ఫిబ్రవరి 7వ తారీఖున మాఘపూర్ణిమ సందర్భంగా జిల్లెళ్ళమూడిలో ‘ ఏకాహం, దీప దాన హోమం మహాద్భుతంగా జరిగాయి. 2012లో కార్తీక బహుళ షష్టినాడు హైమక్కయ్య 70వ జన్మ దినోత్సవం. ప్రతి పూర్ణిమ నాడు కనీసం 70 మంది ఏకాహం చెయ్యాలని, కనీసం 7 వూళ్లలో హైమ నామంతో ఏకాహం చేయ్యాలని సంకల్పించాము. మొదటి ఏకాహం జిల్లెళ్ళమూడిలో 70 మందితో కలిసి చేస్తే బాగుంటుంది అనుకున్నాము. రామబ్రహ్మం అన్నయ్య గారితో నా కోరిక విన్నవించాను. అన్నయ్యగారు 6వ తేదీ జిల్లెళ్ళమూడి వచ్చారు. ప్రొద్దున్న 7 గంటలకు అన్నయ్యగారు, నేను భగవతి, కమలత్తయ్య గారు, శ్రీమతి & శ్రీ శాస్త్రి గారు, మల్లన్నయ్య, మన్నవ సుబ్బలక్ష్మిగారు కొబ్బరి కాయలు కొట్టి హారతి ఇచ్చి హైమ ఏకాహం మొదలు పెట్టాము. నామంలో జమ్ములపాలెం నుంచి వచ్చిన 10 మందికాక 50 మంది విద్యార్థులు చాలా భక్తి ప్రపత్తులతో నామం చేశారు. రాత్రి రెడ్డి సుధ జాగారం, జిల్లెళ్ళమూడి గ్రామస్తులు మైమరచి చేసిన నామ సంకీర్తనతో ఏకాహం పూర్తయింది. ఆవరణలో కూడా చాలా మంది నామంలో కూర్చున్నారు. ఘనపాఠీ బ్రాహ్మడైన నాగేశ్వరరావు చేసిన నామ సంకీర్తన వేదమంత్రాలని గుర్తు చేసింది. 70 మంది నామంలో పాల్గొనాలని నేను కోరుకుంటే కనీసం 140 మంది దాకా నామంలో పాల్గొనేలా అమ్మ చేసింది.
మేం జిల్లెళ్ళమూడి వెళ్ళేటప్పుడు సున్నిపెంట పూర్ణానందస్వామి ఆశ్రమానికి వెళ్ళాము. స్వామి ఆశ్రమం నుండి బ్రహ్మచారిణి ఉమ మాతో పాటు జిల్లెళ్ళమూడి వచ్చారు. 7వ తేదీ సాయంత్రం చంద్రోదయ సమయంలో మొదలైన హోమం రాత్రి 8-30కు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. నిజానికి ఈ దీప దాన హోమ కార్యక్రమం పూర్ణానందుల వారి శిష్యులకి మాత్రమే తెలుసు. పురోహిత బ్రాహ్మలు దీని గురించి విని ఉండలేదు. గోధుమ పిండితో దీపం చేసి, ఆవునెయ్యితో వెలిగించి “సర్వమంగళ మాంగళ్యే” మంత్రాన్ని పునశ్చరణ చేస్తూ దీపాన్నే హోమద్రవ్యంగా వాడే ఈ హోమ కార్యక్రమం చేసే వారికే కాక చూసే వారికి కూడా చాలా ఆహ్లాదంగా వుంటుంది. బోళ్ల వరలక్ష్మిగారు, బి. సుబ్బలక్ష్మి గారు, రాచర్ల కమలగారు మిగిలిన వారితో కలసి దాదాపు 3700 దీపాలు చేశారు. చీకటి పడ్డాక యాగశాలలో వేల కొద్దీ దీపాలు వెలుగుతూ ఉంటే ఆదృశ్యం చూసి ఆనందించాల్సిందే కాని, వర్ణనలో చెప్పలేము. హోమంలో పాల్గొనటానికి ఒంగోలు, గుంటూరు, బాపట్ల ఆర్.టి.సి. డిపో మేనేజర్గా చేసి రిటైర్ అయిన జనార్దనరావుగారు. హైద్రాబాద్ వాస్తవ్యులు లక్ష్మీనారాయణ గారు – – అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హోమానికి కావల్సిన 3000 వత్తులు జన్నాభట్ల వీరభద్రశాస్త్రి అన్నయ్య పంపించారు.