‘మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ’ ఆదర్శ విద్యానిలయంగా రూపొందింది. సంస్కృతాంధ్ర భాషా బోధన ద్వారా భారతీయ సంస్కృతీ పరిరక్షణ ప్రయో జనం. ముఖ్యంగా పేద విద్యార్థులను ప్రయోజకులను చేయాలని ఉచిత భోజన వసతి కల్పించబడింది.
1971 ఆగష్టు 6వ తేదీ స్థాపన. ఈ 50 సంవత్సరాలలో వేల సంఖ్యలో విద్యార్థులు సమగ్ర అధ్యయనం ద్వారా సమాజానికి ఉపయోగ పడుతున్నారు. చాలామంది అధ్యాపకులుగా రాణిస్తున్నారు. ఉత్తమ విద్యార్థులు ఉత్తమ పౌరులుగా సార్థకమైన జీవితాలను గడపగలరు అని నిరూపించారు. ఈ కాలేజీకి మూలకారణం, బలం అమ్మ. మాతృశ్రీ అనసూయా దేవి ఉదారచరిత, విశ్వజనని. సర్వాత్రానురాగం గల అమ్మ వాత్సల్యం అనిర్వచనీయం. కుల మత భేదం లేదు. జడ చేతన భేదమే లేదు. అందరికీ అన్నిటికీ అమ్మ. అపురూపమైన వ్యక్తి, అనంతమైన శక్తి అమ్మ.
అమ్మ స్వర్ణోత్సవంలో లక్షమందికి పైగా, వత్రోత్సవంలో 60 వేల మందికి పైగా సోదరీ సోదరులు భోజనం చేసినవి అపూర్వ ఘట్టాలు. అమ్మ ఇల్లు అందరిల్లు. అక్కడి అన్నపూర్ణాలయం డ్రస్సు అడ్రెస్సు చూడకుండా, ఆకలే అర్హతగా నిరంతరం అన్నం పెట్టే దేవాలయం. ఇలాంటి పవిత్ర ప్రదేశమైన జిల్లెళ్ళమూడిలో కాలేజీ నడుస్తున్నది. విద్యార్థులకు పుస్తకాలలోని పాఠాలే కాకుండా సేవాభావం, సహజీవన సౌందర్యం, దేశ భక్తి, దైవ భక్తి కల్పిస్తూ శీలశిక్షణకు ప్రాధాన్యమిస్తూ విద్యాబోధన సాగుతోంది. పులుకడిగిన ముత్యాల్లా విద్యార్థులు విద్య పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. విద్యార్థులుగా అడుగు పెట్టినప్పుడు పుట్టురత్నాలు. ఇప్పుడు సానలు దీరిన జాతిరత్నాల్లా ప్రకాశిస్తున్నారు.
ఇక్కడ అధ్యాపకులు అమ్మ సన్నిధిని అనుభవిస్తూ బోధన చేయడం విశేషం. విద్యార్థులకు గురువులకు అమ్మే గురువు. ఆ వెలుగు లోనే పఠన పాఠనాలు సాగుతున్నాయి. విద్యార్ధినీ విద్యార్థులు, ఆవరణవాసులు పరస్పర అనురాగంతో, సహకారంతో ఒకే కుటుంబంగా జీవయాత్ర సాగిస్తున్నారు. అమ్మ సన్నిధిలో జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో అన్ని పనులు ఆడుతూ పాడుతూ నిర్వహించడం ఎంతో నిండుతనాన్ని, శోభను కల్పిస్తుంది.
మనుగడకు మార్గ దర్శకత్వాన్ని అందించే విద్యాలయాలు మనశ్శాంతికి నిధానాలైన దేవాలయాలు. సహజీవనంతో కళకళ లాడే అందరిల్లు, అన్నపూర్ణాలయం జిల్లెళ్ళమూడి ప్రత్యేకత. అమ్మ భక్తులు, సేవాపరాయణులు అయిన విశ్వజననీ పరిషత్. విద్యా పరిషత్ సభ్యుల పర్యవేక్షణలో కళాశాల, సంస్కృత పాఠశాల నిర్వహింప బడుతున్నాయి. ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఆదర్శ ప్రాయంగా వెలుగొందుతున్నాయి.
మానవుడు పూర్ణ మానవుడుగా ఎదగాలి, జీవించాలి. తన సుఖశాంతులతో పాటు సమాజ హితానికి కూడా పాటు పడాలి. రాగ ద్వేష అసూయలు అనే అవరోధాలను అధిగమించాలి. అమ్మ చరిత్ర నేర్పే పాఠం ఇదే. అందుకే ‘మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి’. ‘మాతృ యాగం’ చేయమంది అమ్మ. మాతృయాగం అంటే? ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం, రోగార్తులకు ఔషధసేవ, వీలైనంతలో వస్త్రాలను ఇవ్వడం వంటి కార్యక్రమాల ద్వారా సమసమాజ దేవతా సమారాధనకు అంకితం కావడం. అప్పుడు మానవుడు పూర్ణమానవుడుగా, దైవంగా పరిణమిస్తాడు. అదే విద్యకు ఫలం.
ఈశావాస్య మిదం సర్వం (ఈ సృష్టి అంతా దైవ స్వరూపమే) తేన త్యక్తేన భుంజీథా: (అందువల్ల త్యాగభావంతో దైవం/ప్రకృతి మనకిచ్చిన దాన్ని అనుభవిద్దాం) మాగృథ: కస్య స్విత్ ధనం (ఇతరుల సంపదకు ఆశ పడకుందుము గాక) అని ఉపనిషత్ ప్రబోధం. అమ్మ ఆ భావాన్ని తేట తెలుగులో “నీకు ఇచ్చింది దైవం ప్రసాదించింది) తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో, అదే జీవితంలో సుఖ పడే మార్గం”- అని ఆచరణలో బోధించింది.
ఈ సందేశం అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు, వారి ద్వారా వాళ్ళ విద్యార్థులకు మిత్రులకు తర తరాలుగా వ్యాప్తి చెందాలి. జిల్లెళ్ళమూడిలోనే కాకుండా మిగతా ప్రాంతాలలో జిల్లెళ్ళమూడి సంస్కార పరిమళాలు వ్యాపించాలి. సేవాభావం వెల్లి విరియాలి. అందరూ సోదరభావంతో పరస్పర సహకారంతో జీవించాలి.