“శ్రీవాణీగిరిజా స్వరూపమయి రాశీభూత మాతృత్వమై ఆ వేదంబుల వెల్లునై వెలసి విశ్వారాధ్యమై దివ్య సు శ్రీ వాత్సల్య మరీచి మాలిక శుభశ్రీ నించు నిల్లాలు నా యావచ్ఛక్తియు భావదీప్తి అనసూయాదేవి రక్షించుతన్”
1969 లో పలికాను అమ్మను గూర్చి. ముగురమ్మల మూలపుటమ్మ – అమ్మలందరికీ అమ్మ అనసూయమ్మ. అసూయకు తావు లేనిది. మరి “స్పర్ధయావర్ధతే విద్యా” అన్నారు కదా! స్పర్థ అంటే పోటీ, అసూయ అని కాదు. విద్యలో పోటీ ఉండాల్సిందే – ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఎవరి వద్ద ఎంత విద్య ఉన్నదో అంత తేలిగ్గా తెలియదు.
“విద్య యొసగును వినయంబు వినయమునను
బడయు పాత్రత పాత్రత వలన ధనము
ధనము వలనను ధర్మంబు దానివలన
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు” అన్నారు.
అమ్మ అందరికీ కావలసిన తిండి, వసతి, విద్య, ఆరోగ్యముల కొరకు అన్నపూర్ణాలయం – అందరిల్లు – విద్యాలయం – వైద్యాలయం ఏర్పాటుచేసింది..
విద్యా స్వరూపిణి అమ్మ. విద్యవలన ఏమి వస్తే నరుడు సుఖపడతాడో పైన పేర్కొన్నాడు భర్తృహరి తన సుభాషితాలలో – అమ్మ ఇంకొంచెం ముందు చూపుతో నరుని సర్వతోముఖాభివృద్ధికి ఏ విద్య అవసరమో అలాటి విద్య అందరింట్లో ఏర్పాటు చేయాలని భావించింది. సంస్కారాన్నిచ్చే సంస్కృత విద్యతో పాటు ఆదర్శ విద్యార్థిని తయారుచేసి లోకంలోకి పంపే ఏర్పాటు చేసింది. విద్యతప్ప ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసింది.
ఒక కుగ్రామంలో, గట్టిగా 700 మంది జనాభా – కూడా లేని ఊళ్ళో అందరికీ సమాన భాగస్వామ్యమున్న అందరిల్లేమిటి? విద్యాలయమేమిటి (పాఠశాల కళాశాల) వైద్యాలయమేమిటి, అన్నపూర్ణాలయం (సత్రం) ఏమిటి? ఊహకందని విషయాలే – అయినా సంకల్పమే తానైన వారికి అసాధ్యమేమీ ఉండవనే దానికి నిదర్శనం ఈ అమ్మ.
కళాశాల రాకముందే ఆచార్యులను ఎన్నిక చేసింది, వారికప్పటికి యం.ఎ. విద్య లేకపోయినా. విద్యార్థులను తయారుచేసింది. సంకల్ప సిద్ధులకు ఉపకరణాలలో పనిలేదు. వాటంతట అవే సమ కూడుతవి. అలా సమకూడిందే ఓరియంటల్ కళాశాల. శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు అలా ఇక్కడ ఎంపిక చేయబడ్డవారే
అమ్మ సంకల్పానికి అనుగుణంగా శ్రీ అధరావురపు శేషగిరిరావుగారు ఆనాటి సంస్థ నిర్వాహకులు ఆ కళాశాలను జిల్లెళ్ళమూడి తెప్పించారు. వారి కండదండగా నిలబడ్డవారు సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు వంటివారు. కొండముది సోదరులు తమ కృషి అందించారు.
1970లోనే మాతృశ్రీ విద్యాపరిషత్గా పురుడు పోసుకొని నామకరణం జరుపబడినా ప్రాథమిక కార్యక్రమాలు ప్రభుత్వంతోనూ, యూనివర్శిటీతోనూ సంప్రదింపులు జరిగి 1971 ఆగష్టు 6వ తారీకున కళాశాల అమ్మ సువర్ణహస్తాలతో ప్రారంభింపబడింది. 13-12-1973న సొంత కళాశాల భవనానికి శంకుస్థాపన చేయబడింది. 1971-72 సంవత్సరం 5 సంవత్సరాల భాషాప్రవీణ – విద్యాప్రవీణ విద్యాకోర్సులు ప్రారంభింపబడినది. దీనికి అనుబంధంగా 1974 చేశారు. జూన్లో మాతృశ్రీ ఓరియంటల్ అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రారంభించారు. అదే పాఠశాల 1997 జులైలో మాతృశ్రీ సంస్కృత పాఠశాలగా మార్చబడింది.
ప్రారంభించిన నాటి నుండి విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో ఉచిత విద్యాబోధన ఏర్పాటు చేయబడింది.
కళాశాల ప్రారంభం నుండి సమర్థులైన ఆచార్యుల బోధనలతో తయారుకాబడిన విద్యార్థినీ విద్యార్థులు వివిధ పోటీలలో, పరీక్షలలో బహుమతులు సాధిస్తూ ప్రశంసింపబడ్డారు. అందులో ఆనాడు పోతుకూచి ఝాన్సీలక్ష్మీబాయి, ఎ.శివరామకృష్ణ, కొమరవోలు కుసుమకుమారి, జి.సుభాషిణి, కె. సుహాసిని, వి.రుక్మిణి, యన్.కస్తూరి, వి. పద్మసావిత్రి, వి. రుక్మిణి, కొమరవోలు రవి, యస్. శైలజ, కె. విశ్వనాధ్. యస్.యల్.నరసింహం, బి.యల్.సుగుణ, పి.చైతన్య, శివలెంక వెంకట ప్రసాదరావు వంటి ఎందరో విద్యార్థులు కళాశాల పేరు ప్రతిష్ఠలు రాష్ట్రంలో ఇనుమడింప చేస్తూ వచ్చారు.
ఆ రోజులలోనే నేషనల్ సర్వీస్స్కమ్ (N.S.S.) ప్రారంభింపబడి కళాశాల పరిశుభ్రత, పూలతోటలు పెంచుట, రోడ్లు బాగుచేయుట, చెట్లు పెంచుట, గ్రామాలలో హోమియోమందులు పంపిణీచేయుట, బాల్బాట్మెంటన్, టెన్నికాయిట్, వాలీబాల్ వంటి ఆటలు ఆడించుట వంటి ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. చుట్టుప్రక్కల రేటూరు, కాకుమాను, చెరుకూరుల వంటి గ్రామాలలో యూకలిఫ్టస్ చెట్లు నాటుట, ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు చేయించి మందులు పంపిణీ చేయుట, హైసూలు ఆవరణలో, నీటికుంట ఏర్పాటు చేయుట, ఆటస్థలాలు బాగుచేయుట, హరిజనవాడలలో మురుగు కాల్వవనతులు ఏర్పాటు చేయుట, ఆటస్థలాలు బాగుచేయుట, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుట వంటి సేవాకార్యక్రమాలు అధ్యాపకుల సాయంతో చేశారు.
శ్రీ విశ్వజననీపరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్లు ఆర్థికపటిష్టత గల సంస్థలు కావు, ఉచిత సౌకర్యాలు కలుగచేయటానికి కావలసిన వనరులు లేవు. అమ్మ వద్దకు వచ్చే మధ్యతరగతి కుటుంబీకులు, భక్తులు, కళాశాల, పాఠశాల ఆచార్యులు గ్రామ గ్రామాలు తిరిగి ధాన్యము, ధనము పోగుచేసి సంస్థకు బలం చేకూర్చు తున్నారు.
కళాశాలకు మొదటి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు అధ్యాపకులకు జీతాలు ప్రభుత్వం వారు ఇవ్వలేదు. విద్యాపరిషత్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. తర్వాత మొదటి నుండి గ్రాంటు మంజూరు చేసింది. గత 50 సంవత్సరాలుగా కొన్ని వేలమంది విద్యార్ధినీ విద్యార్థులను ఆదర్శ ఆచార్యులుగా తయారుచేసి లోకంలోకి పంపిన ఘనత మన కళాశాలకున్నది.
ఈ మధ్య వచ్చిన ప్రభుత్వాలు ఎయిడెడ్ విద్యాసంస్థలపై శీతకన్ను వేసి రిటైరైన ఆచార్యుల స్థానంలో క్రొత్తవారికి గ్రాంటును ఆపివేసింది. 2021 సంవత్సరం నుండి కళాశాలలకు గ్రాంటు ఇవ్వకుండా ఉండటానికి నిర్ణయించింది. ఇది మన కళాశాలకే కాదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని కళాశాలలకు శరాఘాతమే.
మొదట గ్రాంటు రాని రోజులలో మొదటి ప్రాచార్యులు శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారు అమ్మ వద్దకు వచ్చి “ఇక్కడ పని చేసే ఆచార్యులకు జీతాలివ్వ లేకపోతున్నాను కళాశాల మూసి వేద్దామమ్మా!” అన్నారు. అందుకు అమ్మ “మూసివేయటానికా ప్రారంభించింది. చూడరా రామకృష్ణా!” అన్నది. అప్పుడు రామకృష్ణ “మీకు ఏ నెల, ఏ తారీకుకు ఎంత కావాలో చెప్పండి నేనేర్పాటు వేస్తాను” అన్నారు. అలా ఇప్పుడు ఏ టాటానో, బిర్లానో మరెవరో ఎవరైనా కానివ్వండి సంస్కృత కళాశాలలకు ఉదారబుద్ధితో తోడ్పడే బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. అయితే అప్పటి దాకా మనకీ గుంజాటన తప్పదు. కృషి చేయవలసిందే. కృషితో నాస్తి దుర్భిక్షం. అమ్మ ఏర్పాటు చేసిన ఈ కళాశాలను మూసివేయలేం కదా!!
మన కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకునే ఈ సంవత్సరమే ప్రభుత్వం యీ నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికభారం మోయటం కష్టమౌతుంది. నెలకు కనీసం నాలుగు లక్షల రూపాయలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు కనీసం కావాలి. కొన్ని వేల మంది పూర్వవిద్యార్థులున్నారు. ప్రకటనల ద్వారా సంపాదించి కాని, నెలకింత అనిగాని త్యాగం చేసి ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది.
పూర్వవిద్యార్థులు, సోదరీ సోదరులు ఈ అత్యవసర పరిస్థితిని అధిగమించటానికి కావలసిన భారం మోయడానికి సిద్ధంగా ఉండవలసిన అవసరం ఏర్పడ్డది. ఏదైనా ఒక శాశ్వతనిధి ఏర్పాటుకు కావలసిన వనరుల కొరకు కృషి జరగాలి. శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు ఇటువంటి పరిస్థితి తట్టుకోటానికి పూర్వం ఒక కోటి రూపాయలు దాకా పోగుచేయటానికి శ్రమించారు. కానీ అది ఆడపిల్లల నూతన వసతిగృహ నిర్మాణానికి ఉపయోగింపబడింది. యుద్ధప్రాతిపదికపై సర్వులూ ఈ కళాశాల స్వర్ణోత్సవ శుభసమయంలో కంకణబద్ధులు కావాలనీ, అందుకు అమ్మ అనుగ్రహం మనకు సర్వదా సర్వధా ఉండాలనీ ప్రార్థిస్తున్నాను.