1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మహోపదేశం

మహోపదేశం

Brahmandam Vasundhara
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : November
Issue Number : 4
Year : 2011

ఆచరణాత్మక ప్రబోధాన్ని అందించే అమ్మ జీవితమే ఒక సందేశం. తోలు నోరు కాదు గదా తాలు మాట రావటానికి అని అమ్మ చెప్పినట్లుగా అమ్మ ప్రతిమాటా మంత్రమై, మహామంత్రమై మహోపదేశమయింది.

అమ్మకు జన్మనిచ్చి మనకు అందించిన పుణ్యమూర్తి రంగమ్మగారు అమ్మకు మూడు సంవత్సరాల వయస్సులోనే పరమపదించింది. అమ్మకు మాటలు వచ్చీరానీ వయస్సు. ఆ వయస్సులోనే అందరూ దుఃఖపడుతుంటే “దైవం పంపిన మనిషి దైవంలోకి పోతే మధ్య మనకు ఏడుపు ఎందుకు తాతయ్యా !” అని చిదంబరరావు తాతగారిని ప్రశ్నించింది. ప్రశ్నరూపేణ ఆ వయస్సులోనే అమ్మ మనకందించిన మహోపదేశమది.

అమ్మకు 5 సంవత్సరాల వయస్సులో పోలీసు మస్తాన్తో సంభాషిస్తూ “మాట అంటే ఏమనుకున్నావ్, మారుమాట లేని మాట. ఆ మాటనే మంత్రం అంటారు” అని అమ్మ పలికిన ఆ వాక్యమే అతని జీవితానికి మహామంత్రమై ఎన్నో అనుభవాలను ప్రసాదించింది. అంతేకాదు. ఆనాడే “అందరికీ సుగతే” అని అమ్మ హామీ ఇచ్చింది. ఆ హామీయే అతని జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది.

అమ్మ ప్రబోధం సంభాషణ పూర్వకంగానే ఉంటుంది. ఒకరోజు కొండముది రామకృష్ణఅన్నయ్య అమ్మతో సంభాషిస్తూ “అమ్మా! నిన్ను నమ్ముకుని నీ సన్నిధికి చేరాం కదా! అందరికీ సులభసాధ్యమయిన సాధన ఏదయినా చెప్పమ్మా ! మాకు ఏఉపదేశమూ చెయ్యక పోతివి. మేము ఏ సాధనా చెయ్యటం లేదు. కాలమేమో గతించిపోతున్నది.

ఎట్లా అమ్మా!” అని అడగటం జరిగింది. అమ్మ ప్రసన్నంగా నవ్వుతూ “అయితే సరే, మీకు నేను పెట్టిందేదో తిని హాయిగా ఉండండి. నేను ఇచ్చిందేదో యిక్కడకు వచ్చిన పదిమందికీ ఆదరణతో పెట్టండి. ఇదే మీకు సాధన”.. అని చెప్పింది. ఈ సాధనను ఎలా అలవరచుకోవాలో ఒక సన్నివేశం ద్వారా అమ్మ నాకు ప్రబోధించింది.

ఒక రోజు మధ్యాహ్నం 3 గంటల వేళ ఒక సోదరుడు అమ్మ దర్శనార్థం వచ్చినట్లు అమ్మకు విన్నవించాను. “భోంచేశాడేమో కనుక్కున్నావా?” అన్నది అమ్మ. “లేదమ్మా! మూడు గంటలు దాటింది కదా ! తినకుండా వుంటారా అని అడగలేదు” అని అమ్మకు చెప్పి వెంటనే ఎందుకయినా మంచిదనిపించి ఆ సోదరుని దగ్గరకు వెళ్ళి భోజనం విషయం అడిగితే చెయ్యలేదన్నాడు. అన్నపూర్ణాలయానికి తీసుకెళ్ళి అన్నం పెట్టించాను. ఆ సమయంలో అమ్మ భోజనం సంగతి కబురు చేసినందుకు ఆ సోదరుడు అమ్మ ప్రేమకు ఆనందంతో పొంగిపోయి అమ్మ పాదాలపై వాలిపోయాడు. ఆనాటి నుండి ఎవరు ఏ సమయంలో వచ్చినా భోజనం చేశారా అని పలకరించాలి అన్న అమ్మ మాటలే ఉపదేశంగా భావించాను.

ఇక్కడకు వచ్చిన వాళ్ళు అమ్మ సన్నిధిని చేరాక తృప్తినీ, హాయినీ పొందటం కాదు. అందరింటిలో అడుగుపెట్టిన క్షణమే అమ్మ దగ్గరకు వచ్చిన అనుభూతిని పొందగలగాలి అనీ ఆదరణ, ఆప్యాయతలతో అందరిల్లు నిండి ఉండాలనీ, ఏ సమయంలో వచ్చినా అన్నపూర్ణాలయంలో ఆదరణ అనే అనుపాకం వేసి భోజనం పెట్టాలనీ అమ్మ ఆకాంక్ష. అందుకే ఒక సందర్భంలో ప్రపంచంలో ఆస్తి అంటే ఆదరణేననీ, ఆ ఆస్తి ఎవరు అంటే అమ్మ అనీ, ఆ ఆస్థి తనే అని సుస్పష్టంగా పలికింది. 

పూర్వ సంస్థ బాధ్యతలు నిర్వహించిన సోదరులు హరిదాసుగారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా – రేపటికి బియ్యం లేవు. వడ్లు మరకు పంపిద్దామంటే – మరకు వెళ్ళే మనిషి లేడు. ఇంట్లో విసిరిద్దామంటే – తిరుగలి విసరేవారు లేరు. ఏమి చెయ్యాలో తోచట్లేదని మొర పెట్టుకున్నారు.

అమ్మ వడ్లు తాను విసురుతానని తిరగలి వేయమన్నది. కొన్ని వడ్లు విసిరి, కొంత చెరిగి శుభ్రపరిచింది. అన్ని పనులూ చేస్తూనే “నాకు పనులు రావు. అన్ని పనులు నేర్చుకోవాలి” అని అక్కడే ఉన్న సోదరి గజేంద్రమ్మ అన్నది.

“నీకు రాని వేముంటయ్యమ్మా” అన్న గజేంద్రమ్మతో – నేను మీతో కలవకపోతే మీరు నాదగ్గరకు రాలేదు. నేను మీతో కలసి మిమ్మల్ని దగ్గరకు తీసుకోవాలి. వడ్లగింజలో బియ్యపు గింజలాగా దాగి ఉన్నాం మనం. మనలో దోషాలు తొలగించుకుని వేరు కావిల. వడ్ల గింజలో ఎన్ని దాగి ఉన్నాయో మనలోనూ అన్ని వున్నాయి. అవి తొలగించుకోలేక పోయినా ప్రస్తుతానికి ఇవి తొలగించండి” అని పరిహాసం చేసింది కానీ దాని వెనుక ఉన్నది మనలో మాలిన్యాన్ని తొలగించుకోమని ప్రబోధమే కదా !

ఒక సోదరుడు మానవులు దుష్కర్మ చేస్తున్నప్పుడు దుష్కర్మ, సత్కర్మ రెంటికీ కర్తవైన తల్లివి. నీవు ఈ బిడ్డల మనస్సులను మార్చి సన్మార్గంలో పెట్టవచ్చుకదా! -అని అడిగినప్పుడు “నాకు దుష్కర్మ కనపడితేగా” అన్న అమ్మ సమాధానం విన్న ఆ సోదరుడు “మాకు ఆ భేదం కన్పిస్తున్నది. వాటి వల్ల నష్టం అనుభవిస్తున్నాం కదా ! నీవు మా మనసులు తిప్పి అన్నీ సత్కర్మలే చేయిస్తే లోకంలో ఈ సంక్షోభం తప్పుతుంది గదా ! – అని అనగా –

“నాకు అవసరం అనిపించినపుడు తిప్పుతాను” అని అతి నిర్లిప్తంగా అన్నది అమ్మ. కానీ అందులో నిశ్చయమే ధ్వనించింది. ఆ సందర్భంలో మంచి, చెడులను గురించి వివరిస్తూ ఇది మంచిమార్గం, ఇది చెడుమార్గం నిర్ణయించు కోవటం ఎట్లా అంటే – అన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు. అనుకోవటమే – కష్ట సుఖాలూ రెండూ వాడి అనుగ్రహమే. ఆయా అవసరాల్లో ఆయా పనులు చేయించటమే కరుణ. అంతా వాడి అనుగ్రహమనుకుంటే మనస్సు హాయిగా ఉంటుంది. మనం చేస్తున్నది ఏమీ లేదనీ, మనని నడిపించే శక్తి మరొకటి ఉన్నదనీ, ప్రేరణే దైవమనీ, అసలు భగవంతుడంటే – ఈ సృష్టి సర్వమూ దైవ స్వరూపమే. సృష్టే దైవం. ఎక్కడ ఎవరికి పరిచర్యలు చేసినా, ఏ రూపంలో చేసినా అది దేవతార్చనయే. ఎవరికి సాయం చేసినా మేమే చేస్తున్నాం అనే భావన కాక భగవంతుడిచ్చిన అవకాశంగా భావించాలి.

ఒక సోదరుడు సాధన గురించి ఒక మూర్తిని ఉద్దేశించి ధ్యానం చేస్తుంటే – అనేక రూపాలు ఎదురుగా వచ్చి నిల్చుంటాయి. ఏకాగ్రత కుదరటం లేదు. ఏం చేయాలమ్మా అని బాధపడ్డాడు. ‘బాధపడకు నాన్నా! నీవు ధ్యానం చేసే దైవమే అన్ని రూపాలూ తనవే నని నీకు తెలియ చెప్పటం కోసం అన్ని రూపాల్లో సాక్షాత్కరించింది. అంతేకాని నీవు ఒకరిని కొలుస్తుంటే ఇతరులెవరో మార్గానికి అడ్డు రావటంకాదు. వారందరూ ఒక మూర్తి యొక్క విభిన్నమైన రూపాలని భావించటమూ, గుర్తించటమే ఏ. ఏకాగ్రత అంటే పటం ముందు కూర్చోవటమే కాదు ప్రతి వస్తువునూ ఆ స్వరూపంగా చూడటమే ఏక్రాగత అని అతనికి సాధనా మార్గాన్ని నిర్దేశించింది.

మరొక సందర్భంలో – మంత్రం అంటే అక్షర మాలేగా అక్షరాలు ఏర్చి, కూర్చి వాక్యాన్ని రూపొందించి వాటి కొక భావన కల్పించి, చెవిలో చెప్పేసరికి అది మంత్రమవుతున్నది దానికొక పవిత్రత ఏర్పడుతుంది. గాయత్రీ బ్రహ్మోపదేశం ఎవరికీ వినపడకుండా చెప్పాలంటారు. దేనికి ? ఇతర ధ్యాస లేకుండా, ఇతర శబ్దం వినకుండా వినమని అనటానికి బదులు ఎవరూ వినకుండా అంటున్నారు. తృప్తినీ, శాంతినీ, హాయినీ, ఇచ్చి సందేహ నివృత్తి చేయగలిగింది. ఏదయినా, సందేశమే, – మంత్రమే – మననమే – మంత్రం.

ఎవరయినా ఇక్కడ ఉంటామని అమ్మను అడిగినప్పుడు. ఇక్కడేదో అమ్మ దగ్గర హాయిగా ఉన్నదని అనుకోవద్దు. గులాబీపువ్వు కావాలనుకుంటే – గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇక్కడ తేళ్ళు, కాళ్ళ జెర్రులు, మండ్రగబ్బలు, పాములు అనేకం ఉంటాయి. వాటన్నింటితో కలిసిమెలగాలి. ఇక్కడ మెలగ గలిగితే ప్రపంచంలో ఎక్కడయినా మెలగగలరు” అని అమ్మ చెప్పింది. ఇది సమాధానమో, సందేశమో మరి. ఇక్కడ ఉండటమే – పూజ అనీ ఇది కాశీ రామేశ్వరం లాంటి క్షేత్రమనీ అదృశ్యంగా అన్నింటికీ కూడలి అవుతుందనీ” చెప్పింది. 

నిగ్రహం కోసమే విగ్రహారాధన అని చెప్పిన అమ్మ దానిని ఈ విధంగా వివరించింది. రాముని బొమ్మ ఉన్నదనుకోండి దానిని బొమ్మల దగ్గరగా పెడితే బొమ్మగా చూస్తున్నాం. దేవతార్చనలో పెడితే దేవునిగా చూస్తున్నాం. స్థానాన్ని బట్టి పేరు పెడుతున్నాం. ఈ నోములూ, వ్రతాలలో ఒక్కొ నోముకు ఒక్కొక్క వస్తువులో దైవత్వాన్ని ఆపాదించి పూజ చెయ్యడం జరుగుతున్నది. విడి సమయంలో ఆ వస్తువును ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాం. అదే నోముల్లో దైవత్వాన్ని చూస్తున్నాం. కనుక ప్రతివస్తువులో దైవత్వాన్ని చూడటం కోసమే ఈ నోములూ, వ్రతాలు. కాలవనిండా నీరు ఉన్నా దాహం తీరటానికి రేవు అవసరం.

ఆలయాలు కూడా రేవుల్లాంటివే అని చెప్పిన అమ్మ ఇక్కడ హైమాలయం, అనసూయేశ్వరాలయాలను ఏర్పాటు చేసి తను అనుగ్రహాన్ని వర్షించటానికి అనసూయేశ్వరా లయంలో కొలువై ఉన్నది.

“అమ్మా ! మహిమలు చేసే నీవు మహిమలు ఎందుకు ఒప్పుకోవు” అన్న ప్రశ్నకు

“మహాత్మ్యాలతో కలిగే విశ్వాసం అవి నిలిచిపోయి నప్పుడు చెదిరిపోతుంది. కనుక ఏది జరిగినా – ఏ పరిస్థితులోనయినా భగవంతుని మీద చెదరని విశ్వాసం వున్నది. ప్రసాదించమని కోరుకోవటమే ప్రార్థనకు పరమావధి” అన్నది.

కష్టాలలో ఉన్న అభాగ్యుల బాధలకు స్పందించటమే మానవుని ద్వారా వ్యక్తమయ్యే దివ్యత్వం అని నిర్వచించిన అమ్మ తన బిడ్డలందరూ ఆస్థితిని పొందటానికి ఏమి చెయ్యాలో అనేక సన్నివేశాల ద్వారా వివరించింది.

ఒకసారి బాపట్లలో దారుణమయిన అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సంఘటన విన్న అమ్మ హృదయం వించి వారికి ఆహార సదుపాయాలు కలుగచేయమని శ్రీ విశ్వజననీ పరిషత్ను ఆదేశించింది. అన్నం పొట్లాలు కట్టటం మొదలైన పనులన్నీ తానే స్వయంగా దగ్గరుండి జరిపిస్తోంది.

ఆ సమయంలో అమ్మ దర్శనార్థం వచ్చిన ఒక సోదరుడు నాకేదయినా సందేశం ప్రసాదించమ్మా అని ప్రార్థించాడు. అమ్మ మౌనంగా అతణ్ణి చూసింది. అతను మళ్ళీ ప్రాధేయపడ్డాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనమని అమ్మ సూచించింది. అందులోని సందేశం అర్థంకాక. ఆ సోదరుడు అమ్మ పాదాలవైపు, అమ్మ వైపు చూస్తుండి పోయాడు.

వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తుంటారు. నలుగురు కలిస్తే వారికి త్వరగా అందించవచ్చు అన్న అమ్మ మాటల్లో ప్రేమ, సానుభూతి అతనికి ధ్వనించాయి. ఒకరి కొకరు తోడయితే పని తొందరగా అవుతుంది. వారికి త్వరగా అందించటానికి అవకాశం ఉంటుంది. అన్న భావం, ఆంతర్యం అప్పటికి గాని అతనికి అవగతం కాలేదు. తనకి ఆసేవలో పాల్గొనే అవకాశం అమ్మ ఇచ్చినందుకు ఆ రూపంగా సందేశం అందించినందుకు. ఆ సోదరుడు ఎంతో సంతృప్తి పొందాడు.

ఈ విధంగా అమ్మ తన మాటల ద్వారా, చేతల ద్వారా కొన్ని సన్నివేశాల ద్వారా, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రబోధించింది. అందుకే “పరిస్థితులే గురు” వన్నది. 

అమ్మ ఏం చెప్పినా తన అనుభవంలోనుంచే చెప్పింది. తాను ఆచరించి చూపింది కనుకనే

“నీ బిడ్డయందు దేనిని చూస్తున్నావో – అందరి యందు దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందటమ”నీ, ‘కూతుర్ని, కోడల్ని ఒకటిగా చూడటమే అద్వైతమ’నీ ప్రబోధించింది.

ఉపదేశమంటే దైవసన్నిధికి చేర్చటం అని ప్రవచించిన అమ్మ మనం ఆ సన్నిధికి చేరుకోవటానికి చేసిన మహోపదేశాలు ఎన్నో – ఎన్నెన్నో….

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!