అమ్మ తత్వచింతన సదస్సు జిల్లెళ్ళమూడిలో జరిగిన తరువాత విశాఖలో కూడా నిర్వహించాలన్న సంకల్పాన్ని కలుగజేసింది అమ్మ. విశాఖ లలితా పీఠంలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారి సమక్షంలో జూన్ 9, 10 తేదీలలో అమ్మను గురించిన తత్త్వచింతన ఏర్పాటు జరిగింది. అందులో భాగంగానే ఈ వ్యాసాన్ని సమర్పించటం జరిగింది.
అమ్మ పడుగు పేకలా మా జీవితాలలో నిండిపోయింది. మా జీవితాలనుంచీ అమ్మను వేరు చేస్తే పడుగు పేక విడిపోయిన నూలుపోగుల మాదిరిగానే మా జీవితాలు మిగులుతాయి. భగవంతునియందు మనకు గల భక్తి, ప్రేమ, ఆరాధన అంతా ఒకే వైపుకు సాగాలి. పర్వతం మీద నుంచీ ప్రవహించిన నీరు నలువైపులా చెదిరిపోతే నీరు తేలికగా ఇంకిపోతుంది. పర్వతం మీదనుంచి పడే నీరు ఒకే పక్కగా ప్రవహిస్తే మహానదిగా మారి మానవుని పిపాస తీరటమే కాక సేద్యానికి, విద్యుత్తుకు ఇంకా అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. మనలోని భక్తి భావము నిలకడగా వుండక నలువైపులా చెదరిపోతే మనలోని భక్తి ఇగిరిపోతుంది. అలాకాకుండా మనలోని భక్తి, ఆరాధన ఒకేరకముగా ఉద్భవించిసాగి నిలకడగా వుంటే మనలోని జ్ఞాన పిపాస తీరుతుంది. ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేయటం కాక మన జీవితాల లక్ష్యం, గమ్యం ఒక్కటై సాగినప్పుడు భగవంతుడు నైతికంగా, సాంఘికంగా, ఆర్థికంగా కూడా మనకు సహాయపడుతాడు.
ఈ కలియుగంలో దుఃఖ నివారణార్థం ప్రపంచానికి అవసరమైనది సాధన, తపస్సు కాదు. అందరినీ ప్రేమించే గుణం, అందిరిపై కారుణ్యం. అమ్మ ప్రేమస్వరూపిణి తనను ఎవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా, దూషించినా, ద్వేషించినా, హింసించినా అందరినీ ప్రేమించే ఉదాత్త మనస్విని అమ్మ. మనయోగ్యతలతో అవసరంలేని అవాజ్యనమైన, అనిర్వచనీయమైన, అనంతమైన అమ్మ తత్వం అమృతత్వం.
“దళమైన పుష్పమైనను
ఫలమైనను, సలిలమైన బాయని భక్తిన్
గొలిచిన, జనులనర్వించిన
నెలమిన్ రుచిరాన్న ముగా యేను భుజింతిన్”
అని కుచేలోపాఖ్యానములో శ్రీకృష్ణుడు నుడివినట్లుగా అమ్మ మననుంచి ఏమీ ఆశించకనే ప్రేమతో మనలో సమర్పణ భావం అంకురింపచేసి మనకు ముక్తి మార్గాన్ని చూపించింది. ‘పితామహస్య జగతోమాతాధితాపితామహః’ నేనే తల్లిని, నేనే తండ్రిని అన్నాడు పరమాత్మ. పితృ స్వరూపం, మాతృస్వరూపం ఆయనే ధరిస్తుంటాడు. ఏది ఎప్పుడు ఆవసరమవుతుందో, ముచ్చటవుతుందో ఆయనకే తెలియాలి. ఇప్పుడు మాతృ స్వరూపంగా అమ్మ అవతరించింది.
“ఎక్కడైనా ఆధ్యాత్మిక గగనతలంలో నెలవంకను చూడగలం. కానీ జిల్లెళ్ళముడిలో మాత్రమే పూర్ణచంద్రుణ్ణి చూడగలం” అన్న డాక్టరు శ్రీపాదవారి వచనం ప్రత్యక్ష సత్యం.
విశ్వంలోని మాధుర్యాన్ని, మమతానురాగాల్ని దర్శింపచేయగలంగటం అమ్మకే సాధ్యమౌతుందనిపిస్తుంది. అంతర్మథనంలో అంతర్యామిని దర్శించగలగటం ఆధ్యాత్మికత యొక్క విశిష్టత. “సర్వరాశి పరిత్యరాజ అద్వైతే పరితిష్టతి”. సంసారంలో వుంటూ కర్మయోగాన్ని అనుష్టించవచ్చు. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే ముఖ్యం అని అమ్మ మనకు ఆచరించి చూపించింది. కర్మ చేయకుండా వుండలేము. కర్మ చేయకుండా వుండాలనుకోవటమే కర్మ. అందుకే అమ్మ “సంసారం అంటే కోట లోపలి వుండి యుద్ధం చేయటం, సన్యాసం అంటే కోట వెలుపల వుండి యుద్ధం చేయటం” అన్నది. అందుకే ఆత్మజ్ఞాని అన్నవాడు కర్మలు వదిలి పెట్టడు.
సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖము వస్తే కృంగిపోవటమే కాకుండా ఏది జరిగినా ఒకేలా స్పందింపగలగటం ‘స్థితప్రజ్ఞ’ లక్షణం. అట్టి ప్రజ్ఞయోగులకు, మహాత్ములకు మాత్రమే సాధ్యం. కానీ వారి కరుణామృత కిరణాలు మనమీద ప్రసారమైనప్పుడు వెలుగు – చీకటి, గొప్ప- బీద, కష్టం-సుఖం అనే ద్వంద్వాలు పోయి ఒకేలా సందించగల్గుతాము.
పట్టాభిషేకానంతరం రాములవారు వానర సేనను సంభావించినప్పుడు వానరులు ఒక్కొక్కరు ప్రభువు నన్ను చూచి నవ్వాడని, నావేపే చేతులు చాచాడని, నన్నే పలకరించాడని, నన్ను మెచ్చుకున్నాడని పలుపలు విధాల సంతోషించారు. అదే విధంగా అమ్మ సమక్షంలో ఎందరు కూర్చున్నా అమ్మ నన్ను చూస్తోందని, నన్ను చూచే నవ్విందని, నన్నే పలకరించిందని ప్రతి ఒక్కరం భావించేవారము. అంతమటుకు మనలో వున్న ఆర్తి, ఆవేదనలు తీరిపోతాయి. మన సమస్యలకు చక్కని పరిష్కారాలు లభించేవి.
శ్రీకృష్ణుడు గోప కాంతలతో రాసకేళి సలిపేటప్పుడు “ఆత్మారాముడయ్యును, గోప సతులతో అందరకు అందరై నిజ ప్రతిబింబముతోడన్ గ్రీడించు బాలుర పోలిక కేళి సలిపెనట” భాగవత దశమస్కందములో పోతనగారు శ్రీకృష్ణుని గురించి. వర్ణించారు. అట్టి భావం కలుగ చేయటం దివ్య పురుషులకు మాత్రమే సాధ్యం. కానీ ఇతరులకు అనితరసాధ్యమే అవుతుంది. అమ్మ నెమ్మదిగా మాట్లాడినా గదిలో వున్న పాతికమంది కూర్చన్నా వారి సమస్యలకు తగిన విధంగా చెప్పినట్లే వుండేది. అందరి సమస్యలు ఒకటి కాకపోయినా, వాటికి పరిష్కార మార్గాలు లభ్యమయ్యేవి.
“యస్యదే వేదపరాభక్తిః యధాదేవేతథాగురో:
తస్యతే కధితాహ్యర్దా: ప్రశాంతే మహాత్మనః ||”
దైవం, గురువు ఒకటే. గురువు ఉపదేశించిన మంత్రం కూడా గురువు కంటే భిన్నం కాదు. అందుకే అమ్మ “నీకు ఇచ్చినది తృప్తిగా అనుభవించు, నీకున్నది ఇతరులకు ఆదరణగా పెట్టడం, అంతా వాడే చేస్తున్నాడని నమ్మడం, ఇదే సందేశం అన్నది. అమ్మ బిడ్డలందరం దానికై ప్రయత్నిస్తే మనకు అమ్మ అనుగ్రహం వల్ల అమృత తుల్యమైన ఆనందస్థితి కల్గుతుంది.
ఒక గమ్యానికే పెక్కు మార్గాలున్నాయని వేదం ఒక్కటే చెప్తున్నది. అట్లే అమ్మ ఎవరినీ వారివారి మార్గాలను మార్చుకోమని ఎప్పుడూ చెప్పలేదు. నీరు నిన్న ప్రదేశం వచ్చే వరకూ ఏవిధంగా అల్లల్లాడుతుందో అదే విధంగా ఒక వస్తువు యొక్క వాస్తవస్థితి తెలియనంతవరకూ బుద్ధి కూడా అల్లాడుతుంది. నిజం తెలిసిన తరువాత శాంతిని పొందుతుంది. రామానుజులు “నేను ఏ పనిచేసినా, మాట్లాడినా తలచినా నీ ముఖం విప్పారాలి. దీనిని నేను అనుభవించాలి. దాని ద్వారా నా ముఖం వికసించాలి” అంటారు. భగవంతునితో తాదాత్మ్యం చెందటానికి అందరం కృషి చేయాలి. ఆయనతో తాదాత్మ్యం చెందిననాడు నీవు, నేను అని వుండదు. అంతా ఒకటే. అందుకే ఉ పనిషత్తులలో ‘అహం బ్రహ్మాస్మి’ అని చెప్పబడింది.
జన్మేషది మంత్రతపః |
సమాధిజాః సిద్ధయః II
సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చునంటాడు పతంజలి మహర్షి. అమ్మ ఎటువంటి పూజలు చేయలేదు. వ్రతాలు, నోములు నోచలేదు. అమ్మ “తల్లి గర్భములో పడ్డప్పటి నుంచీ వాళ్ళ కుటుంబములో ఎందరెందరో కాలం చేసారని చరిత్ర మనకు తెలియజేస్తోంది. వారందరికీ తాను లోకంలోకి రాకపూర్వమే సద్గతి కలుగజేసింది. భూమిమీద అవతరణ జరిగినప్పటి నుంచీ ఎందరికో సద్గతి కలుగచేయటమే కాక, మనలాంటి వారందరికి మంచి మార్గాన్ని చూపించి తన ఒడిలో ఓలలాడించింది. అమ్మ లాలనలో, పాలనలో మన జీవితాలను పండించింది.
రాముడు ఏకపత్నీవ్రతం, రాజధర్మం కోసం అవతరిస్తే, కృష్ణుడు యుద్ధం ఎలా చేయాలో నేర్పటానికి వచ్చాడు. ఈ కలియుగంలో తల్లి ధర్మంకోసం తాను అవతరించానని నిర్ద్వందంగా ప్రకటించింది. మీకు అందరూ సమానమేనా అమ్మ? అని ఒకరు ప్రశ్నిస్తే, ‘నాకు బిడ్డగా కాక మరొకగా కనపడరు. నేను రాజరాజేశ్వరినని కానీ గురువునని కానీ ప్రకటించలేదు. నేను తల్లిని మీరు బిడ్డలు. నాకు అంతా శిశువులే కాని శిష్యులు లేరు, అని తన సర్వమాతృత్వాన్ని వెల్లడి చేసింది. పెట్టుటలో లోటుండదు. పంచటంలోనే తేడా. జ్వరంగా వున్న పిల్లవాడు అడిగినా వాడికి తల్లి ఆవకాయ అన్నం పెట్టదు. రొట్టె, సగ్గుజావ ఇస్తుంది. చిన్న పిల్లవాడికైతే గుప్పెడు కొంచెం, పెద్దవాడికైతే దోసెడు, అలా వారికి సరిపడా పెడ్తాను. వాడికి తక్కువ పెట్టానని వాడి మీద ప్రేమలేనట్టు కాదు కదా! అని, నాకు అందరూ సమానమే అని తనతత్వమైన మాతృత్వాన్ని పలురీతుల ప్రకటించింది అమ్మ.
అమ్మ దగ్గర కూర్చుని వుండగా అమ్మ ఒక స్త్రీకి బట్టలు పెడ్తూ బొట్టు పెట్టబోతే నాకు ఆ అర్హతలేదని ఆమె చెప్పింది. దానికి అమ్మ బొట్టు తల్లి పెట్టినదే, భర్త మరణించనంత మాత్రాన బొట్టు పెట్టుకోకూడదని అంటూ ఏమీలేదని తాను బొట్టుపెట్టి మరీ ఆమెకు బట్టలు పెట్టింది. ఇది 1970లో జరిగిన సంఘటన. ఆ రోజు నుంచీ మా ఇంటికి ఎవరు వచ్చినా నేను, బొట్టు అమ్మ ప్రసాదమని, బొట్టు పెడ్తున్నాను. మా విశాఖ అమ్మ మందిరంలో కూడా భర్తలేని స్త్రీలు ఎవరు వచ్చినా భర్త గురించి భావన వున్నంతకాలం ఆ స్త్రీ పునిస్త్రీయేనని, అమ్మ చెప్పిందని చెప్తాను. అమ్మ నిఘంటువులో విధవ అన్నమాటే లేదని, అందరూ సధవ లేనని అమ్మ చెప్పిన విధంగా మనం ఆచరించి చూపటం మన విధి అని చెప్తాను. అప్పుడే మనం అమ్మబిడ్డలంగా మనగలుగుతాము. దుర్గాష్టమికి కూడా అందరికీ బొట్టు పెట్టే అమ్మప్రసాదం ఇస్తాను. అమ్మ బిడ్డలందరినీ కోరుకునేదొకటే, అమ్మబిడ్డలుగా మనం జీవించాలంటే కొంతలో కొంత అమ్మ చేతలను, సూక్తులను మనం ఆచరణలో పెట్టగలగాలి.
అమ్మ గురించిన చింతన, ఆలోచనలు మన హృదయాలను మధించి ఉన్నత శిఖరాలకు గొనిపోతాయి. అమ్మ బిడ్డలందరం కలుసుకున్నప్పుడు అమ్మ గురించిన అనుభూతులను నెమరు వేసుకుంటూ కొత్తవారికి అమ్మ గురించి తెలియజేయటం కంటే మించిన తత్వచింతన వేరే ఏముంటుంది? అప్పుడే ఈ తత్త్వ చింతన సదస్సుల పరమార్థం గోచరం అవుతుంది. అందరం ఆ మార్గాన్ని పయనిస్తూ మన జీవితాలకు ఒక గమ్యాన్ని నిర్దేశించుకుందాము.
– జయ మాతా-