‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని ‘లయన్స్ క్లబ్-నార్త్-గుంటూరు వారు 1984లో ఘనంగా సన్మానించారు. కీ.శే. పార్థసారథి సరస్వతీపుత్రుల వారి సన్మానానికి చొరవ చూపారు. నారాయణాచార్యుల వారి అద్భుతమైన ప్రసంగం విని ముగ్ధులైన సి.వి.ఎస్.ధన్ ఆచార్యుల వారి ‘శివతాండవము’ కావ్యాన్ని సుప్రసిద్ధ చిత్రకారులు ‘బాపు’ బొమ్మలతో అందంగా ముద్రించి కవి గారికి కానుకగా సమర్పించాలని సంకల్పించారు.
సన్మానం జరిగిన మరునాడు నారాయణాచార్యుల వారు తాను జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించుకోవాలనుకున్నట్లు తెలిపారు. ఆచార్యుల వారి జిల్లెళ్ళమూడి ప్రయాణానికి ధన్ గారు ఏర్పాటుచేశారు. నారాయణాచార్యుల వారితో వారి ప్రియశిష్యులు రాజన్నకవి, మరొక అభిమాని జిల్లెళ్ళమూడి వెళ్లారు.
మాతృశ్రీ ఎప్పటిలాగే తాము నిత్యమూ కూర్చునే శయ్యపై వున్నారు. సరస్వతీ పుత్రుల రాకను భక్తులు అమ్మకు తెలిపారు. ప్రసన్న వదనంతో అమ్మ అందరినీ ఆహ్వానించారు. తనకు పక్కనే కుర్చీలో కూర్చుని వున్న ఆచార్యుల వారిని తన చెంతకు రమ్మని పిలిచారు. అమ్మ దగ్గరకు వెళ్ళిన ఆచార్యుల వారిని దగ్గరకు చేర్చుకొని ఆయన శిరసుపై తమ చేతిని వుంచారు.
సరస్వతీ పుత్రులొక్కసారిగా అమ్మవొడిలో తల పెట్టుకొని బిగ్గరగా విలపించారు. వెక్కివెక్కి ఏడుస్తున్న ఆచార్యులవారిని అమ్మ వోదార్చి తన దగ్గరకు వచ్చెయ్యమని ఆదేశించారు. ఆమె ఏమంటున్నారో ఆచార్యుల వారికి స్పష్టంగా తెలియలేదు. అమ్మ ఆదేశాన్ని రాజన్నకవి గారు తెలియజేశారు.
నారాయణాచార్యుల వారు కష్టం మీద గొంతు పెగల్చుకొని అమ్మతో అమ్మా! నాకు ఇంకా బాధ్యతలున్నాయి” అన్నారు. అమ్మ నవ్వు ముఖంతో వాత్సల్యాన్ని కురిపిస్తూ “మీ వాళ్లందరినీ తీసుకొని ఇక్కడకు వచ్చెయ్యి” అన్నారు. పట్టరాని సంతోషంతో ఆచార్యులు వారు చేతులు జోడించారు.
తర్వాత అమ్మ తన చేతితో అన్నం కలిపి ఆచార్యుల వారికి తినిపించారు. అక్కడ వున్న వారందరికీ అమ్మ అన్నం ముద్దలు కలిపి ఇచ్చారు.
భోజనం తర్వాత అమ్మ ఆచార్యుల వారికి నూతన వస్త్రాలు కానుక ఇచ్చారు. అక్కడ వున్న అందరికీ అమ్మ నూతన వస్త్రాలు ఇచ్చారు.
అమ్మ ఆశీస్సులు అందుకొని తిరిగి వస్తున్నప్పుడు నారాయణాచార్యుల వారి అభిమాని ఆయన్ను “మీరెందుకంత దుఃఖించారు?” అని అడిగాడు. సరస్వతీపుత్రులు “ఎందుకో చెప్పలేను. అమ్మను చూడగానే మా అమ్మ తలపుకు వచ్చింది ఉద్రేకం ఆపుకోలేక పోయాను” అన్నారు.
“మీ రచనలన్నీ అమ్మ చదివి వుంటుందంటారా?” అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు ఆయన అభిమాని.
“అమ్మకు అన్నీ తెలుసు” అన్నారు సరస్వతీ పుత్రులు.