(గత సంచిక తరువాయి)
- చిదంబరరావు తాతగారు వారి అన్నగారయిన వెంకటసుబ్బారావుగారితో..
“మనం పదిసార్లు వాళ్ళ అమ్మను జ్ఞాపకం చేయటమెందుకులే అన్నయ్యా”..
అమ్మ: అమ్మను ఒకరు జ్ఞాపకం చెయ్యటమేమిటి లెండి తాతగారు.
“మరపురానిది అమ్మ. మరువలేనిది అమ్మ. మరొకరు అడ్డు లేనిది అమ్మ.
ఎవ్వరూ తీసివేయలేనిది.”
- వెంకటసుబ్బయ్య తాతగారు: పూర్తిగా నీ వుద్దేశ్యం చెప్పమ్మా.
అమ్మ: నేనందుకు రాలేదు. చిదంబరరావుగారు: అంతా మరుగేనా?
అమ్మ: మరపులేదుగాని, మరుగువున్నది. మరుగే నా గురువు.
చిదంబరరావుగారు: అంటే నీ లక్ష్యం అదన్నమాట.
అమ్మ: అదేగా ఈ లక్షణమంతా.
చిదంబరరావుగారు: పోనీ, ఇదయినా తక్షణం చెప్పావు. అమ్మా: అదయినా నీ సమక్షంలోనే.
చిదంబరరావుగారు: ఎంత ప్రత్యక్షంగా వినిపిస్తున్నదో చూడు.
47.చిదంబరరావుగారు “ఏవమ్మా! ఏమమ్మవమ్మా! ఏమమ్మ ఏమిటి, కమ్మనమ్మ” అనుకుని ముద్దుబెట్టుకోబోతారు. ముద్దుపెట్టుకోబోయినప్పుడు అమ్మ కనుపించదు. వెంటనే తాతగారు “ఇదిగో ఇట్లాగే తెర వేస్తుంది. కాసేపు చిన్న పిల్లగా కనపడి ముద్దులు మూటకడుతుంటే మోసపోతాం. ఏమిటి అమ్మా అదృశ్యమయిపోయావు”.
“అదే మీకు సాదృశ్యం” అమ్మ స్వరం వినిపించింది.
“రూపం చూపించి తెరవెయ్యమ్మా అని లోగడ అడిగాను. ఇదేనా చూపించి తెరవేయటం?”
“రూపంలేనిది రూపం వచ్చింది. వచ్చిన రూపం పోయింది. నా రూపం చూపించమని అడిగారు. ఉన్నది గనుక లేకపోవటం అంటూ వచ్చింది. లేదు కనుక ఈ రూపం ఉన్నదంటూ వచ్చింది. లేనిరూపం నిర్గుణం. ఉన్న
రూపం సగుణం. అదే నిర్వికారం, సాకారం. నిర్వికారానికీ ఆకారమున్నది. సాకారానికీ ఉన్నది. ఉన్నదేదో ఉన్నది ఈ ఉన్నదే అది. అదే నేను.” స్పష్టంగా చెపుతున్న అమ్మను కన్నుల్పగించి చూస్తూ ఉండిపోయారు చిదంబరరావుగారు.
- చిదంబరరావుగారు: ‘విధి’ కి ఇంకా వున్నయ్యా అమ్మా అర్థాలు? అమ్మ: అర్థాలు ఎన్నివున్నా రెండు మాటలు మీద ఆధారపడి వుంది “విధి”ని గురించి చెప్పాలంటే.
చిదంబరరావుగారు: ఏమిటమ్మా ఆ రెండు మాటలు చెప్పు.
అమ్మ: “విధే విధానం”. “విధి” అంటే “బ్రహ్మ, పరమాత్మ, చైతన్య స్వరూపం,
చైతన్యం.” అదే స్పందనం. ఆ స్పందనంచేత కలిగే పరిణామము సృష్టి. అది అనుక్షణమూ జరుగుతూనే వున్నది ఆ జరిగేది విధానము. ఇదే “విధే విధానము.”
- అమ్మ: గోపికలలో కూడా అనేకమంది అనేకరకాల స్థితులతో వున్నారేమో!! గోపికల ఆరాధన ఎట్లా వుంటుందంటే, ఒక ఆమె ముఖాన్ని ఆరాధిస్తుంది. ఒక ఆమె శబ్దాన్ని ఆరాధిస్తుంది. ఒక ఆమె చెవులు, ఒక ఆమె లలాటం, ఒక ఆమె నేత్రాలు, ఒక ఆమె లలాటం ముందున్న తిలకాన్ని ఆరాధిస్తుంది. ఒక ఆమె దేహము, ఒక ఆమె కాంతి. ఇట్లా రకరకాలుగా ఆరాధించి, అందులో ఒకామె ఇన్ని రకాలు కలిపి కృష్ణుడిలో ఉన్న “ధారణాశక్తియై”, ధారణ అంటే “ఉచ్ఛ్వాస నిశ్వాసలు” కూడా ఆరాధించి రాధ అయింది.
చిదంబరరావు గారు: అమ్మా! ఆ కృష్ణుడు, ఆ రాధ, ఆ రాముడు, సీత అందరూ నీవై చెపుతున్నావా?
అమ్మ: నేనెట్లా చెప్పినా మీరు దాన్ని ఎంతగానో తీసుకోగలిగారు. మీరు వివేకులు గనుక.
చిదంబరరావుగారు నవ్వి, “తల్లి చిన్నపిల్లవాడికి బోధించినట్లుగా వుంది.
వివేకమంటే ఏమిటి?” అమ్మ: తన్ను తాను విమర్శించుకోవటం వివేకం. ఇతరులను విమర్శించటం అవివేకం.
- చిదంబరరావుగారు: వివేకం అంటే ఇదేనా, ఇంకా ఏమయినా అర్థమున్నదా అమ్మా!
అమ్మ: పనికిమాలిన గుణములను విడిచినవాడే వివేకుడు.” అని చాలామంది చెపుతుంటే విన్నా.
చిదంబరరావుగారు: ఎవరూ చెప్పలేదమ్మా ఈ మాట!
అమ్మ: “మమేకుడే” వివేకుడు. అంటే మంచి, చెడు మనస్సుకు తోచకుండా వుండటమే ‘మమేకం’. అదే ‘వివేకం’.
- చిదంబరరావుగారు: రాముడి గురించి చెప్పు. రామం అంటే విరామం లేనిది. అన్నావు. దేనికి విరామం లేదు?
అమ్మ: సృష్టికి లేదు. కదలికకు లేదు. ఇప్పుడు జరుగుతున్న పని అంతా… విరామం లేకుండా జరుగుతున్న పని అంతా రాముడే! మనలో నడిపించే ఉచ్ఛ్వాస నిశ్వాసలు విరామం లేకుండా వున్నాయి వ్యష్టిలోగాని, సమిష్టిలోగాని విరామం లేకుండా వుండే ప్రతి ఒక్కటీ రామమే!
చిదంబరరావుగారు; నీవు చెప్పే ప్రతి ఒక్కటీ అద్వైత స్థితికి తీసుకెళుతున్నదమ్మా!
అమ్మ: నేను తీసుకెళ్ళేదేముంది? అది అయ్యే ఉంది.
చిదంబరరావుగారు: దశరథుడి కొడుకు రాముడి గురించి చెప్పమ్మా!
అమ్మ: ఆయన ఆ సమయానికి ఆ అవతారం అవసరమై ఆ రాముడు పరిమితి గలిగి రాముడుగా, విరామం లేని దానిలోనుంచి రాముడుగా అవతరించాడు. తనలో వుండే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, తనలో వుండే శక్తి సీతై, ఆ సీతే లోకమాతై, ప్రకృతి, వికృతై, సర్వసాక్షియై సర్వం ఆరామమై విరామం లేనివారుగా ప్రపంచానికి వారి ధర్మాన్ని పంచిపెట్టారు. వారే సీతారాములు.
- చిదంబరరావుగారు: “ఎన్ని రకాలుగా చెప్పినా అన్నీ, అందరూ ఒకటేననీ, అంతా అద్వైతమేననీ, ప్రపంచంలో వున్న ప్రతిదానిని గురించి ఒకేదానికి సమన్వయం చేసి చెప్పావమ్మా! సమన్వయం చేసేదేమిటిలే! ఆ సమన్వయమే నీవు కదా! లేకపోతే ఇట్లా సాధ్యం కాదు. నీవు అసాధ్యం కనుక నీకంతా సాధ్యమేనమ్మా! నా ఈ మాటలు కూడా నీవే. ఇదంతా ఏ పండితులన్నా వచ్చి వ్రాస్తే బాగుండు తల్లీ!”
అమ్మ: పండుతుడయిన పామరుడు వ్రాయడు. పామరుడు అయిన పండితుడు వ్రాస్తాడు.
53.(చిదంబరరావుతాతగారి ఇంట్లో పనిమనిషి ఎరుకలనల్లి- క్రైస్తవ మతస్తురాలు): నల్లి: అమ్మాయిగారు! నీవు ఈ ఆవరణలో తిరుగుతుంటే… ఇదంతా నెత్తినేసుకుని… అంటే చెప్పటం చేతకావటంలా – నేను చదువుకునే రోజుల్లో మా స్కూలు మానేజరుగారు వుండేవారు. ఆ స్కూలు బాధ్యత ఆయన నెత్తిన ఎంత వుందో, తమ నెత్తిన ప్రపంచమంతా వున్నట్లు కనపడుతోందమ్మా!! చూడటానికి చిన్న పాపాయిలా కనపడతావుగాని, ప్రపంచానికే పెద్ద అన్నట్లు అనిపిస్తుంది.
అమ్మ: ఏం చూచి అనిపిస్తుంది నల్లీ నీకు?
నల్లి: ప్రతి ఇళ్ళల్లో వుండే చిన్న పిల్లల మాదిరిగా వుండవుగా అమ్మా. ఒక లక్షణమేమిటి అన్నీ విశేషంగానే వున్నాయి చెప్పటానికి చేతగాని విశేషం. (ఇంతలో మొగలిపువ్వు వాసన వస్తుంది. మరుక్షణానికే రకరకాల పూల వాసన వస్తుంది).
చూచావా! నీవు గొప్ప దానివని రుజువయిందమ్మా! మా బోధకులు మంచివారియొక్క విశేషాలు చెప్పుకుంటున్నప్పుడు వారిని గురించి ఆ తండ్రి. సువార్త చేస్తాడు (అంటే ఈ వాసన.) అట్లాగే నీ విషయాలు చెప్పుకుంటుంటే ఎటువంటి వాసనలు వచ్చాయో చూశావా? ఆ పరలోకంలో వున్న ఆ తండ్రి ఎట్లాంటివాడో కనపడుతున్న నీవూ అంతే అమ్మా!
- పనిమనిషి నల్లి: అమ్మా! నేను ఫలానా అని నిర్ణయించలేక పోవచ్చును వివరించలేక పోవచ్చును కానీ ఏదో విశేషం నీలో నాకు స్పష్టంగా కనిపిస్తున్నది. అదే నేను దైవత్వం అనుకుంటున్నాను. ఆ తండ్రి కూడా కాదు. నీవు మరియావే అనుకుంటా.
అమ్మ: చాలా మరియాదగా గుర్తించావు. మరియాకు పదియేళ్ళప్పుడు ఏసు పుట్టాడు. నాకు ఎవరు పుట్టారు?
నల్లి పకపకా నవ్వి “మా బంగారుతల్లికి అన్నీ తెలుసునే. నీవు మరియాకు కూడా అమ్మవమ్మా! లేకపోతే ఇంత పసికూనకు ఇన్ని విషయాలు ఎట్లా. తెలుస్తాయి? ఏదోలే, పనిచేసేదిలే అనుకోక యదార్ధం చెప్పు తల్లీ!” అంటూ అమ్మను వీపుమీద పడుకోబెట్టుకుని చీపురు తీసుకుని దొడ్డి చిమ్మటం ప్రారంభించింది.
“నల్లీ! నన్ను అందరికీ తల్లి నంటివే. ప్రపంచానికంతకూ నేనే ఆధారమంటివే. మరి, నీవు నాకు ఆధారమయినావు. నన్ను మోస్తున్నావు. మరి, నీవు ఎవరివి?” అని అమ్మ ముసిముసి నవ్వులు నవ్వింది.
(సశేషం …)