1. Home
  2. Articles
  3. Mother of All
  4. మాతృధర్మం

మాతృధర్మం

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 10
Month : October
Issue Number : 4
Year : 2011

 శ్రీ ఎమ్. దినకర్ అన్నయ్య బాపట్ల ఎస్.బి.ఐలో మేనేజర్గా పని చేస్తూన్న రోజులవి. బ్యాంకు వెనుక ప్రభుత్వ వసతి గృహంలో నివాసం. అన్నయ్యకి ఇల్లూ ఆఫీసే. ‘రాజ్యం స్వహస్త ధృత దండమివ ఆత పత్రం’ (గొడుగును ముందు మనం మోయాలి. అపుడే అది నీడనిస్తుంది. అలాగే ప్రభుత్వం) రాత్రి బాగా పొద్దు పోయింది. అయినా ఏవో ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ మంచమ్మీద విశ్రాంతి తీసికోవాలని ప్రయత్నిస్తుండగా ఫోన్ గణగణా మ్రోగింది. ‘దినకర్ మాట్లాడుతున్నాను” అని వ్యవహార ఫక్కీలో స్పందిస్తే, “నాన్నా! వెంటనే బయలుదేరి జిల్లెళ్ళమూడి రాగలవా?” – అంటూ మురళీనాదసదృశ అమ్మ పలుకులు మృదు మధురంగా వినవచ్చాయి. తక్షణం జాగ్రదావస్థలోకి వచ్చి ‘తప్పకుండా వస్తానమ్మా’ అని బయలుదేరి ఎన్నో విఫలప్రయత్నాల అనంతరం అమ్మ పిలుపే బలంగా ఏదో విధంగా ఆ అర్ధరాత్రి జిల్లెళ్ళమూడి చేరారు. రోగికి, యోగికి, భోగికి రాత్రి సమయమే లక్ష్య సిద్ధికి అమృత ఘడియలు.

శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య కుమారుడు చి॥ చైతన్య పసివాడు. ఆ చిరంజీవికి తక్షణ వైద్యసదుపాయం నిమిత్తం గుంటూరు తీసికొని వెళ్ళాల్సి ఉంది. అన్నయ్యను పిలిపించిన ఉద్దేశం అది.

కానీ కొద్దిసేపట్లో సమయం సందర్భం లేకుండా శ్రీమద్రామాయణంలో రాముని పాత్రను గురించి సుదీర్ఘంగా అమ్మ వివరించటం ప్రారంభించింది; అజ్ఞాన చీకటి తెరలను చీలుస్తూ జ్ఞానకాంతులను ప్రసరింపచేస్తోంది.

అమ్మ సన్నిధిలో అత్యంత సహజమైన ఆశ్చర్యకరమైన విషయం ఇదే. అమ్మయందలి అకుంఠిత భక్తి విశ్వాసాలతో, త్యాగనిరతితో, సేవాతత్పరతతో అమ్మకి లేదా సంస్థకి సేవ చేసినట్లు, చేస్తున్నట్లు చరిత్రలో కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా కనిపిస్తారు. అనిపిస్తారు. కానీ వాస్తవం ఏమంటే జిల్లెళ్ళమూడిలో (దైవసాన్నిధ్యంలో) ఎవరు ఏ సేవ అందించినా దాని ఫలం వారి అభ్యున్నతి మాత్రమే; మరేమీ కాదు. అమ్మ ఎవరితోనైనా ఏ సందర్భంలోనైనా చెప్పిన మాటలు బ్రహ్మసూత్రాలు; అవి వారి భావిజీవితానికి మార్గదర్శకాలు, గాఢాంధకార జీవనమార్గంలో ఉజ్జ్వల కరదీపికలు.

ఉపోద్ఘాతంతో నిమిత్తం లేకుండా సూటిగా ‘రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః’ – అనే తాత్పర్యంతో ఆరంభించి – ధర్మ నిరతుడైన కుమారునిగ, వినయ విధేయతలు గల రాకుమారునిగ, ఏక పత్నీవ్రతదీక్షా దక్షునిగా, వాత్సల్య స్వరూప సోదరునిగ, సౌజన్యశీలిఐన స్నేహితునిగ, సౌహార్ద్రహృదయ శతృవుగ, సకల జనరంజక ఏలికగ… అన్నియుగాల్లో అన్ని తరాల్లో అన్ని పాత్రలలో ముమ్మూర్తులా ధర్మస్వరూపుడే రాముడు – అని వివరించింది. విరామం లేని ఆరామతత్త్వం వేదవేద్య అయిన అమ్మే. గోపాల్ అన్నయ్యతో ఒక సందర్భంలో సవాలుగా “నేనే మగవాడ్ని, మీరంతా స్త్రీలే” అన్నది ఆదిపురుషుడు అయిన అమ్మ. అమ్మ ఒక సామాన్యగృహిణిలా కనిపిస్తుంది. కానీ ‘సహస్ర శీర్షా పురుషః…’ అని వేదాలు వర్ణించే విరాట్స్వరూపం అమ్మ అనే దర్శనం యోగులకు మాత్రమే సాధ్యం.

“కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ | 

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢ వ్రతః॥ 

చారిత్రేణచ కోయుక్తః సర్వ భూతేషు కో హితః॥ 

విద్వానకః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః॥ 

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః |

 కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 

– అని వాల్మీకి మహర్షి నారద మహామునిని ప్రశ్నించటంలోనే రాముని సద్గుణాలన్నీ రాశీభూతమైనాయి.

‘రామోద్విర్నాభిభాష’ – శ్రీరామునికి రెండు మాటలు లేవు; ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. మహాత్ములకి మాటే మంత్రం. మాట అంటే మారు మాట లేని మాట. సంఘంలో సామాన్యంగా తంటాలు పడే వాళ్ళంతా మారుమాట గల వాళ్ళే.. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుని రూపాన్ని – ‘తేజసా ఆదిత్యసంకాశం, ప్రతిపత్ చంద్రదర్శనం’ – సూర్యప్రభ వంటి తేజస్సు, చంద్రకాంతి వంటి స్వరూపం – అని వర్ణిస్తారు. వ్యక్తి సౌందర్యానికి కారణం గుణ ఔన్నత్యం: వయస్సు హంగు, పొంగు, అంగసౌష్టవం కాదు. ఉదాహరణకి ‘సోక్రటీస్’.:

ధర్మ పరిరక్షణ కోసం ప్రాణ సమానమైన ధర్మపత్ని సీతాసాధ్విని రెండుసార్లు పరిత్యజించాడు. అది ఒక విధంగా ఆత్మహత్యాసదృశమే. పితృవాక్పరిపాలన కోసం రాజమకుటాన్ని తృణ ప్రాయంగా విసర్జించి, కఠోర వనదీక్షని సంతోషంగా పరిగ్రహించిన ధీరోదాత్తుడు రాముడు. నిష్కళంకంగా 1000 సం||లు రాజ్యపాలన చేశాడు. ‘రాజ్యం’ అంటే ‘రామరాజ్యమే’ అని ఒక గీటురాయిని నెలకొల్పాడు. ‘రక్షితా స్వస్యధర్మస్య స్వ జనస్య చ రక్షితా’ – తన యొక్క తన ప్రజల యొక్క ధర్మాన్ని పరిరక్షించాడు.

రాముడు స్వసుఖనిరభిలాషుడు; స్మితపూర్వాభి భాషుడు. అయినా సామాన్యమానవ దృష్టిలో రాముడు ఏం సుఖపడ్డాడు?

ఈ సంగతులన్నీ ఏకరువు పెట్టి, అమ్మ సూటిగా ఒక్క ప్రశ్న వేసింది – “రాముడు ఏం పొందాడు, నాన్న?” – అని. నిజమే. రాముడు తన సుఖాన్ని త్యాగం చేసి ఐచ్ఛికంగా జీవితమంతా ముళ్ళబాటలోనే పయనించాడు.

ఇపుడు “అమ్మ” జీవితాన్ని, అవతారసమయాన్ని పరిగణనలోకి తీసికొని అదే ప్రశ్న వేసుకుందాం. “అమ్మ” ఏం పొందింది? అంటే వ్యక్తి గతంగా ఏం లబ్ధిపొందింది? అమ్మ ఏం చేసిందో గుర్తుకు తెచ్చుకుంటే అమ్మ లక్ష్యం సువిదితమౌతుంది; అమ్మ శ్వాసించినదీ, శ్వాసిస్తూన్నదీ ‘మాతృధర్మ పరిరక్షణ కోసం అని స్పష్టమౌతుంది.

కూడు, గుడ్డ, నీరు, నీడ.. మానవుని మౌలిక అవసరాలు. తన అవసరాల్ని విస్మరించి అమ్మ తన యావత్తు సంపదని, సర్వం సహాశక్తిని, ప్రతిక్షణాన్నీ బాధితుల్ని ఆదరించటానికి ఆదుకోవటానికి వెచ్చించింది. వేలాది మందికి స్వయంగా అన్నం తినిపించింది; లక్షలాది మందికి అన్నంతోపాటు ఆదరణ, ఆప్యాయత, అనురాగాన్ని పంచింది; మానవతావిలువల్ని పెంచి పోషించింది. మహిమాన్విత మధుర మాతృవాత్సల్య బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. కనుకనే ఆస్తికులూ – నాస్తికులూ, మానవులు – దానవులు – దేవతలు, పశుపక్ష్యాదులు… సృష్టిలోని అణువణువూ… అమ్మ ఒడిలో పసిబిడ్డలుగా పరవశించింది. సత్యాన్వేషిగా, యదార్థవాదిగా అంధవిశ్వాసాల్ని మూఢనమ్మకాల్ని ఖండించి, జీవకోటిని సముద్ధరించింది; అఖండ జ్ఞానామృతాన్ని అయాచితంగా స్వపరభేదం లేక సర్వులకూ అనుగ్రహించింది. మమకారపాశంతో బంధించి, వర్గ వైషమ్యాలతో కుతకుతలాడే హృదయాల్ని ఒకే త్రాటిపై నడిపించి, వర్గరహిత సమాజస్థాపన చేసింది. అనురాగ రక్తసంబంధ బాంధవ్య పునాదులపై అందరింటిని నిర్మించి అగతికులకు, నిరాశ్రయులకు దిక్కు, దిక్సూచి అయింది.

అన్నపూర్ణాలయాన్ని స్థాపించి అన్నమయ కోశాన్ని, వైద్యాలయాన్ని స్థాపించి ప్రాణమయకోశాన్ని, హైమాలయాన్ని స్థాపించి మనోమయ కోశాన్ని, పత్రికలు – విద్యాలయాన్ని స్థాపించి విజ్ఞానమయ కోశాన్ని, అనసూయేశ్వరాలయాన్ని స్థాపించి ఆనందమయకోశాన్ని సంతృప్తి పరిచింది. తత్త్వతః ఆదరణాలయాన్ని స్థాపించి శాంతిని సుస్థిరంచేసింది. పత్రికలు, అన్నపూర్ణాలయ సభ్యత్వం తీసుకొనుటకు పేరు పేరున ప్రోత్సహించటం; లారీల పరిమాణంలో బియ్యం, క్వింటాళ్ల తూకంగా పప్పు దినుసులు, బస్తాల లెక్క ఉసిరికాయలు, చింతకాయలు, మామిడి కాయలు, గోంగూర… సేకరించి, ఏడాదికి సరిపడు పచ్చళ్లు సమకూర్చటం… ఎవరి కోసం? మాతృధర్మ పరిరక్షణ కోసం.

అమ్మ సాన్నిధ్యంలో శ్రీలలితా కోటి నామ పారాయణ, సప్తసప్తాహాలు, గాయత్రీయాగం, సరస్వతీ సామ్రాజ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు… ఎన్ని నిర్వహించినా అమ్మ వాంఛితార్థం ఒకటే – వచ్చిన వాళ్ళకి కట్టుకోను నూతన వస్త్రాలు, కడుపునిండా కమ్మటి భోజనం ఆదరణగా పెట్టాలి. దీని ఆంతర్యం మాతృధర్మ పరిరక్షణ.

శ్రీరాముడు చేసింది ధర్మాచరణ. ధర్మప్రబోధం కాదు. పురాణాలూ ప్రవచనాల ద్వారా ధర్మ ప్రబోధం వినిపిస్తుంది. మాటలు కాదు చేతలే మనుష్యుల్ని సంస్కరిస్తాయి. అందరినీ, అన్నిటినీ అమ్మ తన సంతానంగా ప్రేమించింది. బిడ్డల బురద అనే కుసంస్కారాన్ని క్షాళనం చేసే ప్రక్రియలో ప్రాణాపాయ ప్రమాదకర పరిస్థితుల్ని అమ్మ ఎన్నో సార్లు ఎదుర్కొన్నది. నిర్భయంగా ఆహ్వానించింది. ఎన్నో అనుమానాల్ని, అవమానాల్ని సహించింది. ఆత్మ సంహననోద్యుక్త పుత్రప్రేమ ప్రవర్షిణిగ నిలిచింది. అమ్మ వ్యక్తిత్వం మేరు పర్వతం కంటే ఉన్నతమైనది; అమ్మ హృదయం సముద్రం కంటె గంభీరమైనది. అటువంటి ఒక విపత్కర సన్నివేశానికి సాక్షి అయిన గోపాల్ అన్నయ్య హృదయం ఛిన్నాభిన్నంకాగా ఆదుర్దాగా అమ్మదరి చేరి, ‘అమ్మా! ఇపుడేమైంది?’ అని కంగారు పడుతూంటే, అమ్మ నిశ్చలంగా, “అవును, నాన్నా! ఇపుడే మైంది?” అని తిరిగి ప్రశ్నించింది. నవ్వుతూ తన కేమీ జరగలేదనీ, తనకి ఏ ప్రమాదం వాటిల్లదని పరోక్షంగా భరోసా నిచ్చింది. అమ్మ సహజ సహనానికి మూలం:

బాల్యంలో ఒకసారి అమ్మకి తీవ్రంగా అనారోగ్యం చేసింది. అది చూసి చిదంబరరావు తాతగారి కన్నులు జలజలా వర్షించాయి. గుండె దడదడలాడింది. తాతగారితో అమ్మ, “కంగారు పడకండి. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి” – అన్నది.

అమ్మ దినచర్యకి కొన్ని ఉదాహరణలు :

ఒకసారి రోడ్డు మరమ్మతు బాపతు కూలిపని చేసే స్త్రీలు కొందరు అమ్మ దర్శనార్థం వచ్చారు. ధూళి ధూసరమైన జీర్ణమైన వస్త్రాలతో, ఎండలో మాడి వివర్ణమైన శరీరాలతో విధిని ఎదిరించలేని బరువైన జీవితాల్ని గడుపుతూన్న వాళ్ళు బిక్కుబిక్కు మంటూ ఓ మూల ఒదిగి గుడ్లు అప్పగించి అమ్మ వంక చూస్తూన్నారు. అక్కడ ఉన్నది ‘అమ్మోరు కాదు, అవ్యాజకరుణారసార హృదయ “అమ్మ” అని వారికి తెలియదు కదా!

ప్రక్కనే ఉన్న సో॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారితో వాళ్ళకి పెట్టుకోను చీరలను తెమ్మని అమ్మ మెల్లగా చెప్పింది. వారు లోపలికి వెళ్లి బీరువాలో చూస్తే ఖరీదైన మూడు / నాలుగు పట్టుచీరెలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక వట్టి చేతులతో వేగంగా తిరిగి వచ్చి అమ్మకి ఆ సంగతి నివేదించారు. శరవేగంతో అమ్మలోపలికి వెళ్ళి, మెరుపులా ఆ చీరెల మూటను తెచ్చి ఆదరణగా వాళ్ళకి పెట్టుకుని హత్తుకున్నది. నిజమైన కడుపు తీపి అంటే అదే. చదువు, సంపద, భక్తి, సంస్కారం… ఉన్నవాళ్ళూ లేనివాళ్ళనే భేదం అమ్మకి లేదు. ఆ ప్రక్కనే ఉన్న మరొకరు, ‘వాళ్ళు అంత ఖరీదైన చీరెలు కట్టుకోరు, అమ్ముకుంటారు’ అన్నారు. వెంటనే కత్తివాటు పడ్డ బెబ్బులిలా ఆ మాతృహృదయం, ‘అయితే ఏమిటి?’ అని మాత్రమే ప్రశ్నించి శాంతించింది. ప్రతిఫలాపేక్షతో అమ్మ ఏ పనీ చేయదు. వాళ్ళకి పెట్టుకునే అవకాశం తనకి లభించటమే మహాద్భాగ్యంగా భావించింది. ఆ విధంగా పెట్టుకోవటం తనకి తృప్తి, పెట్టుకోలేకపోవటం వెలితి. బిడ్డలను ఆరాధించడం అనే తపముగా ఫలపరిత్యాగము చేసిన యోగీశ్వరేశ్వరి అమ్మ.

మరొక ఉదాహరణ :

అమ్మ చలన చిత్ర నిర్మాణ కార్యనిర్వహణలో మద్రాసు, బొంబాయి… వంటి నగరాల్లో ప్రముఖుల్ని కల్పుకునే కార్యసాధనలో గోపాల్ అన్నయ్య మునిగి తేలుతున్న రోజులవి. తిరుగు ప్రయాణంలో చీరాల వచ్చాడు. ‘మీ అమ్మాయి వివాహం నిశ్చయించావటగా? పెళ్ళి ఎప్పుడూ?’ అని సోదరి ఆత్రంగా ప్రశ్నించింది. అన్నయ్య ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘నాకేమీ తెలియదు’ – అంటూ జిల్లెళ్ళమూడి చేరాడు. లాంఛనాలూ, కట్నకానుకలూ… సకల బాధ్యతా అన్నయ్య తరపున తన మీద వేసుకుని అమ్మ నిశ్చయ తాంబూలం స్వీకరించి, సుముహూర్తాన్ని కూడా నిశ్చయించింది. అన్నయ్య, ‘అమ్మా! చేతిలో కాని లేదు. కొంత వ్యవధి కావాలి’ – అని అంటే “మీ దంపతులు వచ్చి పీటల మీద కూర్చోండి చాలు’ అన్నది అమ్మ.

ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నత విద్యాభ్యాసం గురించి, మరొక కుటుంబంలో అమెరికాలో పని చేసే అబ్బాయితో వివాహం గురించి, శుభాశుభకార్య పరంపర నిర్వహణ గురించి, ఆస్పత్రులూ అనారోగ్యాలూ నుంచి ఒడ్డు ఎక్కించటం…. ఇలా చెప్పుకుపోతే నలుగురితో, నలుగురిలో చెప్పగలిగినవి. చెప్పలేనివి ఎన్నో! వాటిని అక్షరబద్ధం చేస్తే ఉద్గ్రంధం అవుతుంది.

ఇవన్నీ కంటికి కనిపించే అమ్మ సేవలు. మానవ మేధస్సుకి ఇంద్రియాలకి అగ్రాహ్యమైన అగోచరమైన అతులితమైన ఎన్నో సేవల్ని పాత్రతాపాత్రతల్ని పరిగణించక అహరహం అవిశ్రాంతంగా అమ్మ అందిస్తోంది.

“తల్లి అంటే తరింప చేసేది”; ‘అడగనిదే అవసరాన్ని గమనించి పెట్టేదే అమ్మ’ వంటి అమ్మ వాక్యాల్లోని హామీ చరిత్ర ఎరుగనిది; అగణితమైనది. అమ్మ సకల క్రియలకూ మూలం ఒకటే, ‘మాతృధర్మం’. అమ్మ అవతార పరమ లక్ష్యం అదే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!