిగ్గుతేలిన సీతమ్మలా’ అమ్మ అనేక అగ్ని పరీక్షలకు లోనై జగన్మాతగా మనకు దర్శన మిచ్చింది. అమ్మేలేని అమ్మ ముగురమ్మల మూలపుటమ్మగా నిలిచింది.
అమ్మకు ఇష్టమైన పాట
ప ఎవరు కన్నారెవరు పెంచారూ!
నవనీతచోరుని, గోపాల బాలుని ||ఎవరు||
నోము నోచి నెలలు మోసి నీలమేఘశ్యాముకన్నది దేవకీ
లాలపోసి పాలుపట్టీ జోలపాడే కలిమి కలిగె యశోదకు
తడవ తడవకు కడుపుశోకము తాళజాలక పెంపుకిచ్చెను దేవకీ
తాను కనుకయె తల్లియైనది తనయుడాయెను దేవుడే యశోదకు
ఎవరు కనినా ఎవరు పెంచిన చివరికతడానందమిచ్చిన దెవరికీ అవనిలో తనపైన ఎన్నో ఆశలుంచినవారికీ తన నాశ్రయించిన వారికీ
ఈ వ్యాసం, ఈ పాటా రాసి పాడి అమ్మ చూపిన ప్రేమకు ఋణం తీర్చుకోవాలని ఆశిస్తున్నాను.
చివరి మాట : అమ్మ దర్శనం అయిన ఎవరికైనా అది వృధాకాదు. వారిలో ఆధ్యాత్మిక నిప్పు రవ్వ రగిలి అది సమయం వచ్చినపుడు, కర్మ పరిపక్వమైనపుడు జ్వాలగామారి వారి పాపాలను దగ్ధం చేసి పరమార్థం చూపిస్తుంది. ఈ విషయం ఈ వయసు మీరిన సమయంలో గ్రహించాను. ఆమె అందుకే ఎప్పుడూ ‘అమ్మ’ దర్శనమే మన ధ్యేయం కావాలని నిశ్చయంగా, నిక్కచ్చిగా చెప్పింది. అమ్మ సందేశాన్ని మనం విశ్వసించకపోతే దేనినీ జీవితంలో విశ్వసించలేము.
“జయహోమాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి”