“శబ్ధమే బ్రహ్మము, కాదు నిశ్శబ్ధం కూడ బ్రహ్మయే” అని అమ్మ ప్రబోధం. “ప్రేరణ కనబడదు – ప్రయత్నం కనబడుతుంది” అని చెబుతుంది. ప్రయత్నమైన క్రియకాని, భావాన్ని ప్రకటించే మాటతోకాని పనిలేకుండగ వీటన్నింటికి మూలమైన ప్రేరణ శక్తి తానయిన అమ్మకి, పైవానితో అవసరం లేకనే అనుభవ పూర్వకంగా సమాధానం అమ్మ యిస్తుంది. కొన్ని అనుభూతులు కేవలం హృదయ సంబంధమైన భావాత్మక అనుభూతులు ఉంటాయి. అవి వ్యక్తపరచటం కూడా కష్టమే అవుతుంది. ఒక వేళ వ్యక్త పరిచినా అర్థం చేసుకునే పరి పక్వత అవతల వారికి ఉండాలి. కాని మాటలు లేని సమాధానాలు, ఎక్కువగా హృదయానికి హత్తుకొని సంశయ నివృత్తి అవుతుంది.
అందుకే “మౌనమే గురుని వ్యాఖ్యానం, దానితో శిష్యుని సందేహాలు తీరుతాయ్” అని ఆర్యోక్తి. ఇది శంకరాచార్యులవారు చెప్పిన దానిలో కూడా ఉంది. శంకరాచార్యులవారు చేసిన ప్రబోధంలో వున్న విశిష్టత తన మానసిక పరిధికి అనుభూతికి అతీతంగా వున్నందున జిలెళ్ళమూడికి తరుచూ వస్తూ అమ్మతో అనేక సంభాషణలు చేసిన సోదరులు వీరమాచనేని ప్రసాదరావుగారు శంకరాచార్యులవారు పైమాటని ఉత్ప్రేక్షగా చెప్పారేమో లేకపోతే మౌనం ఏమిటి ? గురుని వ్యాఖ్యానం ఏమిటి ? అని అనుకున్నారట. అమ్మ మహాసిద్ధి పొందిన తరువాత ఒకసారి వారు జిల్లెళ్ళమూడి వచ్చినప్పుడు అమ్మ స్నానం చేసే గదిని చూస్తూ ఆ గదిలో ఒకప్పుడు తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ పై విషయాన్ని వారు చెప్పగా నేను ప్రక్కనే వుండి స్వయంగా విన్నాను. ఒక సందర్భంలో వారు అదే గదిలో అమ్మ సన్నిధిలో కూర్చున్నారట. దరిదాపు గంట, గంటన్నర ఏ సంభాషణ లేకుండా కూర్చున్నారట. కాని అంతసేపు వారికి మనస్సులో అనేక ప్రశ్నలు వెంటనే సమాధానాలు ఈ విధంగా వెంట వెంటనే వారికి (ప్రశ్నలు, సమాధానాలు) వస్తూ గంటన్నర గడిచిందట. గంటన్నరమౌనంగా కూర్చున్న అమ్మ చివరికి ఈ విధంగా అన్నదట. అయ్యిందా? తీరినయ్యా సమస్యలు? సమాధానాలు వచ్చినయ్యా? ఇంకా వున్నాయా. ప్రశ్నలు?” అని అన్నదట. ఈ గంటన్నర బాహ్యానికి చెప్పటానికి వారికి, అమ్మకి ఏ సంభాషణ జరగలేదు. కాని ప్రశ్నలు, సమాధానాలు వారికే అంతరంగంలో వచ్చినవి. చివరికి అమ్మ పై మాట అనటంతో అప్పుడు వారికి ‘ఓహో’ ఇది అన్నమాట శంకరాచార్యుల వారు చేసిన ప్రబోధంలోని సారాంశం “మౌనమే గురుని వ్యాఖ్యానం శిష్యుని సందేహాలు తీరుతాయి” అని చేసిన ప్రబోధం ఇది అన్నమాట అని అనుకున్నారట. మౌన వ్యాఖ్యానం అంటే ఏమిటో అమ్మ చెంత అనుభూతి ఉన్న ఎందరికో ఈ విధంగానే వుండేది. మరొక సోదరులు అమ్మ దగ్గరికి వచ్చిన సందర్భంలో అప్పుడు వారి అమ్మగారి మొదటి మాసికం అయిన క్రొత్త రోజుల్లో 1960 సంవత్సరంలో దర్శించిన సందర్భంలో అయిన అనుభూతిని నాకు చెప్పారు. అమ్మ చెంతకి చేరే వారు మగ, ఆడ, పెద్ద, చిన్న అందరూ కూడా అమ్మ ఒడిలో తల వాల్చి లాలన పొందటం మొదలయినవి చూసి, ఈ విధంగా మగవారు ఈమె ఒడిలో తలవాల్చట మేమిటని మనస్సులో అనుకున్నారట. మరుక్షణంలో ఆ మంచం మీద అమ్మలేదట. ఆ స్థానంలో వారి అమ్మగారు కనబడ్డారట. నీకు ఏ విధంగా అమ్మనో అదే విధంగా అందరికి అమ్మని కనక అందరూ ఈ విధంగా బిడ్డలై నా ఒడిలోకి వస్తారని ఆయనకు సమాధానం వచ్చిందని వారు నాతో చెప్పడం జరిగింది.
పైన వివరించిన వీరమాచనేని ప్రసాదరావుగారి అనుభవాన్ని ప్రస్తుతం వివరించిన ఈ రెండవ వ్యక్తి అనుభవానికి తేడా ఉన్నది. రెండూ కూడా మాటలు లేని అనుభవాలే. కాని మొదటివారి అనుభవం మనస్సులో వచ్చిన ప్రశ్నలు, సమాధానాలు మొదలయినవి రావటం, అవి అన్నీ ఏ విధంగా మౌనంలో నుండి తాను ఇచ్చిందో అమ్మ స్వయంగా అనటం జరిగింది. కాని రెండవ వ్యక్తి అనుభవం ఏమాట లేకుండగ కేవలం ఒక దర్శనంతో ఇచ్చిన అనుభవం నుండి సమాధానం..
రమణ మహర్షి ఆశ్రమంలో ఇంగ్లండ్ నుండి వచ్చి వుంటున్న జేమ్స్ అనే వ్యక్తి ఉన్నాడు. అమ్మ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళి అమ్మని దర్శించుకుంటున్దారు. ఆ సందర్బంలో “ఒక స్త్రీ వస్తే అందరూ ఈ విధంగా వెళ్లి దర్శనం చేసుకుంటున్నారేమిటి” అని బయట ఉండి అనుకున్నాడట. కొంత సమయం గడిచిన తరువాత అతను కూడా లోపలికి వెళ్ళి చూస్తే వెంటనే అంతకు ముందు తనకు ఉన్న భావం పూర్తిగా పోయి “ఈమె పరమోన్నతం, పరిపూర్ణం” అనే భావం ఏర్పడింది. తరువాత జిల్లెళ్ళమూడి వచ్చి ఉండిపోయాడు. ఈ విధంగా జేమ్కు అయిన మొదటి అనుభవం ఏమాటా లేని హృదయానుభూతిలో జీవితాన్నే అమ్మ సన్నిధిలో గడిపి, విశ్వసించే స్థితి ఏర్పడింది.
అమ్మ సన్నిధిలో సంఘటనల ద్వారా కొందరికి కొన్ని సమాధానాలు వచ్చేవి. ఇ.సి. రామమూర్తిగారు అనే సోదరులు అమ్మ చెంతకి వస్తూ ఉండేవారు. వారికి పక్షవాతం వచ్చింది. ఆ సందర్భంలో వారు అమ్మ చెంతకి వచ్చారు. వారిని డా॥ పొట్లూరి సుబ్బారావుగారి దగ్గర వైద్యం చేయించుకొనుటకుగాను చీరాల పంపటం జరిగింది. డాక్టరుగారు శాయశక్తులా వైద్యం చేసి చివరికి తన పరిధిలో సాధ్యమైనంత వరకు చేశానని ఇక అసంభవమని చెప్పారు. తరువాత వారు అమ్మ చెంతకు వచ్చారు. అప్పుడు అమ్మ “ఇది వరకు తిరిగి చేసే దేశ సేవ ఇప్పుడు రిక్షా ఎక్కి వెళ్ళిచెయ్యమని చెప్పింది. ఆ సందర్భంలో జరిగిన సంఘటనలో ప్రబోధాన్ని వారు ఈ విధంగా వివరించారు. వారి కంటే కూడా నడకలేని మరొక వ్యక్తి అక్కడికి వచ్చారు. ఆయనను ఇద్దరు వ్యక్తులు రెండు వైపులా పట్టుకొని తీసుకు వచ్చారుట. అప్పుడు వారు ఈ విధంగా అనుకున్నారట. “నాకంటే కూడా నడవలేనివారు ఎంతో మంది ఉన్నారు కదా ? ఇదే నేమో అమ్మ ప్రబోధంలో “నవ్వుతూ అనుభవించే వారి దగ్గరకి ఏడుస్తూ అనుభవించే వారు సలహాకి వస్తారని” చెప్పిన సారాంశం అని చెబుతూ వారు ఒక చక్కని ఉదాత్తమయిన వివరణ యిచ్చారు. “కష్టాలన్నీ తొలగించటం కాదు. కష్టాలని ఏ విధంగా చూడాలి అనేది అమ్మ ప్రబోధించినది” అన్నారు. ఈ విధంగా పైన వివరించిన సంఘటన వారికి చెప్పకనే చెప్పిన ఒక వజ్రతుల్య ప్రబోధాత్మక సందేశమయినది. ఒక్కసారి దేహం పరిస్థితి బాహ్యమయిన స్థితిగతులు మారకపోయినా నిండైన సంతృప్తితో అచంచల విశ్వాసంతో తన ఆశయానికి అంకితమయ్యేటట్లు చేసింది.
ఇది సాధారణంగా కనబడుతున్నట్లు జరిగిన ఒక అపూర్వ సంఘటన. ఎందుకంటే అంతరంగమే ఒక ఉజ్వలమయిన రీతిలో మారటం మహోన్నతం. దైవాన్ని ఆరాధించటం జీవితాల్ని అర్థం చేసుకోవటం, ధ్యేయానికి అంకితం అవటం అంటే ఏమిటో సరియైన రీతిలో హృదయానికి హత్తుకొని అనివార్యమయిన ద్వంద్వాల జీవితంలో అంటే కష్టం. సుఖం, సంపద దారిద్య్రం, ఆరోగ్య అనారోగ్యాలు మొదలయిన వాటిని తలచుకొని మానసికంగా కృంగిపోవటంకాక వీని నుండే ఒక ఉజ్వల స్ఫూర్తిని పొందటం, తనకు ఏర్పడిన స్థితి నుండే తాను అంకితమయిన ధ్యేయ సాధనా మార్గంలో జీవితాన్ని గడపటమనేది పంచాగ్నుల మధ్య తపస్సులాంటిది. ఇటువంటి వజ్రతుల్య అంతరంగం అనేది అమ్మ సన్నిధిలో ఆ విధంగా ఏర్పడినది. మాటలు లేని సంఘటనతో అంతకు ముందు తాను చేసిన ప్రబోధంలోని ఉజ్వల తాత్విక తేజఃకిరణం వారి హృదయంలోకి చొచ్చుకొని పోయి సమాధానం వచ్చింది.
మొదటిసారిగా అయిన నా అనుభవం అమ్మ చెంతకు రాక ముందు నాగార్జున సాగర్ లో జరిగింది. మా అన్నయ్య ఒకసారి అమ్మని గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆ విధంగా చాలాసార్లు అంతకముందే విన్నాను. కాని నాకేమి అనిపించలేదు. మరి ఆ రోజు అంతగా ఎందుకు హృదయానికి హత్తుకున్నదో చెప్పాలంటే “బాహ్యంగా ప్రత్యేకమయిన ప్రమాణాలు లేవు. నాకు అమ్మని గురించి చెప్పిన తరువాత తను వెళ్ళిపోయాడు. నేను ఒక్కడినే వెళ్తున్నాను. చుట్టూతా చూస్తున్న చెట్టు, చేమ, కొండ, గుట్ట మొదలయిన వాని రూపాలు ప్రత్యేకంగా మారలేదు. కాని చుట్టు ప్రక్కల ప్రకృతి మొత్తం అమ్మ అనిపించింది. అది హృదయానుభూతేగాని, దృశ్యానుభూతి కాదు. అంటే కనబడు జగత్తు ప్రత్యేకించి జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ రూపంగా కనబడలేదు. కాని అంతకు ముందు చూస్తున్న ఆ ప్రకృతి రూపమే అమ్మ అనే భావానుభూతి హృదయంలో నిలిచింది. తాత్కాలికంగా ఆవేశంతో కూడుకున్న క్షణికమయిన అనుభవంకాక, శాశ్వతమయిన విశ్వాసం అయినది. తరువాత తలచుకోకుండగ వుందామన్నా వుండలేక అమ్మ స్మరణ, ధ్యాన, దానంతట అదే సహజంగా సాగేది. ఆనాటి నా వయస్సుకి మనస్సుకి తగ్గట్లుగా కొన్ని కొన్ని అనుభవాలు కలిగినవి. ఇవి | అన్నీ జిల్లెళ్లమూడిలో వ్యక్తిగా అమ్మని చూడక ముందే జరిగినవి. ఈ విధంగా మాటలులేని అవ్యక్త హృదయానుభూతి వ్యక్తిగా అమ్మ సన్నిధిలో కాక దూరంగా వున్న నాగార్జునసాగర్ జరిగింది. ఈ విధమయిన అనుభవం ఇవ్వటానికి దేశకాల నియమాలకి అతీతంగా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరికైనా అమ్మ ఇస్తుందని రూఢి అయినది..
సాకార రూప దర్శనం (అంటే నెమలి పింఛం, వేణువు ధరించిన కృష్ణుని రూపమో, కోదండపాణి అయిన రాముని రూపం అదే విధంగా అమ్మరూపం) అయినప్పటికి ఎంతో మందికి విశ్వాసం వీగిపోయి జారి పోవటమేకాక పతితులు కూడా అవుతారు. కాని నా మొదటి అనుభవంలోనే అమ్మ యొక్క రూపం ఈ అనంత విశ్వమే అని ప్రత్యేకించి సాకార రూప దర్శనాలతో కూడుకున్న ఋజువులతో పనిలేని అనంత విశ్వాకారమే అమ్మ అనే హృదయానుభూతి కల్గిన ప్రత్యేకించి ఒక రూపంతో అమ్మకనబడలేదనే అసంతృప్తి కాని కోరిక కాని లేకపోగా లోకంలో జనం అనుకొనే సాకార రూప సాక్షాత్కారాలు సర్వం కాదనే భావంతోపాటు ఒక్కొక్కప్పుడు అల్పం అని కూడా తోస్తుంది.
ఒక ఆంగ్లసామెత ఈ విధంగా వున్నది. “The deepest feeling always shows itself in silence”. అతి లోతైన భావోద్వేగం ఎప్పుడూ నిశబ్దంలో నుండే ప్రకటితమవుతుంది. మరి భావమే నిశబ్దం నుండి ప్రకటితమయితే భావాన్ని మించిన అవ్యక్త హృదయానుభూతి నిశ్శబ్దం నుండి ప్రకటితమవుతుంది కదూ ? ఈ విదంగా మాటలు లేని అనుభూతులు వ్యక్తిగా అమ్మ చెంత కొందరికి అక్కడికి వెళ్ళకుండా దూరంగా వున్న నాకు కలిగిన అవ్యక్త హృదయానుభూతి, ఒక అనిర్వచనీయ అనుబంధమై నిలచి నడిచి శాశ్వతంగా అమ్మకి అంకితమవటమనేది జరిగినది. ఈమె మాట్లాడదు ఏమిటి? అక్కడి వారు ఏమి అడగరేమిటి, మాట్లాడరేమిటి ? అనిలోతైన చింతన లేని పుస్తకాల మనుష్యులు అపరిపక్వ హృదయములు అంటారు. అనుకుంటారు. ఎన్నో మాటలు విన్నా ఎన్ని బాహ్యమయిన మహిమలు చూసినా ఏర్పడని మహోన్నత భావం, సమాధానం వీనితో పనిలేని (ఏమహిమలు – మాటలు) నిశ్శబ్ధం నుండి పొందే అవ్యక్త హృదయానుభూతి వలన ఏర్పడుతుంది. ఇదే అమ్మ చెంత మాటలు లేని అనుభూతులలోని విశిష్టతత్వం.
ఈ మౌనం నుండి పొందే అనుభూతి యొక్క సంపూర్ణ విశిష్టతని రమణ మహర్షి ఈ విధంగా వివరిస్తారు. “మౌనం అంటే ఆత్మస్ఫూర్తియే కదా? ఆత్మస్ఫూర్తి లేనిది మౌనం ‘ఏలాగవుతుంది. మౌనమంటే ఎడతెగని భాషన్నమాట.