జిల్లెళ్ళమూడి అమ్మను గురించి విన్నాను. చూడాలని అనిపించింది. వర్షమైనా, వరదయినా, బురదయినా లెక్కచేయక 24.7.66 తేదీ బాపట్ల మీదుగా ప్రయాణమై 7వ మైలు వద్ద బస్సుదిగాను, నాతో పాటు ఒంగోలు నుండి ఒక కెమిష్టు కూడా బస్సు నుండి దిగాడు. “జిల్లెళ్ళమూడికి వెళ్ళే రోడ్డు గండి పడింది. మీరు పోలేరు” అని అక్కడున్నవారు హెచ్చరించారు. అయినా వినక మేము బయలుదేరాము. కుండపోతగా వర్షంకురవడం మొదలైంది. మేము పూర్తిగా తడిసి ముద్దయిపోయినాము. ఎంత వర్షం కురిసినా ఇంతకంటే ఏం చేస్తుంది. మేము నడుస్తున్న రోడ్డు ఒక తెల్ల కాగితంపై నల్లని గీతలాగ ఎటుచూసినా కనుచూపు మేరకు తెల్లగా అగుపించే నీళ్ళ మధ్య మాకు దారి అగుపిస్తోంది. రోడ్డుకు గండిపడిన చోటు వచ్చింది. అక్కడ కట్టబడి ఉన్న చిన్న వంతెన కూలి నీళ్ళపాలై పోయింది. వంతెనమీద రోడ్డుప్రక్కల ఉండే పిట్టగోడలలో ఒక గోడమాత్రం అగుపడుతోంది. అందువలన రోడ్డు ఆ గోడకు ఎటువైపున ఉన్నదీ నీళ్ళమధ్య గుర్తించుట అసాధ్యమైనది. వర్షం అంతకంతకు ఎక్కువగా జొచ్చింది. నావెంట ఉన్న ఆ కెమిప్ను నిల్చుండబెట్టి నే నొక్కడనే లోతు చూడటానికి ఆ వరదనీటిలో కాలు బెట్టాను. నా కాలు క్రింద పీకబంటి నీళ్ళలో మునిగిపోయాను. వరద వేగంగా ఉన్నది. అయినా మనిషికంటే ఎక్కువ లోతు లేనందున తమాయించుకుని, దాటవచ్చునని నిశ్చయించుకుని, నా వెంట వుండే నాతని చేయిపట్టుకొని వరదను దాటాను. నేను వరదలో పడినప్పుడు నా జేబులోని డైరీ – 27 రూపాయల నోట్లు వరదలో పడిపోయాయి. అవి నా వెంట వచ్చుచుండిన అతనికి దొరికాయి. పూర్తిగా నానిపోయాయి. అది కాకతాళీయంగా దొరికి వుండవచ్చునని అనికొంటిని. వర్షమున ఒక సంవత్సరం నుండి చూడని నాకు ఆ నీళ్ళమధ్య కొండపోతగా కురియు వర్షంలో తడవటం చాలా సర్దాగా వున్నది. మేము జిల్లెళ్ళమూడి చేరుకొనక పూర్వము ఎవరో ఒకరు అమ్మతో “అమ్మా ! ఈ వర్షాన్ని ఆపరాదా ?” అని అడిగారట, అప్పుడు అమ్మగారన్నారట “నాన్నా! వర్షము లేక అవస్థపడేవారికి ఈ భారీ వర్షంలో తడవటం కూడా సర్దాగా వుంటుంది” అని మేము వెళ్ళిన తర్వాత ఈ విషయం మాకు చెప్పారు. సందర్భోచితంగా ఈ మాట ఎవరైనా అనవచ్చునని సరిపుచ్చుకున్నాను. అక్కడున్న వారు మమ్ములను చూచి వెంటనే అత్యంతాదరంగా మాకు పొడిగుడ్డనిచ్చారు. తడిసిన నోట్లను వెచ్చబెట్టిచ్చి మేము ఊహించని రీతిగా సపర్యచేశారు. వారి ఆప్యాయత, అనునయము మాకు ఆశ్చర్యం కలిగించింది. వేషభాషల్లో. ఆడంబరం లేకపోయినా వారిలో గల మానవత్వం తోడివారిపై గల ఆత్మీయత సాటిలేనివని గమనించుట కెంతో కాలం పట్టలేదు.
కొబ్బరికాయ, కర్పూరం, మున్నగు సామగ్రితో అమ్మ దర్శనార్థం వెళ్ళాము. అమ్మ మంచం మీద కూర్చుని చుట్టూ వున్న వారితో కబుర్లు చెప్తూ వుంది. అమ్మ ముఖం ప్రసన్నంగా వున్నది. అమ్మను చూడగానే పాదాలకు నమస్కరింప బుద్ధిపుట్టడం, అమాంతంగా వెళ్ళి పాదాలపైన బడటం క్షణంలో జరిగిపోయింది. అక్కడున్న వారిలో భవాని అనే అమ్మాయి అమ్మగారిని పూజించుకొమ్మని సలహా ఇచ్చింది. కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి గంట కొట్టి పూజ చేసే అలవాటు నాకు ఎప్పటికీ లేదు గాన “నాకు రాదండీ” అన్నాను. అయినా ఆమె సలహా మేరకు పూజించాను. అమ్మ నన్ను జూచి మొదటిసారిగా “నాన్నా! అన్నం తిన్నావా’ అని అడిగింది. “అమ్మా బాగా టిఫిన్ చేశాను. ఆకలి లేదమ్మా” అన్నాను. నన్ను మంచం దగ్గరికి, తనకు చేరువగా రమ్మన్నది. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అరటిపండ్లను ఒక్కొక్కటే ఒలిచి పసివానికి తినిపించినట్లుగా తినిపించింది. అమ్మ ఆదరణలో, అనురాగంలో, ఆప్యాయతలో ప్రసన్న వీక్షణావళిలో ఎంతో గుండె నిబ్బరం గల వాడనని ఎప్పుడూ అనుకునే నేను చల్లగా నీరుకారిపోయాను. నా మనస్సు, సర్వేంద్రియాలు చెప్పలేని దివ్యమధురానుభూతిని అనుభవిస్తున్నాయి. అంతటి చలి గాలిలోనూ నా శరీరం చెమటలు పోసింది. కళ్ళ వెంబడి నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. సర్వం మరచి నిశ్చేష్టుడనై అమ్మను చూస్తూ అమ్మ తినిపించే అరటిపండ్లను యాంత్రికంగా తింటూ ఉండిపోయాను. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, పండరీపురం, బెజవాడ కనకదుర్గ మున్నగు క్షేత్రాలను దర్శించి ఆ క్షేత్రాధిపతుల సాన్నిధ్యమున చాలా సేపున్నాను. నాకున్న మలిన మనస్కత తప్ప ఏ అనుభూతి నాకు గలుగలేదు. ఏ దేవుళ్ళ సన్నిధి యందు కలగని అనిర్వచనీయమైన దివ్యమధురానుభూతి అమ్మ సాన్నిధ్యంలో నాకు కలిగింది. ఆ రోజల్లా అమ్మ వద్ద నుండి బయటకు వెళ్ళలేదు. అమ్మ కబుర్లను వింటూంటే ఆకలి దప్పులు ఉండవు. రోజులు క్షణాల్లాగా గడుస్తుంటాయి. భోజనం చేయవలసిందిగా అమ్మ ఆనతిచ్చింది. అమ్మ ఆనతితో వసుంధరమ్మ అన్నం పెట్టింది. భోజనం చేసి అమ్మ వద్ద కూర్చుని అమ్మ నిద్రనటించగానే నేను వెళ్ళి నిద్రించాను.
మరుదినం శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య గారితో పరిచయం కలిగింది. వారు అమ్మవద్దనే ఎక్కువ కాలం గడుపుతూ వుంటారు. వారితో పాటు నేను కూడా అమ్మ పాదాల వద్దనే కూర్చున్నాను. అమ్మ వద్ద నాకున్న భయం పోయింది. చనువు లభించింది. మా యిద్దరికీ లంగా అన్నయ్యగారు పృచ్ఛకులుగా నిలిచారు. ప్రశ్నోత్తరాలీ క్రింది విధంగా ఉన్నాయి.
“అమ్మా ! మంచికీ, చెడ్డకూ భేదం తెలిసింది. ఎక్కడుండినా మనసు చెడ్డతలంపువైపుకే ఎందుకు లాగుతుంది? చెడ్డ తలంపు వచ్చిన పిమ్మట అందుకు గాను బాధ కలుగుతుంది. అయినా మనసు చెడు తలంచక మానదు. ఇది ఎందుకు జరుగుతుంది ? ఇది ఎప్పుడు ఎట్లా పోతుంది?”
“నాన్నా! ఇప్పుడు ఏదైతే నీకు చెడ్డగా దోచిందో ఒక కాలంలో అదే నీకు మంచిదిగా దోచింది. నీ మనస్సు దానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎప్పుడైతే అది చెడ్డదనే భావం నీకేర్పడిందో ఆక్షణమే దానిని పారద్రోలుటకు నాంది జరిగింది. అది చెడ్డదనే భావం నీకు తనంతటే కలిగింది.
తరుణం రాగానే అది తనంతటదే పోతుంది. దానిని గురించి బాధపడనవసరం లేదు. మంత్రాలతో, మాటలతో చిటికెలో పోయేదిగాదు”.
“అమ్మా ! ఇందాక రకరకాలైన ఫోటోలలో నీ మూర్తిని చూచాను. ఒక చోట గణపతిలాగా, ఒక చోట భయంకరమైన దుర్గలాగా, ఒకచోట ప్రసన్నవదనంతో అమ్మలా ఒక చోట పరమహంసలాగా కన్పించావు. అన్ని రూపాలు నీకు ఎట్లా వచ్చాయి. ”
అమ్మ నవ్వింది. “నాన్నా! ఒకే రకమైన బొమ్మను అనేక రూపాల్లో జూచే శక్తి నీకళ్ళకున్నది. అంతేగాని బొమ్మల్లో ఏముంది?” అని తేలికగా దాటేసింది.
“నాకు చెప్పడం నీకు ఇష్టం లేదులే అమ్మా!” అన్నాను. “నేను చెప్పను” అని అమ్మ కచ్చితంగా అన్నది. అన్నయ్యగారు కలుగజేసుకుని “అమ్మ నోటితో చెప్పదు. క్రియలో చూపెడుతుంది. అంతేకదమ్మా!” అన్నారు.
ఏమహాపండితులకు లేని – ఏ పాండిత్య ప్రకర్షకు అందని అమోఘమైన శబ్దశాసనత్వం అమ్మలో ఉన్నది. ఎటువంటి క్లిష్టమైన సమస్యనయినా, జటిల ప్రశ్నకైనా సులువుగా, సోదాహరణంగా వారి ప్రశ్ననుండియే సూటియగు సమాధానం అందిస్తుంది. అమ్మ సమగ్ర సకల భాషా నిఘంటువు. అమ్మ మాటలు వరాల మూటలు. కాదు రతనాల పేటలు. అంతేకాదు. అమృతపు గుళికలు, అక్షర జ్యోత్సలు. అమ్మ పడుకున్నది. అన్నయ్యగారు లేచి వెళ్ళారు. నేనొక్కడనే మిగిలిపోయాను.
అమ్మను గురించి పుస్తకమేదైనా ఉంటే చదువు కుంటూ వుందునే అని మనస్సులో అనుకున్నాను. పడుకొని కళ్ళు మూసుకుని వున్న అమ్మ ఎవరినో పిలిచి జన్మదిన సంచికను తెప్పించి నాకిచ్చి “చదువుకో నాన్నా!” అన్నది. దీనిని మరి కాకతాళీయమని గాని, సందర్భానుసారమని గానీ అనుకోలేకపోయాను. పిల్లల ఆకలినీ, అభిరుచినీ పసిగట్టి అడుగకనే అవసరమైన దానిని అందించే మాతృదేవతే అమ్మ. అమ్మ సర్వజ్ఞత్వం చూడగా కలిగిన ఆశ్చర్యం నుండి కొన్ని క్షణాలు నేను తేరుకోలేకపోయాను. సాయంకాలం దాకా ఆ పుస్తకం చదువుతూ అక్కడే కూర్చున్నాను. అమ్మ లోపలికెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చింది. అభిషిక్తమైన దేవతామూర్తిలాగా అమ్మ అవతరించింది. సంధ్యాకాల ప్రార్థన మనోజ్ఞంగా, మధురంగా, శ్రావ్యంగా, భక్తియుక్తంగా గానం చేయబడింది.
“అమ్మ సుప్రభాతం వినలేకపోతినే” అని మనసులో అనుకుంటున్నాను. అమ్మ నావైపు తిరిగి “నాన్నా! భోజనం చేసివచ్చి ఇక్కడే పడుకో. ప్రొద్దున్నే సుప్రభాత స్తోత్రం విందువుగాని” అని అన్నది. అమ్మకు నాపై గల ప్రత్యేక ప్రేమకు నేను కరిగిపోయాను”. నా మనస్సు ఆనందంతో పొంగిపోయింది. అమ్మకు వెంటనే పాదాభివందనం చేశాను నా కన్నులు మరొక్కమారు ఆనందాశ్రువులను అమ్మ పాదాలపై గ్రుమ్మరించాయి.
మరుదినం ఉదయం సుప్రభాత సంకీర్తనం జరిగింది. “ఏ తల్లి రాధికా కృష్ణవేణువు నుండి, అమృత నాదమ్ముగా నవతరించు” అనే పద్యపాద భావం వాస్తవమని నిరూపించే నిదర్శనంగా రాధాకృష్ణశర్మగారి కమనీయ పదజాలం ప్రవిమల భక్తిభావం పెనవేసుకున్న శ్లోక పరంపర, సుప్రభాత ప్రశాంత వాతావరణంలో శ్రీ శారదా భవానీస్వరూపిణుల మంజులమనోజ్ఞ సుస్వర ప్రస్ఫుటాలాపనగా వినవచ్చింది. ఇతర వ్యధలను మరచి ఏకాగ్రతతో అమ్మ పాదాలపై దృష్టినిల్పి అలాగే కూర్చున్నాను. ‘అమ్మ’ అనే శబ్దంలోని పవిత్రత, మాధుర్యం అమ్మ సంకీర్తన వల్ల గలిగే దివ్యానుభూతి అనిర్వచనీయాలు.
అన్నయ్య గారితో సహా నేనూ అమ్మ పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాము. అప్పుడు నా మనస్సులో ఆగష్టు 15 ఇక యిరవై రోజులే వున్నది. ఆనాడు అమ్మకు జరిగే పూజలకు హాజరుకాగలనా అనుకుంటున్నాను. అమ్మ దరహాసంతో నావంక జూచి “ఆగష్టు 15 నాటికి రాగలవు. వచ్చేయి” అని అనతిచ్చింది. అమ్మ ఆనతిలోని అవ్యాజ కరుణామృతము నా శరీరమును పులకింప చేసింది. దారిలో మా కాకలి యగునని ఊహించిన అమ్మ మాకు ఉప్మా చేయించి యిచ్చింది. దానిని అమ్మ ప్రసాదంగా స్వీకరించి ప్రయాణమై వచ్చాము.
వర్షం తగ్గింది వరదకూడా తగ్గింది. కొంతకు కొంత బురదమాత్రం అంతా ఆవరించింది. రోడ్డుకు గండు పడిన
చోట లోతైనా నీటిలో దిగునిమిత్తం గుడ్డలు సర్దుకొను చుండగా ఒక నల్లని తేలు నాకుడికాలిపైకి మోకాలి వరకు చరచరా ప్రాకింది. దానిని గమనించి నేను నాకాలును జాడించడం అన్నయ్యగారు గమనించడం క్షణాలలో జరిగాయి. అయినా తేలు నాజాడింపుకు పడిపోకుండా కాలిపై నుండి క్రిందికి తనంతట తానే చరచరా దిగిపోయింది. అంతసేపున్నా నన్నుకుట్టలేదు. అనుక్షణమూ అమ్మ అండగా వుండగా ఆపదరావడమంటూ వుంటుందా? అమ్మ వద్ద కలిగిన మధురానుభూతులను పునశ్చరణ చేసుకుంటూ మేము బాపట్ల చేరాము.
ఆగష్టు 15వ తేదీన జిల్లెళ్ళమూడిలో అమ్మ సాన్నిధ్యంలో గడిపాను. ‘నువ్వు ఆగష్టు 15కు రాగలవు వచ్చెయ్యి” అన్న అమ్మ నన్ను రప్పించుకున్నది. వివిధ రీతులలో అమ్మకు పూజలు, నీరాజనాలు అర్పితమైనవి. శరీర అవయవములు అణుమాత్రము కదల్పక, సంశయా స్పదమగు ఉచ్ఛ్వాస, నిశ్వాసములతో అమ్మ దేవుడు లాగా కూర్చుని గంటల కొలది పూజలందుకొన్నది. ఇది మానవ మాత్రులకు అసాధ్యమైనది. అమ్మ మానవాతీత, మహిమాన్విత, అనుకొనుటకు ఇది గూడా ప్రబల నిదర్శనం. రెప్పవేయకుండ అమ్మను తిలకించడం తప్ప అలవాటు లేని ఆ పూజ లేవియూ నేను చేయలేదు. నాకా కోరికయే గలుగలేదు.
ఇది వరలో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసిన శ్రీశ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు ఆంగ్లంలో అమ్మను గురించి తాను వ్రాసిన పుస్తకమనుచు పెద్దల సమక్షంలో అమ్మకు చదివి వినిపించుచుండిరి. పాశ్చాత్య దేశాలలో ఆంగ్ల భాషాభ్యాస మొనర్చి నిష్ణాతులైన వారి రచనను వింటున్న అమ్మ ఒక చోట ఆపమని చెప్పి “స్టమక్ ట్రబుల్” అనుపదమును తీసివేసి “స్టమక్ డి జార్డర్” అని వ్రాయమని సవరణ చేసింది. ఆంగ్లభాష యందు అమ్మకు ఇంతటి పాండిత్యమెలా వచ్చింది ? ఇది శ్రీ వాణీ గిరిజా స్వరూపిణియగు అమ్మలోని సరస్వతీ స్వభావంగాక మరేమిటి ? ఆగష్టు 15వ తేదీన రాత్రి దాదాపు మూడు గంటల సమయమున అన్నయ్యగారు, శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు, ఇంకా ఇతర పెద్దలు అమ్మ పడుకుని యుండు మంచం చుట్టూ చేరి కబుర్లు చెప్తున్నారు. అవి వట్టి కబుర్లు కావు. వేదాలు ఏమి ? ఎటువంటివి ? అలాంటి ప్రశ్నలు. వాదాలకతీతమైన అమ్మకు వేదాలు వినోదాలుగా నున్నాయి కాబోలు. పొయ్యి, చీవురు, చేట, కత్తిపీట, రోలు, రోకళ్ళతో పోల్చి సరసంగా వివరించింది. అక్కడ గుమిగూడిన ‘సమావేశమునకు” సమమైన ఆవేశము కలదే సమావేశమని చక్కగా వ్యాఖ్యానించింది. సుప్రభాత కీర్తన మొదలైంది. వారు వెళ్ళగానే అమ్మ పాదాల వద్దగా చిన్నగా చేరాను.
అమ్మ నన్ను జూచి ‘ఏమి నాన్నా?’ అన్నది. ఆక్షణంలో నాకు జనించిన సంశయం నిస్సంకోచంగా అమ్మ ఎదుట బెట్టాను. అమ్మా ప్రతిదినమూ ఉదయం “ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ హే మాత” అని నిన్ను నిద్రలేపడం అవసరమా ? అట్లా లేపకపోతే నీకు మెలకువరాదా ? మీరింతకూ నిద్రపోతారా?” అని అడిగాను. అమ్మ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. “మీరు మేల్కొని నన్ను లేపుతారు. నేను నిద్రపోతున్నానని మీరు మేల్కొల్పుతారు. మేల్కొల్పుట మీకు అవసరం గనుక. నేను మిమ్ములను ఆటంకపరచను. నా నిద్రనాకుంటుంది” అని సమాధాన మిచ్చింది. అమ్మ వద్ద శలవు తీసుకుని నేను, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, బాపట్ల వ్యవసాయ కళాశాల ఆంగ్లోపన్యాసకులు శ్రీ పురుషోత్తంగారు అమ్మ గుణగణాలను వర్ణించుకుంటూ తిరిగివచ్చాము.
అమ్మ పాదాల దివ్యస్పర్శకు నోచిన జిల్లెళ్ళమూడి ఒక పవిత్రక్షేత్రము, కాశీలో ఉన్న అన్నపూర్ణ, అన్నం పెట్టినదీ, లేనిదీ నాకు తెలియదుగానీ జిల్లెళ్ళమూడిలో అమ్మ నిత్యాన్న దానం చేసే అన్నపూర్ణయే. కదలక మెదలక ధరణికి అతుకుకున్న శిలామూర్తి వలె కాక, ప్రతి కదలికలో ప్రత్యేక దివ్యత్వమందిస్తూ మృదుమధురవచనామృత వాహినిలో ప్రతి హృదయాన్నీ పునీతమొనర్చే యీ అమ్మ మాట్లాడే దేవతయే”.
(అడుగడుగున అమ్మ ఇచ్చిన అనుభూతులను పొందిన ఆ సోదరుడు వాటిని మనకందించారు. ఆయన అన్నట్లు ఆనాటికీ ఈనాటికీ ఏ నాటికి మాట్లాడే దేవతే అమ్మ. ఆ అమ్మను ఆశీస్సులందించమని అందరం. వేడుకుందామా మరి. – సంపాదకుడు)
1966 డిసెంబర్ మాతృశ్రీలోని యీ వ్యాసం దయామణి సేకరించి పంపించింది.