జులై 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఓరియంటల్ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం జరిగింది. శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్ అధ్యక్షులు శ్రీ ఎమ్.దినకర్రు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ యస్.మోహనకృష్ణగారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వై.వి. శ్రీరామమూర్తిగారు, విద్యాపరిషత్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ శ్రీ బి. రామబ్రహ్మంగారు, పూర్వ కార్యదర్శి శ్రీ ఎన్. లక్ష్మణరావు గారు, సోదరులు శ్రీ టి.టి. అప్పారావు గారు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గారు సభలో పాల్గొన్నారు.
శ్రీ బి. రామబ్రహ్మంగారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు మంచి నడవడికను, క్రమశిక్షణను అలవరచుకోవాలని సందేశం అందించారు.
శ్రీ మోహనకృష్ణగారు తమ ప్రసంగంలో విద్యార్థులందరూ అమ్మ చరిత్రను అధ్యయనం చేయాలని ఈ ఆవరణను పరిశుభ్రంగా రూపొందించుకోవాలని హితవు చెప్పారు.
శ్రీ వై.శ్రీరామమూర్తిగారు అమ్మ సన్నిధిలో విద్యాభ్యాసము చేసే అదృష్టం పొందిన విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులందరూ అమ్మ నామసంకీర్తనలో పాల్గొనాలని కోరారు.
శ్రీ ఎమ్. దినకర్ గారు విద్యార్థులు నుంటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించినందుకు తమ ఆనందం వ్యక్తం చేశారు. నిరంతర కృషి విజయానికి సోపానమని వివరించారు. అమ్మ సన్నిధిలో విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సోదరులు శ్రీ టి.టి. అప్పారావుగారు సత్ప్రవర్తన నేర్పడమే కళాశాల లక్ష్యమని, విద్యార్థులందరూ బాగుపడటమే అసలైన అభివృద్ధియని ఉద్ఘాటించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శాస్త్రిగారు. 2010-2011 విద్యాసంవత్సరంలో విద్యార్థులు సాధించిన విద్యా ప్రగతిని సమీక్షించారు. కళాశాల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని, ఫైనల్ విద్యార్థులలో ఏడుగురు విద్యార్థులు అత్యధిక శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ప్రకటించారు. పెద్దల ఆశయాలకు తగినట్లు మెలగుతూ విద్యార్థులు పురోగమించ గలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక అవతారమూర్తి స్వయంగా నెలకొల్పిన ఆశ్రమ వాతావరణంలో ఉన్న విద్యాసంస్థ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అని, ఈ సత్యాన్ని గుర్తించి విద్యార్థులు తమ నడవడికకు మెరుగులు దిద్దుకుంటారని, విద్యాస్వరూపిణి అయిన అమ్మ దివ్యానుగ్రహంతో అఖండ విజయాలను సాధించి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని వక్తలందరూ ఆకాంక్షించారు. విద్యాసంవత్సర ఆరంభంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశం విద్యార్థులకు నూతనోత్సాహాన్ని కలిగించింది.
అమ్మ కరుణా కటాక్షవీక్షణ ప్రసారంతో సభ వైభవంగా జరిగింది.