ఎక్కడ నీ మనస్సు నిర్మలమూ ,నిశ్చలమూ అవుతుందో, ఏది నీకు జీవిత కాలంలో ప్రపంచంలో అత్యంత ప్రేమపాత్రమూ, మిక్కిలి విలువైనదీ అని పదే పదే అనిపిస్తుందో- అదే నీ దైవం అని నిశ్చయించు కోవచ్చు. ఎవరిని చూస్తే నీ మనస్సులోని బాధలూ, భయాలూ సూర్యరశ్మి సోకగానే కరిగిపోయే పొగ మంచులా, పెనుగాలి తాకగానే చెదిరి పోయే మేఘంలా దూరమవుతాయో, ఎవరి సన్నిధిలో నీవు అనిర్వచ నీయమైన తృప్తినీ, శాంతినీ పొందుతావో, ఎవరి మాట నీకు వెలుగుబాట అవుతుందో, ఏ రూపం నీ మనస్సులో గాఢంగా నాటుకుంటుందో,ఏ నామం నీవు మరిచిపోదామనుకున్నా మరపు రాదో- అది చెట్టు గానీ, పుట్టగానీ, భావం కానీ, వ్యక్తి గానీ అదే నీ దైవం.
ప్రతివాడు తన జీవన యాత్రలో అట్టి చోటును, వ్యక్తిని చేరుతాడు.కొందరు మాకు ఇట్లాంటి పరిస్థితి కలగ లేదంటారు. అంటే వారి ప్రయాణం ఇంకా పూర్తి కాలేదనీ, గమ్యస్థానం చేరలేదనీ,జీవితానికి ఇంకా సార్ధక్యం సిద్ధించ లేదనీ అనుకోవాలి.పై కారణాల చేత తన దైవాన్ని గుర్తించిన వాడు తన ప్రయాణం అయిపోయినట్లు తన గమ్యస్థానం సిద్ధ ప్రాయమని భావించవచ్చు. క్రమంగా కాలానుగుణంగా అట్టివాడు అద్వైత స్థితిని అంటే దైవంతో అభేదాన్ని అనగా అన్నీ తానే అని అనుభవాన్ని పొందుతాడు.
అమ్మను నేను మొదటిసారి చూచినప్పుడు అమ్మను నేను చూడడం ఆలస్యంగా జరిగినందుకు నా దురదృష్టాన్ని తలంచుకొని విచారించాను.కొంతసేపటికి అప్పటికయినా చూడగలిగినందుకు ఎంతగానో సంతోషించాను.అమ్మను చూసాక అంతకు పూర్వం నాలో తీరని కోరికగా ఉండే ”మహాత్ముల సందర్శనం, వారి సన్నిధిలో కొంత కాలం గడపడం అనేది తీరినట్లుగానూ, ఇంక ఏతీర్ధాలకూ ఏ క్షేత్రాలకూ, ఏ మహాత్ముల సన్నిధికి వెళ్లనక్కర్లేదనీ, ఇంత కంటే పొందవలసిన తృప్తి,శాంతి ఉండబోదనీ నిశ్చయించుకున్నాను.నేను నా స్వస్థానాన్ని పొందినట్లు భావించాను.అమ్మ ఆదరణ నన్ను నవమాసాలూ మోసి కని పెంచిన తల్లి వాత్సల్యాని కన్న ఎంతో విశిష్టమైనదిగా అనిపించింది.అమ్మ వర్షించే వాత్సల్యం పూర్వం కన్నదీ విన్నదీ కాదు.ఊహకి కూడా అందేది కాదేమో.
అమ్మ అందరికి అన్నింటికీ అమ్మ అవునో కాదో నా పరిమితమైన మనసుకు అందే విషయం కాదు కాని ”అందరూ నా బిడ్డలే ”అని ఆమె అనడమే కాకుండా వాళ్లను వాళ్ల వయసుతో నిమిత్తం లేకుండా, గడ్డాల వారయినా పసిపాపలయినా, యువకులయినా, స్త్రీలయినా ఏ అరమరిక లేకుండా లాలిస్తూ ఉంటే, ‘అమ్మా’ అని వాళ్లందరూ ఆమె ప్రేమ పాశబద్ధులై ఆనందాశ్రువులు రాలుస్తుంటే ఆమే అందరికి ”అమ్మే”అనిపిస్తుంది.ఆమె అపరిమితానురాగం సమ్మోహనాస్త్రంలా వశీకరిస్తుంది. ”ఎన్నేళ్లుగానో అమ్మను చూడాలనుకుంటున్నా”నని, ఈ జీవితంలో చూస్తాననుకోలే”దని అసంఖ్యాకంగా జనం అనే మాటలు వినేటప్పుడు అంతమంది హృదయాల్ని పాలించే ఆమె ప్రభావానికి ఆశ్చర్యం కలుగుతుంది. అమ్మను చూడడానికి వచ్చే వాళ్లు ”అమ్మా! మీరు ఇంత మందికి అన్నదానం చెయ్యడం సామాన్యమా? అంటే ”తల్లి బిడ్డలకు అన్నం పెట్టడంలో విశేషం ఏముంటుంది నాన్నా, అయినా నేను పెట్టడం ఏముంది?వాళ్ళకు అన్నం ఇక్కడ ప్రాప్తం ఉండి తింటున్నారు’అని అమ్మా! నీవు రాజరాజేశ్వరివా? అంటే ‘నీవు కానిది నేనేదీ కాదు’ అని అన్నప్పుడు ఆమె అద్భుత శక్తి,కర్తృత్వం లేని భావనా ముగ్ధుల్ని చేస్తాయి.అనంతమైన శక్తి మానవాకృతిలో ఇట్లా జీవించడం మానవ జాతి చరిత్రలో అపురూపమైన విషయం.ఎందరో యోగులూ, సిద్ధులూ కారణజన్ములుగా కాల ప్రవాహంలో ప్రయాణించి ఉండవచ్చు. కాని అమ్మగా అందరిచేత ఆరాధింపబడిన అద్భుతావహమైన వ్యక్తిత్వం లేదేమో.ఆమె లోని ప్రశాంతీ, అపరిమితాను రాగమూ, ఉజ్జ్వలమైన తేజస్పూ, ఉదాత్తమయిన భావసంపదా కనీ వినీ ఎరుగనివి….
ఆ అనిర్వచనీయమైన దివ్యశక్తి మానవ రూపంలో వాత్సల్యామృత వర్షిణి ‘అమ్మ’గా అవతరించింది మొదలుగా నేటి వరకూ ఎన్నో మహిమలు జరిగి ఉంటాయి.విశిష్టమైన వ్యక్తిత్వము గల ఆమె జీవిత మహోదధిలో ఎన్నో అసాధారణమైన సంఘటనలు తరంగాలుగా రూపు దాల్చి ఉంటాయి. వాటిలో చాలా భాగం సామాన్యులూ, మాన్యులూ కూడా గుర్తించకుండా ఉండవచ్చు. ఆ దివ్య శక్తి యొక్క విలాసం ఇదమిత్థమని సంపూర్ణంగా గుర్తించడం, వాగ్రూపంలో వ్యక్తం చేయడం అసాధ్యమే.ఎందరికో ఎన్నో సందర్భాలలో ఆమె దివ్యానుభూతులను ప్రసాదించి ఉండవచ్చు.తన విరాడ్రూపాన్ని చూపించి ఉండవచ్చు.పరిమితమైన కాలంలో అపరిమితమైన, అసాధారణమైన శక్తిని ప్రదర్శించి ఉండవచ్చు.వానిలో చెదురు మదురుగా ఏ కొన్నో మాత్రమే గుర్తింపబడి ఇంతవరకూ ప్రకటించబడి ఉండవచ్చు.వానిలో అత్యల్పమైన సంఘటనలను మాత్రమే అల్పసంఖ్యలో పొందుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను.
మాతృశ్రీ జీవిత మహోదధిలో ఎన్నో సంఘటనా తరంగాలు లేస్తూ ఉంటాయి.వానిలో ఏ తరంగం ఎంత లోతు నుండి ఎంత ఉవ్వెత్తుగా లేచిందో,ఎన్ని సందేశ రత్నాలను లోకంలో వెదజల్లిందో,ఎంత మాలిన్యాన్ని కడిగి వేసిందో ఎలా తెలుస్తుంది? రత్న గర్భంలో ఎన్ని అనర్ఘ మణులున్నాయో అంతరాంతరాల్లోకి దిగి పరిశోధించిన వారికి తప్ప అందరికీ తెలియదు కదా! ఆమె జరిగిన తన జీవితకాలంలో ఎన్ని మోడు వారిన జీవితాలలో వసంత శోభలను వెలార్చిందో,భయ విహ్వలాలైన జీవితాలలో అభయామృతాన్ని కురిపించిందో, అంధకారావృతమైన హృదయాలలో వెన్నెల వెలుగులను వ్యాపింపజేసిందో గమనించడం కష్టం. ఎంత బడబాగ్నిని తనలో ఇముడ్చుకున్నదో, ఎంత హాలాహలాన్ని మింగుతున్నదో కూడా అంతుపట్టని విషయమే.ఎల్లప్పుడూ నిస్తరంగ సముద్రంలా, నిమ్మకు నీరెత్తినట్లు నిండుగా చల్లగా ఉంటూ అందరికీ హాయిని ప్రసాదించే’అమ్మ’ అద్వితీయ జీవితవైభవం వర్ణనాతీతం.అనుభవానికి అందినంత ఆస్వాదించడమే మన వంతు.
అమ్మ ”రూపం పరిమితం శక్తి అనంతం” అని, ”తెలియనిది తెలియజెప్పడానికే ఈ రాక” అని,” అమ్మంటే అంతటా నిండి ఉన్న శక్తి” అనీ,” సంపూర్ణావతారం కాదు సంపూర్ణత్వం”, అని అనేక సందర్భాలలో మరుగు పరిచినా మరుగు పడని , అనిర్వచనీయమైన శక్తిని గూర్చి వాగ్రూపంలో అనుగ్రహించి ఉన్నది.అవి అన్నీ మానవాకృతి ధరించిన తనను గూర్చి కాక ‘అంతటా నిండి ఉన్న శక్తి’ని గూర్చి చెప్పిన మాటలని ఆమె ఎంత దాట వేయడానికి ప్రయత్నించినా అసాధారణమైన కొన్ని సంఘటనలను ఆమె బిడ్డలకు ప్రసాదించిన దివ్యాను భూతులను బట్టి ఆలోచిస్తే ఆ లక్షణాలన్నీ ‘జిల్లెళ్లమూడి అమ్మ’ కు సరిపోతాయి అనిపిస్తుంది.
‘మీరు చూస్తే నేను కనబడను, నేను కనబడితేనే మీరు చూస్తారు ‘ అని అమ్మ అని ఉండడం చేత ఆమె అనుగ్రహిస్తేనే కాని ఆమెలోని ఏ కొలది శక్తినో కూడా మనం గ్రహించలేం అనిపిస్తుంది. లెక్క లేనన్ని సందర్భా లలో ఆమె అఘటన ఘటనా సామర్ధ్యం ప్రకటింపబడినా మానవమాత్రులు గ్రహించ గలిగిందీ, విశ్వసించ గలిగిందీ అత్యల్పమే.
- అమ్మ వివిధ దేవతా రూపాలలో దర్శనం ఇవ్వడం.
- నిరంతరాయంగా తనను చూడ వచ్చే వారికి ఆధివ్యాధులకు పరమౌషధం అయిన అన్నపూర్ణాలయం భోజనం సమకూర్చడం.
- కుగ్రామమైన జిల్లెళ్లమూడి ‘నిత్య కల్యాణం’ పచ్చతోరణంగా ఎల్లప్పుడూ పలు ప్రాంతాల నుండి వచ్చే జనసందోహంతో కళకళలాడుతూ ఉండడం.
- తాను అనుభవించే స్థిత ప్రజ్ఞ స్థితినే బిడ్డలకు క్రమంగా అలవరచడం.
- దూర శ్రవణ దూర దర్శనాదులు ఆమెకు అత్యల్పాలు కావడం.
- కనీసం పది గంటల కాలవ్యవధిలో జరుగ వలసిన మంత్రోపదేశం 3 గంటల కాలంలో ముగియడం.
- ఒక పంక్తిలో లక్ష మందికి పైగా జనం జిల్లెళ్లమూడిలో భోజనం చేసిన కనీ వినీ ఎరుగని స్వర్ణోత్సవ వైభవం.
- దర్శన, స్పర్శల చేత ఎందరికో అనిర్వచనీయ మైన తృప్తినీ, శాంతిని ప్రసాదించడం.
- పాద తీర్ధం- కుంకుమ ప్రసాదాలచే మృత్యు ముఖంలో ఉన్న వారు కూడా ఆధి వ్యాధుల నుండి దూరం కావడం.
- దుర్భరమైన శారీరక బాధలను, నక్సలైట్లను కూడా బిడ్డలుగా భావించడం.
- పంది పిల్లలూ, ముసలివారి ముఖాల్లోని ముడతలూ శవాలూ కూడా ఆమెకు ముద్దు రావడం- ‘పెరుగు పిల్లి ముట్టుకుందమ్మా’ అని ఒకరంటే-‘పరవాలేదులే పిల్ల ముట్టుకుంది’అని పిల్లిని కూడా బిడ్డగా తలంచడం.
- దేవతల దేవతగా అంటే- అన్నపూర్ణ, హనుమంతుడూ, లక్ష్మీ,శేషుడూ చివరకు వేంకటేశ్వరుడూ తన బిడ్డలే అని చెప్పడం, హైమకూ- హైమాలయానికి తల్లి కావడం.
- ‘ఈ కలిలో నాకాకలి లేదు.’ ‘నేను అన్నాన్ని వదలడం కాదు.అన్నమే నన్ను వదిలింది’ అంటూ ఇన్నేండ్లుగా అన్నం తినక పోవడం.
- అమ్మ ‘అనసూయ’గా అవతరించక పూర్వమే తాను చూసినట్లుగా కొందరిని గూర్చి చెప్పడం.
‘నాలో మీరు మానవత్వాన్ని చూస్తారు,మీలో నేను దైవత్వాన్ని చూస్తాను’. ‘మీరే నా ఆరాధ్యదైవాలు’ అంటూ సృష్టినంతటిని దైవంగా భావించడం.
- రెండేళ్ల వయసులోనే తనకంటే పెద్దవారితో ‘నేను నీకు అమ్మను’ అని చెప్పడం, ‘కుల భేదమే లేని నాకు గుణ భేదం ఎక్కడిది’అని అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని సమదృష్టితో చూడడం.
- ‘మూడు కాలాలూ వర్తమానమే’ అని ప్రకటించడం.
- ‘శుక్ల శోణితాలకేది కులమో అదే నా కులం’ అని ‘సర్వసమ్మతమైనదే నా మతం’ అని అసాధారణంగా అనితరసాధ్యమైన రీతిలో పలకడం.
- ‘తోలు నోరు కాదు కదా – తాలు మాట రావడానికి’, ‘మనసులో భావాన్ని తెలుసుకోవడానికి మాటలతో పని లేదు’. ‘సృష్టిలో జడమేమీ లేదు – అంతా చైతన్యమే, ‘చీమలో దోమలో కాదు భగవంతుడు, చీమగా దోమగా కూడా’ ‘సృష్టి అనాది – నాది’. ‘తృప్తే ముక్తి’ ‘బిడ్డలను కనడమే సాధన’, ‘అందరికీ సుగతే’ -అని తన అసాధారణమైన వ్యక్తిత్వాన్ని ప్రకటించి అభయ మీయడం.
ఇట్లాంటి అనేకానేక సంఘటనల మూలంగా ఆమె అఘటనాఘటన సామర్ధ్యాన్ని, అనంతమైన శక్తిని, అపురూపమైన వ్యక్తిత్వాన్నీ, అసాధారణ మేధా సంపత్తిని, అంతులేని సహనాన్ని ఆధారం చేసుకొని అమ్మను ‘మహిమాలయం’ అనడం వాస్తవమే కాని స్తవం కాదు.