అమ్మను దర్శించుకోవటం మన భాగ్యం, గొప్పవరం. అవతారమూర్తి అమ్మదర్శన, స్పర్శన సంభాషణాదుల భాగ్యంపొంది నేను ధన్యురాల నయ్యాను. కోటికి ఒక్కరికి ప్రాప్తిస్తుంది ఆ సౌభాగ్యం. అదంతా కేవలం అమ్మ అనుగ్రహమే.
నా జీవితంలో సంభవించిన అనేక సంఘటనలు, ఒడుదుడుకులు, ఎదురీతలని అధిగమించి నేను ఒక మనిషిగా నిలదొక్కుకోవటానికి అమ్మ కృపే కారణం. ఆపదలు చుట్టుముట్టినపుడు ‘అమ్మా!’ అని ఒక్క కేక పెడితే తక్షణం ప్రేమామృత ధారలను వర్షించి గట్టెంక్కించేది అమ్మ.
1970 ప్రాంతంలో నాకు జిల్లెళ్ళమూడి నుంచి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. మా తాతగారు శ్రీ భృగుబండ నారాయణరావుగారు అమ్మ సన్నిధిలోనే ఉండేవారు. వారు గుంటూరు వచ్చి నన్ను జిల్లెళ్ళమూడి తీసుకు వెళ్ళారు. వెళ్ళగానే అమ్మ దర్శనానికి వెళ్ళాము. నన్ను తీసుకు వచ్చిన సంగతి అమ్మకు నివేదించారు మా తాతగారు. అన్నీ తెలిసిన అమ్మ ఏమీ తెలియని దానిలా చిరునవ్వుతో తలపంకించింది. తీరా చూస్తే పెళ్ళి చూపుల వంటి తంతు ఏదీ సంభవించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తిరుగు ప్రయాణమై సెలవు తీసుకోవటం కోసం అమ్మ వద్దకు వెళ్ళాం. అమ్మకు పాదాభివందనం చేసుకొని మౌనంగా కూచున్నాడు మా తాతయ్య.
”ఏమయింది, నాన్నా?” ప్రశ్నించింది అమ్మ. ”అమ్మా! గుంటూరులో అందరూ నేను ఏదన్నా మంచి మాట చెపుతానని ఎదురు చూస్తుంటారు” అన్నాడు తాతయ్య దిగులుగా.
”లేదు నాన్నా! దాని మొగుడు ఎక్కడో ఉంటే ఇక్కడికి తీసుకు వచ్చావు దాన్ని” అన్నది అమ్మ నవ్వుతూ. అలా అని ఊరుకోలేదు, నన్ను ఉత్తచేతులతో పంపలేదు. ఏకంగా పెళ్ళికూతురిని చేసి పంపింది. వసుంధర అక్కయ్య చేత తెల్లచీర కట్టించింది. తన గళసీమను అలంకరించిన కనకాంబరాలమాల నా జడకు చుట్టించింది. గుప్పెడు కుంకుమ తీసుకుని నాకు కళ్యాణం బొట్టు తీర్చిదిద్దింది. బియ్యం తెప్పించి నాకొంగులో మూట కట్టించింది. అక్షతలు, పసుపు తలపై చల్లి ఆశీర్వ దించింది. అదంతా నా వివాహానికి ప్రతి బంధకాల్ని పరిహరించడానికి, మార్గం సుగమం చేయటానికి చేసింది. ఇక వెళ్ళిరమ్మని, నన్ను అలాగే గుంటూరు తీసుకువెళ్ళమని చెప్పింది.
అమ్మ దివ్యాశీస్సుల్ని పొందిన నన్ను చూచి మా ఇంట్లో అంతా ఎంతో ఆనందించారు. ఏడాది తిరగ కుండానే – 1971, మే 8న నా వివాహం జరిగింది. నాడు అమ్మ పెట్టిన చీర కట్టి పెళ్ళికూతురిని చేశారు. అష్టకష్టాలు పడి మా అన్నయ్య నా పెళ్ళి చేశాడు; మొదటి శుభలేఖ అమ్మకు పంపి పెళ్ళి పనులు ప్రారంభించాడు.
పెళ్ళి తంతు జరుగుతుండగా నాగవల్లి సమయానికి అమ్మ నాకు స్వయంగా ఒక కానుక పంపింది. తెచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు సుబ్బారావు అన్నయ్యే – చీర,పసుపు – కుంకుమ, నల్లపూసలు, అమ్మ ఫోటో ఉన్న లాకెట్. అందరి నేత్రాల నుండి ఆనంద బాష్పాలు వర్షించాయి. అమ్మ నా జీవన యానంలో ఒక శుభోదయానికి తెరతీసింది, నూతనాధ్యాయానికి నాంది పలికింది. ప్రత్యేకంగా అమ్మ నన్ను కనిపెట్టుకుని సంరక్షిస్తున్నదని అందరూ తలపోశారు.
తర్వాత అందరం జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అమ్మ పాదాలు పట్టుకుని మా అన్నయ్య చాలా దుఃఖించాడు. అమ్మ తన పైట కొంగుతో తన కన్నీళ్ళు తుడిచి ఓదార్చింది. యథావిధిగా నేనూ మా వారూ అమ్మను అర్చించుకున్నాము. మా ఇరువురికి కలిపి ఒకే దండ వేసి ఆశీర్వదించింది అమ్మ. అందరూ శెలవు తీసుకుని వరండాలోకి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఒక ప్రక్కన తలవంచుకుని నిలుచున్నాను. ”ఏమమ్మా! ఏమన్నా మాట్లాడాలా?” అడిగింది అమ్మ. ”అవునమ్మా! ఊహ తెలిసింది మొదలు ఇంతవరకు అన్నీ కష్టాలే ! అన్నీ నీకు తెలుసు. ఆయనకి ఉద్యోగం లేదు. ఎలా బ్రతకాలో భయంగా ఉంది” అన్నాను. అమ్మ నన్ను దగ్గరకు పిలిచింది. ”ఏం చదువుకున్నాడురా ఆ అబ్బాయి?” అని అడిగింది. S.S.L.C. Pass అయ్యారు. Teacher Training కూడా అయింది” అన్నాను.
”సరేలే! దిగులు పడకు. తప్పకుండా ఉద్యోగం వస్తుంది” అని అమ్మ హామీ ఇచ్చింది. 16 రోజుల పండుగ అత్తవారింట్లో ఉన్నాను. అమ్మ ఇచ్చిన హామీ తెలుసుకుని మా వారు పరమానందభరితులయ్యారు. ఈలోగా మా మామగారు వచ్చి మా వారికి ఏదో Registered Post వచ్చిందని, ఒక కవరు తెచ్చి ఇచ్చారు. తెరచి చూస్తే ఉద్యోగం వచ్చింది. Appointment Order అది. అంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి? అది అమ్మ అమోఘవాక్కు, అనిర్వచనీయ ఆశీఃఫలం, వరం. నాటి నుండి మా వారికి అమ్మే ఆరాధ్యమూర్తి. ఆర్తత్రాణ పరాయణ అమ్మ శ్రీ చరణాలకు శతకోటి నమస్కారములు.