1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : April
Issue Number : 2
Year : 2019

(గత సంచిక తరువాయి)

  1. “తాతగారూ! మీరు ఇప్పుడు తెనాలి తాతగారితో అన్నదేమిటి?” అమ్మ అడిగింది. “పట్టుకున్నా పీక?” 

“నేను పట్టుకోలేదు. మీరే అన్నారు ఇంటికి వెళ్ళిందాకా పీక ఎత్తవద్దని”

“ఏదీ చెప్పకుండా తప్పుకోవటానాకి ఈ ఎత్తు?” “అందుకే రెండెద్దులూ ఈ ఎత్తు ఎత్తినయ్. ఇంతకూ అనుకున్నది జరుగదు. తనకున్నది తప్పదు.”

ప్రతివ్యక్తి అనుభవంలోనూ అడుగడుగునా ఎదురై ఓదార్చే సత్యమూ, ప్రతివ్యక్తి మనసులోని ఊహాజగతికి లోకానుభవానికీ మధ్య నిలిచే సమన్వయ సూత్రమూ, పరాజితుడయిన మానవుడు కారణంకోసం ఆకాశంలోకి తలయెత్తి చూచినపుడు అంతరంగం పలికే సమాధానమూ, సర్వమతాల సకల శాస్త్రాల సారమూ అయిన ఆ మహావాక్యాన్ని అమ్మ నోటి వెంట అలా నిర్లిప్తంగా, నిసర్గంగా వినగానే చిదంబరరావుగారు ఆశ్చర్య ఆనందాలతో పులకితాంగులైనారు. 

  1. ‘ఏమిటో మహారాణిగారు తీర్మానం చేస్తున్నారే అన్నారు చంద్రమౌళి వెంకట సుబ్బారావుగారు.

 “నేను మహారాణినిగాదు తాతగారూ – సర్వసృష్టికారిణిని.”

విస్మయానందాలతో వారి మేనులు ఒక్కసారి పులకరించాయి. వారి మేధామండలాల్లో ఒక్క మెరుపు మెరిసింది. పరిసర ప్రకృతి పరమానందంతో పరిమళించింది. పవనుడు భక్తితో ప్రదక్షిణాలు చేసినట్లు అక్కడే సుడితిరిగాడు. ఆకాశం నుండి దేవతలు జయధ్వానాలు సలిపినట్లు మేఘమాలికలు మెత్తగా నినదించాయి.

“బండి ఆపు ఖాసిం”. చిదంబరరావుగారు బండి ఆపించి అమ్మవంక చూచారు.

అమ్మ మామూలుగానే కూర్చున్నది.

“మళ్ళీ అనమ్మా”

“అవసరం కలుగలేదుగా”

“ఇందాక భూమి తల్లి’ అన్నావు. ఆమె ‘అన్నిటికీ ఆధారమన్నావు’ ఇప్పుడు 

సర్వానికీ నేనే ఆధారమన్నావు.”

“సర్వానికీ సర్వమూ ఆధారమే”. 

అమ్మ పలికే ప్రతిమాటా ఒక్కొక్క నక్షత్రమై నిలిచిపోతున్నది.

  1. చిదంబరరావుగారు: ఆమెకు మాట్లాడడం చేతగాదమ్మా!

 అమ్మ: మాట్లాడడం చేతగాక మాట్లాడితే బాధలేదు.

చిదంబరరావుగారు: నీకు ఎప్పుడూ బాధ లేదులే అమ్మా! 

అమ్మ: ఈ మాట నాకు ఆశీర్వచనంగా వుండాలి. “భరించలేని స్థితి అంటూ నాకు రాకూడదు.”

చిదంబరరావుగారు: అనిర్వచనీయమైన శక్తి గలదానికి నా ఆశీర్వచనమెందుకమ్మ.

అమ్మ: “నిర్వచనాలతో” ఉన్నాను గనుక, 

  1. చిదంబరరావుగారు: “నీయందు నాకు, నీకు చెప్పటానికి చేతకానిది, నేను ఆనందపడే అభిప్రాయము నాకు వున్నది. ఒక్కొక్కప్పుడు నీవు చిన్న పిల్లవని అనిపించదు. మరొకప్పుడు పసిపిల్లవుగా తోస్తావు. అసలు నీలో గొప్పతనమున్నా, లేకపోయినా ఒకే పిల్లను గురించి ఒకసారి ఒక అభిప్రాయం, మరొకసారి ఇంకొక అభిప్రాయం సాధారణంగా తోచదుగా! ఎవరినైనా అసలు అర్థం చేసుకోలేకపోవటమో లేదా తన శక్త్యనుసారము అర్థం చేసుకోవటమో జరుగుతుందిగాని ఒకే వ్యక్తిని గురించి అనేక రకాల భావాలు కలగవు. అదే నీ అసాధారణ స్థితి. నేనేమీ నీ మాట బయటపెట్టను. విశ్వసించి, నా వికారములు పోగొట్టుకుంటా”.

అమ్మ: ఆకారమే వికారంతో వచ్చింది తాతగారూ.

చిదంబరరావుగారు అమ్మ తల గుండెలకు హత్తుకుని- “అమ్మా! లోకజననీ! మాతా! ఈ స్థితి ఎప్పుడూ ఉంచమ్మా! రంగమ్మ తల్లి గర్భాన రత్నగర్భ ఆవిర్భవించింది” అని కాసేపు కనులు మూసుకుని తనను తాను మరచిపోతారు.

  1. అందరూ భోజనం చేసినా, రాఘవరావు మావయ్య సైకిలెక్కి ఎటో వెళతారు. అన్నానికి రాలేదు. అమ్మ తాతమ్మ దగ్గరకు వెళ్ళి, “మా అన్నయ్య ఇంకా అన్నానికి రాలేదే! అందరం తిన్నాం. తల్లికి ఒక బిడ్డ రాకపోయినా దిగులే.” మరిడమ్మగారికి ఆ మాటలు ఆశ్చర్యం కలిగించి అన్నది. “అదేమిటమ్మా అన్నయ్యను పట్టుకుని బిడ్డ అంటావు. అయినా వాడు అన్నం తినకపోతే

బాధపడే తల్లి కాస్తా దాటిపోయిందికదా?”

“వాడు అన్నం తినకపోతే బాధపడే తల్లి పోయిందిగాని, 

తినకపోయినా బాధపడే తల్లి వున్నది.” “ఎవరు ఆమె?” ఎవరు అన్నం

అడిగే ఆమెకు పెంచిన మమకారం ఉన్నది 

ఈమాట చెప్పే అమ్మ అమ్మగా అర్థం కాకుండా వుంది. అంతే. 

“అయితే పెంచిన మమకారం నాకు అమ్మవై అమ్మగా గుర్తించబడకుండా ఉన్న అమ్మవు నీవనా అర్థం?”

“తీసుకోగలిగిన వారికి తీసుకోగలిగినంత”.

  1. అమ్మ: “చెయ్యటం చేతుల్లో వున్నప్పుడు బాధవుండదు. మాట ఉండదు. ప్రతిదీ ఒకేసారి నిర్ణయమై వుంటుందిగా! మారేదయితే మారటానికి వీలున్నదయినా, ఆ స్థితిని నిర్ణయమని అనరు. నిర్ణయమంటే తప్పనిసరిగా జరిగేది. నేను అమ్మగా నిర్ణయించుకున్నాను. అమ్మ అమ్మగా కనుపించక పోయినా అన్నీ తను ఏర్పరచుకున్న వయినా, ఆ ఏర్పాటు సక్రమంగా నెరవేర్చవలసిందే. ప్రథమంలో స్పందనం కలిగేటప్పుడే ఎవరి నడకలు వారికి ఏర్పడతాయి. నీటికి తడి ఎట్లా స్వభావమో, అలా ఆ స్పందనం అనేక రూపాలై కూర్చుంది.”

మరిడమ్మతాతమ్మ మాట్లాడటం మానేసి అమ్మ ముఖము వంక కన్ను ఆర్పకుండా

 చూస్తూ, తన గురువుగారయిన మల్లెల రత్తమ్మ గారిని అమ్మ ముఖములో చూస్తూ, ఆమె చేసిన బోధ అమ్మ ముఖంలో పునశ్చరణ చేస్తుంది. అది అనుభవించేటప్పుడు అది పునశ్చరణగా తోచదు. అప్పుడు జరుగుతున్నట్లే వుంటుంది. ఇదంతా ఒక అరగంట కాలంలో జరుగుతుంది.

  1. చిదంబరరావుగారు కోర్టుకు వెళ్ళి వెంటనే తిరిగి వస్తారు. అమ్మ: “ఎప్పుడు వెళ్ళారు? చూడనే లేదే! వెళ్ళటానికి రావటానికి వ్యవధి లేదు! అన్నయ్య అన్నానికి రాలేదు. మీకెక్కడయినా కనిపించాడా?” చిదంబరరావుగారు: లేదమ్మా! అమ్మ: అన్నయ్య రాలేదనే చింత తాతమ్మతో చెపుతున్నా. చింతకు కారణం “నా సొంతం” అనుకోవటమేగా. సొంతం అనుకోకపోతే సౌఖ్యానికి దారి లేదు. సౌఖ్యం గల దారిగా కనపడుతూ దుఃఖాన్న రుజువు చేస్తుంది “నాది”. అనేది. చిదంబరరావు తాతగారు మరిడమ్మ గారిని ఉద్దేశించి, “వీలు కలిగినప్పుడల్లా అమ్మాయితో ఏకాంతంగా సంభాషణ చేస్తే చాలా హాయిగా కాలం గడుస్తుంది. “పిన్నీ”.

అమ్మ: “ఏకాంతంగా అంటే సంభాషణ పోతుందండీ తాతగారూ!” 

ఆ వాక్యానికి చిదంబరరావు గారు మరీ ముగ్ధులైపోయారు.

  1. “మొత్తం మీద మన ఆవరణలో బ్రహ్మాండం నిండి ఉన్నది. అంటే నిండింది. కనపడేది కాదు. కనపడేది పరిమితం. అది నిండి ఉంటే అందరికీ అర్థమయ్యేది. కాదు. కనుకనే పరిమితంగా వచ్చింది. అర్థమయినట్లు ఉండే అయోమయమవుతుంది. అర్థం కాకుండా ఉండీ-వారి సంస్కారాన్ని బట్టి అర్థమవుతుంది. భగవంతుడు ఈ రూపంగా ఇక్కడ అవతరించటానికి కారణం వెతుక్కుంటే – లోగడ అమ్మాయమ్మగారూ (మరిడమ్మగారి తల్లి), మా మేనమామ చలపతిరావు గారూ (సీతాపతి తాతగారి తండ్రి), బ్రహ్మచారియై అందరికీ సేవచేసి కడతేర్చిన నీవూ, మీ ముగ్గురి యొక్క సాధన చతుష్ఠయ సంపత్తిసారం అమ్మగా అవతరించింది.”

చిదంబరరావుగారి ఒక్కొక్క అక్షరం మరిడమ్మగారి కన్నుల నుండి ఒక్కొక్క అశ్రుబిందువును జార్చింది.

  1. మరిడమ్మ తాతమ్మ: “అసలు పుట్టినప్పటి లక్షణాలే ప్రత్యేకంగా ఉన్నాయిరా నాయనా! నేను కనుక్కో లేకపోయాను. నేను ఆ సమయంలో అక్కడ లేకపోయినా తర్వాత విన్నాను కదా! విని వింతగా ఉన్నదనుకున్నాను గాని, ఇంత విశిష్టత గుర్తించలేకపోయాను. అసలే ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కడుపున పడ్డప్పటినుండీ జరిగిన పరిస్థితులన్నీ ఒక మహాపురుషుడు ఉద్భవించే లక్షణాలే.”

చిదంబరరావుగారు: “జరిగిపోయినవి వదిలేసెయ్యి. ఇప్పుడు మనకు కలిగిన ఈ అనుభవాలను మాయ కప్పకుండా వుంచితే చాలు.”

అమ్మ అటుగా వెళుతూ వీళ్ళ మాటలు విననట్టుగా తనలో తానే అనుకున్నట్టుగా అన్నది “నాటకంలో వేషాలు వేసుకురావటానికి తెరలు అవసరం”. చిదంబరరావుగారు” ఎక్కడినుండి వస్తున్నావమ్మా? నాకేనా ఈ సమాధానం.”

అమ్మ: “అనుకుండేది నాకోసమే. ఈ మాట అందరికీ ఉపయోగపడవచ్చు”.

తాతగారు, తాతమ్మ ఇద్దరూ ఒకేసారి అమ్మ ముఖము వంక చూచి “ఒకవేళ నీవు మాయను కప్పినా ఒకసారి తెలియపరచి పూర్తిగా అసలు నీ రూపమేమిటో చూపించి తరువాత తెరవేసుకో అమ్మా!” అంటారు.

  1. మరిడమ్మ తాతమ్మ: “నీకు తెలియందేముందమ్మా!”.

అమ్మ: “పెద్ద వాళ్ళు అంటూ ఉంటారే తెలిసీతెలియని నాది. ” అదీ స్థితి అని

మరిడమ్మ తాతమ్మ: “అది నీవంటివాళ్ళకు వర్తిస్తుందటమ్మా! అది చిన్న పిల్లల్ని అనేమాట.”

అమ్మ: “ఆ మాట చిన్న పిల్లలనే అనవచ్చుగానీ ఆ మాట అర్థం ఇదే. తెలిసి కూడా తెలియనట్లుండే వారికి చెప్పటం కష్టం కాదు మరి.”

ఆ వివరణకు చిదంబరరావు గారు ఆనందపరవశులై అన్నారు “ఎంత చక్కగా విడదీశావమ్మా – అన్నీ ఇట్లాగే వివరించు తల్లీ! కాళిదాసుకు వరమిచ్చిన కాళి నీ దగ్గర నేర్చుకున్నట్లున్నది. కాళి మ్రొక్కినవారికే వరమిస్తుంది. నీవు మ్రొక్కినవారికీ, మ్రొక్కని వారికీ యిస్తావు.”

అమ్మ: వరాలివ్వటమా నా దగ్గర నేర్చుకున్నది? చిదంబరరావుగారు: “కాదమ్మా! ఒక్క కాళి అనే కాదు. అవతారాలనే దేవుళ్ళంతా ఒకటై అవతరించిన సర్వ దేవ దేవీ స్వరూపిణివై సర్వ కార్యాలకూ కారణమై, అకారణంగా సకల కార్యాలూ నడుపుతున్న సగుణమూర్తివమ్మా.”

(సశేషం…)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!