- చిదంబరరావుగారు : అమ్మా! పువ్వొత్తులు వెలిగిస్తావా?
అమ్మ : నేను వెలిగించలేనండి. అసలు వెలిగించటమెందుకు?
చిదంబరరావుగారు : నిన్న చెపితిని కదా! అటువంటి అసురుడు పోయాడని అంతా సుఖంగా వుందామని.
అమ్మ : అటువంటి సంతోషం నాకు లేదు. ఒక బిడ్డ తరిగాడని బాధగానీ, మరొక రకంగా బాధకూడా లేదులెండి, కృష్ణుడ్ని చూస్తే సంతోషం లేదు. నరకాసురుడు చస్తే బాధా లేదు. ఎందుకంటే అంతా నేనే గనక. నేనంటే నేను అనుసూయ మ్మను అని కాదు, అందరిలో వున్న నేను.
- లక్ష్మణాచార్యులు గారు వస్తారు. వచ్చి అమ్మను ఎత్తుకుని, ‘ఈరోజు ఉదయం తొమ్మిదింటికి మా ఇంటికి వచ్చావటమ్మా?”
చిదంబరరావుగారు పకపకా నవ్వి, “తొమ్మిదింటికి తలంటు పోసుకుంటున్నది” లక్ష్మణాచార్యులు గారు ఆశ్చర్యంతో “మా ఇంటికి వచ్చి చేతిలో మొక్కజొన్న కండె కూడా పట్టుకుని వున్నది. చూచాను.”
చిదంబరరావుగారు : “అవి అసలే లేవు మా ఇంట్లో. అయినా మన ఇద్దరి సంభాషణ ఎందుకు? ఎదురుగానే వున్నదిగా?”
అమ్మ : నిజమే తాతగారూ! మీరు ఆస్పత్రికి వెళ్ళినప్పుడు తొందర తొందరగా వెళ్ళివచ్చి కిటికీలో కూర్చున్నా.
చిదరంబరరావుగారు : అప్పుడు తొమ్మిది గంటలు కాదుగా పది అయింది. ఆచార్యులు గారు : మా ఇంటికి వచ్చినప్పుడు తొమ్మిదే అయింది కరక్టుగా.
చిదంబరరావుగారు : జరిగింది జరిగినట్లు చెప్పు.
అమ్మ (విసుగుతో) : అబ్బా ! ఎట్లా అయితేనేం. వెళ్ళివచ్చాను.
- చిదంబరరావు తాతగారికి అమ్మ చూపించిన విశ్వరూపం -1
చిదంబరరావుగారు అందరినీ ఆచార్యులగారింటికి పంపించి మేడమీదకు వస్తారు. రాగానే ఒక ముత్తయిదువ కనిపిస్తుంది. ఆమె రోజా రంగు చీరె కాశీపోసి (అంటే మడి కట్టుకుని), ఊదారంగు రవికె తొడుక్కుని వుంటుంది. ముక్కుకు బులాకీ, ముంగెరా, చెవులకు నీలం బావిలీలూ, పచ్చలూ, చెంపస్వరాలూ, జూకాలూ, శిరమున తమలపాకు మొవ్వరేకు కొప్పుగొలుసు, తిరుగు పువ్వు, పాపిట బొట్టు, రాగిడి, నాగరం, చంద్రవంకా చేతికి బాదుబందులు, కడియమూ ముంజేతికి మురిడీ గొలుసులూ, పలక మురుగులూ, మెడలో అడ్డగలూ, గజ్జెల పట్టెడా, జిగినీ గొలుసూ, పలకసరి పట్టెడా, గుళ్ళకంటే, కాసులు పేరూ, పగడాల హారమూ, ముత్యాల హారమూ, చంద్రహారమూ, సూర్యహారమూ, నడుముకు వడ్డాణమూ, అన్ని వ్రేళ్ళకూ ఉంగరాలు, చేతికి బంగారపు గోట్లూ, కాలి అందెలూ, కడియాలూ, గోళ్ళెపుగొలుసులూ, పావడాలూ, తుమ్మకాయ బిళ్ళలూ, మోకాలుకు జానెడు క్రిందనించి కాలుకు అంతా సొమ్ములతో కాలివ్రేళ్ళకు మట్టెలూ, వివిధ ఆభరణాలతో, ఆనాటి భాగ్యవంతులు ముత్తయిదువ వలే నిమ్మపండు మేని ఛాయతో, నుదుట రక్తపురంగులో రూపాయంత బొట్టుతో ఉన్న ఒక ముత్తయిదువ కనుపిస్తుంది. ఆమెను చూడగానే వారి అన్న అత్తగారు. మతుకుమల్లి ముత్తమ్మగారు అనుకుని “మీరు ఎప్పుడు వచ్చారు” అంటూ దగ్గరకు రాబోతారు. అట్లా చూస్తూ వుండగానే రూపం మారిపోతుంది.
- చిదంబరరావు తాతగారికి అమ్మ చూపించిన విశ్వరూపం – 2. రూపం మారి, వీరాసనం వేసుకుని జుట్టు విరబోసుకుని అభయహస్తంతో చేతిలో చెరకుగడ పట్టుకుని ఎడమకాలు కుడికాలు మీద వేసుకుని, కిరీట ధారిణియై ఫలాన అమ్మవారు అని గుర్తించలేకుండా ఒక లిప్తకాలం మాత్రం దృశ్య మానయై, మళ్ళీ ఆ రూపమూ మారి జడకుప్పెలూ, నాగరమూ, పరికిణి చొక్కాలతో పది సంవత్సరాల బాలికయై, శరీరమంతా సకలాభరణాలతో అలంకృతయై బాలాత్రిపురసుందరి వలే కనపడుతుంది. మరుక్షణమే కన్యాకుమారివలే, భ్రమరాంబవలే, కనకదుర్గవలే, జ్ఞానప్రసూనవలే, బొడ్డుకూడా కోయబడక శరీరమంతా మాయను కప్పుకుని అప్పుడే మాతృగర్భం నుంచి వెలుగులోకి వచ్చిన పసికందువలే, చింపిరి గుడ్డలతో, చేతిలో కర్రపుల్లతో గొడ్లను కాచే పదియేళ్ళ పిల్లవాడువలే, నెరిసిన గడ్డంతో, కర్రపోటుతో గజగజవణికే వృద్ధుడువలే, లలాటాన విభూతిరేఖలతో, చేతిలో పంచాంగం, చెంబుతో “శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః” అంటూ మామూలుగా భిక్షాటనకు వచ్చే పేద బ్రాహ్మణునివలే కోర్టులో మునసబు వలే, పాకీదొడ్లో చిమ్మే వెంకన్నవలే, దొడ్లో చెట్లకు నీళ్ళుపోసే వీరాస్వామివలే, హత్య చేయబడిన తన స్నేహితుడు పొన్నూరు గోపాలరావుగారు వలే చిత్రచిత్రంగా తెరమీద చిత్రాలవలే అమ్మ కనుపిస్తుంది.
- చిదంబరరావు తాతగారికి అమ్మ చూపించిన విశ్వరూపం – 3
చిదంబరరావు గారు శరీరం జలదరించి నేత్రాలు విశాలం చేసి చూస్తారు. వెంటనే అమ్మ ఒకే ఆకృతిలో అనేకంగా కనుపిస్తుంది. చిదంబరరావుగారు కనులు మూసుకుని చేతులు ముకుళిస్తారు. తమ వాకిట్లో ఉన్న కృష్ణుడి బొమ్మవలే, కుగ్లర్ హాస్పిటల్ డాక్టర్ వలే, అక్కడ చిమ్మేమనిషివలే కనుపిస్తుంది. ఆ వెంటనే పిఠాపురం తాలూకా చెందుర్తి కరణంగారూ, బాలోపాసకులూ అయిన పెమ్మరాజు సత్యనారాయణగారువలే కనుపిస్తుంది. విచిత్రమేమిటంటే వారిని చిదంబరరావుగారు అంతకుపూర్వం ఎరుగరు. ఆయన బాల విగ్రహం దగ్గర పూజ చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఆ కరణంగారు ఆ మరునాడే అక్కడకు వస్తారు.
తరువాత లక్ష్మణాచార్యులుగారు చేస్తున్న క్రతువు అంతా ఇక్కడే కనపడుతుంది. మూర్తీభవించిన శంకరాచార్యులు వలే ఒకసారి, చివరకు ఎక్కడో నానాబాధలతో వుండి ఒక ఇంట్లో సేవ చేస్తున్న స్త్రీ మాదిరిగా, ఆ స్త్రీ చర్యలు, బాధలు అన్నీ సినిమా తెరమీద బొమ్మలాగా కనుపిస్తాయి. దుర్భరమైన బాధలన్నిటినీ ఓర్పుతో అనుభవించే ఆ స్త్రీని చూడగానే చిదంబరరావుగారి గుండెలు బరువెక్కి, కన్నులు నీటికుండలై “ఎవరమ్మా ఈ సహనమూర్తి? ఈ చరిత్ర గతంలోనిదా? వర్తమానం లోనిదా? భవిష్యత్తు లోనిదా? అని ఆలోచించుకుంటూ “సహనమనే దేవతను ఆరాధిస్తున్న తల్లీ!” అంటూ పెద్ద పెద్ద కేకలు పెడతారు. కళ్ళుమూసుకుని కింద పడతారు. “సహజ సహనం” అనే అక్షరాలు పెద్దవిగా బంగారపు రంగుతో వ్రాసి వుంటాయి. వెంటనే ఆయన అవికూడా చూచి ఉలిక్కిపడతారు. కళ్ళుమూసుకుని కిందపడి వున్నా కనపడుతూనే వుంటుంది. ఆ అక్షరాల కింద చొక్కాలేకుండా, బొడ్డు క్రిందకు జారిపోయిన పరికిణీతో, చింపిరిజుట్టుతో చీమిడితో అమ్మ పోలికన ఒక బాలిక కనుపిస్తుంది. ఆ అక్షరాలనూ, ఆమూర్తినీ అవలోకిస్తూ, శరీరంమీద, మనసుమీద అధికారం కోల్పోయి ఒక విధమయిన పరవశస్థితిలో ఉండిపోతారు చిదంబరరావుగారు. అమ్మ మెల్లగా అక్కడ నుండి లక్ష్మణాచార్యులు గారింటికి వెళుతుంది.
- చిదంబరరావుగారు అన్నపూర్ణమ్మగారితో అమ్మాయి అనసూయ ఎక్కడ? అని అడిగారు.
“రాత్రి లక్ష్మణాచార్యులగారింటి వద్దనే పడుకున్నది. తర్వాత ఏమయిందో తెలీదు.”
“అయితే అసలు రాత్రి అక్కడకు ఎన్ని గంటలకు వచ్చింది?”
“మేము రాబోయే ముందు పన్నెండు గంటలకు వచ్చింది. తాతా మనుమరాలూ ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉంటారేమిటి?”
“అవసరమయితే ఆమె ఉంచుతుంది”.
“ఆమె అంటే ఎవరు? బాలాత్రిపురసుందరా ? చందలూరి మహలక్ష్మమ్మా.”
“ఎవరయినా ఆమేగా!”
“ఎవరయినా ఆమేనంటే అందరూ ఒకటేననా మీ ఉద్దేశం ?”
ఇంతలో అమ్మ లక్ష్మణాచార్యులు గారి ఇంటివద్దనుంచి వచ్చి వెనుకగా నుంచుని –
“ఆ! అన్నీ ఒకటే అయింది” అని అంటుంది.