“మనశ్శుద్ధే మనస్సిద్ధి” అన్నది అమ్మ. ఆ మహావాక్యానికి ఉదాహరణ హైమ, మానవిగా జన్మించి దేవతగా ఎదిగింది. సాధన, తపస్సు, దీక్ష, ఉపాసన, మానవత్వం, కారుణ్యం, ప్రేమ, దయ, నైర్మల్యం వంటి దైవీ సంపత్తికి సాకారరూపంగా నిలిచింది. అనిర్వచనీయమైన ప్రతిఫలాపేక్ష రహితమైన అచ్చమైన ప్రేమకి త్యాగానికి నిర్వచనం హైమ, ఊహకు అందని అనురాగ రూపం, అద్వైత దీపం హైమ.
“మనకు హైమ మీద కంటె, హైమకు మన మీద ప్రేమ ఎక్కువ. హైమ ప్రేమకు, మన ప్రేమకు పోలిక ఏమిటి?” అని స్పష్టం చేసింది జగజ్జనని అమ్మ. అసలు ఆ లక్షణం కేవలం ఆదిమూలమైన అమ్మకే సహజం. ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నది హైమ.
హైమను చూసినంతనే… ‘మల్లికాపుష్పనైర్మల్యం జాతీ స్వచ్ఛ ప్రభాఝరీ, మందార సౌకుమార్యశ్రీః పారిజాతస్య సౌరభమ్, తులసీ పావనత్వంచ హైమాయాం ప్రస్ఫుటం సదా. – అని తెలుస్తుంది. “ఎక్కడ ఉన్నా! ఎలా ఉన్నా! అందరూ హాయిగా ఉండాలని నేను నీకు నమస్కరిస్తున్నానమ్మా!’ – అనే హైమ అభ్యర్ధన లోకోత్తరమైనది, ఆర్షధర్మసారభూతమైనది. ఉదాహరణకి ఆచార్య ఎక్కిరాల భరద్వాజను హైమ ఆదరించిన అద్భుతమైన తీరుని చూస్తే
‘ప్రసన్నతా ముఖాంభోజే మాధుర్యం భాషణాదికే,
ఆప్యాయ భావ సంపన్నా సంగీతాలాపభాసురా..
ప్రేమార్ద్రహృదయానిత్యం సర్వస్య ప్రియదర్శినీ,
సద్భావ సంపత్తియుతా సర్వభూత హితేరతా.
మానసేరాగ జలధిః హృదయే రాగమాలికా,
అనురాగ సుధాదేహే నేత్రయో రాగవీచికా,
తస్యాః సంస్కృతి వేళాయాం గౌతమాది దయామయాః, తిష్ఠతి భావ పద్యాయాం తేషు హైమా ప్రదృశ్యతే’ అనే సత్యం అవగతమౌతుంది.
ఒకనాడు మాన్య సో॥ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు అమ్మ పావన పద సన్నిధిలో ఆసీనులై ఉన్నారు. పరికిణీ ఓణీ వేసుకుని కాలి అందెల రవళి మృదు మధురంగా వినవస్తుండగా హైమ, మలయ మారుత వీచికలా పూర్ణచంద్ర ప్రభారాశిలా అనురాగ జ్యోత్స్నా తరంగమాలికలా కారుణ్య రసోత్తుంగ తరంగంలా మందయానయై వస్తోంది. తేజసా ఆదిత్య సంకాశం ప్రతిపత్ చంద్ర దర్శనం అనే తత్వానికి దర్పణం పడుతున్న హైమను చూసి అన్నయ్య “అమ్మా! దేవత నడచి వస్తున్నట్లు ఉన్నది” అన్నారు. హైమ అమ్మ దరి చేరింది. హైమను ఉద్దేశించి అమ్మ, “అన్నయ్య నిన్ను దేవత అంటున్నాడు” అన్నది. అమ్మ మాట, అన్నయ్య మాటలు అక్షరసత్యాలయ్యాయి.
‘దయగల హృదయమే దైవనిలయం’ అనే మహితోక్తికి సరళమైన సుందరమైన ఉదాహరణ హైమ. హైమకి అలంకారప్రాయమైన సాధన సంపత్తిని ప్రస్తావించాలంటే……
‘ఈర్ష్యా విద్వేష మాత్సర్య కాశ్మల్య పరిదూషితాం, దుష్టమానవతాం తీర్యా సదా సద్భావభాగినః. సంత్యక్త భేద భావాశ్చ స్థిత ప్రజ్ఞాః భవంతి హి, చిత్త స్థైర్యం సౌమనస్యం తేషాం సహజ భూషణమ్’ – అని గ్రహించాలి.
ఈ సద్గుణ వైభవానికీ, సంస్కారగరిమకీ మురిసి పోయి అమ్మ హైమకి దైవత్వాన్ని ఇచ్చింది. కానీ దైవత్వ పరిగ్రహణానికి హైమను అమ్మ సిద్ధం చేసుకున్న ప్రక్రియ ఊహాతీతమైనది. దానిని భ్రమర కీటక న్యాయం అనవచ్చు.
‘జ్ఞాన సంపాదనే’ హైమా’ మహక్లేశ ముపాగతా, తత్కృతా జ్ఞాన వాశిష్ఠ చరితం భాసతేస్మృతా.’ జ్ఞాన వాశిష్ఠం అద్వైత వేదాంతానికి మోక్ష సాధనకి సంబంధించినది.
శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి పూర్వము తీర్థయాత్ర పూర్వకంగా పర్యటనచేసి, ‘జీవితం క్షణభంగురం, కాలం ఝరీ వేగతుల్యం, యౌవనం బుద్బుద ప్రాయం, భోగ భాగ్యాలు బంధహేతువులు’ – అనే వైరాగ్యంతో “రాజ్యము వద్దు తపస్సు చేసుకుంటాను.” అన్నాడు. ఆ సమయంలో అర్జునునికి శ్రీకృష్ణపరమాత్మ గీతను ఉపదేశించినట్లు వశిష్ఠమహాముని శ్రీరామునికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు.
అమ్మ అనుగ్రహం వలన హైమ, ఈ మహిని చూడలేక తన మదిని వీడలేక, మేఘాలు దాటి శోకాలు లేని లోకాలు చేరింది, మృత్యుంజయ అయింది. జగజ్జననికి ప్రతిరూపంగా దీపిస్తోంది.
హైమకి శారీరకంగా బలహీనత, మానసికంగా వేదన. ఆ తనువు, మనస్సు కుసుమ కోమలం. లలితా సహస్రనామ పారాయణ చేసేది. అమ్మనే ధ్యేయమూర్తిగా మనస్సులో ప్రతిష్ఠించుకున్నది. మనస్సు నిలవటం లేదని, ఏకాగ్రత కుదరటం లేదని పరితపించేది. ఆ తపన చూస్తే పరితాపోగ్ర నిదాఘవేళ శిలపై పంచాగ్ని మధ్యంబునన్ పరమధ్యాన సమేతయై నిలచి విభ్రాజిల్లె – అన్నట్లు తపమాచరించిన నగరాజతనయ స్ఫురిస్తుంది, అక్కయ్యకి ‘హైమ’ అని నామకరణం చేయటంలోని అంతర్యం ప్రస్ఫుట మౌతుంది.
‘జగద్రక్షణార్ధం ధరామండలేస్మిన్ శుభం జన్మ సంపాద్య దేవీ కలాభిః, మహాదర్శపాత్రం బభూదాత్ర ‘హైమా’ గరమా సుందరి దివ్యధామ.’ అని అర్థమవుతుంది.
నేను హైమక్కయ్యను చూడలేదు. 1970లో మొదటిసారి జిల్లెళ్ళమూడి వచ్చాను. ‘నీరూపు కనగలేని, నీమాట వినగలేని విధివంచితుండ’ అన్న శ్రీరాజుబావ పలుకులు నాపట్ల సత్యం. నాకు అదొక వెలితి. ఒకనాడు అమ్మ నన్ను ఆప్యాయంగా తన ఒడిలోకి తీసికొని, ‘నాన్నా! హైమను చూశావా?” అని అడిగింది. హైమను చూడలేక పోయాననే బాధతో ‘నువ్వే చూపించలేదమ్మా” అని నా ఆవేదనని అభ్యర్ధనని కలిపి నివేదన చేశాను. అందుకు సమాధానం అమ్మ చిరునవ్వే. అన్ని ప్రశ్నలకు సమాధానం, అన్ని సమస్యలకు పరిష్కారం అమ్మ దరహాసమే- అదే మహాప్రసాదం. కొంచెం వివరిస్తాను.
జిల్లెళ్ళమూడిలో ఉన్నపుడు ఏవో పనిపాటలు చేసేవాడిని. ఏ కాస్త విరామ సమయం చిక్కినా హైమాలయంలో గడిపే వాడిని. అది హరిద్వార్, హృషీకేశ్ వలె పవిత్రక్షేత్రం. అడుగిడినంతనే మేనుకు, మనస్సుకు చల్లదనం, హాయి. ఒకనాడు అమ్మ నాకోసం ఒక సోదరుని పంపింది. ఆ వ్యక్తి ఆవరణంతా వెదికి ఎక్కడా కనిపించలేదని చెప్పగా అమ్మ, “వాడు హైమాలయంలో ఉంటాడు” అన్నది. హైమ కారుణ్యాన్ని నాపై ప్రసరింపచేసింది అమ్మ. అది నా భాగ్యం. అందుకు –
ఒక నిదర్శనంలా చెప్పుకోవాలంటే – నేను శ్రీ హైమవతీ వ్రత కల్పాన్ని రచించిన ఉదంతం గుర్తుకొస్తుంది. అంతకు ముందు ‘మాతృశ్రీ’ పత్రికలో సుమారు ముప్పై వ్యాసాలు వ్రాశాను. ఆ ఆత్మ స్థైర్యంతో అందుకు సంకల్పించాను. ‘నానాక్లేశ విశీర్ణ జీర్ణహృదయైః రక్షార్ధిభిః సోదరైః సమ్యక్సేవిత పాదపద్మ యుగళీం శ్రీచక్ర సంచారిణీం అంటూ, ప్రారంభించి ప్రార్ధనా శ్లోకాన్ని, స్మిత పూర్వాభి భాషిణి’ వంటి నామములతో అష్టోత్తర శతనామావళిని, దయామూర్త్యైచ విద్మహే అనసూయాత్మజాయైచ ధీమహి తన్నో హైమవతీ ప్రచోదయాత్ అనే మత్స్య గాయత్రిని, మంగళ హారతి, బహుపరాకులు…. రచించాను. కాగా ఐదు అధ్యాయాలకు ఐదు కధలు వ్రాయాల్సి ఉంది. కాలేజికి వారం రోజులు సెలవు పెట్టుకుని జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఆరు రోజులు గడిచాయి. కాగితం మీద కలం పెట్టలేదు. మర్నాడే తిరుగు ప్రయాణం. నా మనస్సు కలత చెందింది. మామూలుగా నాటిరాత్రి నిద్రపోయాను. తెల్లవారు ఝామున మెలకువ వచ్చింది. కథలు వ్రాద్దామనిపించింది. అంతే, తెల్లవారేటప్పటికి ఐదు కథలు సర్వాంగ సుందరంగా, పరమార్ధస్ఫోరకంగా, ఈశ్వర విభూతి వైభవరహస్య గీతికల్లా కనువిందు చేశాయి. అపుడు అర్థమైంది. వ్రాయటానికి ఆధారం నా ప్రజ్ఞ, ఆత్మస్థైర్యం కాదు, ‘నేను నేనైన నేను’ యొక్క సంకల్పం, ఆశీర్వచనం.
సాధారణంగా ఉయ్యాలలో ఉన్న పసిబిడ్డ, కుండీలో పెరుగుతున్న మొక్క, గుంజకు కట్టివేయబడిన జంతువు, పంజరంలోని చిలుక, నిశ్చలస్థితిలో ఉన్న రాయి వంటిని నిస్సహాయమైనవని భావిస్తాం. వస్తుతః మనిషి అసహాయుడే. కానీ సర్వతంత్ర స్వతంత్రునిగా అసహాయశూయుడుగా తలపోస్తాడు, తల ఎగరేస్తాడు. అది సహజం. చేతలు చేతుల్లో లేవనే సత్యం అక్షరాలా అనుభవంలో గుర్తించ అసంభవమే అనవచ్చు.
అలా తత్త్వతః కొంతవరకు హైమక్కయ్యను నేను దర్శించుకున్నట్లే. కొంత వరకు అనటానికి ప్రబలమైన కారణం ఉంది. హైమవతీశ్వరి కరకమలాల్లో చిన్ముద్ర (అద్వైతముద్ర) అలరారుతోంది. అది దక్షిణామూర్తి తత్వానికి నిలయం. అంటే హైమవతీ అద్వైత సిద్ధిదాయిని. ఆ విధంగా హైమమ్మను నేను దర్శించుకోలేదు. ఆ అనుగ్రహాలయంలో ప్రదక్షిణ, అర్చనలు ఆచరించి, మొక్కుబడులు చెల్లించి ఎందరు తమ వాంఛితార్థ ఫలాన్ని సునాయాసంగా పొందారు అట్టి భాగ్యవంతులలో నేనూ ఒకడను. అంతే.
ఆధ్మాత్మిక వనంలో జగత్కాళ్యాణార్ధం అమ్మ ఒక మొక్కను నాటింది. దానికి పాలుపోసి పెంచి పోషించింది. అది ఎదిగి పుష్పఫల భరితమైంది. ఆ కల్పవృక్షమే హైమాలయం, ఇహపర సౌఖ్యాలను అనుగ్రహించే పవిత్రతీర్ధం. అది దివ్య ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదకుతోంది. అమృతోపమానమైన జీవన ధారల్ని వర్షిస్తోంది. హైమానుగ్రహ రూపమైన ఆ సుగంధాన్ని, మధుర రసాల్ని మానవాళి అనుభవిస్తోంది.
ఓం హైమ నమో హైమ, శ్రీ హైమ, జయ హైమ
(‘శ్రీ విశ్వజననీ చరితమ్’ కావ్యరచయిత శ్రీ చింతలపాటి నరసింహదీక్షిత శర్మ గార్కి కృతజ్ఞతాభి వందనములతో).