ఔరసం కృతసంబంధం తథావంశక్రమాగతం,
రక్షితం వ్యసనేభ్యశ్చ మిత్రం జ్ఞేయం చతుర్విధమ్. ‘నీతి సారం – ప్రతాపరుద్రదేవుడు’
రక్తసంబంధీకుడు, చిన్ననాటి నుండి పరిచితుడైన వాడు, వంశక్రమంగా కుటుంబ ” సంబంధాలు కలవాడు, కష్టముల నుండి రక్షించుట వలన సన్నిహితుడైన వాడు, ఇలా మిత్రులు నాలుగు రకాలుగా ఉంటారు.
ఈ నాలుగు రకాలుగానూ నాకు మిత్రుడు అయి అమ్మను చేరిన భట్టిప్రోలు రామచంద్ర గురించి – చెదరని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపు, మృదుసంభాషణ భూషణాలు ధరించిన సేవాదురంధరుడు రామచంద్ర.
పూజా పునస్కారాలు చేయలేదు అననుగాని అంతకు మించి అమ్మ సంస్థలకు సేవ చేశాడు. అమ్మ సంస్థలలోనే అమ్మను దర్శించాడు అని ఘంటాపథంగా చెప్పగలను. ఇది ఒక మెట్టు. ఇంకో పైమెట్టు అధిరోహించక పోలేదు. మా రామ్మూర్తి భట్టిప్రోలు రామన్నయ్యను మేము చిన్నతనం నుండి ప్రేమగా పిలుచుకునే పిలుపు. మా అనుబంధం స్మరించాలి అంటే, మేము అప్పికట్లలో పక్క పక్క ఇంటి వాళ్ళమే కాదు, ఒక్కటిగా పెరిగినవాళ్ళం. మా ఇంటికి వాళ్ళ ఇంటిని కలుపుతూ ద్వారం ఉండేది, ఇలా ఉండటం ఏమంత సహజం కాదు. ఎంతో అనుబంధం ఉంటే కాని సాధ్యం కాదు. కానీ ఇది మాకు సులభసాధ్యం అయింది. సహజం అయింది. అది మా ఇంటిని మాత్రమే కలపలేదు మా మనసులను ఆశయాలనూ కలిపింది.
అందరికీ తెలియని విషయం నేను చిన్నతనంలో ప్రారంభించిన సాహితీ వ్యవసాయంలో చిన్నతనంలో నాకు చేదోడు వాదోడుగా నిలిచినవాడు (కొంతకాలం నా కలం పేరు “సురా” సుబ్బారావు అనుకుంటారు. అందరూ. కానీ నిజానికి అది సుబ్బారావు, రామ్మూర్తికి సంక్షిప్తం) కలసి నాటకాలు వేసాం. కలసి చేలగట్ల వెంట నడచి అప్పికట్ల నుండి జిల్లెళ్ళమూడి వచ్చాం.
అమ్మసేవ కలసి చేశాము అనే సాహసం చేయలేను కాని ఆయన చేసిన సేవ చూసిన వాడను. రామన్నయ్య సాగించిన అమ్మ సేవాసాగరమధనంలో ఉద్భవించిన అమృతం పానం చేసిన వాడిని. మర్యాదాక్రమంలో రామన్నయ్య అనే సంబోధిస్తాను.
రామన్నయ్య అధిరోహించిన పైమెట్టు ఏది అంటే అమ్మ సంస్థల సేవే అమ్మ సేవగా భావించిన రామన్నయ్య మరో మెట్టు ఎక్కి అమ్మ బిడ్డల సేవ పరమోత్కృష్టంగా భావించారు. ఇంకో మెట్టు ఎవరు ఆపదలో ఉన్నా వారి సేవ, అమ్మ బిడ్డల సేవగానే భావించాడు. చుట్టూ ఉన్న అందరి వ్యక్తిగత కష్టసుఖాలలో మమేక మైనాడు. వారికి భరోసాగా నిలిచాడు. వారికి వెన్నుదన్ను అయినాడు.
ఎవరైనా బాధలలో ఉన్నారంటే అక్కడ రామన్నయ్య వాలి పోయేవాడు. వారి కష్టనష్టాలు తనవిగా భావించి పరిష్కరించేవాడు. ఆర్థిక బాధలలో ఉంటే ఆదుకునేవాడు. అనారోగ్య బాధలైతే మార్గదర్శనం చేసేవాడు. మార్గదర్శనం ఏమిటి ? చేయి పట్టి ఆ ఆపద దాటే వరకు ప్రక్కనే ఉండేవాడు. అందుకే అందరికీ, ముఖ్యంగా వయసుమళ్ళిన వారికి అత్యంత ఆత్మీయుడైనాడు. అభాగ్యులకు రక్షకుడైనాడు.
స్వానుభవంమీదే రామన్నయ్య వ్యక్తిత్వాన్ని దర్శింపచేస్తాను. మా బాబాయి గారు శ్రీ కొండముది హనుమంతరావు గారు శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య ఫౌండేషన్ తరఫున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సమావేశ మందిరాన్ని పునర్నిర్మాణం కావించి సుందరీకరించ సంకల్పించినప్పుడు రామన్నయ్యే ఆ కార్యభారం శిరస్సున ధరించి పూర్తిగావించాడు.
శ్రీ కొండముది సుబ్బారావు అన్నపూర్ణమ్మ గారల స్మారక సమావేశ మందిరంగా నామకరణం చేయించాడు. ఎన్నో సందర్భాలలో మాకు ఊతకర్ర అయినాడు. మా అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు రామన్నయ్య చేసిన సహాయం మరువలేనిది. కుటుంబ మూలస్తంభం కూలిపోతే ఆ కుటుంబాలకు ఆర్థికంగా ఊత మిచ్చాడు.
“నిజమైన ధనం ఎదుటివాడి మనసు నిండి పొంగిన ఓ నీటి బిందువు” అని నమ్మిన మా మామయ్య చలపతిరావు గారికి వారసుడు. వ్యాపార పరంగా శిఖరాగ్రాలు అధిరోహించినా, అంబరాన్ని చుంబించినా అహంకారం దరిచేయనీయని నిగర్వి, స్నేహశీలి. తన వ్యాపారసామ్రాజ్యంలో అందరికీ ఆశ్రయం కల్పించి సమసమాజాశ్రమం నిర్మించి ఎందరికో మార్గదర్శకుడైనాడు.
అసిధారావ్రతం లాంటి అమ్మ సంస్థ నిర్వహణలో రెండు దశాబ్దాల పాటు సోదరులందరిని మెప్పించాడు. కళాశాల నిర్వాహకుడిగా భళీ అనిపించాడు. అనేక నిర్మాణాలను పర్యవేక్షించి వాటి భౌతిక రూపాలలో సజీవుడైనాడు. జిల్లెళ్ళమూడి గ్రామస్థుల మనసులు చూరగొని శెభాష్ అనిపించాడు.
బాపట్లలో మెడికల్ షాపు నడిపి డాక్టర్ విద్యాసాగర్ గారికి చేదోడై బాపట్ల వారికి ఆరోగ్య ప్రదాన కార్యకర్త అయ్యాడు. ఇన్ని విజయాలు సాధించి అప్పికట్ల గ్రామానికి గర్వకారణమైనాడు. తల్లిదండ్రులను సేవించి తరలించి పితృ యజ్ఞాలు సక్రమంగా నిర్వహించి తృప్తి చెందాడు.
రామన్నయ్య “సుగుణాభిరాముడు” అయి సుగుణక్కయ్యను జీవనపథంలో విజయవంతంగా నడిపించాడు. అందరింటిని నడుపుతూ అందులో భాగంగా తన కుటుంబాన్ని నడిపి సంతానం రహి, దీప్తి లను జీవన పథంలో సక్రమంగా నిల్పి సంతృప్తి పడ్డాడు. అందరింటి అనుజులతో పాటు తన తోడబుట్టిన వారికి జీవితమంతా తోడైనాడు.
ఏ శుభముహూర్తాన జిల్లెళ్ళమూడిగడ్డ మీద అడుగు పెట్టాడో జీవితం అమ్మకు అంకితం ఇచ్చి అందుకోలేని లోకాలకు తరలి వెళ్ళాడు. రామన్నయ్య చెట్టు అంత ఆకారమే కాదు. చెట్టులాగే ఉపకారబుద్ధి కలవాడు. అందుకే రామన్నయ్యను చూస్తూ ఉంటే ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇచ్చిన మహావృక్షం కళ్ళ ముందు కదలాడుతున్నది.
మరొక్కమాట. చెట్టు లాంటి రామన్నయ్య భౌతికంగా దూరమైనా, మన మనస్సులలో చిరంజీవిగా ఉంటాడు. చెట్టు నేలకు ఒరిగినా, ఆ ఫలాలు అస్వాదించిన మనకు దాని రుచి హృదయంలో పదికాలాలపాటు పదిలంగానే ఉంటుంది. రామన్నయ్య జ్ఞాపకాలూ అంతే. అమ్మ సేవచేసే వారందరిలో నిరంతరం రామన్నయ్య మనకు కనబడుతూనే ఉంటాడు.
రామదాసు రాముడి భక్తుల సేవలో నిత్యం ఆ భద్రాచల రామాలయ ఆవరణలో ఉన్నాడు అని కదా! ఇప్పుడు మన రామన్నయ్య కూడా భౌతికంగా ఇక్కడ లేకపోయినా అమ్మ బిడ్డలకు సహాయం చేసే ప్రతివారిలో ఉంటాడు అనేది నా ప్రగాఢ విశ్వాసం.
సుగుణక్కయ్యకు, రహికి, దీప్తికి, తోడబుట్టిన వారికి, ఇంట అడుగిడిన అల్లుడూ, కోడలికి, బంధువులకు, హితులకు స్నేహితులకు, సన్నిహితులకు, ఆశ్రితులకు అందరికీ అమ్మ సాంత్వన కలిగించుగాక. రామన్నయ్యకు అక్షరనివాళి, అశ్రునివాళి సమర్పిస్తూ….