ఒక ప్రక్క కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు శోభాయమానంగా నిర్వహించుకుంటున్నాం; మరొక ప్రక్క ఒక విపత్కర పరిస్థితి.
హేతువు : ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సువిదితం. అవి Grant-in-aid పరిధిలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలకు రెండు మార్గాలను నిర్దేశించాయి. ఒకటి – బోధన బోధనేతర సిబ్బందికి తామే జీతభత్యాలు చెల్లిస్తూ సొంతంగా నిర్వహించు కోవాలి. రెండవది – సంస్థ స్థలములు, భవనములు, మౌలిక సదుపాయ సామగ్రి, సిబ్బందితో సహా ప్రభుత్వాధీనం చేయాలి.
ప్రస్తుత సమస్య : నేటి ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి Grant-in-aidలో పనిచేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఒక కార్యాలయపు గుమాస్తా సేవలను ప్రభుత్వాధీనం చేశాము. Contract పద్ధతిపై ఐదుగురు Lecturers పనిచేస్తున్నారు. వారి విషయకంగా మున్ముందు ఇదే విధానాన్ని అమలు చేస్తే మొత్తం కళాశాల వ్యయాన్ని సంస్థే భరించాల్సి వస్తుంది.
తక్షణచర్య : ప్రత్యక్షంగా పరోక్షంగా కళాశాల నిర్వహణకి సహకరిస్తున్న ఆత్మీయులు సూచనలు సలహాలు తెలుసుకునేందుకు 12-9-2021 నాడు ప్రత్యేక అంతర్జాల (Zoom Meeting) సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఆవేదనతో పలు విషయ ప్రస్తావన చేశారు. కానీ – స్పష్టంగా ఏది ఆచరణీయం? ఏది అనుసరణీయం? ఏది తక్షణ కర్తవ్యం? అనే ప్రశ్నలకి సమాధానం చిక్కలేదు.
‘అమ్మ’ ఆపన్నహస్తం: S.V.J.P. సంస్థ అంటే అమ్మ భౌతిక రూపమే. ఇందరు బిడ్డలు తలలు చేతబట్టుకుని సతమత మవుతూంటే ‘అమ్మ’ హృదయం చలించింది. Zoomసమావేశం జరుగుతుండగానే శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య కుమారుడు చిరంజీవి చైతన్య లక్షరూపాయలను తక్షణ సహాయంగా సమర్పించాడు; మరునాడు గుడివాడ
బాబయ్య శ్రీ తుమ్మలపల్లి చలపతిరావుగారి కుమారుడు చిరంజీవి వినాయకరావు పదిలక్షల సహాయనిధిని ఒక ప్రజాపుష్పంగా సమర్పించాడు. వారిరువురి స్పందన, వదాన్యతలకు ధన్యవాదాలు.
అందుకు కారణం ప్రస్ఫుటం – జగజ్జనని ‘అమ్మ’ పవిత్ర హస్తాలతో వెలిసిన సేవాసంస్థలన్నీ పెను తుఫానులో సైతం చలించక సుస్థిరంగా, నిరాటంకంగా, నిరాఘాటంగా వృద్ధి చెందాలి – అని. అందులో ‘మాతృశ్రీ ప్రాచ్యకళాశాల’ ఒకటి. అది దయతో ‘అమ్మ’ చేసిన దిశానిర్దేశం, తరణోపాయం, అందించిన చేయూత.
ఆత్మీయసోదరీ సోదరులకు అభ్యర్థన: సమీప భవిష్యతులో ఇటువంటి విఘాతం కలిగి యావత్ భారాన్ని అమ్మ సంస్థే భరించే పరిస్థితి కలగవచ్చు. అందుకు మనం మానసికంగా సంసిద్ధులం కావాలి. మనలో ఆధ్యాపక వృత్తిచేపట్టి పదవీ విరమణ చేసినవారూ, ముఖ్యంగా కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులూ స్వచ్ఛందంగా కాని, స్వల్ప గౌరవ వేతనంతో కాని తమ సేవలనందించేందుకు ముందుకు రావాలి. అందరం చి. చైతన్య, చి. వినాయకరావు ఆచరించిన మార్గంలో యథాశక్తి ఆర్థిక సహకారాన్ని అందించాలి. కారణం ‘అమ్మ’ అన్నది “తల్లికి బిడ్డ సొమ్ము” అంటే ‘అమ్మ’ ఆస్తి బిడ్డలే. ‘అమ్మ’ అమృతాశీస్సులతో మన కాలేజిని మనమే నిర్వహించుకుందాం; మనమే నిలబెట్టుకుందాం. ‘అమ్మ’ అశేష కళ్యాణగుణాల్లో “ఐకమత్య ప్రబోధినీ” అనేది ఒకటి. కావున నిండుమనస్సుతో కదలిరండి! సహకరించండి!
‘అమ్మ’ సంకల్పానికి మహదాశయానికి దన్నుగా నిలుద్దాం. ‘అమ్మ’ మహనీయ ప్రసాదరూప కళాశాల సేవా ఫలాన్ని కలకాలం విద్యార్థి లోకానికి అందిద్దాం. ‘అమ్మ’, ‘అమ్మ కళాశాల’ మనందరిదీ.
సా జయతి శక్తిరాద్యా!!!