1. Home
  2. Articles
  3. Mother of All
  4. మాఘపూర్ణిమ- మంత్రోపదేశము

మాఘపూర్ణిమ- మంత్రోపదేశము

A. Rama Krishna Sarma
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : October
Issue Number : 4
Year : 2019

ఒకసారి అమ్మ అందరిని మాఘ పూర్ణిమకు రమ్మని చెపుతూ నన్ను కూడా భార్యా సమేతంగా రమ్మని చెప్పారు. “మాఘపూర్ణిమ 1958 ఫిబ్రవరి 4వ తారీకు అవుతుంది, అందరినీ 3వ తారీకు సాయంత్రానికే రమ్మన్నారు అమ్మ.

మాఘ పూర్ణిమ విశేషమేమో నాకు తెలియలేదు. అమ్మ రమ్మన్నారే గాని చెప్పలేదు. కాని అందరూ అనుకొన్నారు – అమ్మ ఆనాడు అందరికీ మంత్రోపదేశం. చేస్తారట అని. ఆ మాట విన్న నేను చాలా సంతోషంతో పొంగి పోయాను. ఇది నా జీవితంలో అపూర్వమైన పరిణామమని అనుకొన్నాను.

రానే వచ్చింది ఫిబ్రవరి 3వ తారీకు. సాయంత్రం 3 గంటలకే బాపట్ల చేరాను మా శ్రీమతితోగూడ. బాపట్ల బస్ స్టాండు వద్ద జన సందోహ కోలాహలం ఎక్కువయింది. వారిలో చాలా భాగము జిల్లెళ్ళమూడికే వెళ్ళుతున్నారని వినగానే నా మనస్సెంతో సంతోషభరితమైంది. అమ్మను పదే పదే స్మరిస్తున్నాను. బస్సు ఒకటి మాత్రమే పెదనందిపాడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాది. ఈ మహా జనానికి అది ఒక్కటి చాలని కారణంగా జట్కాబండ్లపై రిక్షాలపై కాలి నడకన బయలు దేరారు. చాలామంది. మేము మాత్రం కొంత మందితో కలసి బస్సుపై ప్రయాణం చేసి 7వ మైలు వద్ద దిగినాము. బస్సు దిగిన వారిలో ఒకరైన కె. గోపాలరావు గారు తాము వెంట తెచ్చిన సుమారు 3 మణుగుల చేమదుంపల బస్తా 7వ మైలు నుండి జిల్లెళ్ళమూడికి తీసికొనిపోయే కూలీలెవరూ లేని కారణంగా ఆందోళన పడుతూన్నట్లు నేను గమనించి “నేను తీసికొనివస్తాను” అన్నాను వారితో. నేను వారి కపరిచితుడనైన కారణం చేతనో ఏమో కాని మొదట వారు ఇష్టపడలేదు. మరొకరు తీసికొని వెళ్ళేవారులేరు. ఆ కారణంగా చివరకు ఒప్పుకొనక తప్పలేదు. నేనే సంతోషంతో బస్తాను నెత్తిపై పెట్టుకుని జిల్లెళ్ళమూడికి చేర్చాను.

పాదప్రక్షాళనానంతరం మేము అమ్మ ఉన్నచోటికి వెళ్ళి నమస్కరించి తెచ్చిన పండ్లు అమ్మకు సమర్పించాము.

క్రిందటి సారికీ యిప్పటికీ ఆ ఆవరణలో చాలా మార్పు కన్పించింది. అమ్మ ఉన్న ఇంటికి ఈశాన్య భాగంలో సిమెంటు వరలతో క్రొత్తగా ఒక నూయి నిర్మాణమైంది. దానికి 2,3 గజాల దూరంలో నైఋతి దిశగానూ, దేవాలయానికి తూర్పుగానూ 100 చ.గ. వైశాల్యం కలిగిన ప్రదేశంలో ఇంటి నిట్రాడిపై ఒక చక్కని తాటియాకుల మందిరం నిర్మాణము చేయబడి ఉంది. దానికి మూడు వైపులా తాటాకు దడులు కట్టబడి ఉన్నయ్. నాన్నగారి బారన్ వద్దనుండి నాన్నగారి యింటివరకు గల ప్రదేశమందు ఒక పొడవైన తాటాకు పందిరి వేయ బడ్డది భోజనాలు చేయటానికి. వచ్చిన వారికి చక్కని వసతులు ఏర్పడ్డాయి.

సూర్యుడస్తమించాడు. సంధ్యారుణ కాంతులు క్రమంగా ఆ ప్రదేశమంతా అలము కొన్నాయి. కొంచెం సేపటికి కన్నతల్లి మనసులా హృదయాహ్లాదకరమైన వెన్నెల ప్రకాశిస్తున్నది. 7-30 గంటలయ్యే సరికి చాలామంది (నా అంచనా ప్రకారం 1500 మంది) అచ్చటికి చేరుకున్నారు.

నూతనంగా నిర్మితమైన మందిరంలో జనం చాలామంది కూర్చున్నారు. పెట్రొమాక్సులైట్లు వెలిగించారు. మైకు ఏర్పాటు చేసినారు. నన్ను కొంచెం సేపు పురాణపఠనం చేయమన్నారు. నేను భాగవతంలో దశమస్కంధం ప్రవచనం చేశాను. 8-30 గంటలు కాగానే భోజనాలకు లెమ్మన్నారు. భోజనాలు పూర్తి అయ్యే సరికి దాదాపు 10 గంటలయింది. అందరూ నిద్రించారు హాయిగా నాటిరాత్రి.

షుమారు 2 గంటలకు అమ్మ కబురుతో అందరూ నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకొన్నారు. సమీప మందున్న కాల్వకు ప్రయాణమైనారు అందరూ. అమ్మ కూడ ప్రయాణానికి సిద్ధమైనారు. చాలా బలహీనంగా కన్పిస్తున్నారు అమ్మ. నాన్నగారు అమ్మతో “బండికట్టిస్తాను, బండిమీద వెళ్ల” మన్నారు. అమ్మ పది నిముసాలలో బండి సిద్ధమైతే సరే, లేకుంటే నడిచి వెళ్తా” నన్నారు. నాన్నగారు బండి సిద్ధంచేసే యత్నంలో నిమగ్నమైనారు. కాని బండి కట్టడం ఆలస్యం కానే అయింది. అమ్మ నడక సాగించారు. ఆ సమయం 2.45 గం|| ని.లు అయి ఉంటుంది. చివరకు నాన్నగారు కూడ నడిచే వచ్చారు. తర్వాత ఎప్పుడో వచ్చింది బండి కాల్వవద్దకు.

సన్నగా బలహీనంగా ఉన్నట్లు అమ్మ కన్పిస్తున్నా బలంగా ఉన్నాననుకొన్న నేను మాత్రం అమ్మతోపాటు నడవలేక కొంచెం పరుగు తీయాల్సి వచ్చింది. పి.డబ్లు.డి గుమాస్తాగారు కూడ మా బృందంలో ఉన్నారు. వారు నామ సంకీర్తన ప్రారంభించారు. అందరూ అందుకొన్నారు ఆ స్థాయిని. సంకీర్తన చాలా బ్రహ్మానందంగా సాగి పోతూన్నది. మనస్సులుప్పొంగి పోతున్నవి. చాలామంది అమ్మతో నడవలేక నామాదిరే తిన్నని పరుగులు తీస్తూ నామం చేస్తూ పోతూ ఉన్నారు. మొత్తంమీద త్వరగానే కాల్వదరికి చేరాము.

వెన్నెల వెలుగు ప్రశాంతంగా హాయిగా ఉన్నది. అమ్మ కాల్వలోనికి దిగారు. స్నానానికి. నీళ్లు నడుములోతువరకు ఉన్నవి. ప్రవాహం బాగున్నది. ఆ సమయం3.25 గం||లు. అందరూ కాల్వలోనికి దిగి స్నానాలు చేస్తూ ఉన్నారు, ఏ కొద్దిమందియో తప్ప. ఒక అరగంట వరకు స్నానాలు చేసిన తర్వాత అమ్మ ఒకరి తర్వాత ఒకరిని తన వద్దకు రమ్మన్నారు. ఒక్కొక్కరు అమ్మ వద్దకు వెళ్ళి వస్తున్నారు. కొంతమంది. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. నాకు మంత్రోపదేశం చేశారు. మా శ్రీమతికినీ చేశారు నా తర్వాత. ఆనాడు చాలామంది మంత్రోపదేశం పొందారు. నా అంచనా ప్రకారం 1000 మంది మంత్రోపదేశం పొందారనుకొన్నాను. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి ఇంకా వెన్నెల ఉంది. అందరు బయటకు వచ్చారు. అమ్మ మాత్రం తనవెంట ఎవ్వరినీ ఉండవద్దని చెప్పి కొంచెం దూరం వెళ్ళారు నీళ్లలోనికి. ఒక అరగంట ఉండి మరలా ఒడ్డు చేరారు.

తూరుపు దెస అరుణోదయ కాంతులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఇంతలో బాలభానుడు తన కిరణాలద్వారా బంగారురంగు వలువను జగతిపై పరచినాడా . యన్నట్లు లే యెండ మిగుల శోభాయమానమై హృదయాహ్లాదకరమై యొప్పారుతున్నది. అమ్మ బండి ఎక్కారు. హైమ మరి కొంతమంది ఆడవారుగూడ బండి ఎక్కారు. బండి బయలు దేరింది. బండివెంట నామం చేస్తూ మేమూ బయలుదేరి ఇంటికి చేరాము.

ఇంటికి చేరగానే అమ్మ బండి దిగీ దిగటంతోడనే టెంకాయ కొట్టి అమ్మకు హారతిచ్చారు. అమ్మ నేరుగా వెళ్ళి పందిట్లో మంచంపై కూర్చొని ఉన్న లక్ష్మీకాంత యోగిగారి ఒడిలో పండుకొన్నారు. ఆ దృశ్యం చాలా సుందరంగా ఉన్నది. బాబుగారు అమ్మయొక్క దైవత్వాన్ని గురించి దాదాపు అరగంటసేపు మాట్లాడినారు. తర్వాత అమ్మ ఇంట్లోకి వెళ్లారు అమ్మ ఇల్లు చేరేటప్పటికి దాదాపు ఏడున్నర అయింది.

అందరికీ కాఫీ అందివ్వబడింది. కాఫీ సేవనం కాగానే పందిట్లోనూ, మందిరంలోనూ అమ్మ వ్యక్తిత్వ ప్రతిభా విశేషాలను గూర్చి చెప్పుకుంటున్నారు. జనం చాలామంది. ఇంతలో అమ్మ మందిరంలోనికి వచ్చి చాపపై కూర్చున్నారు. పాటకచ్చేరి ఏర్పాటయింది. కచ్చేరి ప్రారంభించడానికి ముందు అయ్యగారి సోమేశ్వరరావు, నేతి శ్రీరామశర్మ, మహదేవు రాధాకృష్ణరాజుగార్లు అమ్మకు నమస్కరించగా అమ్మ వారినుదుట కుంకుమతో నిలువుబొట్టు దిద్దినారు.

సోమేశ్వరరావు వీణాగానము ప్రారంభించారు. సహకార వాద్యాలు: నేతి శ్రీరామశర్మ ఫిడేలు, రాధాకృష్ణరాజు మృదంగం. సోమేశ్వరరావు వీణపై వాయిస్తూ మధ్య మధ్య తనుగూడ పాడుతూ శ్రోతలను పరవశులుగా చేశారు. ఆయన పాడిన వాటిలో ఒకటి “నీదు చరణ పంకజములే నమ్మితినమ్మా” అనునవి మనసు పొంగునటుల పాడారు. అట్లే శ్రీరామశర్మగారు గూడ దేవీపరమైన కృతులు చక్కగా గానం చేశారు. తర్వాత శ్రీరాజా వ్రాసిన పాటలు (అమ్మను గుఱించి) శ్రీగంగరాజు వెంకటేశ్వరరావుగారు తమ మధురమైన గాత్రంతో గానం చేసి శ్రోతలను ఆనందంలో ముంచెత్తారు. మందిరంలో కూర్చున్న సోదరీ సోదరుల చూపులతో బాటు వారల మనస్సులనూ అయస్కాంతము ఇనుము నాకర్షించినట్లు సర్వానికి కేంద్రమైన అమ్మ అనిర్వచనీయ ప్రేమ స్వరూపిణి అయిన అమ్మ ఆకర్షించి అందరివైపూ తన కరుణాకటాక్ష వీక్షణప్రసారం చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఆ మందిరంలో కూర్చొనడం చూస్తే అప్పుడనిపించకపోయినా ఆ దృశ్యం తలంచుకొన్నప్పుడల్లా ధ్యానం అంటే అదే కాబోలు, అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ అలాంటి దృశ్యాలు చూస్తూండాలని మనసున ఆకాంక్ష కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడో – ఏమో? కొంతసేపటికి పాట కచ్చేరి పూర్తి అయింది.

మరి కొన్ని క్షణాలకు శ్రీమోతడక రామచంద్రయ్యగారిచే రచింపబడిన మాతృదేవీస్తవ దండక ఆవిష్కరణోత్సవం అమ్మ సన్నిధిని జరిగింది. శ్రీరామచంద్రయ్యగారు అందరికీ ఆ దండక పుస్తకములు పంచిపెట్టి నాకూ ఒక పుస్తకం ఇచ్చి అమ్మ సమక్షంలో చదవమన్నారు. నేను ఆ దండకాన్ని అమ్మవద్ద పఠించాను. ఆ మహనీయుడు వ్రాసిన ఆ దండకమే నేటికీ అమ్మ సన్నిధిని ప్రతిదినం ప్రాతఃకాలమందు సుప్రభాత పఠన సమయంలో “శ్రీమంజులస్వర్ణ మాణిక్య సంధాన” అంటూ అందరూ తమ మృదు మధురమైన గాత్రములతో శ్రోతల మనస్సులుూతలూగిస్తూ మైమరపిస్తూ గానం చేస్తున్నారు.

ఆ రాత్రికి హరికథా కాలక్షేపమన్నారు. కథకుడు నాకు చిరపరిచితుడైన మిత్రుడు శ్రీకంచిభొట్ల కామేశ్వర శర్మయే. మందిరంలో కథ ప్రారంభమైంది. అమ్మ సభలో కూర్చున్నారు. కథ-భక్తి రసభరితమైన మార్కండేయ చరిత్ర-మృత్యుంజయుని గాథ. మృత్యువును ప్రసాదించుటకుగానీ, జీవితాన్ని ప్రసాదించుటకు గాని కారణభూతురాలైన అమ్మయే సభలో అధ్యక్షస్థానమందున్నది. ఇక యేమి? కథాగానం చక్కగా సాగిపోయినది. మార్కండేయుడు మరణాన్ని జయించాడు – కాదు కాదు పరమేశ్వరీ అనుగ్రహప్రాప్తి పొందాడు – ఆహా ! నాడు కథయే కథకుడు ఎన్నుకొనటానికి పరమేశ్వరీ సంకల్పమే కారణమై ఉండనోపు. వేరు కారణమున్నదని అనుకోలేను

మరునాడు బహుళపాడ్యమి. (5.2.1958) ఉదయం 9 గంటలకు అమ్మ మందిరంలో కూర్చున్నారు. బాబుగారిని పిలువనంపారు. బాబుగారు వచ్చి అమ్మ ప్రక్కగా కూర్చున్నారు. సభ నిండుగా ఉన్నది. ఎందుకుండదు? అమ్మ సభలో ఉన్నప్పుడు నిండుతనానికి లోటేమున్నది? బాబుగారు రాజరాజేశ్వరిని గురించి ఉపన్యాసం ప్రారంభించారు. వింటున్నాను. 10 నిముషాలైనదో లేదో నీళ్ళ పీపా బండి తోలుకురావటానికి రమ్మన్నారు నన్ను సోదరులు డాక్టరు శ్రీ సుబ్బారావుగారు. వెంటనే లేచివెళ్ళాను. కాని ఉపన్యాసం వినలేకపోతినే అని విచారపడ్డాను గాని అమ్మ కరుణా విశేషంచే సర్వం విశదమౌతుందిలే అని నాలో నేనే సమాధాన పడ్డాను.

సాయంత్రం 4 గంటలయింది. అందరు వారి వారి గ్రామాలకు బయలుదేర సిద్ధమైనారు. అమ్మ మందిరంలో ఒక చాపపై ఆసీనులయ్యారు. వెళ్ళేవారందరూ అమ్మవద్ద సెలవు తీసికొంటున్నారు. సెలవు తీసికొంటున్నవారిలో లోగడ రోజు మంత్రోపదేశం పొందిన వారికి ఒక్కొక్కరికి ఎవరికి ఏ మంత్రం ఉపదేశించారో మంత్రార్థ వివరణమూ అనుష్ఠించవలసిన విధానమును గూర్చి చెప్పి ప్రసాదమిచ్చి పంపిస్తున్నారు. అట్లే నాకు గూడ వివరించారు.

కాలాంతరముందు ఈ మాఘపూర్ణిమా ప్రసక్తి వచ్చి అమ్మ అన్నారు – ఆనాడు. వచ్చినవారి సంఖ్య 1000 అనీ, అందులో మంత్రోపదేశం చేయబడ్డవారు 600 మంది అనీ, ఆనాటి విశేషాన్ని గురించి చెపుతూ ఇంకా అన్నారు – మంత్రోపదేశ. సమయంలో ఒక్కొక్కరికీ కనీసం ఒక్కొక్క నిమిషం పట్టిందని వెంటనే నాలో కొన్ని భావాలు మెదిలాయి. మరి 600 మందికి 600 నిముషాల కాలము గదా పట్టింది. అంటే 10 గంటలకాలం అది కనీసమే, పట్టిందన్నమాట. కాల్వకు బయుదేరినది 2.45 గం.లకు. ఇంటికి చేరినది 7.30 గం.లకు. కొద్ది కాలవ్యవధిలో 10 గంటలకాలం ఇమిడిపోయిందన్న మాట. ఇది వినటానికి విడ్డూరంగా తోచవచ్చు. కానీ ఇందెంతో తర్కాతీతమైన రహస్యం ఇమిడియున్నది. ఆలోచనకు అందనిది. అద్భుతమైనది. అయితే లోకంలో ఇట్లా జరగటం సంభవమా? అని మానవ మానసానికి శంక కలగవచ్చు. కాని అమ్మకు ఇది ఒక లెక్కలోనిదికాదు. స్త్రీలలో కొందరు పతియే దైవమని నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరించి సముపార్జించిన పాతివ్రత్య మహిమచే అనేక అద్భుతకార్యాలు చేసినట్లు మన పురాణాదులలో కన్పిస్తున్నదిగదా! పురాణాల్లోనే కాదు – అమ్మ సంగతి అట్లుంచుదాం. ఈ రోజులలో గూడ నేనెరిగిన సజీవులయిన మహనీయులలో సైతం ఒకేక్షణంలో అనేకచోట్ల ఒకేసారి కనబడ్డవారితో నాకు పరిచయమున్నది. అదీగాక ప్రత్యక్షంగా ఋజువు పరచుకొన్నాను. అయినా యీ మహనీయులంతా భక్తకోటిలోనివారే.

ఇక అమ్మగా అవతరించిన సాక్షాత్పరమేశ్వరికి ఈ సంఘటనలన్నీ సహజం. మనకు విశేషంగా కన్పడేవి అమ్మకు సహజంగా ఉంటాయి. అమ్మను వాడు అనీ అతడని అనటం నాకు అలవాటు. వానిసృష్టిని గుఱించి ఆలోచిస్తేనే పరమాద్భుతంగా ఉంటుందిగదా. అంతకంటే ప్రపంచంలో విచిత్రమేముంటుంది? సృష్టిలో ఏ ఒక్క అంశాన్ని ఆలోచించినా ఊహకు అందనిదేకదా! ఇక మంత్రోపదేశ సందర్భంలో 5 గంటలమధ్య 10 గంటల కాలాన్ని స్తంభింపజేయటం ఏమంతగొప్ప-అమ్మకు? 

ఒక్కసారి భాగవత దశమస్కంధం తిలకిద్దాం.

నాటి కృష్ణావతారమందు గోపాలకృష్ణుడు బృందావనమందు సమవయస్కులైన గోపబాలురతో గోవత్సములను మేపుకొనే సమయంలో ఒక పెద్ద పామునుజంపి అందు జిక్కుపడిన గోవత్సార్భకుల గాపాడిన ఉదంతం విన్న బ్రహ్మ-గోవత్సార్భకుల నందరినీ మ్రింగ సమర్థమైన పామును చంపగలిగిన ఈ కుఱ్ఱవానిచర్య తన్ను చకితుణ్ణి చేసిన కారణంగా ఆ బాలకుని (శ్రీకృష్ణుని) శక్తిని పరీక్షించే నిమిత్తం కృష్ణుడూ. గోపబాలకులూ చల్దులుగుడిచే సమయంలో పచ్చికలుమేస్తూ దూరంగా పోతున్న గోవత్సాలను, తన మాయచే దాచేశాడు. దూడల్ని వెతకటానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళగానే ఇటు బాలురనూ దాచేశాడు. ఇదంతా చూచాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మకు పాఠం చెప్పాలనుకున్నాడు. దాచిపెట్ట బడ్డ గోవత్సారకుల ఆకారాలను తానే ధరించి మందకు వెళ్ళాడు. ఆవిధంగా ఆ ఆకారాలతో సంవత్సరం సంచరించాడు. బృందావనంలో,

తరువాత బ్రహ్మదేవుడు గోపాలకృష్ణుని మహిమ తెలియనేరక తనచే దాచిపెట్టబడ్డ వారివలె ఉన్న గోవత్సార్భకులగాంచి వారల పోలికల పరీక్షించు సమయంలో పరమేశ్వరుడు ప్రదర్శించిన విశ్వరూపం బ్రహ్మదేవుని నిశ్చేష్టాపరుని చేసివైచింది. అంతే. శ్రీకృష్ణుడు ప్రదర్శించిన విశ్వరూపోప సంహారానంతరమే బ్రహ్మకు తెలివికలిగి భగవానుని స్తుతించి వెడలిపోయినాడు- దూడలను, బాలురను వదలి. ఆ బాలకులు శ్రీకృష్ణుని చూచారు. ఎట్లున్నాడు స్వామి,

 కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి

విమల శృంగంబును వేత్ర దండంబును జాతిరానీక దాచంక నిఱికి

మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద దాపలిచేత మొనయ నునిచి

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి దూడలను వెదుకబోయిన కృష్ణుని లాగే వారికి కన్పించినాడు. అమాయకులైన ఆ బాలకులు సంతోషంతో జరిగిన గాథ ఏమాత్రం తెలియనివారలై

‘చెలికాడా ! అరుదెంచితే యిచటికిన్ సేమంబునం గ్రేపులున్ 

నెలవుల్ సేరె నరణ్యభూమివలనన్;

నీ వచ్చునందాక జ 

వీరించుక యెవ్వరుం గుడువ రాలోకింపు; రమ్ము రమ్మని

పిలుస్తారు శ్రీకృష్ణుణ్ణి. భక్త సులభుడైన భగవానుడు ప్రేమమూర్తిగాన మందహాసం చేస్తూ చల్దులు గుడుస్తాడు వారితో నడుమ నడుమ నర్మ సంభాషణలు సాగిస్తూ.

సాయంత్రం మందకు బోయిన బాలకులు వారి తల్లి దండ్రులతో అంటారు. ‘ఈ ఉదయం కృష్ణుడు పెద్ద పామును చంపి మమ్ముల కాపాడినాడు’ అని, చిత్రంగా లేదు ఇది!

ఈ గాథ పరీక్షిత్తునకు శ్రీ శుకులవారు విన్పిస్తూ 

క్రించుదనంబున విధి దము

వంచించిన యేడు గోపవర నందును లొ

క్కించుక కాలంబుగ నీ

క్షించిరి, రాజేంద్ర! బాలకృష్ణుని మాయన్

 “ఏ మహాత్ము మాయ నీ విశ్వమంతయు

 మోహితాత్మకమయి మునిగి యుండు 

నట్టి విష్ణుమాయ నరకు లొక్కయే 

దెఱుగ కుండినుట యేమి వెఱగు?”

ఆ విష్ణువే అమ్మగా ఆవిర్భవించి కాల్వవద్ద 10 గంటల కాలమును ఎవరికీ తెలియ రానీయకుండా గడవ చేసిందంటే మన బోంట్లు తెలుసుకోలేక పోయినామనుట సహజమేకాని అందసహజమేమాత్రం లేదు. అమ్మ కావలెనని వివరించినప్పుడే తెలిసిందిగానీ లేకపోతే ఇదైనను మన బుద్ధికి గోచరము కాలేదు గదా!

పూర్ణిమకు లోగడ రోజు నీరు తక్కువగా ఉన్నది కాల్వలో. పూర్ణిమనాడు. బాగా ఉన్నది నీరు.

అమ్మ మంత్రోపదేశమేల చేయాలి? వారేదనుకుంటే అది అవుతుంది గదా అను ప్రశ్న బయలు దేరుతుంది.

ఈ మంత్రోపదేశం అమ్మ కావలెనని చేసిందికాదు. దేశిరాజు రాజమ్మగారి కోరికపై చేసిన మంత్రోపదేశాలే. వారికిచ్చిన మాట ప్రకారం తనకు 33వ ఏడు వచ్చిన తర్వాతనే చేశారు.

కాలాంతరమందు అమ్మ కాల్వకు స్నానార్ధము బయలుదేరినప్పుడల్లా కాల్వ పొంగుతుంటుంది. అంతకుపూర్వమాలోతు ఉండదు. 1958 ఫిబ్రవరి 4వ తారీకున – కాలాన్ని స్తంభింపచేయటంగానీ, కాల్వను పొంగులు వారించటం గానీ అమ్మకు సహజమైన కార్యాలలోనివే.

ఘటనా ఘటనలు మానులకుగానీ సృష్టికర్తకు ఏమిటి?

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!