అర్కపురీ దివ్యక్షేత్రము దర్శించిన ప్రతి ఒక్కరు అక్కడ కలిసిన అన్నయ్యలు, అక్కయ్యల అనుభవాలను తరచి తరచి ప్రశ్నించి, భిన్నమైన, భవ్యమైన, అనుభూతిని పంచుకొనుట అక్కడ జరుగుతున్న అతి సాధారణమైన విషయం. అయితే అమ్మ తనకు తానుగా భువనేశ్వరిగా, రాజరాజేశ్వరిగా ప్రకటించుకున్న ఘట్టములు ఎంతో ఆనందాన్ని కలుగ జేస్తుంటాయి.
గడిచిన వికృతి నామ సంవత్సర కార్తీకమాసంలో, నా శ్రీమతితో జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు గోపాలన్నయ్య (శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తి వివరించిన సంఘటన ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అది అమ్మపాకలో ఉన్నప్పటి వైనం ఒకానొక పర్వదినాన ఒక పెద్దమనిషి అమ్మ వాకిటి ముంగిట కూర్చుని ఎంతో శ్రద్ధగా పుస్తకం పట్టుకుని ఉపనిషత్ పారాయణ చేసుకుంటున్నారు. ఆ ఉపనిషత్ శ్లోకాలలో ఎంతో నిమగ్నమయి ఉన్నారు. అటువైపుగా వస్తున్న అమ్మ గోపాలన్నయ్యతో సాక్షాత్తు బ్రహ్మస్వరూపాన్ని ఎదురుగా పెట్టుకుని దాన్ని చిత్తు కాగితాలలో వెతుక్కుంటున్నాడు” అని అంటూ మందహాసంతో అతని వైపు అలవోకగా చూస్తూ నిష్క్రమించింది.
ఈ కోవకు చెందిన ఒక సంఘటన. దాదాపు 1985వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావుగారు, బ్రహ్మశ్రీ పార్థసారధి అయ్యంగార్ గారు అమ్మ సన్నిధిలో కూర్చుని ఉండగా అమ్మ నన్ను లలితాసహస్రం పారాయణం చేయమని ఆదేశించినది. ప్రార్థన శ్లోకంతో మొదలు పెట్టి పారాయణ సాగిస్తున్నాను. మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిణి నామం దగ్గరకు లెక్కలేదు. వచ్చినంతనే అమ్మ నన్ను ఆపమన్నది. టక్కున ఆపి అమ్మ వైపు చూస్తూ ఉండిపోయాను.
బ్రహ్మశ్రీ రంగారావుగారిని ఉద్దేశించి, అమ్మ “నాన్నా ఆ నామమునకు అర్థం చెప్పు అంది. బ్రహ్మశ్రీ రంగారావుగారు పులకింతతో “అమ్మా! మహాకల్ప సమయమందు సమస్త జగుత్తలు జలమయి నప్పుడు లయకారకుడైన మహేశ్వర ప్రభువు విలయతాండవ సౌరభ్యంతో నర్తించుచున్న మహాతరుణం అది. ఆ మహాతాండవ ప్రభంజనా వైశిష్యము. ఆ మహోగ్ర విలసనము వర్ణనాతీతము. అది చూచినవారు గాని, సాక్షీభూతులు గాని ఎవ్వరూ లేరు. ఒక్క లలితా పరమేశ్వరీ పరాభట్టారికామాతృమూర్తి తప్పఅని వారి విశదీకరించారు. అటువంటి విశిష్ఠతతో గూడిన ఆ నామ ప్రాశస్త్యం విని సంభ్రమాశ్చర్యభరితులమై యున్నాము.
అంతలో శ్రీ పార్ధసారధి అయ్యంగార్గారు “అమ్మా….. ఒక సందేహం” అని అమ్మ వైపు చూశారు. “ఊఁ” అని తలపంకిస్తూ “ఏమిటీ నీ సందేహం?” అని అడిగింది.
శ్రీ పార్థసారధి అయ్యంగార్ “అమ్మా….!!” ఆ మహేశ్వర మహాకల్ప మహాతాండవ నాట్యమునకు నువ్వు సాక్ష్యమేనా’ అని అడిగారు. నిర్వికల్పమునకు రాశీభూతమైన అమ్మ అత్యంత సాధారణశైలిలో, ప్రసన్నతతో గూడిన కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవితయైన అమ్మ “అవును నాన్నా! దానికి నేను సాక్ష్యమే” అని నిర్ధారించినది.
ఇటువంటి మహిమాన్వితమైన ప్రసంగ విశేషం అట్టి మహానుభావులు మధ్యన మాతృశ్రీ సన్నిధిని పొందగలగడం పూర్వజన్మ సుకృతఫలంగా తల్చుకుంటూ ఈ సంఘటన ఎన్నిసార్లు ఎంతమందికి తెలియచేశానో లెక్కలేదు.
ఈ సంఘటన శ్రీమతి వసుంధరక్కయ్యతో పంచుకున్నప్పుడు దీన్ని అక్షరబద్ధం చెయ్యమని ఆమె ఆదేశించినది. అందుకే ఈ ప్రయత్నం.